Friday 1 January 2016

ఒక భూమికి ఒకే పత్రం

ఒక భూమికి ఒకే పత్రం 
02-01-2016 03:18:11

  • పాస్‌బుక్‌, టైటిల్‌ డీడ్‌ వేర్వేరు కాదిక!
  • రెండూ కలిపి సింగిల్‌ డాక్యుమెంట్‌
  • తహసీల్దారుకే జారీ అధికారం
  • ఏపీ సర్కారు సంచలన నిర్ణయం
  • వెబ్‌ల్యాండ్‌ ఆధారంగా రుణాలు
  • ఒకే సర్వే నంబర్‌పై
  • వేర్వేరు బ్యాంకుల్లో లోన్లు కుదరవు

హైదరాబాద్‌, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): ఇక ఒక భూమికి... ఒకటే రికార్డు! పాస్‌ బుక్‌ అని, టైటిల్‌ డీడ్‌ అని, మరొకటని, ఇంకొకటని రకరకాల గందరగోళాలు ఉండవు! భూమి హక్కు రికార్డుల విషయంలో ఇలా కీలక సంస్కరణలు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. భూమి హక్కులను తెలియజేసేందుకు ఒకటికి మించి ఎక్కువ రికార్డులు ఉండటం వల్ల తీవ్ర గందరగోళం నెలకొంటోందని, అవినీతికి ఆస్కారం కల్పిస్తోందని భావిస్తోన్న సర్కారు సింగిల్‌ డాక్యుమెంట్‌ విధానం తీసుకురావాలనుకుంటోంది. దీంతోపాటు బ్యాంకు రుణాలు పొందడం, రిజిసే్ట్రషన్‌లు, మ్యుటేషన్‌లకు కూడా ఇది వర్తించేలా భూమి హక్కుల చట్టం (ఆర్వోఆర్‌)లో సవరణలు తీసుకురావాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. అయితే, ఈ ప్రతిపాదనల్లో ప్రజలకు మేలు చేసేవి కొన్ని ఉంటే..... ప్రజలతోపాటు ప్రభుత్వానికీ తలనొప్పులు తెచ్చిపెట్టేవి కొన్ని ఉన్నాయి. ఈ ప్రతిపాదనలను ఆమోదంలో ముఖ్యమంత్రిదే అంతిమ నిర్ణయమని రెవెన్యూశాఖ చెబుతోంది.
ఇదీ అసలుకథ.... 
భూమి హక్కులపై ప్రస్తుతం రెండు రకాల రికార్డులున్నాయి. ఒకటి పట్టాదారు పాస్‌ పుస్తకం. రెండోది టైటిల్‌డీడ్‌. పాస్‌బుక్‌ను తహసిల్దార్‌ ఇస్తారు. టైటిల్‌ డీడ్‌ రెవెన్యూ డివిజనల్‌ అధికారి(ఆర్డీవో) సంతకంతో ఇస్తారు. భూమి హక్కుల పత్రం (ఆర్వోఆర్‌) చట్టంలోని పలు నిబంధనల మేరకు... ఈ రెండు సమర్పించిన తర్వాతే బ్యాంకులు రుణం ఇస్తున్నాయి. ఈ రెండు డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాతే భూముల క్రయ విక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్‌ జరుతాయి. అయితే... పాస్‌పుస్తకం, టైటిల్‌ డీడ్‌ జారీలో తీవ్ర అవినీతి చోటుచేసుకుంటోందనే విమర్శలున్నాయి. రెవెన్యూ శాఖలో అవినీతి నిర్మూలనకు ఇటీవల కాలంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. దీంట్లో భాగంగా రెవెన్యూ రికార్డులను ప్రజల వద్ద ఉన్న రికార్డులతో సరిపోల్చి, వాటిని పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. ‘మీ భూమి’ అనే వెబ్‌సైట్‌ (వెబ్‌ల్యాండ్‌)ను ఏర్పాటు చేసి అందులో పొందుపరిచారు. 1బీ రిజిస్టర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ‘మీ ఇంటికి - మీ భూమి’ కార్యక్రమం కింద గ్రామసభలు నిర్వహించి వెబ్‌ల్యాండ్‌లో ఉన్న రికార్డులను సరిపోల్చారు. గ్రామాల వారీగా 1బీ రిజిస్టర్‌లను ప్రజలకు అందించారు. ఇక వెబ్‌ల్యాండ్‌లో రెవెన్యూ రికార్డులు అందుబాటులో ఉన్నందున... బ్యాంకులు, రిజిస్ట్రేషన్‌ సిబ్బంది రైతులను పాస్‌బుక్‌, టైటిల్‌డీడ్‌లు కోరవద్దని రెవెన్యూ శాఖ ఆదేశాలు ఇచ్చింది. దీనిపై రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి పెద్దగా అభ్యంతరాలు రాలేదు. కానీ... బ్యాంకులు ఇందుకు అంగీకరించలేదు. ప్రస్తుతం అమలులో ఉన్న ఆర్‌ఓఆర్‌ చట్టాన్ని సవరించకుండా, కేవలం సర్క్యులర్‌ ద్వారా ఆదేశాలను మారిస్తే అమలు చేయలేమని బ్యాంకులు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఆర్వోఆర్‌ చట్టంలోనే సవరణలు తీసుకురావాలని తీసుకురావాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పుడు చేసిన ప్రతిపాదనల్లో ముఖ్యమైనవి ఇవి...
తహసిల్దార్‌కే అధికారం 
పాస్‌బుక్‌, టైటిల్‌డీడ్స్‌ స్థానంలో సమీకృత (ఇంటిగ్రేటెడ్‌) సింగిల్‌ డాక్యుమెంట్‌ ఇవ్వాలి. అంటే... పాస్‌బుక్‌, టైటిల్‌డీడ్స్‌ ఒకే డాక్యుమెంట్‌లో కలిసి ఉంటాయి. సమీకృత డాక్యుమెంట్‌ను పూర్తిగా తహసిల్దార్‌ స్థాయిలోనే జారీ చేసేలా ప్రతిపాదనలు రూపొందించారు. ఇప్పటికే టైటిల్‌ డీడ్స్‌ ఇచ్చే అధికారాన్ని ఆర్‌డీవో నుంచి తప్పించి తహసిల్దార్‌కే అప్పగించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కాబట్టి, భూమి హక్కులకు సంబంధించిన సింగిల్‌ డాక్యుమెంట్‌ ఇచ్చే అధికారాన్ని కూడా పూర్తిగా తహసిల్దార్‌కే అప్పగించేలా కొన్ని సవరణలు తీసుకొస్తారు. ఈ సింగిల్‌ డాక్యుమెంట్‌నే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. వెబ్‌ల్యాండ్‌లోనూ పొందుపరిచే అవకాశం ఉంది. రైతులు, ప్రజలు తమ డాక్యుమెంట్‌ను పట్టుకెళ్లకుండానే ఇటు బ్యాంకులు, అటు రిజిసే్ట్రషన్‌ శాఖ పనులు పూర్తిచేయించే ఆలోచనలు ఉన్నాయి. అయితే, ఇది ఎంత వరకు ఆచరణ సాధ్యమన్న దానిపై భిన్నవాదనలున్నాయి. బ్యాంకులు ఇందుకు సమ్మతం తెలిపినట్లు తెలిసింది.
లోనుకూ లంకె 
బ్యాంకులు వెబ్‌ల్యాండ్‌లో ఉన్న భూముల వివరాలను ప్రాతిపదికగా తీసుకొని రుణాలు ఇచ్చేలా ఆర్వోఆర్‌ చట్టంలో సవరణలు ప్రతిపాదించారు. ఈ మేరకు రెండుచోట్ల క్లాజులను మార్చనున్నారు. వెబ్‌ల్యాండ్‌లో ఉన్న భూముల వివరాలను ఎప్పటికప్పుడు బ్యాంకర్లు పరిశీలించేందుకు ప్రత్యేకంగా అనుసంధానం చేశారు. లోన్‌చార్జ్‌ క్రియేషన్‌ మాడ్యూల్‌ను ఏర్పాటు చేశారు. ప్రతీ బ్యాంకు, ప్రతీ బ్రాంచ్‌ పరిధిలో వెబ్‌ల్యాండ్‌లోకి వెళ్లి వివరాలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఖాతాలను కూడా సృష్టించారు. ఉదాహరణకు... ఒక బ్యాంకు వద్దకు రైతు రుణం కోసం వెళ్తే, ఆయనిచ్చిన వివరాలను వెబ్‌ల్యాండ్‌లో పరిశీలిస్తారు. సర్వే నెంబర్‌, ఆధార్‌ నెంబర్‌, భూముల 1బీ రిజిస్టర్‌ను పరిశీలించి అన్నీ పక్కాగా ఉన్నాయనుకుంటే రుణం మంజూరు చేస్తారు. వెబ్‌ల్యాండ్‌లోనే రైతు భూముల వివరాల వద్దే బ్యాంకునుంచి తీసుకున్న రుణం వివరాలను కూడా నమోదు చేస్తారు. ఈ సమాచారం ఇతర బ్యాంకులకూ అందుబాటులో ఉంటుంది. అంటే, ఒకే సర్వేనెంబర్‌పై వేర్వేరు బ్యాంకుల నుంచి రుణం పొందడం కుదరదు. రైతు తన రుణాన్ని పూర్తిగా చెల్లిస్తే ఆ వివరాలను కూడా వెబ్‌ల్యాండ్‌లో పొందుపరుస్తారు.

తహసిల్దార్ల ‘సెల్ఫ్‌’ మ్యుటేషన్‌ 
తహసిల్దార్‌లే ఆటోమ్యుటేషన్‌ చేసేలా ఒక ప్రతిపాదన రూపొందించారు. రిజిస్ట్రేషన్‌లు ముగిసిన తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్‌ను రిజిస్ట్రేషన్‌ శాఖ తహసిల్దార్‌కు ఆన్‌లైన్‌లో పంపిస్తుంది. దాన్ని చూసిన వెంటనే తహసిల్దార్‌ సుమోటోగా మ్యుటేషన్‌ చేయాలి. అంటే, దాన్ని ఆర్డీవోకు పంపించకుండానే తన స్థాయిలో ఫైలు వచ్చిన వెంటనే పరిష్కరించాలన్న మాట. ఈ ప్రతిపాదనపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి వచ్చే ఫైలుపై తహసిల్దార్‌ సుమోటోగా స్పందించడం వరకు బాగానే ఉందని, ఎలాంటి క్షేత్రస్థాయి విచారణ లేకుండానే మ్యుటేషన్‌ చేస్తే మాత్రం చాలా ఇబ్బందులొస్తాయని అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాక... దానికి సంబంధించిన డాక్యుమెంట్‌ను రిజిస్ట్రేషన్‌ శాఖ ఓకే చేసి మ్యుటేషన్‌కోసం తహసిల్దార్‌కు పంపిస్తుంది. కొత్త ప్రతిపాదన ప్రకారం... తహసిల్దార్‌ ఎలాంటి విచారణ చేపట్టకుండానే సుమోటో మ్యుటేషన్‌ చేసి ఫైలును వెనక్కు పంపించాల్సి ఉంటుంది. ప్రభుత్వ భూములపై కూడా అంటే ఎంచక్కా హక్కులు పొందవచ్చన్నమాట. దీని వల్ల మొదట నష్టపోయేది ప్రభుత్వమేనని, ఇక ప్రజల భూములకూ గ్యారంటీ ఉండదని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు.

No comments:

Post a Comment