రాజధాని గ్రామాల్లో రోడ్ల ప్రతిపాదనలపై రైతుల ఆందోళన
28-01-2016 06:37:25
క్యాపిటల్ సిటీ ముసాయిదా ప్రణాళికలో సూచించినట్లు రోడ్లు నిర్మిస్తే గ్రామాలు కనుమరుగవుతాయని రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవగాహన సదస్సులో ఇదే విషయాన్ని వారు విన్నవించగా.. అభ్యంతరకరంగా ఉన్న రహదారుల విషయంలో పునరాలోచిస్తామని ఒకటికి రెండుసార్లు మంత్రులు, సీఆర్డీఏ ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. మార్పులుంటాయని హామీలిచ్చిన మంత్రులను సీఎం మందలించారనే వార్తల నేపథ్యంలో సందిగ్ధత నెలకొంది.
ఆంధ్రజ్యోతి, విజయవాడ :
క్యాపిటల్ సిటీ డ్రాఫ్ట్ మాస్టర్‌ప్లానలో ప్రతిపాదించిన ఎక్స్‌ప్రెస్ వే, ఇతర ప్రధాన రహదారుల్లో రైతుల అభీష్టానుసారం మార్పులు చేస్తామన్న రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, సీఆర్‌డీఏ ఉన్నతాధికారుల హామీలు ఎంతవరకు కార్యరూపం దాల్చుతాయనే అంశంపై ప్రస్తుతం రాజధాని ప్రాంత గ్రామాల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. ‘ఇష్టానుసారంగా, తమకు తోచిన విధంగా రైతులకు హామీలు ఎలా ఇస్తారంటూ’ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మంత్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారంటూ వచ్చిన వార్తలు ఇందుకు కారణమయ్యాయి. రైతుల అభ్యంతరాలు
క్యాపిటల్ సిటీ ముసాయిదా బృహత ప్రణాళికలో సూచించిన విధంగా రహదారులను నిర్మిస్తే, చాలా గ్రామాలు కనుమరుగవుతాయని, ఇది తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంటూ పలువురు రైతులు నెల రోజులుగా ప్రజాప్రతినిధులు, సీఆర్‌డీఏ ఉన్నతాధికారులకు అభ్యంతరాలు, సూచనలు అందజేయడం తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో అమరావతిని నిర్మించాలంటే ఈ రహదారులు తప్పనిసరని, వాటివల్ల నష్టపోయే రైతులకు సంతృప్తికర పరిహారం ఇస్తామని చెప్పి, తొలిరోజుల్లో అన్నదాతల్లో నెలకొన్న వ్యతిరేకతను తగ్గించేందుకు ప్రజాప్రతినిధులు, సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు ప్రయత్నించినప్పటికీ ఆశించిన ప్రయోజనం కనిపించలేదు. పైగా అంతకంతకూ ఈ రోడ్ల వ్యవహారం తీవ్రరూపం దాల్చుతుండడంతో.. అమరావతి నిర్మాణానికి ఉదారంగా పొలాలనిచ్చిన రైతులను నష్టపరచే ఉద్దేశం తమకెంతమాత్రమూ లేదని, అందువల్ల వారికి అభ్యంతరకరంగా ఉన్న రహదారుల విషయంలో పునరాలోచిస్తామని ఒకటికి రెండుసార్లు మంత్రులు, సీఆర్డీఏ ఉన్నతాధికారులు హామీలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల పాటు మాస్టర్‌ప్లాన్లపై మరోవిడత సంప్రదింపులకు సింగపూర్ వెళ్లిన మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు అక్కడ సర్బానా సంస్థతో రైతుల ఆందోళన గురించి తెలిపారు. తదనుగుణంగా ఫైనల్ ప్రణాళికలో మార్పులు చేయాల్సిందిగా కోరామని పత్రికా ప్రకటనలు సైతం జారీ చేశారు. వీటన్నింటితో రాజధాని ప్రాంత రైతుల ఆందోళన ఒకింత తగ్గింది. తమ ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామాలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని, అమరావతి వాటిని కబళించబోదనిఊరట చెందారు.
ముఖ్యమంత్రి ఆగ్రహంతో మారిన పరిస్థితి!
సోమవారం నాటి క్యాబినెట్ భేటీలో ముఖ్యమంత్రి మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి హామీలు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పరిస్థితి మొదటికి వచ్చినట్లయింది. మలుపుల రోడ్లతో అమరావతి మౌలిక స్వరూపమే దెబ్బ తినే ప్రమాదం ఉందని, అలా చేస్తే రైతులు ఆశిస్తున్నట్లుగా వారి భూములకు విలువలు పెరగవని కూడా ఆయన వ్యాఖ్యానించినట్లు వినవచ్చింది. ఫలితంగా అమరావతిలో రోడ్లు ముసాయిదా బృహత ప్రణాళికలో సూచించిన విధంగానే ఉంటాయి తప్ప మంత్రులు చెప్పినట్లు మార్పులు చోటు చేసుకునే అవకాశాలు లేవని రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. తరతరాలుగా ఉంటున్న గ్రామాలు అంతర్ధానమవక తప్పదని భయపడుతున్నారు.
No comments:
Post a Comment