Friday 22 January 2016

మార్కెట్‌లో పాలు కొనుక్కుని తాగుతున్నారా ?

మార్కెట్‌లో పాలు కొనుక్కుని తాగుతున్నారా ?
22-01-2016 15:37:28

  • అధిక ఉత్పత్తి కోసం విచ్చలవిడిగా పశువులకు ‘ఆక్సిటోసిన్‌’ వాడకం
  • పాలధర పెరుగుతున్న నేపథ్యంలో కొందరి అడ్డదారులు
  • వ్యాధుల బారిన ప్రజలు
  • బలహీన పడుతున్న పశువులు
  • ఇంజక్షన్ అమ్మకం, వాడకంపై అమలు కాని నిషేధం..?
స్వచ్ఛమైన.. ఎన్నో పోషకవిలువలు ఉండే పాలను విషతుల్యం చేస్తున్నారు కొందరు. సంపాదనే ధ్యేయంగా వారు చేస్తున్న ‘కల్తీ’తో పిల్లల నుంచి వృద్ధుల వరకు జబ్బుల బారిన పడుతున్నారు. అధిక ఉత్పత్తికోసం పశువులకు ఇంజక్షన్లు ఇస్తూ... అటు పశుసంపదను బలహీనం చేస్తూ... ఆ పాలను తాగే ప్రజలను రోగాల ఊబిలోకి నెట్టేస్తున్నారు. ఇటీవల పాల ధరలు రెట్టింపవుతుండటంతో ‘డబ్బు’కు ఆశపడుతున్న కొందరు వ్యాపారులు, రైతులు పశువులకు ఔషధాలను ఇస్తూ... పాలను పిండుతున్నారు. ఈ క్రమంలో పాలు పోషకవిలువలను కోల్పోయి విషతుల్యమవుతున్నాయి. మరికొందరైతే ఏకంగా ప్రమాదకర రసాయనాలతో కృత్రిమ పాలు సృష్టిస్తూ ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. 


(ఆంధ్రజ్యోతి- ఖమ్మం) 
పల్లెల నుంచి మొదలుకుని పట్టణాల వరకు ఎందరో పాడి పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారు. మరోవైపు పాలకు డిమాండ్‌ కూడా ఉండటంతో వ్యాపారం జోరుగా సాగుతోంది. కొందరు తమ వ్యాపారాభివృద్ధికి పశువుల సంఖ్యను పెంచుకుంటూ పోతుంటే.. కొందరేమో అడ్డదారులు తొక్కుతున్నారు. పాలను సాంతం పిండేసేందుకు ఔషధాలను ఇంజక్షన్ల రూపంలో ఇస్తూ... స్వచ్ఛమైన పాలను కలుషితం చేస్తున్నారు. పాడి గేదెలకు, ఆవులకు ‘ఆక్సిటోసిన్‌’ ఇంజక్షన్లు ఇచ్చి పాలను పిండుతున్నారు. మార్కెట్లో విక్రయించి ప్రజలను రోగాల‘పాలు’ చేస్తున్నారు.
 
అమలుకాని నిషేధం!
ఈ ఆక్సిటోసిన ఇంజక్షన్లపై నిషేధం ఉన్నా అది అమలు కావడం లేదు. మార్కెట్లో యథేచ్ఛగా విక్రయాలు సాగుతున్నాయి. పాలను త్వరితగతిన విషపూరితం చేస్తున్న ఆక్సిటోసిన్‌ వాడకంపై ప్రభుత్వం గతంలో నిషేధం విధించింది. అయినా కొన్ని ఔషధ కంపెనీలు వాటిని తయారు చేస్తూ మార్కెట్లో విక్రయాలు జరుపుతున్నాయి. కొన్ని గ్రామాల్లో రైతుల ఇళ్లలో ఈ ఇంజక్షన్లు కోకొల్లలుగా ఉన్నాయంటే వీటి వినియోగం ఎంతటిస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఇంజక్షను అమ్మకాలు జరిపితే యానిమల్‌ యాక్ట్‌-1960 సెక్షన్‌12 ప్రకారం సంబంధిత వ్యక్తులను నేరస్థులుగా శిక్షించాలి. ఈ యాక్టు ప్రకారం ఎక్కడైనా ఆక్సిటోసిన్‌ ఇంజక్షన్లు అమ్మకాలు జరిపినా... వాడినా కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్న అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించకపోవడం గమనార్హం. అసలు వాటికి సంబంధించిన హెచ్చరిక బోర్డులు జిల్లాలో ఎక్కడా కూడా కనిపించడంలేదు.
 
ధర తక్కువ ‘ఉత్పత్తి’ ఎక్కువ
పశువుల నుంచి అధికశాతం పాలు రాబట్టుకోవడానికి ఇస్తున్న ఇంజక్షన్ల ధర తక్కువగా ఉండటం.... వాటిని ఉపయోగించడం ద్వారా ఉత్ప్తత ఎక్కువగా వస్తుండటంతో పాడి రైతులు కూడా పశువులకు ఆక్సిటోసిన్‌ ఇంజక్షన్లు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒక్కో ఇంజక్షన్‌ ధర మార్కెట్లో రూ.18నుంచి రూ.25వరకు అమ్ముతున్నారు. అయినా ఇంజక్షన్‌ ఇవ్వడం ద్వారా వచ్చే దిగుబడి ఎక్కువగానే ఉండటంతో రైతులు వాటిని కొనేందుకు వెనుకాడటం లేదు. ఒక్కో ఇంజక్షన్‌ ఇస్తే... ఒక్కో పశువుకు కనీసం లీటరు పాలు పెరిగే అవకాశం ఉంది. మార్కెట్లో పాల ధరరూ.50 వరకు ఉండటంతో రైతులుకూడా వీటిని ఎక్కువగానే వినియోగిస్తున్నారు.
 
కృత్రిమ పాలు...
పాల ధరలు పెరుగుతుండటంతో కొందరు పాల వ్యాపారులు కృత్రిమ పాల తయారీవైపు మొగ్గుచూపుతున్నారు. కాసుల కోసం కక్కుర్తిపడి అనేక మార్గాల ద్వారా పాలను కలుషితం చేస్తున్నారు. గట్టిపాలలో నీటిని కలపడం ఒక విధానం అయితే అనేక రకాల రసాయనాలను కలిపి ఎక్కువ పాలు రాబట్టుకోవడం అధిక లాభాలు సాధించడం మరో విధానంగా మారింది. పలువురు వ్యాపారులు పాలల్లో విషపూరిత రసాయనాలను వాడుతూ మరింత కలుషితం చేస్తున్నారు. ఇటీవల కాలంలో పాలు చిక్కగా ఉండేందుకు కొందరు యూరియా కూడా కలుపుతున్నట్టు సమాచారం.
 
చివరికి నష్టపోయేది రైతులే...
పశువుల నుంచి పాలు పితకాలంటే ఆ పశువు దగ్గరకు ముందుగా దూడను వదిలేవారు. అలా దూడ పొదుగును చీకడం ద్వారా పాల ఉత్పత్తి జరిగేది. దూడ కొద్దిగా తాగిన తరువాత రైతులు పాలను పితికి.. చివరకు కొన్ని దూడకు వదిలేవారు. కానీ ఇప్పుడలా కాకుండా పూర్తిగా ఇంజక్షన్‌లపైనే ఆధారపడుతున్నారు. దూడను వదలకుండానే పొదుకు సేపునకు వచ్చేందుకు ఆక్సిటోసిన్‌ ఇంజక్షన్‌ను ఇస్తున్నారు. ఆ ఇంజక్షన ఇచ్చిన సెకన్ల కాలంలోనే పశువు పొదుగు సేపునకు వస్తుంది. దీంతో కొద్దిసమయంలోనే అధికపాలు సేకరించవచ్చు. కొందరు పాల వ్యాపారులే రైతులకు ఇంజక్షన్‌లు, సిరంజ్‌లు సరఫరా చేస్తున్నారు. అలా చేయడం ద్వారా చివరికి నష్టపోయేది రైతే అన్న విషయాన్ని రైతులు గమనించలేకపోతున్నారు. ఈ ఇంజక్షన్‌ పశువుల పునరుత్పత్తిపై ప్రభావం చూపుతోంది. అలా పదే పదే పశువులకు ఆక్సిటోసిన్‌ ఇంజక్షన్‌ ఇవ్వడం వల్ల రాను రాను పాల ఉత్పత్తి తగ్గిపోవడంతో పాటు రక్తపీడనంలో మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
 
అనర్థాలెన్నో...
ఆక్సిటోసిన్‌ ఇంజక్షన్‌ వేసిన పశువుల పాలు తాగడం వల్ల ప్రజలు అనేక అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంజక్షన్‌ ఇవ్వడం ద్వారా వచ్చిన పాలను తాగడం వల్ల ఊపిరితిత్తులు, నరాల సంబంధిత వ్యాధులు వస్తాయి. ఆడపిల్లలు సహజంగా రజస్వల అయ్యే వయసు కంటే ముందుగా అవుతారని వైద్యులు చెబుతున్నారు. అలాగే చిన్నపిల్లలు ఈ పాలను తాగడం వల్ల వారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయే అవకాశం ఉంది. ఇంజక్షన్‌ వేసిన తర్వాత ఉత్పత్తి జరిగిన పాలను పదేపదే తాగడం వల్ల ఎన్నో అనర్థాలు ఎదురవుతాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ఇంజక్షన్‌ వాడకంపై చర్యలు తీసుకోవాలని.. నిషేధాన్ని సక్రమంగా అమలు చేయాలని ప్రజలు, పశుప్రేమికులు కోరుతున్నారు.

No comments:

Post a Comment