విభజనపై నిర్ణయం భాధాకరం, హైదరాబాద్‌ను యూటీ చేయాలి : చిరంజీవి
న్యూఢిల్లీ, ఫిభ్రవరి 20 : ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం చాలా బాధాకరమని కేంద్రమంత్రి చిరంజీవి పేర్కొన్నారు. గురువారం రాజ్యసభలో తెలంగాణ బిల్లుపై చర్చలో భాగంగా ప్రసంగించిన చిరంజీవి పై విధింగా స్పందించారు. సభలో ఇది నా తొతి ప్రసంగమని, అందరూ సహకరించాలని ఈ సందర్భంగా సభ్యలను ఆయన కోరారు. వ్యత్తిగతంగా సమైక్యవాదినేనని అయితే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడిఉన్నాని ఆయన తెలిపారు.
తమతో సంప్రదించకుండానే కేంద్రం విభజన నిర్ణయం తీసుకుందనని చిరంజీవి తెలిపారు. విభజన విషయంలో కేంద్రం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని తప్ప ఇంకెవ్వరినీ సంప్రదించలేదని, ఆంటోని కమిటీ కూడా తెలుగు ప్రజల సమస్యలు వినలేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియలో శ్రీకృష్ణ కమిటీ నివేదిక కూడా కేంద్రం పరిగణలోకి తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయం తెలుగు ప్రజలందరినీ దిగ్భాృంతికి గురిచేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా రాష్ట్ర విభజన దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదించిన విధానం దారుణమని చిరంజీవి అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన కురియన్ లోక్‌సభ విషయాలు ఇక్కడ మాట్లాడొద్దని చిరంజీవికి సూచించారు. ఈ పరిణామాలన్నిటికి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కారణం కాదని, కేవలం కాంగ్రెస్‌ను దోషిగా చూడడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిలో అన్నీ పార్టీల ప్రమేయం కూడా ఉందని చిరంజీవి స్పష్టం చేశారు. ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించే హక్కు కేంద్రానికుందని వైసీపీ తెలిపిందని ఆయన గుర్తుచేశారు.
తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా టీడీపీ కూడా లేఖ ఇచ్చిందని చిరంజీవి ఈ సందర్భంగా గుర్తుచేశారు. చంద్రబాబు సమన్యాయం నినాదంలో అర్థం లేదని, తెలంగాణ విషయంలో చంద్రబాబుకే స్పష్టత లేదని ఆయన ఎద్దేవా చేశారు. దీంతో చిరంజీవి వ్యాఖ్యలను టీడీపీ సభ్యుడు సీఎం రమేష్, సుజనాచౌదరీలు తీవ్రంగా ఖండించారు. సీఎం.రమేష్ చిరంజీవి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొనడంతో కురియన్ జోక్యం చేసుకుని సభ్యులకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ విషయంలో వెనక్కి తగ్గిందని ఆయన విమర్శించారు. ఈ వ్యాఖ్యలను వెంకయ్యనాయుడు ఖండించారు. చిరంజీవి మంచి నటుడని ఆయన ఎద్దేవా చేశారు.
ప్రభుత్వంలో కొనసాగుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని చిరంజీవి ఎలా వ్యతిరేకిస్తాడని బీజేపీ నేత అరుణ్‌జైట్లీ ప్రశ్నించారు. చిరంజీవికి చిత్తశుద్ధి ఉంటే తమ పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. అరుణ్‌జైట్లీ వ్యాఖ్యలకు స్పందించిన చిరంజీవి నేను ప్రజల తరపున మాట్లాడుతున్నానన్న విషయాన్ని జైట్లీ అర్ధం చేసుకోవాలని చిరంజీవి కోరారు.
హైదరాబాద్‌తో తమకు భావోద్వేగ సంబంధాలున్నాయని చిరంజీవి ఈ సందర్భంగా తెలిపారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని ఆయన స్పష్టం చేశారు. తెలుగు ప్రజలందరూ తనను చాలా ప్రేమగా అభిమానిస్తారని చెప్పిన చిరంజీవి ఈ సందర్భంగా వారందరికి కృతఘ్నతలు తెలియజేశారు.
No comments:
Post a Comment