Friday, 22 January 2016

కోనసీమలో రాజుకున్న కుల రాజకీయం... సీన్‌లోకి ప్రముఖ సినీ దర్శకుడు !

కోనసీమలో రాజుకున్న కుల రాజకీయం... సీన్‌లోకి ప్రముఖ సినీ దర్శకుడు !
22-01-2016 15:13:20

ముల్లును ముల్లుతోనే తీయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు కొంత మంది నేతలు వెనకుండి చేస్తున్న ప్రయత్నాలను అదే స్ధాయిలో తిప్పి కొట్టాలనే నిర్ణయానికి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. తూర్పు గోదావరి జిల్లా తునిలో ఈనెల 31వ తేదీన నిర్వహించనున్న కాపునాడు నేతల ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు తెలుగుదేశం అదే కులానికి చెందిన నేతలను రంగంలోకి దించింది. ప్రభుత్వం కాపులకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించటంతో పాటు గత ప్రభుత్వాలు కాపులను అణగదొక్కిన వైనాన్ని కూడా వివరించేందుకు సమాయాత్తమవుతోంది. ఉన్నతస్ధాయిలో జరిగిన ఓ సమావేశంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నిర్ణయం అమలు కూడా ప్రారంభమైంది.
 
రాష్ర్ట విభజన జరిగిన తర్వాత రాజధాని లేకుండా ఆర్ధికలోటుతో ఉన్న ఏపీని గాడినపెట్టటం ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. జీతాలకు కూడా డబ్బులు దొరకని పరిస్ధితి నెలకొనటంతో బాండ్లను వేలం వేసుకుని, ఖజనా నింపుకునే విచిత్ర పరిస్ధితి నెలకొని ఉంది. ఆదాయవనరులను సమీకరించుకోవటం, కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవటం వంటి వాటిపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది.. ఆ దిశగా కొన్ని అడుగులు కూడా వేసింది.. ఉపాధి అవకాశాలు.. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడేందుకు పరిశ్రమలను ఏర్పాటు చేయడం ఆవశ్యకరమని తెలుసుకుంది.. అందుకే పరిశ్రమలను ఏర్పాటు చేయవలసిందిగా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించే పనిలో నిమగ్నమయ్యింది ప్రభుత్వం.
 
రాజధాని నిర్మాణం కూడా ప్రభుత్వం ముందు ఉన్న అతి పెద్ద సవాల్‌... నీరు లేకుండా ఎన్ని మాటలు చెప్పినా అవి నీటిమీద రాతలుగానే మిగిలిపోతాయి.. అందువల్లే ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా మారిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా ప్రభుత్వం రెండో ప్రాధాన్యతగా ఉంది. ఈ నేపథ్యంలోనే పులి మీద పుట్రలా ప్రభుత్వానికి కాపునాడు రూపంలో మరో సవాల్ ఎదురైంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో కాపులను బీసీ జాబితాలో చేర్చుతామని, ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇస్తామని చెప్పటంతో పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తామని ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.
 
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నిమ్మకాయల చినరాజప్పకు హోమ్ మంత్రి పదవితో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. కేబినెట్ లోను, ఎమ్మెల్సీలు, ఇతర నియామకపదవుల్లో కూడా కాపులకు ప్రాధాన్యత ఇచ్చామని తెలుగుదేశం ప్రభుత్వం చెప్పుకుంటుంది. కాపులను బీసీల్లో చేర్చే అంశం పై మంత్రి వర్గంలో కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం మేరకు కర్నాటక హైకోర్టు రిటైర్డ్ జడ్జి మంజునాథన్‌ను కాపు కమిషన్ చైర్మన్ గా నియమించారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చామని ఒక వైపు ప్రభుత్వం చెబుతుండగా, తెలుగుదేశం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నప్పటికీ కాపులకు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని, తమను నిర్లక్ష్యం చేస్తుందని, ఈ నెల 31వ తేదీన తూర్పు గోదావరి జిల్లా తునిలో కాపు నాడును ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ కాపునాడు ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్నారు.
 
కాపునాడు సభ ఏర్పాటుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి పరోక్ష మద్దతు ఉందని ప్రభుత్వానికి కొంత మంది సమాచారం ఇచ్చారు. దీంతో కాపునేతలను ప్రభుత్వం రంగంలోకి దించింది. గత చరిత్రతో పాటు తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక, గతంలోను, ఇప్పుడు కాపులకు ఇచ్చిన ప్రాధాన్యత ఏమిటో వివరించాలని నిర్ణయించారు. ఇందుకోసం విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమశెట్టి రామానుజయలను రంగంలోకి దించారు. వీరు కాకుండా మరికొంత మంది నేతలను కూడా తెలుగుదేశం పార్టీ రంగంలోకి దించబోతున్నది. నెలాఖరు వరకు కూడా అన్ని జిల్లాలకు వెళ్ళి కాపు పెద్దలను, యువకులను కలసి ఏమి చేశామనేది వివరించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న ఓ కులం కాపులను అణగదొక్కిందని, కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ ఓ అడుగు ముందుకు వేసి చేసిన ఆరోపణలు సంచలనం రేకెత్తించాయి. బొండా ఉమా కూడా విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, కాపులకు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ప్రాధాన్యత కల్పించిందనేది వివరించారు. రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం కులాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇదే అంశం పై హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా గళం విప్పారు. ఇలా ముల్లును ముల్లుతోనే తీయాలనే సిద్ధాంతాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఆచరిస్తోంది. కాపునాడు సభకు అనుమతి ఇవ్వటమా లేదా అనేది తర్వాత ఆలోచించాలని, తూర్పు గోదావరి, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో, రాష్ర్ట వ్యాప్తంగా కాపులకు తెలుగుదేశం పార్టీలోను, ప్రభుత్వంలోను ఇచ్చిన ప్రాధాన్యతను వివరించాలనే నిర్ణయానికి వచ్చారు.
 
తూర్పుగోదావరి జిల్లాలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపునాడుకు బీజం వేస్తుండటంతో అదే జిల్లాకు చెందిన హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, సినీ దర్శకుడు వి.వి.వినాయక్‌తో వేదిక పంచుకుని ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. ఇదే జిల్లాకు చెందిన అసెంబ్లీలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉపనేత జ్యోతుల నెహ్రూ, ముద్రగడ పద్మనాభంలు రాజకీయంగా ఆగర్భశత్రువులు. పార్టీ కాపునాడుకు మద్దతు ఇస్తుండటంతో తాను కూడా మద్దతు ఇస్తానని జ్యోతుల నెహ్రూ ఇటీవల కిర్లంపూడి నుంచి తన వద్దకు వచ్చిన కాపునేతలతో చెప్పారు. తునిలో ఓ కొబ్బరి తోటలో ఏర్పాటు చేస్తున్న కాపునాడు సమావేశానికి భారీగా జన సమీకరణ చేసేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. అనుమతి ఇచ్చే అంశం పై కూడా తాము ప్రభుత్వానికి లేఖ రాశామని కాపునాడు నేతలు చెబుతుండగా, తమను ఎవరూ అనుమతి కోరలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ వాదోపవాదాలు ఎలా ఉన్నా, కోస్తాలో మరోసారి కులాల కుంపటి ప్రారంభమవబోతోంది. ఇందుకు విరుగుడుగానే తెలుగుదేశం ప్రభుత్వం కాపులను బీసీల్లో చేర్చే అంశం పై అధ్యయనం చేసేందుకు నియమించిన కమిషన్ నివేదికను కూడా సాధ్యమైనంత త్వరగా తెప్పించాలని నిర్ణయించింది.
 
బీసీలకు రిజర్వేషన్ కూడా తగ్గకుండా, కాపులకు రిజర్వేషన్ ఇచ్చి తమ ప్రభుత్వం నిబద్దత ఏమిటో చూపించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి రాజకీయంగా వెన్ను, దన్నుగా ఉన్న బీసీల మనస్సులను కూడా నొప్పించకుండా కాపులకు రిజర్వేషన్ ఎలా ఇవ్వాలనే అంశం పైనే పార్టీలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఇతర రాష్ర్టాల్లో అవలంభిస్తున్న రిజర్వేషన్ విధానాల పై కూడా అధ్యయనం చేయాలని కమిషన్ కు సూచించాలని నిర్ణయించారు. కాపులను బిసీల్లో చేరుస్తూ నిర్ణయం తీసుకున్నా, గతంలో మాదిరిగా కాకుండా ఆ నిర్ణయం న్యాయ పరీక్షకు నిలబడేలా పటిష్టంగా తీసుకోవాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో తునిలో జరుగుతున్న కాపునాడు అనంతర పరిణామాలు, కాపునాడు నేపథ్యం పట్ల ప్రభుత్వం అప్రమత్తమైంది.

No comments:

Post a Comment