Sunday 21 December 2014

కాకినాడ టు కృష్ణపట్నం పోర్టు - జల రవాణా

కాకినాడ టు కృష్ణపట్నం పోర్టు.. జల రవాణాపై కేంద్ర నిపుణుల కమిటీ పరిశీలన

తెనాలి, డిసెంబర్‌ 20: రాష్ట్రంలో ప్రధాన రేవు పట్టణాలుగా ఉన్న కాకినాడ నుంచి కృష్ణపట్నం వరకు జలమార్గం ద్వారా అను సంధానించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్రం జల రవాణాను తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. జాతీయ జలరవాణా మార్గం-4గా గుర్తించిన ఈ మార్గంలో బకింగ్‌హామ్‌ కెనాల్‌ ద్వారా కాకినాడపోర్టు నుంచి కృష్ణపట్నం రేవు వరకు అనుసంధానం చేయనున్నారు. దీనిపై ఏర్పాటైన అత్యున్నతస్థాయి నిపుణుల కమిటీ శనివారం గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో క్షేత్ర స్థాయి పరిశీలన జరిపింది. కేంద్ర జలరవాణా విభాగం (ప్రాజెక్ట్స్‌ అండ్‌ మెరైన్‌) చీఫ్‌ ఇంజనీర్‌ ఎస్‌.దండపతి, హైడ్రోగ్రాఫికల్‌ సూపర్‌వైజర్‌ టీవీ ప్రసాద్‌లతో కూడిన ఈ బృందం విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి గుంటూరు జిల్లాలో బకింగ్‌హామ్‌ కెనాల్‌, దుగ్గిరాల లాకులు, సంగం జాగర్లమూడి లాకులు, కొమ్మమూరు కెనాల్‌ మీదుగా ప్రకా శం జిల్లా పెదగంజాం వరకు పర్యటించింది. నెల్లూరు జిల్లా కృష్ణ పట్నం వరకు పరిశీలిస్తామని నిపుణుల కమిటీకి నేతృత్వం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ అధికారి దండపతి తెలిపారు. తమ పరిశీలనలో గుర్తించిన అంశాలను నివేదిక రూపంలో కేంద్రానికి అందజేస్తామని ఆయన చెప్పారు. జాతీయ జలరవాణా మార్గం-4గా గుర్తించిన ఈ మార్గంలో కాకినాడ కెనాల్‌, ఏలూరు కెనాల్‌, కొమ్మమూరు కెనాల్‌, నార్త్‌ బకింగ్‌హామ్‌ కెనాల్‌, సౌత్‌ బకింగ్‌హామ్‌ కెనాల్‌, గోదావరి, కృష్ణా నదులు ఉన్నాయి. ఈ మార్గం నిడివి 971 కి.మీ.గా ఉంది. ఇందులో 887 కి.మీ. ఆంధ్రప్రదేశ్‌లో, 84 కి.మీ. తమిళనాడులో విస్తరించి ఉంది. కాకినాడ పోర్టు నుంచి కృష్ణ పట్నం రేవు వరకు జల రవాణా పునరుద్ధరణకు చేపట్టాల్సిన అభి వృద్ధి పనులపై నిపుణుల కమిటీ పరిశీలన జరిపింది. పూర్వం ఈ మార్గంలో చెన్నై నుంచి విజయవాడ, కాకినాడ వరకు జల రవాణా కొనసాగింది. ఇందుకు వీలుగా అప్పటిలో కాల్వలు, వంతెనలు, లాకుల నిర్మాణం జరిగింది. అయితే ఆ రోజుల్లో చిన్న పడవలు మాత్రమే ప్రయాణించేవి. ప్రస్తుతం వంద మెట్రిక్‌ టన్నుల సామర్థ్యానికి తగ్గకుండా జల రవాణా ను ప్రవేశ పెట్టనున్నారు. దీనితో కాల్వలను, లాకులను వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని నిపుణుల కమిటీ పరిశీలనలో గుర్తించింది. ప్రస్తుతం బకింగ్‌హామ్‌కెనాల్‌, కొమ్మమూరు కాల్వపై ఉన్న లాకులు ఆరు మీటర్ల వెడల్పులో మాత్రమే ఉన్నాయి. వీటిని 12 మీటర్ల వరకు విస్తరించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. అదేవిధంగా ఈ మార్గంలోని కొమ్మమూరు కెనాల్‌ 50 కి.మీ. మేర జల రవాణాకు అనుకూలంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. విజయవాడ నుంచి కృష్ణపట్నం వరకు గుర్తించిన జల రవాణా మార్గంలో బకింగ్‌హామ్‌ కెనాల్‌తో పాటు కొమ్మమూరు కెనాల్‌ ఉంది. కొమ్మమూరు కెనాల్‌ నిడివి 112 కి.మీ.లు కాగా, ఇందులో 50 కి.మీ. జల రవాణాకు అనుకూలంగా ఉందని ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చారు. జలరవాణాకు కాల్వ వెడల్పు (బెడ్‌ విడ్త్‌) 32 మీటర్లుగా ఉండాలని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు కాల్వ 50 కి.మీ. మేర ఉండగా, మిగిలిన 62 కి.మీ.లనిడివిలో కాల్వను వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని గుర్తించారు. కేంద్రం జాతీయజల రవాణా ప్రాజెక్టులోభాగంగా మొదటిదశలోనే ఈ మార్గాన్ని అభి వృద్ధి చేయనుంది. సంబంధిత టెండర్లను మార్చిలో పిలిచే అవకాశం ఉంది.

No comments:

Post a Comment