ఘనత వాళ్లకు నింద మనకు!
ఇదీ...కాంగ్రెస్ వ్యూహం..
విభజన జరిగితే ఘనత సొంతం చేసుకోవాలనుకుంటోంది: రాజ్‌నాథ్
లేకపోతే నెపాల్ని మనపై నెట్టేయాలనుకుంటోంది..
మేమిచ్చిన డిమండ్లనే సీమాంధ్ర నేతలతో పలికించింది
విభజన జరిగితే ఘనత సొంతం చేసుకోవాలనుకుంటోంది: రాజ్‌నాథ్
లేకపోతే నెపాల్ని మనపై నెట్టేయాలనుకుంటోంది..
మేమిచ్చిన డిమండ్లనే సీమాంధ్ర నేతలతో పలికించింది
(న్యూఢిల్లీ) "ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు అనుమానాస్పదంగా ఉన్నాయి. ఆ పార్టీ ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. విభజన జరిగితే ఆ ఘనతను తాను సొంతం చేసుకోవాలనుకుంటోంది. లేకపోతే, నెపాన్ని బీజేపీపై నెట్టాలని ప్రయత్నిస్తోంది'' అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ హరిబాబు ఆధ్వర్యంలో సీమాంధ్ర బీజేపీ నాయకులు గురువారం రాజ్‌నాథ్‌ను ఆయన నివాసంలో కలిశారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారంటూ వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో సీమాంధ్ర డిమాండ్లను మరోసారి పార్టీ అధ్యక్షుడికి వినిపించారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. రాష్ట్ర విభజన విషయంలో బీజేపీ వైఖరి చాలా స్పష్టంగా ఉందని, పది జిల్లాలతో కూడిన తెలంగాణకు మద్దతు ఇవ్వాలని, సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేయాలన్నదే పార్టీ విధాన నిర్ణయమని రాజ్‌నాథ్ పునరుద్ఘాటించారు. "సోమ లేదా మంగళవారాల్లో పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు మాతో కూడా అనధికారిక చర్చలు జరుగుతున్నాయి. సీమాంధ్రకు న్యాయం అంటే ఏంటి? మీ పార్టీ డిమాండ్లు ఏంటి? అని కూడా అడిగారు. సీమాంధ్ర రాజధానిని కూడా బిల్లులోనే పేర్కొనాలి. సీమాంధ్రకు ప్రకటించే ఆర్థిక ప్యాకేజీకి ప్రణాళికా సంఘం నుంచి అనుమతి పొందాలి. పదేళ్లపాటు కొత్త రాష్ట్రానికి పన్ను రాయితీలు కల్పించాలి. హైదరాబాద్ ఆదాయ పంపిణీని స్పష్టం చేయాలి. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న సీమాంధ్ర విద్యార్థులు మరో పదేళ్లపాటు అక్కడ జరిగే అన్ని కాంపిటీటివ్ పరీక్షల్లో పాల్గొనేందుకు వారిని స్థానికులుగా పరిగణించాలి. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రులకు భద్రత కల్పించాలి.
పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రకు ఇవ్వాలి. రాయలసీమకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలి. అంటూ పలు డిమాండ్లను చెప్పాం. అలాగే, పార్లమెంటు ఉభయ సభల్లో ఏ ఒక్క ఎంపీని సస్పెండ్ చేసేందుకు అంగీకరించబోమని స్పష్టం చేశాం. ముందుగా, కాంగ్రెస్‌లోని ఇరు ప్రాంత ఎంపీలనూ అదుపులో పెట్టుకోవాలని సూచించాం. వీటిని సానుకూలంగా పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, ఆ తర్వాత మేం చెప్పిన డిమాండ్లనే సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు జీవోఎంకు సమర్పించినట్లు నా దృష్టికి వచ్చింది. ప్రతి చిన్న విషయంలోనూ తనదే పైచేయి కావాలని, విభజన క్రమంలో వెలువడే ఘనత మొత్తం తనకే దక్కాలన్న ఆరాటం ఆ పార్టీలో కనిపిస్తోంది. ఒక జాతీయ పార్టీ ఇలా ఆలోచించటం దురదృష్టకరం'' అని రాజ్‌నాథ్ తప్పుబట్టారు.
బీజేపీ మాత్రం ఏనాడూ ఘనతల కోసం పాకులాడబోదని, ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఆయన చెప్పారు. సీమాంధ్ర ప్రజల ప్రయోజనాల విషయంలో తాము రాజీ పడబోమని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు తాము ఎంతగా కట్టుబడి ఉన్నామో, సీమాంధ్ర ప్రయోజనాలు నెరవేర్చే విషయంలో కూడా అంతే కట్టుబడి ఉన్నామని సీమాంధ్ర నేతలకు భరోసా ఇచ్చారు. విభజన విషయంలో కాంగ్రెస్ చివరి నిమిషంలో అనధికారికంగా మాట్లాడుతోందే తప్ప అధికారికంగా చర్చలు జరపటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ వ్యూహమేంటో స్పష్టంగా తెలియటం లేదని, అసలు ఆ పార్టీకి అయినా విభజన విషయంలో ఒక స్పష్టత ఉందా? అన్న అనుమానాన్ని రాజ్‌నాథ్ వ్యక్తం చేశారు. ఈ సమయంలో, రాష్ట్ర అసెంబ్లీలో జరిగినట్లు పార్లమెంటులో కూడా మూజువాణీ ఓటుతో తెలంగాణ బిల్లును ఆమోదిస్తారంటూ కొందరు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారని సీమాంధ్ర నేతలు రాజ్‌నాథ్ దృష్టికి తీసుకెళ్లగా.. "అలా జరిగేందుకు ఆస్కారమే ఉండదు.
చర్చ జరక్కుండా బిల్లును ఆమోదించే సంప్రదాయం ఇక్కడ లేదు. ఎంపీలను సస్పెండ్ చేయ టం, మార్షల్స్‌ను తెచ్చి బయటకు తోయించటం వంటివి కూడా ఉండవు'' అని వివరించారు. కేసీఆర్ కూడా తనను కలిశాడని, విభజన విషయంలో పార్టీ విధానాన్ని ఆయనకు స్పష్టం చేశానని చెప్పారు. బహుశా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలంతా ఢిల్లీలోనే ఉన్నట్లు కనిపిస్తోందని రాజ్‌నాథ్ చెణుకులు విసిరారు. వీరంతా శుక్రవారం ఆడ్వాణీ, సుష్మ, జైట్లీ తదితరులను కలవనున్నారు.
No comments:
Post a Comment