Thursday 14 January 2016

ప్యాకేజీకి ఓకే!

ప్యాకేజీకి ఓకే!
14-01-2016 01:21:13

  • నీతి ఆయోగ్‌ ప్రతిపాదన.. ప్రధాని ఆమోదం
  • ఆర్థికశాఖ కార్యదర్శికి ప్యాకేజీ బాధ్యత
  • 2016-17కు ప్రకటించనున్న కేంద్రం
  • బడ్జెట్‌లో పొందుపరచనున్న ఆర్థిక శాఖ
న్యూఢిల్లీ, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ త్వరలో ఖరారు కానుంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. నీతి ఆయోగ్‌ ఇటీవల పీఎంవోకు సమర్పించిన నివేదికలో ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయాలన్న ప్రతిపాదన చేసింది. దీనికి ప్రధానమంత్రి మోదీ ఆమోదం తెలిపారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఏపీకి ప్రకటించాల్సిన ప్యాకేజీ వివరాలను సిద్ధం చేయాలని ఆర్థికశాఖను ఆదేశించారు. ఆర్థిక శాఖ కార్యదర్శి రతన్‌ పి వటల్‌కు ఈ బాధ్యతను అప్పగించారు. రతన్‌ ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌ (1987)కు చెందిన ఐఏఎస్‌ అధికారి కావటం విశేషం. నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పాన్‌గడియా, పీఎంవో ముఖ్య కార్యదర్శి నృపేంద్రమిశ్రా తదితరులు ఈ ప్యాకేజీ కసరత్తును పర్యవేక్షించనున్నారు. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఆర్థిక ప్యాకేజీని పొందుపర్చనున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తామని నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీని నెరవేర్చాలని కోరుతూ గతేడాది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వచ్చి ప్రధాని మోదీకి వినతిపత్రం సమర్పించారు. దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ప్రధాని మోదీ నీతి ఆయోగ్‌ను ఆదేశించారు. గతనెలలో నీతి ఆయోగ్‌ నివేదికను సిద్ధం చేసి పీఎంవోకి సమర్పించింది. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, కేంద్రం మద్దతు ఇవ్వాల్సిందేనన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను ఈ నివేదిక సమర్థించినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వనరుల కొరతను దృష్టిలో పెట్టుకుని ప్యాకేజీ ఇవ్వాలని ఇందులో సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయా రంగాల వారీగా లోటు పూడ్చేందుకు కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కసరత్తు ఇప్పుడే ప్రారంభమైనందున ప్యాకేజీ ఎంత ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేమని వివరించాయి. అయితే, నిర్దిష్ట మొత్తం ఇవ్వాలని పీఎంవో నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు లేవని, ఏపీ అవసరాలను బట్టి ప్యాకేజీ రూపకల్పన చేయాలని మాత్రమే కోరారని ఆ వర్గాలు వెల్లడించాయి.

No comments:

Post a Comment