Tuesday, 26 January 2016

అమరావతి విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం

రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం
26-01-2016 16:32:31

అధికారం ఒక తిరుగులేని ఆయుధం...అధికారంలో ఉన్న రాజకీయ పక్షానికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది....ప్రజా సమస్యల పై నిలదీస్తారని, ప్రజలకు, ప్రతిపక్షాలకు అధికార పార్టీ భయపడటం సహజం. కానీ అధికార పార్టీ ప్రస్తుతం గుంటూరు, కృష్ణాజిల్లాల్లో పచ్చటి పొలాలను చూసి భయపడుతోంది. అగ్రికల్చర్ ప్రొటెక్షన్ జోన్ పేరిట సిఆర్ డిఏ 2050వ సంవత్సరం వరకు రూపొందించిన పరస్పెక్టివ్ మాస్టర్ ప్లాన్ అధికార పార్టీ గుండెల పై కుంపటిగా మారింది. రాజధాని పరిధిలోని గుంటూరు, కృష్ణాజిల్లాల్లోని 17 నియోజకవర్గాల్లోని అధికార పార్టీ నేతలకు ఈ పరస్పెక్టివ్ ప్లాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. సిఆర్ డిఏ అధికారుల పై సి.ఎం వద్దనే అమీతుమీ తేల్చుకునేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. ఆనందంగా ఉండాల్సిన అధికార పార్టీ నేతలు ఆందోళనకు గురవుతున్న ఈ అంశం వెనుక పెద్ద కథే ఉంది.
 
నవ్యాంధ్రప్రదేశ్‌లో రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం సీఆర్‌డీఏను ఏర్పాటు చేసింది. గుంటూరు...కృష్ణా జిల్లాల్లోని సింహభాగాన్ని కలుపుకుని మొత్తం 57 మండలాలతో సీఆర్‌డీఏను ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లా తుళ్లూరును రాజధానిగా ప్రకటించిన ప్రభుత్వం ఆ ప్రాంతంలో భూముల ధరలు పెరగడం పట్ల అటు రైతులు.. ఇటు సర్కారు ఆనందంగా ఉంది. రాజధానికి భూసమీకరణ కింద 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు తమ భూములకు ధరలు పెరగడం పట్ల సహజంగానే ఆనందంగా ఉంటారు. కేపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ పరిధిలో నగరాలు...గ్రామీణ..పట్ణణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఒక మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని అప్పుడే ప్రణాళికబద్ధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సీఆర్‌డీఏ భావించింది. ఇందుకోసం సీఆర్‌డీఏ ప్రాంతానికి 2050వ సంవత్సరం వరకు అమలులో ఉండే పరస్పెక్టివ్‌ మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించింది. ఈ రెండు జిల్లాల్లోని 17 నియోజకవర్గాలలో 63 శాతం భూమిని అగ్రికల్చర్‌ ప్రొటెక్షన్‌ జోన్‌ పేరిట చూపించారు. ఇందులో జోన్‌ వన్‌, జోన్‌ టూ, జోన్‌ త్రీ పేరిట చూపించినప్పటికీ ఈ ప్లాన్‌ ఆమోదం పొందితే 2050వ సంవత్సరం వరకు ఎలాంటి నిర్మాణాలు వ్యవసాయ భూముల్లో చేపట్టకూడదని...భూ వినియోగమార్పిడి జరిగేందుకు వీలులేదని రైతాంగంలో ఆందోళన బయలుదేరింది.
 
రెండు జిల్లాల్లోని 17 నియోజకవర్గాలలో ప్రొటెక్షన్‌ జోన్‌ను తీసుకొచ్చారు. ప్లాన్‌ విడుదలైన వెంటనే రైతుల్లో తిరుగుబాటు ప్రారంభం అయ్యింది. వ్యవసాయానికి మినహా మరే ఇతర అవసరాలకు భూములు వినియోగించకూడదని ప్లాన్‌లో పేర్కొనడంతో ఎకరం నాలుగు కోట్ల రూపాయల వరకు ఉన్న భూమి ఒక్కసారిగా కోటి రూపాయలకు పడిపోయింది. 2050 వరకు భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని.. వ్యవసాయం మాత్రమే చేసుకోవాలని రైతులకు సమాచారం అందింది. ఈలోగా తెలుగుదేశం పార్టీ మినహా మిగతా పక్షాల నేతలంతా విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించారు. ప్లాన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు.
 
రైతులు స్వచ్ఛంధంగా సీఆర్‌డీఏ కార్యాలయానికి వాహనాల్లో గ్రామాల వారీగా తరలివచ్చి నిరసనలు చేపడుతున్నారు. పంచాయతీలు ప్లాన్ ఉపసంహరించుకోవాలంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో కూడా అంతర్గతంగా ఆందోళన ప్రారంభమైంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా మండిపడుతున్నారు. ఎవరినీ సంప్రదించకుండా సీఆర్‌డీఏ ఇలాంటి ప్లాన్‌లు విడుదల చేయటం పట్ల ఏకంగా అధికారుల వద్దే నిరసన వ్యక్తం చేశారు. మంత్రి దేవినేని ఉమా.... ఎమ్మెల్యే బొడే ప్రసాద్... ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్... వల్లభనేని వంశీమోహన్ వంటి పలువురు నేతలు సీఆర్‌డీఏ పరస్పెక్టివ్ ప్లాన్ అమలులోకి వస్తే రాజకీయంగా దెబ్బతింటామని ఆందోళన చెందుతున్నారు.
 
గ్రామాల్లో రైతుల్లో వస్తున్న వ్యతిరేకతను నిశితంగా గమనించిన మంత్రి దేవినేని ఉమా ఏకంగా సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ ను పిలిపించి వివరాలు అడిగారు. తాము ఉడా అమలులో ఉన్న సమయంలో ఇచ్చిన ప్లాన్ లకే కట్టుబడి ఉంటామని, అగ్రికల్చర్ ప్రొటెక్షన్ జోన్ అంటే గ్రీన్ జోన్, గ్రీన్ బెల్ట్ కాదని, ఆ భూమిని ఏ అవసరాలకైనా ఉపయోగించుకోవచ్చునని సీఆర్‌డీఏ అధికారులు మంత్రికి చెప్పినప్పటికీ, ఆ అంశాన్ని ఎవరూ విశ్వసించటం లేదు.
 
ఈలోగా మునిసిపల్ మంత్రి నారాయణ సీఆర్‌డీఏ పరస్పెక్టివ్ ప్లాన్ పై నిబంధనల ప్రకారమే ముందుకు వెళతామని ఒక బాంబు పేల్చటంతో రైతుల్లో ఆందోళన మరింత పెరిగింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 17 నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా అనే అంశం పై సతమతమవుతున్నారు. పార్టీ నేతలపై రైతులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీంతో పాటు ప్రతిపక్షాలు కూడా ఉద్యమానికి సిద్ధమవుతుండటంతో అధికార పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరే అమీతుమీ తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు.
 
రాజధాని వచ్చిందనే సంతోషం ఒకవైపు, అధికారుల ఏకపక్ష ధొరణి ఆవేదన మరోవైపు...మొత్తంగా నేతలు ఇప్పుడు సంకటంలో పడ్డారు.
రాజధాని పరిధిలోని తుళ్లూరులోనూ.... ఇటు సీఆర్‌డీఏ పరస్పెక్టివ్ ప్లాన్‌తో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 17 నియోజకవర్గాల్లో వ్యతిరేకత కొనితెచ్చుకున్నట్టవుతుందని అధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ప్రజాప్రతినిధులను.... రైతులను సంప్రదించకుండా ఈ ప్లాన్ విడుదల చేయటమేమిటని నిలదీస్తున్నారు. సాఫీగా జరిగిపోతున్న సమయంలో గిల్లి కజ్జాలు తెచ్చుకోవటమంటే ఇదేనని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు.
 
నాణెనికి రెండో వైపు నుంచి పరిశీలిస్తే మూడు పంటలు పండే భూమిని రాజధాని నిర్మాణాల కోసం ప్రభుత్వం తీసుకుంటోందని ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలు, పర్యావరణ వేత్తలు, వ్యవసాయం చేసుకునేందుకు సీఆర్‌డీఏ పరిధిలోని 63 శాతం భూమిని వ్యవసాయ పరిరక్షణ కింద పేర్కొంటే ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారులు, రైతుల వాదనలు ఎలా ఉన్నా మధ్యలో అధికార పార్టీ నేతల పరిస్ధితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల పరిస్ధితి కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకి కోపం అన్న చందంగా మారింది. చంద్రబాబు ఈ పంచాయతీ ఎలా తీర్చుతారో వేచి చూడాల్సిందే...

No comments:

Post a Comment