Sunday 2 February 2014

నాలుగు నెలల్లో నేనే సీఎం!

నాలుగు నెలల్లో నేనే సీఎం!

Published at: 03-02-2014 03:53 AM
 New  0  0 
 
 

అప్పలూ.. మీకు 700 పెన్షన్.. రైతులూ.. 7 గంటలు కరెంట్...
మహిళలూ.. మీ డ్వాక్రా రుణాలు మాఫీ... ప్లీనరీలో జగన్ హామీల వర్షం
వ్యవసాయ రుణమాఫీ అసాధ్యమని వెల్లడి... కిరణ్, బాబులపై విమర్శలు
కడప, ఫిబ్రవరి 2 : "అవ్వలూ తాతలూ! నాలుగు నెలల్లో మీ మనుమడు సీఎం కుర్చీలో కూర్చుంటాడు. మీ పెన్షన్ రూ.700 చేస్తాడు. రైతులారా... నాలుగు నెలల్లో మీ కొడుకు సీఎం అవుతాడు. వ్యవసాయానికి 7 గంటల నిరంతర విద్యుత్ ఇచ్చి, రైతులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తాడు! విద్యార్థులారా... మీ అన్న ముఖ్యమంత్రి అవుతాడు. మీ చదువుల కోసం మూడువేల కోట్లు కాదు, అవసరమైతే ఆరువేల కోట్లు కేటాయిస్తాడు''... అంటూ జగన్ వరాల వర్షం కురిపించాడు. 'నాలుగు నెలల్లో నేనే సీఎం' అనే ధీమా వ్యక్తం చేశారు. కడప జిల్లాలోని ఇడుపులపాయలో వైసీపీ రెండో ప్లీనరీ సమావేశంలో... జగన్‌ను మరోమారు పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలతో ధ్వజమెత్తారు. "రాష్ట్రంలో చాలా అన్యాయమైన రాజకీయాలు చూస్తున్నాం. దొంగ కేసులు పెట్టించి ఒక మనిషిని జైలుకు పంపించే రాజకీయాలు, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి వెనుకాడని రాజకీయాలు చూశాం. చంద్రబాబు, కాంగ్రెస్ వాళ్లు కుమ్మక్కై కేసులు పెట్టారు. జైలుకు పంపారు. నేరం రుజువు కాకపోతే మూడు నెలలో బెయిల్ ఇవ్వాల్సి ఉన్నా...16 నెలలు జైలులో పెట్టారు. వైసీపీ ఉండదని, నన్ను తీహార్ జైలుకు పంపిస్తారని నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేశారు. అయితే ఎవరు ఏం చేసినా... ఒక్క వెంట్రుక కూడా పీకలేకపోయారు'' అని జగన్ పేర్కొన్నారు.
చంద్రబాబు లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. "ఎఫ్‌డీఐల అంశంపై పార్లమెంటులో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేయకుండా చంద్రబాబు తన ఎంపీలను గైర్హాజరు చేయించారు. కిరణ్ ప్రభుత్వం కరెంటు బాదుడుపై అవిశ్వాసం చంద్రబాబు కాపాడారు'' అని విమర్శించారు. కిరణ్ వైఎస్ పథకాలను నీరు గార్చారని విమర్శించారు. వైసీపీ తరపున 30 మంది ఎంపీలను గెలిపించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వారినే ప్రధాని పదవిపై కూర్చోబెడదామని జగన్ పిలుపునిచ్చారు. ప్లీనరీ వేదికపై అనేక హామీలు ఇచ్చిన జగన్... చంద్రబాబు ఇచ్చిన వ్యవసాయ రుణాల మాఫీ మాత్రం అసాధ్యమని తెలిపారు. రాష్ట్రంలో రైతు బకాయిలు లక్షా 27 వేల కోట్ల రూపాయలు ఉన్నాయని, ఇంత మొత్తంలో బకాయిలు రద్దు చేయడం సులువు కాదని తెలిపారు.
జగన్ ఇచ్చిన హామీలు...
- చిన్న పిల్లల చదువుల కోసం కూలీ డబ్బులు వెచ్చించకుండా... తల్లిదండ్రులకు ప్రతినెలా రూ.వెయ్యి ఇస్తాం.
- ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత మెరుగుపరుస్తాం. గతంలో తొలగించిన 136 వ్యాధులను, చిన్నపిల్లలకు చెవుడు, మూగ ఆపరేషన్లకు రూ.6 లక్షల వ్యయమయ్యే చికిత్సనూ చేరుస్తాం.
- రైతుల కోసం రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. 7 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తాం. తర్వాత దానిని తొమ్మిది గంటలకు పెంచుతాం.
-సస్యరక్షణపై సూచనలు ఇచ్చేలా 101 మొబైల్ వాహనం ఏర్పాటు చేస్తాం. పశు వైద్యం కోసం 102 వాహనం.
- బెల్టుషాపుల తొలగింపునకు గ్రామాల్లోనే మహిళా పోలీసులు! ఎవరైనా మద్యం తాగాలనుకుంటే దిమ్మి తిరిగేలా ధర పెడతాం.
- ఏటా 12 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిలిండర్‌పై వంద రాయితీ ఇస్తాం.
- డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాం.
- వికలాంగుల పెన్షన్ వెయ్యి రూపాయలు చేస్తాం.
బాణం వదిలితే ఎందాకైనా: షర్మిల
'సమైక్య రాష్ట్రంలో జగన్ నాయకత్వంతో వైఎస్ కలలు నెరవేరాలి. అందుకు జగన్‌ను ఆశీర్వదించాలి' అని వైసీపీ గౌరవధ్యక్షురాలు విజయలక్ష్మి పిలుపునిచ్చారు. జగన్‌పై కుట్రలు జరుగుతున్నాయని, కోవర్టు వ్యవస్థ నడుస్తోందని తెలిపారు. కాగా, 'నేను జగనన్న బాణాన్ని. వదిలినప్పుడు అంతిమ లక్ష్యందాకా, ఎంతవరకైనా సాగుతాను' అని షర్మిల తెలిపారు. రాష్ట్రం కుక్కలు చించిన విస్తరిలా తయారైందన్నారు. జగన్ సమైక్య అంశంలో సరిగా వ్యవహరించడం లేదన్న సబ్బం హరి రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌లో ఎలా ఉన్నారని ప్రశ్నించారు. సమైక్యరాష్ట్రమని చెప్పే రఘురామకృష్ణరాజు బీజేపీలో ఎందుకు చేరారని ప్రశ్నించారు. మరోవైపు, తెలంగాణలో ప్రజలు రాష్ట్రాన్ని కాదని, అభివృద్ధిని కోరుకుంటున్నారని గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు. "అభివృద్ధి జరగలేదని రాష్ట్రాన్ని విడదీస్తే...రేపు తెలంగాణలో నాలుగైదు జిల్లాలకు అభివృద్ధి జరుగకపోతే ఆ రాష్ట్రాన్ని విభజిస్తారా?'' అని ప్రశ్నించారు.

- See more at: http://www.andhrajyothy.com/node/61312#sthash.ucFj04nr.dpuf

No comments:

Post a Comment