Friday, 22 January 2016

పట్టిసీమ - గోదావరి బోర్డు ముందు ఏపీ, తెలంగాణ భిన్నవాదనలు

ఎవరి ‘పట్టు’ వారిదే

Sakshi | Updated: January 22, 2016 09:54 (IST)
ఎవరి ‘పట్టు’ వారిదేవీడియోకి క్లిక్ చేయండి
 పట్టిసీమపై గోదావరి బోర్డు ముందు ఏపీ, తెలంగాణ భిన్నవాదనలు
 పోలవరంలో అంతర్భాగం కాదు ఆ ప్రాజెక్టు పూర్తిగా అక్రమం
 గోదావరి నీటిని ఏకపక్షంగా మళ్లించే హక్కు ఏపీకి లేదు: తెలంగాణ
 ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగమేనన్న ఏపీ
 ఎటూ తేల్చని బోర్డు.. కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయం


సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 80 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించ తలపెట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు గోదావరి నదీ యాజమాన్య బోర్డు ముందు భిన్నవాదనలు వినిపించాయి. ప్రాజెక్టు పూర్తిగా అక్రమమని తెలంగాణ స్పష్టం చేయగా, పోలవరంలో అంతర్భాగంగానే ప్రాజెక్టును చేపట్టామని ఏపీ పేర్కొంది. తమ హక్కులకు భంగం కలిగేలా చేపడుతున్న ఈ ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన బాధ్యత బోర్డుపై ఉందని తెలంగాణ గట్టిగా వాదించింది. దాన్ని చేపట్టే పూర్తి హక్కు తమకు ఉందని ఏపీ కూడా అంతే గట్టిగా చెప్పడంతో బోర్డు ఎటూ తేల్చలేకపోయింది. గురువారమిక్కడి జలసౌధలో చైర్మన్ రాం శరాణ్ అధ్యక్షతన గోదావరి బోర్డు సమావేశం జరిగింది.

 ఈ సమావేశానికి బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ, సభ్యుడు(విద్యుత్ ) ఎస్కే పట్నాయక్, కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) సీఈ ఎన్.కె.మాథుర్, ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్, ఏపీ చీఫ్ ఇంజనీర్(అంతర్‌రాష్ట్ర వ్యవహారాలు) రామకృష్ణ హాజరయ్యారు. ఏడాది తర్వాత జరిగిన ఈ సమావేశంలో బోర్డు నిర్వహణ, బడ్జెట్ అంశాలను వదిలిస్తే ప్రధాన వాదన పట్టిసీమ చుట్టే తిరిగింది.

తెలంగాణ వాదన ఇదీ..
పట్టిసీమపై ఏపీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని తెలంగాణ వాదించింది. ‘‘పోలవరం ప్రాజెక్టులో భాగం కాని పట్టిసీమతో కొత్తగా 80 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణాకు తరలించాలని ఏపీ చూస్తోంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 84(3), 85(8)కు వ్యతిరేకంగా ఏకపక్షంగా దీనిపై నిర్ణయం చేసింది. బోర్డు కానీ అపెక్స్ కౌన్సిల్ నుంచి కానీ అనుమతి తీసుకోలేదు.  1978నాటి ఒప్పందం గోదావరి నీటి వినియోగంలో ఏపీకి కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించింది. వివిధ బేసిన్‌ల నుంచి వచ్చే నీటిపై ఏపీకి హక్కులు ఉండేలా ఆ ఒప్పందంలో ఉంది. ఆ హక్కులు ఇప్పుడు విభజన తర్వాత తెలంగాణకు వర్తిస్తాయి. పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమే అయితే తెలంగాణకు ఆ నీటిలో వాటా ఉంటుంది. తెలంగాణను కాదని ఏకపక్షంగా గోదావరి నీటిని మళ్లించడానికి ఏపీకి హక్కు లేదు’’ అని తెలిపింది.

 ఏపీ ఏమందంటే..?
 తెలంగాణ వాదనపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగంగానే పట్టిసీమ చేపట్టామని తెలిపింది. పోలవరం నుంచి 80 టీఎంసీల నీటిని కుడి కాల్వ ద్వారా కృష్ణాకు మళ్లించడానికి అనుమతి ఉందని, అదే నీటిని పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా మళ్లిస్తున్నందున.. ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేద ని పేర్కొంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పోలవరంలో అంతర్భాగం అని పార్లమెంట్‌లో కేంద్రమంత్రి చెప్పిన విషయాన్ని గుర్తుచేసింది. ఈ సందర్భంగా తెలంగాణ చేపడుతున్న పలు కొత్త ప్రాజెక్టులు, రీ ఇంజనీరింగ్ చేస్తున్న ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం తెలిపింది. అయితే అవన్నీ ప్రాథమిక దశలో ఉన్నాయని, ఇంకా డీపీఆర్‌లు కూడా తయారు కాలేదని తెలంగాణ పేర్కొంది.

 బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులపైనా సందిగ్ధత
 బోర్డు పరిధిలోకి తేవాల్సిన ప్రాజెక్టుల అంశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రాణహిత-చేవెళ్ల, దేవాదుల, కంతనపల్లి, దుమ్ముగూడెం వంటి ప్రాజెక్టులతోపాటు, ఎస్సారెస్పీ, నిజాంసాగర్, కడెం, అలీసాగర్, సింగూర్, సదర్‌మఠ్ బ్యారేజీలను బోర్డు పరిధిలోకి తేవాలని ఏపీ వాదించింది. దీన్ని తెలంగాణ వ్యతిరేకించింది. ప్రధాన ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ కొనసాగుతోందని, ఏ ప్రాజెక్టుకు ఎంత నీటి వాటా అన్న అంశం తేలనప్పుడు, ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవడం సరికాదని పేర్కొంది. అందుకు ఏపీ.. నీటి వినియోగానికి కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) అనుమతి ఉన్న అన్ని ప్రాజెక్టులు బోర్డు పరిధిలో ఉండాలని కోరింది.

 తెలంగాణలో ఒక్క ప్రాజెక్టును కూడా బోర్డు పరిధిలో చేర్చడానికి అంగీకరించకుండా.. తమ రాష్ట్రంలోని ప్రాజెక్టులను బోర్డు పరిధిలో చేర్చాలని అడగడం, సీలేరు విద్యుత్‌ను షెడ్యూలింగ్‌లో పేర్కొనాలని డిమాండ్ చేయడంలో అర్థం లేదని ఏపీ వాదించింది. బోర్డు పరిధిపై స్పష్టత రాకుండా సీలేరు విద్యుత్‌పై చర్చించాల్సిన అవసరం లేదంటూ ఏపీ చేసిన వాదనతో బోర్డు ఏకీభవించింది. సీలేరు విద్యుత్‌పై కేంద్ర విద్యుత్ శాఖ నిర్ణయం తీసుకుంటుందని, బోర్డులో చర్చించాల్సిన అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

 బోర్డు వ్యయం రూ.8 కోట్లు: చైర్మన్ శరాణ్
 వచ్చే ఆర్థిక సంవత్సరంలో బోర్డు నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలకు రూ.8 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశామని, ఈ మొత్తాన్ని రెండు రాష్ట్రాలు చెరిసగం భరించడానికి అంగీకరించాయని సమావేశం అనంతరం బోర్డు చైర్మన్ రాం శరాణ్ ‘సాక్షి’కి చెప్పారు. బోర్డు ముసాయిదా నియమావళికి ఇరు రాష్ట్రాలు ఆమోదం తెలిపాయని, దీన్ని కేంద్ర జల వనరుల శాఖకు పంపిస్తామని తెలిపారు. ప్రాజెక్టుల డేటా ఇవ్వడానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయని వెల్లడించారు.

No comments:

Post a Comment