Thursday 28 January 2016

ఏపీ రాజధాని యువత ఆందోళన

ఏపీ రాజధాని యువత ఆందోళన
28-01-2016 06:43:17

విజయవాడ, ఆంధ్రజ్యోతి : సీఆర్‌డీఏ మాటలను నమ్మి, అప్పటికే చేస్తున్న ఉద్యోగాలను సైతం వదిలి, ఏపీఎస్సెస్‌డీసీ ద్వారా నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందిన తమను ఆ తర్వాత ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ రాజధాని ప్రాంత యువతీ యువకులు సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు, ఆ భూముల్లో పని చేస్తూండిన రైతుకూలీల పిల్లలకు ఉపాధి కల్పించే బాధ్యత సీఆర్‌డీఏదేనని, దాని చట్టంలో ఉండడంతోపాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందితే తమకు ఆ సంస్థలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ ఉన్నతాధికారులు హామీలు ఇచ్చారని పేర్కొన్నారు. వారి హామీలు నమ్మి ఇంజినీరింగ్‌, ఎంసీఏ పట్టభద్రులైన తాము అప్పటికే చేస్తున్న ఉద్యోగాలను వదిలి, శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలో దాదాపు 5 నెలలపాటు శిక్షణ పొందామని, అది ముగిసి దాదాపు రెండు నెలలైనా తమకు ఉపాధి కల్పించడం లేదని రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలకు చెందిన 113 మంది యువతీ యువకులు వాపోయారు. ఈ విషయమై రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, సీఆర్‌డీఏ కమిషనర్‌ డాక్టర్‌ నాగులాపల్లి శ్రీకాంత, అడిషనల్‌ కమిషనర్లు, గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌లకు విజ్ఞప్తులు చేసుకున్నా ఫలితం లేకపోవడంతో తాము ఆందోళనకు దిగాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తమకిచ్చిన శిక్షణ నాసిరకంగా ఉందన్న విషయాన్ని ఉన్నతాధికారులు అంగీకరించారని, కానీ దానివల్ల నష్టపోయిన తమకు న్యాయం చేయడపై మాత్రం వారు దృష్టి సారించడం లేదని విమర్శించారు. ఇది చాలదన్నట్లు బీటెక్‌ చదివిన వారికి ఐటీఐ అర్హత సరిపోయే స్పిన్నింగ్‌ మిల్లుల్లోని ఉద్యోగాలిప్పిస్తామంటూ ఇటీవల గుంటూరు జిల్లా బోయపాలానికి తీసుకు వెళ్లారని మండిపడ్డారు. తమ అర్హతలకు తగిన ఉద్యోగావకాశాలు వెంటనే కల్పించాలని, అది సాధ్యం కాని పక్షంలో త్వరలో నిర్మాణం ప్రారంభం కానున్న తాత్కాలిక సచివాలయ పనుల్లోనైనా ఉద్యోగాలివ్వాలని, రాజధాని ప్రాంతంలో కొత్తగా నెలకొల్పనున్న సీఆర్డీయే ఇతర కార్యాలయాల నిర్మాణంలోనూ, అమరావతి రూపకల్పనలో పాలుపంచుకునే కంపెనీల్లోనూ తమకు ప్రాధాన్యమివ్వాలని డిమాండ్‌ చేశారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ ధ్రువపత్రాలను వెంటనే ఇవ్వాలని, శిక్షణ సమయంలో చెల్లించాల్సిన ఉపకార వేతనం, ప్రయాణ చార్జీలను వెంటనే అందజేయాలని రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి హామీలను కనీసం రాజధాని ప్రాంతంలోనైనా అమలు పరచాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఆందోళన చేస్తున్న యువతతొ సీఆర్‌డీఏ అడిషనల్‌ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ చర్చలు జరిపారు. డిమాండ్లను సావధానంగా విన్న ఆయన వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తానని హామీ ఇచ్చారు

No comments:

Post a Comment