టీఆర్ఎస్, టీటీడీపీ, బీజేపీ భగ్గు.. సభలోనే ధర్నా
హైదరాబాద్, డిసెంబర్ 19 : అసెంబ్లీ సమావేశాల్ని జనవరి 3 వరకు వాయిదా వేయడంపై టీఆర్ఎస్, టీటీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. విభజన బిల్లుపై చర్చించకుండా సభను ఏకపక్షంగా వాయిదా వేశారని ఆరోపిస్తూ నిరసనకు దిగారు. గురువారం సభ వాయిదా పడ్డాక బయటికి రాకుండా లోపలే బైఠాయించారు. వెంటనే సభను సమావేశపర్చి, బిల్లుపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమైన వారి ఆందోళనను అసెంబ్లీ సిబ్బంది రాత్రి 9.30 గంటలకు విరమింపజేశారు. ఎమ్మెల్యేలను సభ నుంచి మార్షల్స్ బయటికి తీసుకొచ్చి..బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి.. పార్టీ కార్యాలయాల వద్ద వదిలేశారు. దాదాపు ఎనిమిది గంటలపాటు ఈ హైడ్రామా సాగింది. సభ వాయిదా పడ్డాక తొలుత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయటికి రాలేదు. సభలోనే ఉండి ఆందోళన చేయాలని నిర్ణయించారు.
ఆ తర్వాత బీజేపీ కూడా సభలోనే ఉండి నిరసన తెలపాలని నిర్ణయించటంతో, యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి నిరసనలో పాల్గొన్నారు. మొదట అసెంబ్లీ లాబీల్లోని సీఎం చాంబర్ ముందు ఆందోళనకు దిగిన టీ టీడీపీ ఎమ్మెల్యేలు, ఆ తర్వాత సభ లోపలికి వెళ్లి బైఠాయించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ఎల్పీ నేత ఈటెల రాజేందర్ అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని, ఆయన అబద్ధాలకోరని ధ్వజమెత్తారు. సీఎం, స్పీకర్ కుమ్మక్కై సభను వాయిదా వేశారని, కిరణ్, చంద్రబాబు, జగన్..అంతా ఆంధ్రా బాబులేనని, వారు ఒక్కటై అసెంబ్లీలో బిల్లుపై చర్చ జరగకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగితే సీమాంధ్ర ప్రాంతానికే న్యాయం జరుగుతుందని చెప్పారు. కాగా, సభ జనవరి 3 వరకు వాయిదా పడటానికి ముందు టీఆర్ఎస్, సీపీఐ, బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి..మరోసారి బీఏసీ సమావేశం పెట్టాలని కోరారు.
No comments:
Post a Comment