రేపు ఆంధ్ర రాష్టం నుంచి ఢిల్లీకి వెళుతున్నా,
తిరిగి తెలంగాణ రాష్ట్రంలోకి వస్తా,
15 లోపు స్వీట్లు తినిపిస్తా : కేసీఆర్
హైదరాబాద్ జనవరి 30 : ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తెలంగాణ వచ్చితీరుతుందని, రేపు (శుక్రవారం) ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళుతున్నానని, తిరిగి వచ్చేది తెలంగాణ రాష్టంలోకేనని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. గురువారం అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లు తిరస్కరణకు గురికావడంపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ 15 రోజులలో తెలంగాణ ప్రజల కల సాకారం కాబోతుందని, ఎవరూ నిరాస చెందవద్దని, సంతోషంగా ఉండాలని, సంబరాలు చేసుకుందామని, స్వీట్లు తినిపిస్తానని స్పష్టం చేశారు.
తాను 14 ఏళ్ళనుంచి ఏం చెబుతున్నాననో ఇప్పుడు అసెంబ్లీలో అదే జరిగిందని సీమాంధ్ర నేతలవి చిల్లర రాజకీయాలని, వారు ఏం మాట్లాడారో అర్థం కాని పరిస్థితి అని కేసీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కు, ప్రతిపక్షనేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఏం మాట్లాడాలో తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి అనుకుంటే శాసనసభనే రద్దు చేయగలని, వాళ్ళవి చిల్లర వ్యాఖ్యలని ఆయన విమర్శించారు. ఇంత జరిగిన తర్వాత ఇక కలిసి ఉండలేమని, మానసికంగా విడిపోయామని కేసీఆర్ పేర్కొన్నారు. సీమాంధ్రకు ఏం కావాలో కేంద్రం కోరుకోమని అంటే, కోరుకోకుండా ఏదో మాట్లాడుతున్నారని కేసీఆర్ అన్నారు.
తెలంగాణ విషయంలో తెలంగాణ ప్రజలు నిర్భయంగా ఉండాలని, ఈరోజుతో అసెంబ్లీ అయిపోయిందని, ముఖ్యమంత్రి కిరణ్, చంద్రబాబు నాయుడులు ఏం చేయలేరని, ఇక జరగాల్సింది ఢిల్లీలోనేనని కేసీఆర్ పేర్కొన్నారు. జయప్రకాష్ నారాయణతో సహా సీమాంధ్ర నేతలు అందరూ వాళ్ళ నైజం బయట పెట్టారని ఆయన మండిపడ్డారు. ఆర్టికల్ 3 ప్రకారం శాసనసభ అభిప్రాయంతో పనిలేదని, అసెంబ్లీ కేవలం అభిప్రాయం మాత్రమే పంపాలని, ఓటింగ్ కూడా ఉండదని, ఈ విషయం రాజ్యాంగంలోనే ఉందని, అనేక పర్యాయాలు సుప్రీం కోర్టు కూడా ఇదే తీర్పు చెప్పిన విషయాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రాజ్యాంగా పూర్తిగా తెలుసుకోకుండా సీమాం«ద్రులు ఏవేవో వ్యాఖ్యలు చేయడం సరికాదని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అంతా అయిపోయిందని, ఇక తెలంగాణ విషయమై కేంద్రం చూసుకుంటుందని, ప్రత్యేక తెలంగాణను ఆపడం ఎవరి వల్ల కాదని ఆయన అన్నారు. మీడియాపై కూడా కేసీఆర్ చిందులేశారు. మీడియా పక్షపాతవైఖరి అవలంభించిందని ఆయన విమర్శించారు. భవిష్యత్ తరాలమధ్య విషబీజాలు నాటవద్దని ఆయన కోరారు.
బిల్లుపై ఓడిపోవడం, గెలవడం అన్నది లేదని, చివరిగా బిల్లు పార్లమెంట్‌లో పాస్ అవుతుందని, వచ్చే ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 15లోపే తెలంగాణ ప్రజలకు స్వీట్లు తినిపిస్తానని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు.
No comments:
Post a Comment