Wednesday 19 February 2014

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా - లగడపాటి


రాష్ట్రం రెండుగా విడిపోయినా..తెలుగు జాతిగా కలిసుందాం

Published at: 19-02-2014 05:00 AM
 7  7  0 
 
 

గతం గత:ముందుకు ఎలా వెళ్లాలో ఆలోచిద్దాం
రాష్ట్ర ఐక్యత కోసం పోరాడినంవారంతా..తెలుగు ప్రజల ఐక్యత కోసం పాటుపడదాం
అందుకు నా వంతు కృషి చేస్తా
ఇందుకే రాజ్‌గోపాల్ ఫౌండేషన్ స్థాపించా
విజయవాడ ఉంపీ లగడపాటి రాజగోపాల్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా.. తెలుగుజాతిగా కలిసే ఉండాలని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆకాంక్షించారు. తెలుగు ప్రజలు శాశ్వతంగా కలిసి ఉం డాలని తాను కోరుకున్నానని, రాష్ట్రం సమైక్యంగా ఉం టేనే తెలుగు జాతి, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని భా వించానని వివరించారు. ఇక, ఇరుప్రాంతాల నాయకులూ రాజకీయాలు పక్కన పెట్టి, అంతా బాధ్యతలు చేపట్టాలని సూచించారు. గతం గతః అన్నట్లుగా జరిగినదంతా చరిత్రగా వదిలేయాలని, అంతే తప్ప దానిని తిరగదోడి ఒకరిపై ఒకరు నెపాలు మోపుకోవద్దని సూచించారు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు విభజనలో అందరికీ భాగం ఉందని చెప్పారు. తెలుగు రాష్ట్ర ఐక్యత కోసం పాటుపడిన వారంతా తెలుగు ప్రజల ఐక్యత కోసం పాటు పడాలని హితవు పలికారు. తన వంతుగా తెలుగు ప్రజల ఐక్యత కోసం కృషి చేస్తానని, ఇందుకోసం ఇప్పటికే రాజ్‌గోపాల్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించానని చెప్పారు. ఈ ఫౌండేషన్ ద్వారా.. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య ఉన్న గాయాలను మాన్పించి, ద్వేషాలను తగ్గించి, బంధం, అనుబంధం పెంచేందుకు పాటుపడతానన్నారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తాను అనేక ప్రయత్నాలు చేశానని, విభజనను తన గెలుపుగానో, ఓటమిగానో భావించట్లేదని చెప్పారు. విడిపోయేటప్పుడు బద్ధ శత్రువుల్లో కూడా బాధ ఉంటుందని, అలాగే అందరిలోనూ ఇప్పుడు ఎంతోకొంత బాధ ఉంటుందన్నారు. అయితే, ఒకరినొకరు గాయాలు చేసుకోకుండా, ఎదుటివారి గాయాలు మాన్పించేందుకు దృష్టి పెట్టాలని సూచించారు. ఇప్పటి వరకూ ప్రజల మధ్య రకరకాలుగా పోట్లాటలు, పోరాటాలు, అనేక భావోద్వేగాలు చోటు చేసుకున్నాయని, అనేక మందికి గాయాలయ్యాయని, అవన్నీ మానిపోయేట్లుగా.. పోరాటాలు, కొట్లాటలు గతంగా వదిలేసి ముందుకు ఎలా వెళ్లాలో ఆలోచించాలని సూచించారు. ఈ పోరాటాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, ఆస్తు లు కోల్పోయారని, మానసికంగా గాయపడ్డారని, ఇవన్నీ సమసిపోయేట్లుగా భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలన్నారు.
తాను ఎన్నడూ స్వప్రయోజనాల కోసం, రాజకీయ ఎదుగుదల కోసం రాజకీయాలు చేయలేదని లగడపాటి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన దేశానికి కూడా నష్టం చేకూర్చుతుందని విశ్వసించానని.. జాతీయ స్థాయిలో పార్లమెంట్‌లో అత్యధిక పార్టీలు ఇదే కరెక్టు అని నిర్ణయించాయని చెప్పారు. ఎలాంటి శాస్త్రీయతాలేకుండా రాష్ట్రాలను విభజించడం మం చిది కాదన్నది తన భావని అని లగడపాటి చెప్పారు. ఈ మేరకు తాను ప్రజాస్వామ్యంపైన, పార్లమెంటుపైన నమ్మకం ఉంచానని.. కానీ, ఇప్పుడు రాష్ట్రం విడిపోవటంతో ఇక తాను దేశ రాజకీయాలకు తగనని నిర్ధారించుకుని ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం అవుతున్నానని పునరుద్ఘాటించారు. రాజకీయాల నుంచి తాను తప్పుకొన్నందున ఇకపై రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల గురించి మాట్లాడబోనని, విభజన తప్పొప్పుల గురించి కూడా మాట్లాడనని స్పష్టం చేశారు. అయితే, రాజకీయ నాయకులు సమాజంలో భాగం కాబట్టి వారితో తన సంబంధాలు కొనసాగుతాయని, తన రాజకీయ భవిష్యత్తు గురించి మాత్రం ఆలోచించట్లేదని చెప్పారు.
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా
ఎంపీ పదవికి రాజీనామా
రాష్ట్రం విడిపోతే రాజకీయాల నుంచి తప్పుకొంటానని గతంలో పలుమార్లు ప్రకటించిన లగడపాటి.. మంగళవారంనాటి పరిణామాల నేపథ్యంలో తాను రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. మంగళవారం లోక్‌సభలో బిల్లుకు సవరణలపై ఓటింగ్ జరుగుతుండగా.. సాయంత్రం 4 గంటలకే ఎంపీ పదవికి రాజీనామా చేసి సెక్రటరీ జనరల్‌కు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బిల్లుకు లోక్‌సభలో ఆమోదం పొందినంత మాత్రాన విభజన జరిగినట్లు కాదని, రాజ్యసభ, రాష్ట్రపతి ఆమోదం పొందాలని, కోర్టు కూడా జోక్యం చేసుకోవచ్చంటూ కొందరు చెబుతున్నా తాను మాత్రం విభజన జరిగిపోయిందనే అనుకుని రాజకీయాల నుంచి తప్పుకొంటున్నానని వెల్లడించారు. కాగా.. తన రాజీనామాను ఆమోదింపజేసుకోవడం కోసం స్పీకర్ ఇంటికి కూడా వెళ్లానని, అయితే ఆమె సమయం ఇవ్వకపోవడంతో తిరిగి వచ్చేశానని, బుధవారం ఉదయం మరొకమారు ప్రయత్నించి ఆమెను కలిసి తన రాజీనామాను ఆమోదింపజేసుకుంటానని మీడియాతో చెప్పారు.
- See more at: http://www.andhrajyothy.com/node/67300#sthash.dEPcJlvd.dpuf

No comments:

Post a Comment