Saturday, 13 December 2014

రామోజీ ఫిలిం సిటీ తెలంగాణకు గర్వకారణం

రామోజీ ఫిలిం సిటీ తెలంగాణకు గర్వకారణం

ఓం సిటీ దేశానికే బహుమతి
ఫిలిం సిటీ అభివృద్ధికి సహకరిస్తాం
రామోజీ ప్రభుత్వం నుంచి పైసా తీసుకోరు
అంతా ఆయన స్వయం కృషి: సీఎం కేసీఆర్‌
ఫిలింసిటీ సందర్శన... రామోజీతో భేటీ

హైదరాబాద్‌, డిసెంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): రామోజీ ఫిలింసిటీ తెలంగాణకే గర్వకారణమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘భూతల స్వర్గంలాంటి రామోజీ ఫిలిం సిటీ, త్వరలో నిర్మించనున్న ఆధ్యాక నగరం ఓం సిటీలను పర్యాటక ప్రదేశాలుగా మలచడానికి మా ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది’’ అని ప్రకటించారు. కేసీఆర్‌ శుక్రవారం రామోజీ ఫిలిం సిటీని సందర్శించారు. అక్కడ సుమారు నాలుగు గంటలకుపైగా గడిపారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌, సీనియర్‌ నేత తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి కేసీఆర్‌ ఫిలిం సిటీకి వెళ్లారు. ఆయనను రామోజీరావు స్వయంగా స్వాగతించారు. వారు కలిసి భోజనం చేశారు. కొద్దిసేపు ఇరువురు ఏకాంతంగా సమాలోచనలు జరిపినట్లు సమాచారం.
ఇక... ఫిలింసిటీలోని ప్రత్యేక ఆకర్షణలను కేసీఆర్‌కు రామోజీ స్వయంగా చూపించారు. తాము ‘ఓం’ పేరుతో కొత్తగా చేపట్టబోతున్న ఆధ్యాత్మిక నగరి ప్రాజెక్టు గురించి వివరించారు. ‘ఓం’ ఆల్బమ్‌ను ఆయనకు అందించారు. ఫిలింసిటీలో సినిమాల కోసం వేసిన సెట్టింగ్‌లను కేసీఆర్‌ ఆసక్తిగా తిలకించారు. ఆయన శుక్రవారం రాత్రి వరకు రామోజీ ఫిలిం సిటీలోనే గడిపినట్లు తెలిసింది. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనను కలిసేందుకు రామోజీరావు అపాయింట్‌మెంట్‌ కోరినట్లు తెలిసింది. అప్పుడు వివిధ కారణాలవల్ల సమయం కేటాయించలేకపోయిన కేసీఆర్‌ ఇప్పుడు... తానే ఫిలిం సిటీకి వెళ్లినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఫిలింసిటీ, ఓం సిటీపై కేసీఆర్‌ ఏమన్నారంటే...
‘‘రామోజీ ఫిలింసిటీ ఒక అద్భుత కళాఖండం. ఎంతో దీక్ష, తపన, బలమైన ఆకాంక్ష ఉంటే తప్ప ఇలాంటివి తయారుకావు. ఫిలింసిటీ కంటే ఎక్కువగా పర్యాటకులను ఆకర్షించే ప్రదేశమిది. హైదరాబాద్‌కు ఇది అద్భుతమైన బహుమతి. మేం చాలా ప్రాంతాలు తిరిగాను. కానీ... ఏదో చిన్న విస్తీర్ణంలో కొన్ని అంశాలకే అవి పరిమితంగా ఉంటాయి. కానీ... రామోజీ ఫిలింసిటీ అద్భుతం. ఈరోజు ఇక్కడ గంటో రెండు గంటలో ఉందామనుకున్నా. కానీ, దాదాపు 4.30 గంటలు ఉన్నా, వెళ్లలేకపోయాను. అంత అద్భుతమైన నిర్మాణాలు జరిగాయి. పదేళ్ల క్రితం ఫిలింసిటీలో తిరిగి చూశాను కానీ, అప్పటికీ ఇప్పటికీ పొంతనే లేదు. చక్కటి సౌకర్యాలు, గైడ్లు, ఆహార పదార్థాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి. కాలుష్యంలేకుండా, ప్రశాంతత, మంచి పచ్చదనంతో ఉంది. ఎవరైనా ఒకటి రెండు రోజులు ఉండి చూడాలనుకుంటే, అందుకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి.
ఇక... ఓం ప్రాజెక్టు ప్రపంచంలోనే అద్భుతం. దేశంలోని ప్రముఖ దేవస్థానాల నకళ్లను, అంతే ఎత్తు, అదే పద్ధతితో నిర్మించి, నిత్య పూజలు బ్రహ్మాండంగా జరగనుంది. ఇది పూర్తయితే, తెలంగాణకు, హైదరాబాద్‌కే కాదు... భారతదేశానికే అద్భుతమవుతుంది. దేశానికే గిఫ్ట్‌లా మారుతుంది. ఒకేచోట దేశంలోని పుణ్యక్షేత్రాలన్నింటినీ రెండు మూడు రోజులు ఉండి చూసుకోవచ్చు. ఢిల్లీలోని అక్షర్‌ధామ్‌ను చూస్తేనే మనవాళ్లు ఆశ్చర్యపోతారు. కానీ... ఓంసిటీ, ప్రస్తుత ఫిలింసిటీ మిగిలినవాటన్నింటినీ తలదన్నేలా ఉంటాయి. ఇంత గొప్ప ప్రాజెక్టు ఇస్తున్నందుకు తెలంగాణ ప్రజల తరఫున రామోజీరావుకు కృతజ్ఞతలు చెబుతున్నాను. ఓం సిటీ పూర్తయితే రోజూ రెండు నుంచి రెండున్నర లక్షల మంది సందర్శించే అవకాశముంది. తెలంగాణ రాష్ట్రం రామోజీ ఫిలింసిటీ కలిగి ఉన్నందుకు గర్విస్తున్నా. ఇందులో సందేహం లేదు. రామోజీరావు ప్రత్యేకత ఏమిటంటే... ఆయన ప్రభుత్వం నుంచి పైసా తీసుకోరు. స్వయంకృషితోనే చేపడతారు. ఫిలింసిటీ, ఓం సిటీలను మరింత గొప్పగా, మరింత పెంచడానికి ప్రభుత్వపరంగా పూర్తిగా సహకరిస్తాం!’’.

No comments:

Post a Comment