Friday, 29 January 2016

కోర్‌ క్యాపిటల్‌ ప్రాంతంలో చకచకా నేల చదును

కోర్‌ క్యాపిటల్‌ ప్రాంతంలో చకచకా నేల చదును
30-01-2016 07:17:20

  • మూడు నెలలుగా పనులు
  • అరటి తోటల్లో పూర్తి.. 
  • ఇతర తోటల తొలగింపు
ఆంధ్రజ్యోతి, విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రాథమికంగా అవసరమైన నేల చదును పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ తరహా పనులను ప్రారంభించి దాదాపు మూడు నెలలు కావస్తోంది. ముఖ్యంగా రాజధాని నిర్మాణ అంశంపై తుది మాస్టర్‌ ప్లాన్‌ను ఫిబ్రవరి 15న ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే అందుకు సంబంధించిన లీగల్‌ నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారు. అనంతరం మార్చిలోపు రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు నిర్ధేశిత ప్రాంతాల్లో ప్లాట్లు ఇచ్చే నిమిత్తం సీఆర్డీఏ ముందుగానే సిద్ధమవుతోంది.
అరటితోటల్లో ముగిసిన పనులు 
భూసమీకరణలో ఇచ్చిన అరటి తోటలు ఉన్న భూముల్లో ప్రస్తుతానికి చదును పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆయా గ్రామాల రెవెన్యూ పరిధిలోని ఇతర తోటలున్న భూముల్లో నేల చదును పనులను ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఎలాగైనా లీగల్‌ నోటిఫికేషన్‌ తరువాత సీఆర్డీఏ పెగ్‌ మార్కింగ్‌ నిర్వహించనున్న సమయానికి పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. 
సమీకరణకు రాని భూములు .. 
భూసమీకరణలోకి రాని కోర్‌ క్యాపిటల్‌ ప్రాంతంలోని భూములను ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవరకు ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టకూడదనే నిర్ణయానికి యంత్రాంగం వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే ఒకసారి సమీకరణలోకి రాని భూమిలో అరటి తోటను తొలగించినందుకు గాను నేతలు, అధికారులు ఆ భూయజమానికి క్షమాపణ చెప్పుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ అంశంపై సిబ్బంది కూడా సస్పెండ్‌ అవడంతో ప్రస్తుతం మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకెళుతున్నారు. 
అన్నీ క్లియర్‌.. 
ఫైనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ విడుదల సమయానికి రాజధాని ప్రాంతంలో రైతుల మధ్య వ్యక్తమవుతున్న ఆందోళనలతో సహా.. పూర్తి స్థాయిలో అన్ని సమస్యలను పరిష్కరించాలని మంత్రుల నుంచి సీఆర్డీఏ సిబ్బందికి, రెవెన్యూ అధికారులకు సూ చించినట్లు తెలిసింది. దీంతో సాధ్యమైనంతగా అన్ని సమస్యలను లీగల్‌ నోటిఫికేషన్‌ విడుదల సమయానికి ముందు పరిష్కరించాలని అధికారులు ప్రయ త్నిస్తున్నారు. సీఎం భేటీ సమయంలో రైతులు తీవ్రమైన ఆందోళనలు తెలపకుండా చూసేందుకు రాజధాని గ్రామాల్లోని రైతు ప్రతినిధులతో మంత్రులు ప్రత్యేకంగా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మరి సీఎం సమావేశ సమయానికి రైతులు శాంత పడుతారో లేదో చూడాలి.

No comments:

Post a Comment