Friday 29 January 2016

హెచ్‌సీయూలో రాహుల్‌ దీక్ష

హెచ్‌సీయూలో రాహుల్‌ దీక్ష 
30-01-2016 02:11:19

  • ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు రాక
  • అర్ధరాత్రి రోహిత బర్త్‌డే ర్యాలీకి హాజరు
  • విద్యార్థులతో కలిసి కొవ్వొత్తుల ప్రదర్శన
  • నేడు 6 గంటలదాకా వర్సిటీ శిబిరంలోనే
  • రాహుల్‌ను అడ్డుకునేందుకు ఏబీవీపీ యత్నం
  • పోలీసుల లాఠీచార్జి.. వర్సిటీలో ఉద్రిక్తత
  • సెలవులో శ్రీవాస్తవ.. ఇన్‌చార్జిగా పెరియాస్వామి

హైదరాబాద్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): రోహిత్ జయంతి సందర్భంగా హెచ్‌సీయూలో శుక్రవారం అర్ధరాత్రి విద్యార్థి జేఏసీ ప్రారంభించిన మౌన దీక్షలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. వాస్తవానికి శనివారం ఉదయం ప్రారంభించాలని నిర్ణయించిన మౌన దీక్షలో పాల్గొనేందుకు శుక్రవారం రాత్రికే ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ నుంచి రాత్రి 12:30 సమయంలో నేరుగా వర్సిటీకి చేరుకున్నారు. రాహుల్‌ వచ్చిన వెంటనే విద్యార్థులు 18 గంటల సామూహిక నిరాహార దీక్షను ప్రారంభించారు. వారితోపాటు రాహుల్‌ కూడా దీక్షలో పాల్గొన్నారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకూ ఆయన ఈ దీక్షను కొనసాగించనున్నారు. కాగా, శనివారం మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా ఉదయం 5 గంటలకు ఆయన లంగర్‌హౌజ్‌లోని బాపూ ఘాట్‌లో జాతిపితకు నివాళులర్పించి వచ్చే అవకాశాలున్నాయని తెలిసింది.
 
అయితే, అర్ధరాత్రే దీక్షలో కూర్చున్నందున ఆయన బాపూ ఘాట్‌కు వెళతారా లేదా అనే దానిపై సందిగ్ధం నెలకొంది. కాగా రాహుల్‌ రాకకు ముందు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. వర్సిటీ బర్తడే సర్కిల్‌ మెయిన్ రోడ్డు నుంచి రోహిత్ స్మారక స్తూపం వరకూ ర్యాలీ నిర్వహించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. కాగా హెచసీయూకు రాహుల్‌ రెండోసారి రావడంపై ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ మండిపడింది. ఆయన కాన్వాయ్‌ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిపై లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. రాహుల్‌ రాకను నిరసిస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది.

No comments:

Post a Comment