Friday, 8 January 2016

టీఆర్‌ఎస్‌ ఇక తెలుగు రాష్ట్ర సమితి: కేటీఆర్‌

టీఆర్‌ఎస్‌ ఇక తెలుగు రాష్ట్ర సమితి: కేటీఆర్‌ 
09-01-2016 00:51:07

  • మేం పేరు మార్చుకుంటున్నాం
  • తప్పకుండా త్వరలోనే ఆంధ్రాకూ వెళ్తాం
  • నేను భీమవరం నుంచి పోటీ చేస్తా
హైదరాబాద్: టీఆర్‌ఎస్‌ అంటే.. తెలంగాణ రాష్ట్ర సమితి! కానీ, ఇది ప్రస్తుతానికే!! భవిష్యత్తులో అది తెలుగు రాష్ట్ర సమితి కావొచ్చు. అంతేనా.. కేసీఆర్‌ కుమారుడు, రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు (కేటీఆర్‌) భీమవరం నుంచి పోటీ చేసినా చేయొచ్చు!! ఇదేదో సరదా ఊహాగానం కాదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవలే హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో సాక్షాత్తూ కేటీఆర్‌ నోటి నుంచి వచ్చిన మాటలివి. భీమవరం నుంచే ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారో కూడా చెప్పిన కేటీఆర్‌ మాటమాటకూ ఆ కార్యక్రమంలో కరతాళ ధ్వనులు మారుమోగాయి. ఆరోజు ఆయన ఏమన్నరంటే.. ‘‘నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు చంద్రబాబు ఆహ్వానిస్తే కేసీఆర్‌ అక్కడికి వెళ్లారు.
 
మీరందరూ చూశారు. కేసీఆర్‌ ప్రసంగించడానికి లేవగానే ఎంత పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులు వినిపించినాయో కూడా మీకందరికీ తెలుసు. తెల్లారి.. అనుకోకుండా ఒక ఆంధ్రా మంత్రి నాకు ఏదో పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చారు. ఆయన నా మిత్రుడు. ఆయన మాట్లాడుతూ.. ‘నాకర్థం కాలేదు, ఏంటి బాస్‌.. మావోడి (చంద్రబాబు) కంటే కూడా మీవోడికి (కేసీఆర్‌) ఎక్కువ చప్పట్లు కొట్టినారు మా దగ్గర’ అన్నారు. అంటే నేనొక్కటే చెప్పా.. ‘మేం కూడా పేరు మార్చుకుంటు న్నాం. టీఆర్‌ఎస్‌ అంటే ఇంక తెలంగాణ రాష్ట్ర సమితి కాదు. తెలుగు రాష్ట్ర సమితి. మీ దగ్గరకు కూడా వస్తున్నాం తొందర్లో’ అని చెప్పా. ఒకవేళ ఆ పనే చేయాల్సి వస్తే నేను నా కాన్‌స్టిటుయెన్సీ కూడా ఎంచుకున్నా ఇప్పటికే. నేను కచ్చితంగా భీమవరం నుంచే పోటీ చేస్తా. ఎందుకంటే.. మా రాజుల మిత్రులందరికీ ఎప్పుడూ చెప్తుంటా నేను.. భీమవరంలో గెలవాలంటే చాలా సింపుల్‌ ట్రిక్కు.. ఏంలేదు, కోడి పందాలు లీగలైజ్‌ చేస్తామని చెప్తా. మా మిత్రులు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లేవాళ్లు చాలా మంది ఉన్నారు. పోయినసారి కొంపల్లిలో కృష్ణారావు క్షత్రియమిత్రుల సమావేశం పెడితే అక్కడికి పోయినా. క్షత్రియులంటే.. నాకంటే బాగా మీకు తెలుసు.
 
ఆత్మీయత ఒకటి. ఆతిథ్యంలో మిమ్మల్ని మించినవాళ్లు మొత్తం దేశంలోనే ఎవరూ లేరు. రొయ్యలు, పీతలు కొసరి కొసరి వడ్డించి, తినిపించి పూర్తి గా మనుషులను రెండు మూడు కిలోల బరువు పెంచేదాకా మీరు ఊరుకోరు’’ అన్నారు. కాగా.. శుక్రవారం సాయంత్రం కూకట్‌పల్లిలోని తూముపద్మారావు గార్డెన్‌, ఆల్విన్‌కాలనీ డివిజన్‌ పరిధిలోని ఆల్విన్‌కాలనీలో ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ‘‘గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి. ఆరు దశాబ్దాల్లో కాంగ్రెస్‌, టీడీపీ చేయలేని అభివృద్ధిని చేసి చూపిస్తాం’’ అని ఆయన ప్రజలను కోరారు. నగరంలో అభివృద్ధి కుంటుపడటానికి కారణమైన ప్రతిపక్షాలకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణ పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, అందుకే ఒక్కసారి కూడా తెలంగాణకు రాలేదని ఆరోపించారు.

No comments:

Post a Comment