నిప్పుల జడిలో గుప్పుమన్న ప్రేమ!
17-01-2016 23:19:33
ఇజ్రాయెల్ యువతి, పాలస్తీనా యువకుడి మధ్య అమెరికాలో జరిగే ప్రేమ కథతో ఇజ్రాయెలీ రచయిత్రి డోరిట్ రబిన్యాన్ రాసిన నవల ‘గదర్ హయా’. దీనిని పాఠ్యాంశంగా నిర్ణయించనందుకు నిరసనలు వెల్లువెత్తడంతో పాటు, ఇప్పుడీ నవల ఇజ్రాయెల్‌లో అధికంగా అమ్ముడవుతూ యువత విస్తృతంగా చదువుతున్నది.
యుద్ధాలు మనుషులను చంపేస్తాయా? మనుషులు యుద్ధాన్ని చంపేస్తారా? యుద్ధాన్ని చంపడం అంటే ఏమిటి? ఎలాగ? అరబ్ లోకం మధ్యలో ఇజ్రాయెల్ దేశం ఏర్పాటు చేయడం ఇరవయ్యో శతాబ్దంలో ఒక కీలక ఘట్టం. జాతుల కుంపట్లు రగుల్కుంటూనే ఉన్నాయి. పాలస్తీనా ఒక దేశం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నది. చిన్న భూమి పీలిక గాజా, పాలస్తీనా ప్రజలదని అంతర్జాతీయ సమాజం అంగీకరించినా అక్కడి ప్రజలపై, నిరంకుశ ఆంక్షలు అమలు చేయడంలో ముందర ఉన్నది ఇజ్రాయెల్. పాలస్తీనా ఇజ్రాయెల్ సరిహద్దుల్లో అరబ్ స్వేచ్ఛావాదులకు, ఇజ్రాయెల్ దళాలకు మధ్య హింస ఆగకుండా కొనసాగుతున్నది. పాలస్తీనాప్రజలపై ఇజ్రాయిల్ వివక్షలను, హింసాత్మక దమన కాండను ఆ ప్రాంతానికి, ఆసియా ఖండానికి చెందని అమెరికా దేశం అన్నివిధాలా సమర్ధిస్తూ, మధ్య ప్రాచ్యంలో తమ విధానాలతో శాంతి లేకుండా చేసింది. ఎన్ని యుద్ధాలు జరిగితే ఇక్కడికి శాంతి వస్తుంది?ఒకప్పటి ప్రఖ్యాత కవులు యెహుదా అమిచాయి, మహ్మద్ దర్వీష్, తాము ఇజ్రాయెల్, పాలస్తీనా దేశీయులమైనా సహజీవనం అనివార్యమని ప్రకటిస్తూ, తమ నమ్మకాలు, ఆశలన్నీ యుద్ధాలపై కాక ప్రజలపైనే ఉంచారు.
‘కవులేం చేస్తారు’ అనడిగాడు ప్రముఖ కవి శివారెడ్డి, అదే పేరు గల కవిత రాస్తూ. విపులమైన జవాబులో, కవులు ప్రజలకు ఏవేవి ఇస్తారో వివరించాడు. ఇదొక ప్రఖ్యాత కవిత. అలాగే, ఇజ్రాయెల్ ప్రజలు అందరూ పాలస్తీనా ప్రజలకు శత్రువులు కారు. ఈ సంగతి మనం కాదు వారే చెప్పాలి. అలా చెప్తూ వస్తున్న సాహిత్య ప్రతిభా వంతుల కోవలోకి తాజాగా వచ్చి చేరిన యువ ఇజ్రాయెలీ రచయిత్రి డోరిట్ రబిన్యాన్. ఈమె తన మూడో నవలగా రాసిన ‘గదర్ హయా’ (‘బార్డర్ లైఫ్’ గా ఆంగ్లానువాదం, అసలు హిబ్రూ అర్ధం ‘కంచె పొదలు’ అని) లో, ఇజ్రాయెల్ యువతి, పాలస్తీనా యువకుడి మధ్య అమెరికాలో జరిగే ప్రేమ కథను చిత్రణ చేస్తుంది. ఏమ్ ఒవెద్ ప్రచురణ కర్తలుగా అచ్చయిన ఈ నవలలో లియాత్ అనే ఇజ్రాయెలీ యువ అనువాదకురాలు, తన అమెరికా జీవితంలో, హిల్మి అనే పాలస్తీనా కళాకారుడిని ప్రేమిస్తుంది. ఇద్దరి ప్రేమకు న్యూయార్క్ లో నేపథ్యం. తిరిగి తమ దేశాలకు వచ్చాక, యువతి ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్‌కు, యువకుడు పాలస్తీనా లోని పడమటి గట్టు నగరమైన (వెస్ట్ బాంక్) రమల్లాకు వెళ్తారు. ఇలా ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రజల సామరస్యాన్ని గూర్చి చెప్పిన ప్రఖ్యాత రచయితల రచనలు ఇంతకు ముందరే వచ్చాయి. అవి వారి ఆర్ట్స్ అండ్ హ్యూమనిటీస్‌లో భాగంగా, ఇజ్రాయెల్ లోని విద్యార్ధులు ఉన్నత పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుతున్నారు. హలెమ్ బలీక్, ఇజాక్ బశెవిస్ సింగర్, శ్ముఎల్ యోసేఫ్ అగ్నాన్, సమీ మైకేల్ వంటి వారి రచనలు ఇప్పటికీ వారి అకడెమిక్ సిలబస్‌లో భాగంగా ఉన్నాయి.
అధ్యాపక సంఘాలు డోరిట్ రబిన్యాన్ నవలను పాఠ్య ప్రణాళికలో చేర్చమని కోరిన మీదట, ‘ఈ నవల ఒకటిన్నర ఏడాది ముందరే విడుదలయినది, పాఠ్యాంశంగా ఉండనవసరం లేదు’ అని ఇజ్రాయెల్ హోం మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తే, దానికి నిరసనలు వెల్లువెత్తాయి. ఇదంతా డిసెంబర్ 2015లో జరగగా, ఇప్పుడీనవల ఇజ్రాయెల్‌లో అత్యధికంగా అమ్ముడవుతూ యువత విస్తృతంగా చదువుతున్నది. ప్రజలలో ఇలాంటి ప్రేమలు, పెళ్లిళ్లు జరిగితే, తమ జాతి అస్తిత్వాన్ని కోల్పోతామని అధికార వర్గాల అభిప్రాయం. తమకు నచ్చిన రీతిలో జీవించే హక్కు ప్రజలకు ఉందా, లేక ఇది కూడా ప్రభుత్వాలే నిర్ణయిస్తాయా అన్నది అక్కడ చర్చనీయాంశం అయింది. అవటానికి నలభై రెండేళ్ల వయసు కల రచయిత్రే అయినా, ఇజ్రాయెల్ సమాజంలో గల ఉదార విధానాల వల్ల, ఇప్పటికే, ఈమె రచన ‘అవర్ వెడ్డింగ్స్’ పాఠ్యాంశంగా విద్యా సంస్థల్లో బోధిస్తున్నారు.
ఇజ్రాయెల్ సాంస్కృతిక సమాజంలో డోరిట్ రబిన్యాన్ ఒక చురుకైన సాహిత్య వేత్త. 1972లో పర్షియన్-యూదుగా జన్మించి, తన ఇరవై రెండేళ్లకే తొలి నవల ప్రచురించిన వ్యక్తి. టీవీ ధారా వాహిక ‘షులీస్ ఫియాన్స్’ కు తెర రచన చేసింది.
‘‘యెస్,యె్‌స,యెస్’’ అని ఒక కవిత్వ సంపుటి, పెర్సియన్ బ్రైడ్స్, అవర్ వెడ్డింగ్స్, అండ్ వేర్ వాజ్ ఐ (బాల సాహిత్యం) ఇప్పుడీ ‘గదర్ హయా’ వెలువరించింది. ఈ నలభై రెండేళ్ల వయసుకే 1996లో వెయినర్ బహుమతి, 1997లో జ్యూయిష్ ఫిల్మ్ అకాడెమి నుంచి బెస్ట్ డ్రామా ఆఫ్ ద ఇయర్, 1999లో జ్యూయిష్ వింగేట్ క్వార్టర్లీ అవార్డ్, ద ప్రైమ్ మినిస్టర్స్ ప్రైజ్, లిటరరీ అఇ్ఖక అవార్డ్, ఈ బార్డర్ లైఫ్ నవలకు 2015 బెర్న్‌స్టీన్ బహుమతి గెల్చుకున్న శక్తివంతమైన రచయిత్రి. ‘తెలివి, ఇంగితం కల పరిణత పాఠకుల కోసం రాసిన నవల ఇది. కథా నాయకుడు ఒక మైనారిటీవర్గ వ్యక్తిగా ఇజ్రాయెల్ సమాజంలో ఎలా పెరుగుతాడు, తనపై ఉండే ఒత్తిళ్ళు అతన్ని ప్రేమించిన మెజారిటీ వర్గపు అమ్మాయి ఎదుర్కోవలసిన స్థిర ఛాందస భావాలు, వీటిపై కొంత చిత్రణకు, ఈ పరిస్థితులు మారడానికి తగు సన్నాహాలు ఎక్కడినుంచి రావలసింది సూచించడానికి ఈనవలలో ప్రయత్నం చేశాను’ అంటున్నదామె.
ప్రభుత్వపు ఈ అతి జోక్యందారీ విధానానికి నిరసన నమోదు చేయ నిశ్చయించిన టెల్ అవీవ్‌కు చెందిన ‘టైమ్ అవుట్’ టెలివిజన చానెల్ ప్రజలను తమ ప్రతికూలతను తెలియచేయ ఆహ్వానించింది. పెద్దపెద్ద చర్చలేమీ ఈ సంద ర్భంగా జరగలేదు. టాక్ షోలలో ఒకరినొకరు గొంతులు చించుకుని టీవీ రేటింగుల కోసమని నిందించుకోలేదు. ఆయుధాల కన్నా పెద్దగా తమ మాటల ద్వారా ఈర్ష్యా ద్వేషాలను రెచ్చగొట్టలేదు. మరి, ఏం జరిగింది ఆ టీవీ చానెల్‌లో? ఇజ్రాయెలీ, పాలస్తీనా జాతులవారైనప్పటికీ, ఇజ్రాయెల్ పౌరులైన ఆడ, మగ, ప్రేమికులు, సహ జీవనులూ, దంపతులూ, ఇంకా స్వలింగ సంపర్కులూ, ఒకరితో మరొకరికి ముఖ పరిచయం కూడా లేని వారంతా చేరారు అక్కడకు. యుద్ధాలు యుగావసరం అని నమ్ముతున్న యుద్ధపు పిచ్చోళ్ళ నష్టదాయిక విధానాలకు చెల్లు చీటి రాయడం సాహిత్యం వల్లనే సాధ్యమవుతుందని నిరూపించారు. డోరిట్ తన నవలలో ఏం రాసిందో, అది నిజం చేసి చూపించారు. జంటలు జంటలుగా ఆడ, మగా, మగ మగా, ఇజ్రాయెలీ, పాలస్తీనా పౌరులు తమ సహజీవనమే అనివార్యం అని చెప్తూ, టీవీ తెరలపై ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటూ, యుద్ధాలకు ప్రేమనొక సవాలుగా విసిరారు.
బహుశా ‘ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చును, ప్రేమ కలుగక బతుకు చీకటి’ అన్న తెలుగువాడెవడో కానీ, ఈ సంగతి, సుదూర ఆసియా దేశంలో, 2016లో ఇంత అర్థవంతంగా సాక్షాత్కరించడం కన్నా, సాహిత్య సార్వజనీనతకు ప్రయోజనం ఏముంది? నాలుగు పెదవుల కలయిక, నలభై రకాల ద్వేషాలకు మించిన ఆయుధం అయితే, ఆచరణలో ఈ పౌర సమాజపు ప్రతినిధులు అలనాడు కబీర్ ఏమన్నాడో దానికి నిలువెత్తు రూపాలుగా నిలిచారు. (ఢాయి అక్కర్ ప్రేమ్ కె అంటూ) ‘రెండున్నర అక్షరాల ప్రేమను ఎరగని వాడు, పండితుడెలా అవుతాడు? అన్న దాన్ని పొడిగిస్తూ, ఈ రెండున్నర అక్షరాల ప్రపంచ ఐక్యతా సూత్రాన్ని ఎరగని వారు, ఆయుధ శాసా్త్రలు,ఆర్ధిక శాసా్త్రలు, ఆంక్షల సూత్రాలు, నువ్వు వేరు, నేను వేరు అని చెప్పే వివక్షల తర్కాలు, ప్రజలను నిర్మూలించే నిబంధనలు ఎన్ని రాస్కున్నా, మనుషులు కాగలరా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ముద్దుల నిశ్శబ్ద సంస్కారం, సామరస్య అవగాహన ప్రపంచ వ్యాప్తమవుతే, అందులో సామాన్యుల సాహసాలుగా ఇవి అసంఖ్యాకంగా నమోదయితే, వీటి ముందర, వేల ఆటం బాంబులు, లక్షల యుద్ధాహంకారాలు, పెట్టుబడి దారీ సామ్రాజ్య దండయాత్రలు చిన్నబోతాయి, నిష్ప్రయోజనం అవుతాయి. ఒక మహాకవి చెప్పినట్టు ప్రేమ ‘కుహూరుత శీకరాలే లోకమంతా జల్లులాడే ఆ ముహూర్తాలాగమిస్తాయి’. ఎలా వస్తాయి అంటే ఆ సమస్త మానవ సన్మంగళ ముహూర్తాలు ఇలానే అవతరిస్తాయి.
రామతీర్థ
98492 00385
No comments:
Post a Comment