మీకా..మినహాయింపా?
హైదరాబాద్, ఫిబ్రవరి 4: "ఆర్థిక నేరాలు ఆవేశంలో చేసే హత్యకంటే తీవ్రమైనవి. మినహాయింపులు ఇవ్వడానికి చెల్లని చెక్కులు ఇచ్చే వారికి సమన్లు జారీ చేసిన కేసు కాదిది. తీవ్రమైన ఆర్థిక నేరాలకు సంబంధించి నీతిబాహ్యమైన అభియోగాలు ఎదుర్కొం టున్నారు. మినహాయింపులు ఇవ్వడం కుదరదు'' అని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసింది. పార్టీ అధ్యక్షుడిగా ఉన్నందున కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసుకొన్న పిటిషన్‌ని నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. దీనిపై సీబీఐ వాదనలతో పూర్తిగా ఏకీభవించింది. విచారణ సందర్భంగా కోర్టు.. జగన్‌ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేసింది. వాయిదాలకు తన బదులు తన న్యాయవాదిని అనుమతించాలంటూ జగన్ 10 చార్జిషీట్లకు సంబంధించి 10 స్పెషల్ వకాలత్ పిటిషన్లు దాఖలు చేశారు. "ఆర్థిక నేరాలు తీవ్రమైనవి. ఇలాంటి కేసుల్లో మినహాయింపులు ఇవ్వకూడదు. వాయిదాలకు హాజరుకాకుంటే, అభియోగాల నమోదు ప్రక్రియ వాయిదా పడుతుంది. నేరం రుజువైతే కనీసం 10 సంవత్సరాలు శిక్ష పడే అభియోగాలు జగన్‌పై ఉన్నాయి.'' అన్న సీబీఐ అధికారుల వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. 'దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజల్ని బలహీనం చేసేస్థాయి అభియోగాలు మీపై ఉన్నాయి. మినహాయింపులు ఇచ్చేందుకు ఎలాంటి కారణాలు లేవు. రోజు వారి వేతనం, ప్రభుత్వ విధుల్లో బిజీగా ఉండే వారికి మాత్రమే మినహాయింపులు ఇవ్వొచ్చు'' అని నాంపల్లి సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఎన్ బాలయోగి వెల్లడించారు.
No comments:
Post a Comment