టీ-బిల్లు పెడుతున్నాం!
ఆమోదం పొందుతుందనే నమ్మకముంది
ప్రధాని మన్మోహన్ ధీమా
ప్రధాని మన్మోహన్ ధీమా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 : ఈ పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెడతామని ప్రధాని మన్మోహన్ స్పష్టంచేశారు. పార్లమెంటు దీనికి ఆమోదం తెలుపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంటు శీతాకాల కొనసాగింపు సమావేశాల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం స్పీకర్ మీరాకుమార్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. "ఇవి 15వ లోక్‌సభకు చివరి సమావేశాలు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న బిల్లులతో పాటు అవినీతి నిరోధక బిల్లులు, మహిళా బిల్లు, మత నిరోధక బిల్లు వంటి ముఖ్యమైన బిల్లులు ఎన్నో ఆమోదం పొందాల్సి ఉంది. వీటన్నింటిపై సభలో చర్చించి, ఆమోదించాలి'' అని ప్రధాని ఆకాంక్షించారు. మరి తెలంగాణ సంగతేమిటని ప్రశ్నించగా.. "తెలంగాణ కూడా ముఖ్యమైన అంశం. ఆ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతున్నాం. ఎన్నో ఏళ్లుగా ఈ అంశంపై సుదీర్ఘమైన చర్చ జరుగుతోంది. ఈ బిల్లు ఆమోదంలో సభ తన వివేకాన్ని ప్రదర్శిస్తుందని నమ్ముతున్నాను'' అని తెలిపారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ జరుగుతుందా? అని ప్రశ్నించగా... "పార్లమెంటు ఉన్నదే బిల్లులపై చర్చించి, ఆమోదించేందుకు. ఓటాన్ అకౌంట్ సహా అన్ని బిల్లులపైనా చర్చకు అవకాశం లభిస్తుంది. సభ్యులు లేవనెత్తే ఏ అంశంపైన అయినా చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం'' అని బదులిచ్చారు.
No comments:
Post a Comment