సమైక్యవాదులకు రైల్వే కష్టాలు
Published at: 17-02-2014 04:57 AM
స్లీపర్ కోచ్‌లు బుక్ చేస్తే జనరల్ బోగిలిచ్చారు
బోగీలపై రాళ్ల దాడి.. అడుగడుగునా ఆటంకాలు
బోగీలపై రాళ్ల దాడి.. అడుగడుగునా ఆటంకాలు
చిత్తూరు, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): మహాధర్నాలో పాల్గొనేందుకు ఢిల్లీ బయలుదేరిన ఏపీఎన్జీవోలు, సమైక్యవాదులకు అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయి. సాక్షాత్తూ సీమాంధ్రకే చెందిన కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి రైల్వే సహాయ మంత్రిగా కొనసాగుతున్నా, తమ యాత్రను జాప్యం చేసేందుకు ఉద్దేశపూర్వకంగా రైల్వే యంత్రాంగం ఇలా వ్యవహరించిందని చిత్తూరు జిల్లా జేఏసీ నేతలు ఆరోపించారు. చిత్తూరు జిల్లా జేఏసీ తరపున సుమారు వెయ్యిమంది ఢిల్లీ వెళ్ళేందుకు స్లీపర్ కోచ్‌లకు డబ్బు చెల్లించారు. దీనికి ప్రతిగా చివరి క్షణంలో 18 జనరల్ బోగీలతో రైలును ఏర్పాటు చేశారు. దీంతో సమైక్యవాదులు తెల్లమొహం వేశారు. అయితే సమయం మించిపోతున్నందున చేసేదేమీ లేక అందులోనే బయలుదేరారు. రైలు రెండున్నర గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 12.30 గంటలకు బయల్దేరింది. ప్రయాణం మొదలయ్యాక చూస్తే బోగీల్లో ఫ్యాన్లు తిరగడం లేదని, లైట్లు లేవని గుర్తించారు.
అనంతపురం జిల్లా గుత్తి చేరుకున్నాక హఠాత్తుగా ఇంజిన్ మరమ్మతుకు గురైందంటూ అధికారులు రైలును నిలిపేశారు. గుంతకల్ నుంచి స్పేర్ ఇంజిన్ తెప్పించి బయల్దేరేసరికి మరో రెండు గంటలు ఆలస్యమైంది. దీంతో శనివారం రాత్రి 11.30 గంటలకు హైదరాబాదులోని కాచిగూడ స్టేషన్‌కు చేరాల్సిన రైలు ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు చేరింది. కాగా, కాచిగూడ స్టేషన్ చేరుకోవడానికి కొంచెం ముందుగా వచ్చిన ఓ క్రాసింగ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు టైర్లకు నిప్పు పెట్టి మండుతున్న వాటిని బోగీల కిందికి విసిరేశారు. దీంతో పొగలు కమ్ముకుని బోగీల్లోని సమైక్యవాదులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు అదే సమయంలో బోగీలపై రాళ్ళ దాడి కూడా జరిగింది. సోమవారం ఉదయం సమైక్యవాదులు సకాలంలో ఢిల్లీకి చేరుకోకూడదనే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రైల్వే అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇలా అడుగడుగునా ఆటంకాలు సృష్టించిందని జేఏసీ నేతలు ఆరోపించారు. రైల్వే అధికారుల తీరుతో తాము ఢిల్లీ ఎప్పుడు చేరతామో చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. సీమాంధ్రకు చెందిన సూర్యప్రకాష్ రెడ్డి రైల్వేశాఖ సహాయ మంత్రిగా ఉండగా ఇలా జరగడం సిగ్గుచేటన్నారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment