Tuesday 4 February 2014

రూమ్‌లో వార్

రూమ్‌లో వార్

Published at: 05-02-2014 02:53 AM
 2  0  2 
 
 

తెలంగాణ బిల్లుకు జీవోఎం ఆమోదం
10న రాజ్యసభకు సమర్పణ
ప్రాంతాల వారీగా శిబిరాలు
అంశాల వారీగా వాగ్వాదం
వార్‌రూమ్‌లో హోరాహోరీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 : అది కాంగ్రెస్ వ్యూహాలు ఖరారు చేసే 'వార్ రూమ్'! కానీ, ఆ రూమ్‌లో జరిగింది... 'వార్'. సీమాంధ్ర నేతలు, తెలంగాణ నేతల మధ్య... లగడపాటికీ సీమాంధ్ర నేతలకూ మధ్య... అధిష్ఠానం దూతలకు, సీమాంధ్ర నేతలకూ మధ్య మాటల యుద్ధం! విభజన మీద, వివిధ అంశాల మీద... హోరాహోరీగా వాగ్వాదం! సీమాంధ్ర నేతల్లో కొందరు సున్నితంగా, మరికొందరు ఘాటుగా, ఇంకొందరు నిష్టూరంగా తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు. విభజన బిల్లును గట్టెక్కించేందుకు, ఇరుప్రాంతాల వారికీ సర్ది చెప్పే ప్రయత్నంలో భాగంగా... కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్, జీవోఎం సభ్యుడు, కేంద్ర మంత్రి జైరాంరమేశ్, పార్టీ నేత ఖుంటియా మంగళవారం రాత్రి ఢిల్లీ రికాబ్‌గంజ్‌లోని వార్‌రూమ్‌లో ఇరుప్రాంతాల ఎంపీలను సమావేశ పరిచారు. విభజనపై నిర్ణయం తీసుకున్న తర్వాత అధిష్ఠానం ఇలా ఇరుప్రాంతాల నేతలను ఒక్కచోట సమావేశ పరిచి చర్చించడం ఇదే మొదటిసారి.
రాత్రి 7 గంటలకు మొదలై సుమారు మూడుగంటలపాటు సాగిన సమావేశం ఆద్యంతం వాడివేడిగా జరిగినట్లు సమాచారం. "ఇరు ప్రాంతాల ప్రజలకు న్యాయంచేస్తాం. సీమాంధ్రకు అత్యంత సంతృప్తికరమైన ప్యాకేజీ ఇస్తాం. సీమాంధ్రకు ఏం చేయాలో బీజేపీ ప్రతిపాదిస్తోంది. ఆ ఘనత విపక్షానికి వెళ్లడమెందుకు? మీరే ప్రతిపాదిస్తే... వాటిని బిల్లులో చేర్చి ఆమోదించేలా చూస్తాం'' అని ఎంపీలకు సూచించారు. అలాగే... విభజన ప్రక్రియకు సహకరించాలని, పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు విమర్శించేందుకు తావివ్వకుండా సభ సజావుగా జరిగేలా చూడాలని కోరారు. కానీ... సీమాంధ్ర ఎంపీలు పలువురు అధిష్ఠానం తీరును దుయ్యబట్టారు. మరీ ముఖ్యంగా... లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్ తదితరులు తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. "అసెంబ్లీకి తప్పుడు బిల్లు పంపించారు. దీనిని అసెంబ్లీ తిరస్కరించింది. తెలంగాణ ఇవ్వాలనుకోవడం, తెలుగు ప్రజలను చీల్చాలని చూడటం పొరపాటు నిర్ణయం'' అని తెలిపారు. కేసీఆర్ నిరాహార దీక్ష బూటకమని, హరీశ్ రావు అగ్గిపెట్టె లేకుండా కిరోసిన్ పోసుకుని నాటకమాడారని విమర్శించారు.
సీమాంధ్రలో కాంగ్రెస్ తీవ్రంగా దెబ్బతింటుందని, భవిష్యత్తులో ఎప్పుడూ అధికారంలోకి రాదని హెచ్చరించారు. విభజన వల్ల తెలంగాణకూ నష్టం జరుగుతుందంటూ... సీఎం కిరణ్ చెప్పిన గణాంకాలను ఉటంకించారు. లగడపాటి మాట్లాడుతుండగా... తెలంగాణకు చెందిన వీహెచ్, పొన్నం ప్రభాకర్ తదితరులు అడ్డుకున్నారు. 'లగడపాటిలో కాంగ్రెస్ రక్తం లేదు. ఇప్పటికీ తెలంగాణలో ఆత్మాహుతులు జరుగుతున్నాయి' అని వీహెచ్ పేర్కొన్నారు. టీ-ఎంపీలకు జైరాం, పార్టీ నేత ఖుంటియా నచ్చచెప్పారు. 'బిల్లును అడ్డుకోవద్దు' అని జైరాం, దిగ్విజయ్ చెబుతుండగానే... 'ఎలా పెడతారో చూస్తాను. నేను అడ్డుకుంటాను' అని లగడపాటి ప్రకటించి ఆవేశంగా సమావేశం నుంచి వెళ్లిపోయారు. తెలంగాణ ప్రాంత ఎంపీల వాదనను తిప్పికొట్టకుండా చూస్తూ ఊరుకున్నారని సీమాంధ్ర ఎంపీలపైనా లగడపాటి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
మా గోడు విన్నారా!: చిరంజీవి
కేంద్ర మంత్రి చిరంజీవి గతంలో ఎన్నడూలేని విధంగా ఆక్రోశం వ్యక్తం చేసినట్లు తెలిసింది. "విభజన విషయంలో కేంద్ర మంత్రులెవరితోనూ సంప్రదించలేదు. విభజిస్తే సీమాంధ్రకు ఏమేం చేయాలో విడమరిచి చెప్పాం. అవీ పట్టించుకోలేదు. ఆదాయ పంపిణీ, విద్యా సంస్థలు, హైదరాబాద్ కేంద్రపాలితం, పోలవరంపై ఏం చేస్తున్నారో చెప్పలేదు. ప్రజల్లో ఆకాంక్షలుంటాయి. మాకూ రాజకీయ భవిష్యత్తు ఉండాలి. కానీ... అంతా ఏకపక్షంగా చేశారు'' అని చిరంజీవి ఆక్రోశించారు. హైదరాబాద్‌తో అనుబంధం లేనందునే 1972లో జైఆంధ్ర ఉద్యమం వచ్చిందని, ఇప్పుడు పరిస్థితి వేరని వివరించారు. 1972లోనే రాష్ట్రాన్ని విభజించాల్సిందని అభిప్రాయపడ్డారు. అయితే... హైదరాబాద్ యూటీ చేయడం కానీ, యూటీతరహా పాలన నడపడంకానీ కుదరదని పార్టీ పెద్దలు స్పష్టం చేశారు. ఇతరత్రా అంశాలకు సంబంధించి ప్యాకేజీలు సిద్ధం చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టుపై చిరంజీవి మాట్లాడుతున్నప్పుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి జోక్యం చేసుకోగా... 'ముందు చిరంజీవిని మాట్లాడనివ్వండి' అని దిగ్విజయ్ నిలువరించినట్లు తెలిసింది. ఇక... సీమాంధ్రకు ఏం ఇచ్చుకున్నా అభ్యంతరం లేదని, తమకు మాత్రం రాష్ట్రం కావాలని తెలంగాణ నేతలు పేర్కొన్నట్లు తెలిసింది,
నోనో..కేవీపీ
గతంలో అధిష్ఠానం అనుమతి తీసుకునే తెలంగాణకు వ్యతిరేకంగా రాజ్యసభలో మాట్లాడానని, ఇప్పుడు కూడా అనుమతిస్తే బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడతానని కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు. అయితే... 'నోనో.. అలా చేయకూడదు' అని దిగ్విజయ్ స్పష్టం చేశారు. వార్‌రూమ్‌లో పోలవరం ప్రాజెక్టుపై చాలాసేపు చర్చ జరిగినట్లు తెలిసింది. 'పోలవరం నుంచి ముంపు ప్రాంతాలను వేరు చేయడం మంచిది కాదు' అని హర్షకుమార్ పేర్కొనగా... 'పోలవరం మంచిదే! కానీ, ముంపు గ్రామాలను ఏకపక్షంగా ముంచుతామనడంసరికాదు' అని తెలిపారు. ఈ సమావేశంలో కావూరు సాంబశివరావు మినహా మిగిలిన కేంద్ర మంత్రులంతా మాట్లాడారు. "విభజన ప్రక్రియ తుది దశలో ఉంది. ఇప్పటిదాకా వచ్చాక వెనక్కి వెళ్లలేం'' అని జైపాల్ రెడ్డి తెలిపారు. సీమాంధ్రులకు న్యాయంచేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి కోరారు. అదే సమయంలో... టి-బిల్లును సమర్థించలేమని కూడా స్పష్టం చేశారు.
అవిశ్వాస తీర్మానానికి మాత్రం తాము వ్యతిరేకమని చెప్పారు. సీమాంధ్రలో ఎవరూ విభజనను అంగీకరించే ప్రసక్తిలేదని, తాము ప్రజలకు జవాబు చెప్పలేకపోతున్నామని రాయపాటి సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమకు అన్యాయం జరిగిందని, ముఖ్యంగా అనంతపురం జిల్లాకు తీరని నష్టం జరిగిందని చెప్పారు. ఈ సమయంలో... 'సీమకు మంచి ప్యాకేజీ ఉంటుంది. ఎలాంటి నష్టం జరగదు' అని జైరామ్ హామీ ఇచ్చారు. రాయలసీమకు ఎలాంటి ప్యాకేజీ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని వీహెచ్ పేర్కొన్నారు. ఈ భేటీ ముగిసిన తర్వాత... బుధవారం సీమాంధ్ర ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశం కావాలని పార్టీ పెద్దలు నిర్ణయించుకున్నారు. ప్రభుత్వంపై గతంలో అవిశ్వాసం ప్రతిపాదించిన ఆరుగురు ఎంపీలనూ భేటీకి ఆహ్వానించినా... ఉండవల్లి, సబ్బం హరి హాజరు కాలేదు.
ఇరువురికీ విజయం : దిగ్విజయ్
అటు సీమాంధ్ర ప్రజలు, ఇటు తెలంగాణ ప్రజలు ఇరువురూ గెలుపొందేలా చూస్తామని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. ఎంపీలతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. "సమావేశం బాగా జరిగింది. అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నాం. సీమాంధ్ర ఎంపీల ఆందోళన తెలుసుకున్నాం. వాటిని జీవోఎం దృష్టికి తీసుకెళతాం'' అని తెలిపారు. ఇక... ఇప్పటికే కేంద్ర మంత్రి జేడీ శీలం పది అంశాలను రూపొందించారని, అందరూ మరోసారి చర్చించి ప్రతిపాదన లివ్వాలని జైరాం కోరారు.
భద్రాచలాన్ని ఎలా విభజిస్తారు?
ఎవరో చెప్పారని, ఇంకెవరో ఒప్పుకొన్నారని చెప్పి భద్రాచలాన్ని ఎలా విభజిస్తారు? ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకోరా? ఈ అంశంపై తమనెవరూ సంప్రదించలేదు. నోరు లేని గిరిజనులని చెప్పి వారి అభిప్రాయాలను తెలుసుకోకుండా ఎలా ముక్కలు చేస్తారు? పోలవరం ప్రాజెక్టు కోసం నిర్ణయం తీసుకుంటే అక్కడి ప్రజలను ఏం చేస్తారు!?
-భద్రాచలం పట్టణం మినహా మిగిలిన డివిజన్‌ను సీమాంధ్రలో కలుపుతారన్న వార్తలపై రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
సమస్యలు తీర్చకుంటే వ్యతిరేకంగా ఓటు
"సీమాంధ్రుల సమస్యలు తీర్చకుండా బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెడితే వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పాం. జంతర్ మంతర్ వద్ద సీఎం దీక్ష చేస్తే మేమూ పాల్గొంటాం''
- మాగుంట శ్రీనివాసులు రెడ్డి
మా ప్రాంత ప్రయోజనాలకు కట్టుబడతాం
"ఇరు ప్రాంతాల నేతలను కూర్చోబెట్టి మాట్లాడాలని ఎప్పటి నుంచో చెబుతున్నాం. బిల్లుపై ముందుకెళితే మా ప్రాంత ప్రయోజనాలకు కట్టుబడి ఉంటామని చెప్పాం. సమస్యలు పరిష్కరించకుండా ముందుకు వెళితే ఇబ్బందులు వస్తాయి''
- కేంద్ర మంత్రి జేడీ శీలం
జీవోఎం సవరణలు నమ్మశక్యంగా లేవు
"అసెంబ్లీలో తిరస్కరించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టవద్దని చెప్పాం. జీవోఎం సవరణలు నమ్మశక్యంగా లేవు. తొమ్మిది వేల సవరణలను 24 గంటల్లో ఎలా పరిశీలించారు? సమస్యలు తీర్చకుండా బిల్లు పెడితే వ్యతిరేకంగా ఓటు వేస్తాం''
- ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి
- See more at: http://www.andhrajyothy.com/node/62132#sthash.bk8ZYefY.dpuf

No comments:

Post a Comment