Sunday 2 February 2014

ఆ తీర్మానం బ్రహ్మాస్త్రమే!

ఆ తీర్మానం బ్రహ్మాస్త్రమే!

Published at: 03-02-2014 03:34 AM
 New  0  0 
 
 

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతుంది
కలిసుండాలో విడిపోవాలో వచ్చే ఎన్నికల్లో ప్రజలే తేలుస్తారు
విభజనపై నిర్ణయాధికారం వారికే ఇవ్వాలి
2 నెలల్లో ఎన్నికలుండగా ఇప్పుడెందుకీ తొందర?
సభలో చేసిన తీర్మానం వెనుక ప్రజల అత్మాభిమానం
కొందరు మూజీవాణి ఓటు తొండి అంటున్నారు
తెల్లకాగితమే అయితే భయమెందుకు?
బిల్లును ఓడిస్తానని చెప్పాను.. ఓడించాను
రాష్ట్రపతి సంతృప్తి చెందితేనే పార్లమెంటుకు
వీగిపోయిన, అసమగ్ర బిల్లును ఎలా పంపిస్తారు?
సీఎం ధ్వజం.. జైపాల్. బాబులకు పరోక్ష చురకలు
"అసెంబ్లీ చేసిన తీర్మానం తెల్లకాగితమే అయితే అంత భయమెందుకు? వణుకు ఎందుకు? అది తెల్లకాగితం కాదు. దాని వెనుక ప్రజల ఆకాంక్షలు, ఆత్మాభిమానం ఉన్నాయి. ''
హైదరాబాద్, ఫిబ్రవరి 2 : 'అసెంబ్లీ తీర్మానం ఉత్తి కాగితం కాదు. తెల్లకాగితం అసలే కాదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే బ్రహ్మాస్త్రం' అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. ఆ తీర్మానం వెనుక రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, ఆత్మాభిమానం ఉన్నాయన్నారు. ఇష్టమొచ్చినట్లు చేస్తే ప్రజలు సహించబోరనే సందేశం ఉందని తెలిపారు. 'ఇప్పటిదాకా అసెంబ్లీ తీర్మానం లేకుండా భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రాన్నీ విభజించలేదు' అని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన బిల్లు సోమవారం ఢిల్లీ చేరుతున్న సమయంలో... సీమాంధ్ర నేతలతో కలిసి రెండు మూడు రోజుల్లో రాష్ట్రపతిని కలవాలని భావిస్తున్న నేపథ్యంలో... ఆదివారం ముఖ్యమంత్రి కిరణ్ మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలో, విడిపోవాలో నిర్ణయించాల్సింది తెలుగు ప్రజలేనని... రెండు నెలల్లో జరిగే ఎన్నికల్లో ప్రజలకు ఆ అవకాశం ఇవ్వాలని ఉద్ఘాటించారు. 'తీర్మానం తొండి' అని విమర్శించిన కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి పేరు ప్రస్తావించకుండానే ఆయనకు చురకలు అంటించారు. అసెంబ్లీలో బిల్లుపై మాట్లాడేందుకు 'అవకాశం లభించని' చంద్రబాబుపైనా చెణుకులు విసిరారు. ఆయా అంశాలపై కిరణ్ వెల్లడించిన అభిప్రాయాలు... ఆయన మాటల్లోనే...
బిల్లును ఓడించి పంపుతామని పులిచింతల ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమయంలోనే చెప్పాను. అది చేసి చూపించాను. కొందరు మూజువాణి ఓటు అంటే తొండి ఆట అని అంటున్నారు. దీనిని చెల్లని తీర్మానమంటున్నారు. మూజువాణి ఓటు అంటే 'ఎవరూ వ్యతిరేకించని, ఎవరూ సవాలు చేయనిది' అని అర్థం. పార్లమెంటులోగానీ, అసెంబ్లీలోగానీ 80 నుంచి 90 శాతం బిల్లులు మూజువాణీ ఓటుతోనే పాసవుతా యి. ఇటీవల పార్లమెంటు ఆమోదించిన లోక్‌పాల్, ఆహార భద్రత బిల్లులు కూడా ఇలాగే గట్టెక్కాయి. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్ రాష్ట్రాల ఏర్పాటు బిల్లులను కూడా పార్లమెంటు ఇదేవిధం గా ఆమోదించింది. ఆంధ్ర రాష్ట్రం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా ఈ పద్ధతిలోనే ఏర్పడ్డాయని మరచిపోవద్దు. 'మేం సీనియర్ పార్లమెంటేరియన్లం, మేధావులం, తలలుపండిన నేతలం' అని చెప్పుకొనేవారు కూడా పదవీకాంక్షతో మారిపోయారు. సమైక్యవాదులు విభజనవాదులైతే... విభజనవాదులు సమైక్యవాదులయ్యారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా రాజకీయ లబ్ధికి, స్వలాభం కోసం తమ పద్ధతులు, పార్టీల విధానాలు మార్చుకుంటు న్నా మేం మాత్రం మా విధానం మార్చుకోలేదు.
భయమెందుకు?
ఇది తెల్లకాగితమే అయితే... తీర్మానం చేసిన 15 నిమిషాల్లో మా పార్టీ ప్రధాన కార్యదర్శి (దిగ్విజయ్ సింగ్) ఎందుకు స్పందించారు? పది నిమిషాల్లోనే కేసీఆర్ ఎందుకు బయటికొచ్చి మాట్లాడారు? ఇది ఉత్త తెల్లకాగితమైతే ఎందుకు వణుకు పుడుతోంది? తీర్మా నం ఉత్త కాగితంకాదు. సమై క్య రాష్ట్రం కోసం వేసిన బ్రహ్మా స్త్రం. కొత్త రాష్ట్రాలు వస్తే తీర్మానం తప్పక ఆమోదం పొందాల్సిందే. తీర్మానం లేదా మోషన్ ద్వారానే సభాభిప్రాయం తెలుస్తుంది. ఇది చెల్లదంటూ మనకు ఇష్టం వచ్చినప్పుడు, మనకు ఇష్టమైన అర్థాలు చెప్పడమంటే ప్రజలను మభ్యపెట్టడమే.
అసమగ్రం...
ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్రం నుంచి వచ్చిన బిల్లు... రాష్ట్రం నుంచి వీగిపోయి వెళుతోంది. ఇలా జరగడం స్వతంత్ర భారత చరిత్రలోనే తొలిసారి. బిల్లు అసమగ్రంగా ఉంది. పైగా వీగిపోయింది. ఈ రెండింటినీ (రాష్ట్రపతి) పరిగణనలోకి తీసుకోవాలి. రాష్ట్రాన్ని ఎందుకు విభజిస్తున్నారు? కారణాలేమిటి? విభజనవల్ల ఎవరికి లాభం? ఆర్థికభారమెంత? అందులో కేంద్రం ఎంత భరిస్తుంది? (ఆబ్జెక్టివ్స్, రీజన్స్, ఫైనాన్షియల్ మెమొరాండం) ఇవన్నీ ప్రస్తావిస్తూ పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్న బిల్లును మాత్రమే అసెంబ్లీకి పంపాలి. కానీ... ఆ వివరాలన్నీ ఖాళీగా పెడితే అసెంబ్లీ దేనిపై అభిప్రాయాలు చెప్పాలి? అదనపు సమాచారం కోసం కాంగ్రెస్, టీడీపీతోపాటు లోక్‌సత్తా నేత జేపీ కూడా హోంశాఖకు స్పీకర్ ద్వారా లేఖ పంపారు. కానీ... 'ఇది డ్రాఫ్టు బిల్లు. మా ఇష్ట ప్రకారం మార్చుకుంటాం. మీకు జవాబిచ్చే అవసరమేలేదు' అని బదులిచ్చారు.
నిర్ణయించాల్సింది ప్రజలే
విభజన వల్ల రెండు ప్రాంతాలకు ఎలాంటి నష్టం జరుగుతుందో చర్చలో స్పష్టం చేశాం. ఇన్నేళ్లుగా జరుగుతున్న ఏకపక్ష ప్రచారాన్ని తిప్పికొడుతూ వాస్తవాలను వివరించాం. రాజకీయాల కోసం రాష్ట్రాలను విభజించకూడదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని మళ్లీ మళ్లీ చెబుతున్నా. విభజన తెలుగు ప్రజల నిర్ణయం మేరకే జరగాలి. ఇన్నేళ్లు నిర్ణయం తీసుకోలేదు కదా! ఇప్పుడు మరో రెండు నెలల్లో ఎన్నికలున్నాయి. రాష్ట్రం విడిపోవాలో, కలిసి ఉం డాలో ప్రజలే నిర్ణయం తీసుకోనివ్వండి.
కలిసి రావాలని...
రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు అసెంబ్లీలో కలిసి వచ్చినట్లుగానే ఇకపైనా తెలుగుదేశం, వైసీపీలు కలిసి రావాలని కోరుతున్నాను. అంతా కలిసి ఢిల్లీ వెళ్లి, రాష్ట్రపతికి అభిప్రాయాలు తెలియజేయవచ్చు. లేదా ఆ రెండు పార్టీల నాయకులు వేర్వేరుగానైనా ఆయనను కలుసు కుని చెప్పవచ్చు. రాష్ట్రం సమైక్యంగా ఉంటే చాలు. ఎవరు, ఏ ప్రాంతం వారు అధికారంలోకి వచ్చినా ఫర్వాలేదు. 4 లేదా 5వ తేదీన రాష్ట్రపతిని టైమ్ అడిగాం. ఢిల్లీకి వెళ్లి ఆయనను కలుస్తాం. అసెంబ్లీ, మండలి తీర్మానాన్ని రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకుంటారని పూర్తి నమ్మకముంది. చూద్దాం... ఏమవుతుందో! చర్చ ముగిసిన తర్వాత చేసిన తీర్మానం చెల్లదనే వాదనలోనూ పసలేదు. భారతదేశంలో అన్ని తీర్మానాలు ఇదే విధంగా జరిగాయి. మూడు రాష్ట్రాల ఏర్పాటు తీర్మానాలు కూడా అలాగే జరిగాయి. నేను చెప్పిన వాస్తవాలకు మద్దతుందో, లేదో రాబోయే రోజుల్లో మీరే చూస్తారుగా! మరో 20 రోజులే కదా... బిల్లు పార్లమెంటుకు చేరితే ఏమవుతుందో చూద్దాం! భారత రాజ్యాంగంపైన, అసెంబ్లీ తీర్మానానికి అది ఇచ్చే ప్రాధాన్యంపైనే నా ఆశ!
- డ్రామాలు, మాట మార్చుకోవడం కాంగ్రెస్‌లో ఉండవు. రాష్ట్రాన్ని విభజించాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. కానీ... రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా మేం ఈ నిర్ణయం తీసుకున్నాం.
- కేంద్రం, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకవైపు ఉన్నాయి. మేం మరోవైపు ఉన్నాం.
-నాకు ఎవరూ స్వేచ్ఛ ఇవ్వనక్కర్లేదు. కాంగ్రెస్‌లో నాకు స్వేచ్ఛ ఉంది.
-మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి బిల్లు వచ్చిన తర్వాత... దానిని 15 రోజులపాటు సమగ్రంగా పరిశీలించిన తర్వాతే అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇక్కడేమో కొంపలు మునిగిపోయినట్లు రాద్ధాంతం చేసి సభలో పెట్టించారు. ఒక్కరోజు నేను అనారోగ్యంతో శాసనసభకు గైర్హాజరైతే వివాదాస్పదం చేశారు.
రాష్ట్రపతి సంతృప్తి చెందాలి...
గతంలో కేంద్రమే బిల్లును పార్లమెంటులో పెట్టేది. ఆ పద్ధతి తీసివేసి రాష్ట్రాల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇచ్చేలా రాష్ట్రపతి ద్వారా బిల్లు వెళ్లాలనే పద్ధతి ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి పూర్తిగా సంతృప్తి చెందాకే పార్లమెంటుకు బిల్లు పంపా ల్సి ఉంటుంది. రాజ్యాంగపరమైన, లీగల్ అంశాలు ఏమైనా ఉంటే సుప్రీంకోర్టుకు కూడా పంపే అధికారం రాష్ట్రపతికి ఉంది. ఆర్టికల్ 3 ప్రకారం... న్యాయ, రాజకీయ, శాంతి భద్రతల అంశాలన్నీ చూసుకుని రాష్ట్రపతి సిఫారసు చేయా లి. అసెంబ్లీలో తీర్మానంపై ఎవరూ డివిజన్ కోరలేదు. కాబట్టి సాంకేతికంగా ఇది ఏకాభిప్రాయమే. అంతిమంగా చెప్పేదేమిటంటే... 'బిల్లు వీగిపోయింది'.
బాబు మాట..
"బిల్లుపై సభలో అభిప్రాయం చెప్పేందుకు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు నేను అవకాశం ఇవ్వాల్సిన అవసరంలేదు. అది స్పీకర్ ఇవ్వాలి. కొందరికి మాత్రం అవకాశం దొరకలేదు. విభజనపై పదేపదే వారి అభిప్రాయం మార్చుకున్నవారు... అవకాశం వచ్చినా రానట్లు, వచ్చి ఉంటే బాగుండు అన్నట్లుగా చెబుతున్నారు.''
- See more at: http://www.andhrajyothy.com/node/61300#sthash.AyAYLTtD.dpuf

No comments:

Post a Comment