Tuesday, 5 January 2016

గన్నవరానికి చంద్ర గ్రహణం!

గన్నవరానికి చంద్ర గ్రహణం!

Sakshi | Updated: January 05, 2016 00:28 (IST)
విజయవాడ:  గన్నవరం విమానాశ్రయం విస్తరణ పేరుతో ప్రభుత్వం వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు వ్యూహం పన్నినట్లు సమాచారం. దశల వారీగా  భూమిని  కొల్లగొట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఏలూరు కాల్వను జాతీయ రహదారి ఎడమవైపునకు మళ్లించడం, ఎయిర్‌పోర్టు కుడివైపున మరో రన్‌వే నిర్మించాలని ఎయిర్‌పోర్టు అథారిటీ భావిస్తోంది. ఏలూరు కాలువ మళ్లించాక, కార్గో సర్వీసులు నడిపేందుకు ప్రస్తుతం ఉన్న రన్‌వేకు కుడివైపున రెండో రన్‌వే నిర్మించనున్నారు. రెండు రన్‌వేల మధ్య కనీసం 1700 మీటర్ల దూరం ఉండాలి. అంటే ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయంలో ఉన్న రన్‌వేకు సుమారు 1.75 కి.మి. అంటే 25 మీటర్లకు  తక్కువగా సుమారు  రెండు కిలోమీటర్ల మేర కార్గో విమానాలు దిగేందుకు రెండో రన్‌వే నిర్మించాల్సి ఉంది. రెండో రన్‌వే దగ్గర్లో కార్గో పాయింట్‌ను ఎయిర్‌పోర్టు, రోడ్డు, రైల్ రవాణా, మచిలీపట్నం, పోర్టుకు అనుసంధానంగా నిర్మించనున్నారు. ఇందుకు మరో మూడు వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోనున్నారు.

ఖాళీకానున్న గ్రామాలు
ఎయిర్‌పోర్టుకు కుడి వైపున ఉన్న అజ్జంపూడి, బుద్ధవరం, బూతిమిల్లిపాడు,  వెన్నూతల గ్రామాల్లో ఇళ్లు, భూమలు గల్లంతవుతాయి. రెండో రన్ వేకు దాదాపు రెండు వేల ఎకరాలు, టాక్సీవే, సెక్యూరిటీ జోన్, కార్గోపాయింట్ గోడౌన్ల నిర్మాణాలకు మరో వెయ్యి ఎకరాల భూమి అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏలూరు కాల్వ మళ్లించాక మూడో దశలో రెండో రన్‌వే భూమిపై దృష్టి సారించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారవర్గాల సమాచారం. బందర్ పోర్టు వద్ద టౌన్‌షిప్ మాదిరిగా, ఎయిర్ పోర్టుతో గ్రామాల్లో ఇళ్లు కోల్పోయే వారికి టౌన్‌షిప్ అబివృద్ధి చేసి ఇచ్చేలా ప్రభుత్వం కొత్త ప్లాన్‌ను రూపొందించనున్నట్లు సమాచారం.

రెండో రన్‌వే కోసమే ఏలూరు  కాల్వ మళ్లింపు
మొదట ఏలూరు కాల్వ మళ్లింపు ప్రతిపాదన రాలేదు. ముందుగా బుద్ధవరం నుంచి ఆత్కూరు వరకు కాల్వను మార్చటానికి ప్రణాళిక సిద్ధం చేశారు. పడవలు నడవడానికి వీలుగా ఏలూరు కాల్వ వెడల్పు పెంచుతున్నామని, అందుకే కాల్వను పక్కకు మళ్లిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.  రెండో రన్‌వే ఏర్పాటు, కార్గో పాయింట్ కోసమే కాల్వను ఎడమవైపునకు మళ్లిస్తున్నారు. కాల్వ మళ్లింపు వల్ల గన్నవరం స్వరూపమే మారిపోతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

విడిపోనున్న పలు గ్రామాలు
అధికారులు సర్వే చేసిన ప్రకారం ఏలూరు కాల్వ మళ్లిస్తే గన్నవరం నుంచి వెంకటనరసింహాపురం, మర్లపాలెం విడిపోతాయి. పెదఅవుటపల్లి రెండు ముక్కలవుతుంది. ప్రత్యామ్నాయంగా జక్కులనెక్కలం నుంచి సావరగూడెం వెనుక వైపు నుంచి ముస్తాబాద రైల్వే ట్రాక్ పక్కనుంచి చినఅవుటపల్లి, పెదఅవుటపల్లి మీదుగా ఏలూరు కాల్వను కలపాలని మరో డిజైన్‌ను సూచిస్తున్నారు. రైల్వే ట్రాక్ పక్కనే విలువ లేని భూములు పోతాయని, ఇళ్ల తొలగింపు అవసరం ఉండదని చెబుతున్నారు. ఇప్పటికే ఒకసారి ఎయిర్‌పోర్టుకు భూములు ఇచ్చామని, మళ్లీ కాల్వ మళ్లించి రెండోసారి తమ భూములు లాక్కోవడం వల్ల తాము ఆర్థికంగా నష్టపోతామని కేసరపల్లి గ్రామస్తులు అంటున్నారు.

ఏలూరు కాల్వ వస్తే బతుకులు తల్లకిందులు
పొలం అమ్ముకుని రూ. 70లక్షలతో మంచి భవ నం కట్టుకుని, ప్రశాంతంగా జీవిస్తున్నాం. ఏలూరు కాల్వ మళ్లిస్తే మా ఇల్లు కోల్పోతాం.  ఇళ్లు కోల్పోకుండా ప్రత్యామ్నాయం చూపకుంటే ప్రజల బతుకులు తల్లకిందులవుతాయి.                              - కంభంపాటి శేషగిరిరావు, మర్లపాలెం

 కాల్వ మళ్లింపుపై పునరాలోచన చేయండి
 కాల్వ మళ్లింపుతో రూ. 80లక్షల విలువ చేసే ఇల్లు ధ్వంసమవుతుంది.  మాఇల్లూ వాకిలీ ఏమైపోతాయోనని ఆందోళనగా ఉంది.  కోట్ల విలువైన భూములు పోతాయని అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పునరాలోచన చేయాలి.                         - కొల్లి సుభాషిణి, మర్లపాలెం.
 

No comments:

Post a Comment