Tuesday 18 February 2014

సీమలోనే కొత్త రాజధాని

సీమలోనే కొత్త రాజధాని

Published at: 16-02-2014 05:58 AM
 1  0  0 
 
 

1956 ఒప్పందాన్ని అమలు చేయాలి
ఎంపీ, ఎమ్మెల్యేలు ఏం చేయాలో అశోక్‌బాబు శాసిస్తారా?
మాబుకు అధికారమిస్తే దేశాన్ని అమ్మేస్తారు
మీట్ ద ప్రెస్‌లో రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 15: రాష్ట్రం విడిపోవడం ఖాయమైందని, రాయలసీమలోనే కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమకు ప్రత్యేక ప్రతిపత్తి, ఉనికి ఉందని కోస్తాంధ్ర జిల్లాలతో తమకు పొసగదని ఆయన స్పష్టం చేశారు. కడప లేదా కర్నూల్‌ను రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీట్‌ది ప్రెస్‌లో మాట్లాడుతూ గుంటూరు, ఒంగోలు ప్రాంతాల్లో వేలాది ఎకరాలు కొనుగోలు చేసుకున్న నాయకులు తమ ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటు చేసుకుని కోట్లాది రూపాయలు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాయలసీమలో రాజధాని ఏర్పాటుకు కోస్తాంధ్ర నాయకులతో 1956లోనే ఒప్పందం కుదిరిందని, అందుకే రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త రాజధానిని రాయలసీమ జిల్లాల్లోనే ఏర్పాటు చేసి తీరాలని డిమాండ్ చేశారు.
పవిత్రమైన పార్లమెంటులో ముష్టిఘాతాలతో, పెప్పర్ స్ప్రే ప్రయోగించి భారత ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేశారని బైరెడ్డి విమర్శించారు. ఆత్మరక్షణ కోసం పెప్పర్ స్ప్రేను వినియోగించినట్టు లగడపాటి చెప్పడాన్ని కోతిచేష్టలుగా అభివర్ణించారు. ఎపీఎన్‌జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు, సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిల సలహా మేరకే లగడపాటి ఇలాంటి చిల్లర చేష్టలకు దిగినట్టు ఆయన ఆరోపించారు. పార్లమెంటులో ఎంపీలు ఏంచేయాలో, శాసనసభలో ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరించాలో అశోక్‌బాబు నిర్ధేశించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కేంద్ర మంత్రులను ఆయన బెదిరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం విడిపోతే దేశ భద్రతకు ముప్పుఏర్పడుతుందని, తమను దేశం నుంచి విడగొట్టాలని టీడీపీ ఎంపీలు డిమాండ్ చేయడాన్ని బైరెడ్డి తప్పుబట్టారు. దేశం నుంచి విడిపోతామని ప్రకటించిన ఇలాంటి నాయకులపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పదవుల కోసం ఎలాంటి చర్యలకైనా సిద్ధంగా ఉన్న చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే దేశాన్ని పాకిస్తాన్‌కో, బంగ్లాదేశ్‌కో అమ్మివేస్తారని ఆరోపించారు.
పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితే అడ్డుకోవడం కాకుండా ఓటింగ్ ద్వారా ఓడించాలని సూచించారు. రాయలసీమలోని రెండు జిల్లాలను తెలంగాణలో కలపాలనే కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు ప్రతిపాదనలు కుట్రపూరితమైనవిగా పేర్కొన్నారు. తెలంగాణ బిల్లును అడ్డుకొనేందుకు కోస్తా జిల్లాలకు చెందిన నాయకులు బీజేపీలోని కొంతమంది నాయకులకు డబ్బు ఎరచూపడంతో ఆ పార్టీ నేతలు రెండు విధాలుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. దేశంలో నరేంద్రమోదీ హవా కొనసాగుతుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీచేస్తే బీజేపీ మునిగిపోవడం ఖాయమన్నారు. రానున్న ఎన్నికల్లో రాయలసీమ పరిరక్షణ సమితి తరఫున యువత, రిటైర్డ్ ఉద్యోగులు, రైతు నాయకులు, విద్యార్థి నాయకులు పోటీ చేస్తారని చెప్పారు. బీజేపీతో ఎన్నికల ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలున్నాయని తెలిపారు.
- See more at: http://www.andhrajyothy.com/node/66267#sthash.ye6zufjJ.dpuf - See more at: http://www.andhrajyothy.com/node/66267#sthash.ye6zufjJ.dpuf

No comments:

Post a Comment