కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా సీఎం పదవికి, శాసనసభ్యత్వానికి, పార్టీకీ గుడ్‌భై
హైదరాబాద్ , ఫిబ్రవరి 19 : కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవికీ, శాసనసభ్యత్వానికీ, అలాగే కాంగ్రెస్ పార్టీకీ, ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. బుధవారం ఉదయం ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రతికా ప్రతినిధులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుందని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి తాను వ్యతిరేకం కాదని, మొత్తం తెలుగు ప్రజల శ్రేయస్సు కోసమే ఇన్నాళ్లు పోరాడానని ఆయన పునరుద్ఘాటించారు.
రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్రం ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంతో తెలుగు ప్రజల హృదయాలను గాయపరిచనదానికి, వారి భవిష్యత్‌ను అంధకారం చేసిన దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీకి, సీఎం పదవికి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. విభజన వల్ల తెలుగు ప్రజలందరికి నష్టం కలుగుతుందన్నారు. ఓట్లు, సీట్ల కోసం అన్ని పార్టీలు కలిసి తెలుగు జాతికి తీవ్ర నష్టం కలిగించారని సీఎం వ్యాఖ్యానించారు.
విభజన వల్ల ఇరు ప్రాంతాల ప్రజలకు లాభం చేకూరాలి తప్ప దీని వల్ల అందరికీ అన్యాయం జరిగిందన్నారు. రైతాంగానికి, విద్యార్థుల, ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్ అంధకారంగా తయారయ్యే ఈ నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు. 58 సంవత్సరాలుగా కలిసి ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. తెలుగు ప్రజల మధ్య విడదీయలేని అనుబంధం ఏర్పడిందని తెలిపారు. విభజన వల్ల నీరు, విద్యుత్, వైద్యం, విద్యావకాశాల్లో ఏపీ ప్రజలు నష్టపోయే పరిస్థితి ఏర్పడతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విభజన ప్రక్రియలో రాజ్యాంగాన్ని, సంప్రదాయాలను ఉల్లఘించారని విమర్శించారు. విభజన అంశాన్ని టేబుల్ ఐటెంగా తీసుకున్నారని మండిపడ్డారు.
కనీసం మంత్రులు చదువుకునే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రాన్ని విభజించే ముందు కేబినెట్ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని వాటన్నింటీని ఉల్లంఘించారన్నారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో పెడితే రాజీనామా చేస్తానని ఆనాడే చెప్పానని గుర్తు చేశారు. విభజన బిల్లులో తమ అభ్యంతరాలనే పార్లమెంటులో పెట్టిన బిల్లులో ప్రస్తావించారన్నారు. రాష్ట్రానికి పంపినది డ్రాఫ్ట్ బిల్లు అని చెప్పిన కేంద్రం దానిని అసెంబ్లీలో చర్చించమనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
పార్లమెంటులో సభ్యులపై దాడి చేయడం దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. ఏ రాష్ట్రం గురించి చర్చ జరుగుతుందో ఆ రాష్ట్రం వారిని సస్పెండ్ చేశారని, దొంగల మాదిరిగా ప్రత్యక్షప్రసారాలను నిలిపివేసి బిల్లుకు ఆమోదం తెలిపాల్సిన అవసరం ఏంటని దేశ ప్రజలకు కేంద్రం సమాధానం చెప్పాలని కిరణ్ నిలదీశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న మంత్రులను, సభ్యులను ఒప్పించకుండా ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం అన్యాయమన్నారు. భారతదేశంలో ఎక్కడా కూడా అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో పెట్టారా అని ప్రశ్నించారు. అటువంటి సంప్రదాయాన్ని ఎందుకు మొదలుపెట్టారన్నారు. తెలుగు ప్రజల ఆకాంక్ష మేరకు, వారి భవిష్యత్‌కు సంబంధించి రాష్ట్రపతి పంపిన బిల్లును అసెంబ్లీ తిరస్కరిస్తే, దానిని పార్లమెంటులో పెట్టడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు.
ప్రభుత్వంతో బీజేపీ కుమ్మక్కై చీకటి ఒప్పందం చేసుకుని తెలుగు ప్రజలకు తీవ్రని నష్టం కలిగించిందన్నారు. పార్లమెంటులో మంత్రులు, ఎంపీలు వెల్‌లోకి వెళితే హృదయం గాయపడిందని ప్రధాని అన్నారు. చిన్న అంశానికి బాధపడిన ప్రధానికి తెలుగు ప్రజల కన్నీటి వ్యధ కనపడలేదా అని కిరణ్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సులభంగా ఏర్పడినది కాదని, 50 సంవత్సరాల పోరాటం, ఎంతో మంది త్యాగాల ఫలితమే ఈ రాష్ట్రం అని గుర్తు చేశారు. అదేవిధంగా 58 సంవత్సరాలు కలిసి ఉన్నాక విభజించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
భాషాప్రయుక్త రాష్ట్రాన్ని విభజిస్తే దేశం బాగుపడుతుందా అని ప్రశ్నించారు. దేశ ప్రజల ఐక్యత కోసం, దేశ ప్రగతికోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడాన్ని ఖండిస్తున్నాని ఆయన అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అతి పెద్దది మన దేశం.ఇది మనం గర్వించవలసిన విషయం. అటువంటిది అందరూ నవ్వుకునే, హేళన చేసే విధంగా ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి ఆడిన ఈ నాటకంలో తెలుగు ప్రజలు నష్టపోతారని వెల్లడించారు.
తన ఎదుగుదలకు, సీఎం పదవి ఇచ్చిన కాంగ్రెస్‌కు కృతజ్ఞత తెలియజేస్తూనే...రాష్ట్ర విభజనను నిరసిస్తూ సీఎం పదవికి, ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కిరణ్ ప్రకటించారు. 1962 నుంచి ఇప్పటి వరకు తమ కుటుంబం 12 ఎలక్షన్లలో పోటీచేసిందని తెలిపారు. అయితే రాజీనామా అనేది సులువైన నిర్ణయం కాదని తెలుగు ప్రజలను కాపాడలేకపోయానన్న బాధతో రాజీనామా చేస్తున్నట్లు కిరణ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకం కాదని...జరగబోయే పరిణామాలకు, నష్టాలకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర సమైక్యత కోసం ఎంతో కృషి చేశానని, ఈ క్రమంలో ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించమని కోరారు. తన భవిష్యత్తే తనకు ముఖ్యమనుకుంటే కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని గౌరవించి పార్టీలోనే కొనసాగేవాడినన్నారు. తన భవిష్యత్ ముఖ్యం కాదని రాష్ట్ర భవిష్యత్, తెలుగు ప్రజల భవిష్యత్ గురించే ఈ పోరాటం చేశామని, ఇందులో తమ స్వార్థం లేదని కిరణ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి కిరణ్ తన రాజీనామాను ప్రకటించిన నేపధ్యంలో మీడియా ప్రశ్నలకు సమాధానమిచ్చారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తరువాత తెలంగాణకు కేంద్రం ప్యాకేజీ ఇస్తామంటే వ్యతిరే కించారా? అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు తెలంగాణ ప్యాకేజీ గురించి నాతో ఎవరు చర్చించలేదని కిరణ్ సమాధానమిచ్చారు.
లోక్ సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తరువాత రాజీనామా చేయటం వల్ల ఏం ఉపయోగం అన్న ప్రశ్నకు ఉపయోగం ఉంటుందా లేదా అనేది తనకు తెలియదని కేవలం నిరసన తెలపడానికే రాజీనామా చేశానని అన్నారు.
సిడబ్ల్యూసీ నిర్ణయం వచ్చిన వెంటనే తాను రాజీనామా చేసి ఉంటే తెలంగాణ రాష్ట్ర వచ్చి ఈ పాటికి నాలుగు నెలలు అయ్యి ఉండేదని కిరణ్ తెలిపారు. తన కుటుంబం కాంగ్రెస్ పార్టీ తరపున 12 ఎన్నికలలో పోటీ చేసిందని ఈ విధంగా కాంగ్రెస్‌తో ఉన్న బంధాన్ని తెంచుకోవటం చాలా బాధకరమని కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విభజన రాజ్యంగ విరుధ్ధంగా జరిగిందని విభజన వల్ల ఇరు ప్రాంత రైతులకు, విదార్ధులకు నష్టం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
మీ భవిష్యత్ కార్యచరణ ఏమిటీ, కొత్త పార్టీ పెడతారా? అని విలేఖరి అడిగిన ప్రశ్నకు తన భవిష్యత్తు గురించి తనకు ఆలోచన లేదని, విభజనకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి మాత్రమే రాజీనామా చేస్తున్నట్లు వివరించారు. తనను ఆపధ్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరిన తాను పదవిలో ఉండనని కిరణ్ స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌కు రాజీనామా పత్రం అందజేసి ముఖ్యమంత్రి పదవికి ప్రత్యామ్నాయ నిర్ణయాన్ని సాధ్యమైనంత తొందరగా తీసుకోవల్సిందిగా కోరనున్నట్టు కిరణ్ తెలిపారు.
No comments:
Post a Comment