హైదరాబాద్, ఫిబ్రవరి 19 : రాష్ట్ర విభజన సమస్య పరిష్కారానికి మొదటి నుంచి అనేక విధాలుగా ప్రయత్నించామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ సీఎం కిరణ్ రాజీనామా గురించి గవర్నర్ తనకు సమాచారమిచ్చారని, రాజ్యాంగం ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని చెప్పినట్లు బాబు తెలిపారు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేయడమే టీడీపీ సిద్ధాంతమని, 2008లో లేఖలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ఆట తప్ప సమస్య పరిష్కారించాలనే చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజించారని మండిపడ్డారు. పార్లమెంటులో ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేయడం దారుణమని, నిన్న లోక్‌సభ యుద్దవాతావరణాన్ని తలపించిదన్నారు. స్పీకర్‌కు అంతా తెలిశాక డ్రామాలు ఎందుకని బాబు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రతో ఓట్లు, సీట్లకోసం కక్కుర్తి పడిందని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ను కలుపుకుంటారని, సీమాంధ్రలో జగన్ బలహీనపడటంతో కిరణ్‌ను తెరపైకి తెచ్చారన్నారు.
సోనియాను, ప్రధానిపై ఎలాంటి విమర్శలు చేయకుండానే సీఎం కిరణ్ రాజీనామా చేశారన్నారు. ఇదంతా 10 జెన్‌పథ్ స్కిప్టులో భాగమే అని వ్యాఖ్యానించారు. తెలుగు జాతి ఐక్యత కోసం ఎంతో కృషి చేశానని, ఢిల్లీలో ఏకపక్ష నిర్ణయం కాకుండా, రాష్ట్రంలో చర్చ జరిపి సమస్య పరిష్కరించాలన్న తమ మాటను కేంద్రం పెడచెవిన పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ సవరణలు చేయకుండా బిల్లును దుర్వినియోగం చేశారన్నారు. 371డి, 371ఈ ని ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు.
రాజకీయ లబ్ది కోసం విషబీజాలు నాటి...ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ఎక్కడా కూడా అసెంబ్లీ తిరస్కరించిన బిల్లుపై ముందుకు వెళ్లలేదని, ఇది ఫెడరల్ స్పూర్తి విర్ధుమన్నారు. విభజన అంశంపై జాతీయ నేతలను కలిసి వివరించామన్నారు. విభజన అనేది పాకిస్థాన్- ఇండియా మధ్య కాకుండా తెలుగు జాతి మధ్య భౌగోళిక విభజన జరగాలని కోరారు. ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదని, బిల్లు తయారీలో రాజకీయ కుట్ర జరిగిందని ఆరోపించారు.
ఆర్టికల్-3ని కాంగ్రెస్ దుర్వినియోగం చేసిందన్నారు. ఇటీవల జరిగిన విభజనలు కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాతే పార్లమెంటుకు వెళ్లాయని, ఇక్కడ అందుకు విరుద్ధంగా జరిగిందని విమర్శించారు. తెలంగాణ బిల్లుకు బీజేపీ కూడా సహకరించడం దారుణమని చంద్రబాబునాయుడు అన్నారు.
No comments:
Post a Comment