Thursday 31 December 2015

రాష్ట్ర విభజనలో మాకు అన్యాయం, అవమానం: చంద్రబాబు

రాష్ట్ర విభజనలో మాకు అన్యాయం, అవమానం: చంద్రబాబు
31-12-2015 01:15:29

  • కేంద్ర సాయం తగినంత రావడం లేదు.. అయినా వదలం
  • విభజన సమయంలో అన్యాయం..జన్మభూమిలో ఇవన్నీ వివరిస్తాం
  • ఆర్థిక కష్టాలున్నా సంక్షేమ బాటే..సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
  • కార్డులకు 12.5 లక్షల దరఖాస్తులు..అర్హులందరికీ ఫిబ్రవరిలో కార్డులిస్తాం
  • గ్రామాల్లో 5వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు..‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో సీఎం
 
విజయవాడ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు విభజన సమయంలో అన్యాయం, అవమానం జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శనివారం నుంచి ప్రారంభమయ్యే మూడో విడత జన్మభూమిలో దీనినీ ఒక అంశంగా తీసుకుంటున్నామన్నారు. నవ్యాంధ్ర నిర్మాణం ప్రతి ఒక్కరి కర్తవ్యమని తెలిపారు. ‘‘అన్యాయం జరిగిందని కుమిలిపోతే లాభం లేదు. దాన్ని కసిగా మార్చుకొని కష్టపడాలని ఇదివరకే చెప్పాను. కేంద్రం నుంచి రావాల్సినంత సహాయం రావడంలేదు. దానికోసం ప్రయత్నిస్తున్నాం. వదిలిపెట్టే సమస్యే లేదు’’ అని చంద్రబాబు ఉద్ఘాటించారు. బుధవారం విజయవాడలో ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇవీ ఆ వివరాలు.
 
మూడో విడత జన్మభూమి ప్రారంభిస్తున్నారు. మొదటి రెండు విడతల్లో ఎటువంటి సమస్యలు పరిష్కరించారు. మూడో విడత లక్ష్యం ఏమిటి? 
సమస్యలు అనునిత్యం పరిష్కరిస్తూనే ఉన్నాం. ఒకవిడత జన్మభూమిలో పెన్షన్ల అంశంపై దృష్టి సారించాం. ఇంకో విడతలో అనేక సమస్యలు తీసుకున్నాం. రైతు రుణ విముక్తి, డ్వాక్రా సంఘాలు తదితర అంశాలు పరిశీలించాం. మూడో విడత జన్మభూమి సమీక్ష ప్రధానంగా ఉంటుంది. 12.5 లక్షల మంది రేషన్‌ కార్డులు కోరారు. దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. అర్హులందరికీ రేషన్‌ కార్డులు ఇస్తున్నాం. ఈ జన్మభూమిలో భాగంగా వారికి సంక్రాంతి కానుక అందుతుంది. ఫిబ్రవరి నుంచి రేషన్‌ ఇస్తాం. ఇక... రెండుసార్లు ఇంటింటికీ వెళ్లి ‘మీ ఇంటికి-మీ భూమి’ కార్యక్రమం చేశాం. 90 శాతం వివరాలు కరెక్టుగా వచ్చాయి. 4-5శాతం తప్పులు వచ్చాయి. మిగిలినవి సర్వే పూర్తి కానివి, లిటిగేషన్లు ఉన్నవి. అవి కూడా పబ్లిష్‌ చేస్తాం. అవకతవకలకు అవకాశం లేకుండా, అవినీతిని పూర్తిగా కట్టడి చేసేలా ప్రయత్నిస్తున్నాం. ప్రజల్లో చైతన్యానికి ఈ జన్మభూమిలో ప్రయత్నిస్తున్నాం. ఎన్టీఆర్‌ ఆరోగ్య సేవ కింద వైద్య పరీక్షలను ఉచితంగా చేసేందుకు సంకల్పించాం. ఆస్పత్రుల్లో శుభ్రత, బయోవేస్ట్‌ నిర్వహణ కోసం చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైతే బయటి డాక్టర్లను కూడా పిలిపించి ఎన్టీఆర్‌ ఆరోగ్య సేవలో సర్జరీలు చేయిస్తాం. ఆంధ్రప్రదేశ్‌ను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నాలను కూడా ఈ జన్మభూమిలో వివరిస్తాం. పంట సంజీవని, చెక్‌డ్యాంలు, నదుల అనుసంధానం, డ్రిప్‌, స్ర్పింక్లర్‌ ఇరిగేషన్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నాం. వీటికి తోడు రెయిన్‌గన్స్‌ ఏర్పాటు చేసి పంటలు ఎలా కాపాడతామో రైతులకు వివరించి చెబుతాం. గ్రామాల్లో 5000 కిలోమీటర్ల పొడవునా సిమెంటు రోడ్లు వేయాలని సంకల్పించాం. ప్రతి గ్రామంలో కరెంటు, మరుగుదొడ్లు, సిమెంటు రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. వచ్చే జూన్‌ నుంచి ప్రతి ఇంటికీ 10-15 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో ఇంటర్నెట్‌ సదుపాయం కల్పిస్తాం. ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ప్రభుత్వం ఏం చేస్తోందన్న అంశంపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తాం. పేదలు ఆస్పత్రికి పోతే తల్లీ-బిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో ఉచితంగా వారిని ఇంటికి చేర్చే కార్యక్రమాన్ని జనవరి ఒకటో తేదీన ప్రారంభిస్తున్నాం.
 
జన్మభూమిలో ఆర్థిక భారంలేని సమస్యలే పరిష్కారం అవుతున్నాయనే భావన ఉంది! 
అది కరెక్టు కాదు. సిమెంటు రోడ్లకు డబ్బులిస్తున్నాం. మరుగుదొడ్లు, వంటగ్యాస్‌ సిలిండర్లకు డబ్బులిస్తున్నాం. రేషన్‌ కార్డులు, పెన్షన్లు... ఇలా అన్నీ ఆర్థికంతో ముడిపడి ఉన్నవే. 43 లక్షలకు పైగా పెన్షన్లకు రూ. 6000 కోట్లు వెచ్చిస్తున్నాం. ప్రతి ఒక్కరికీ సంక్షేమం అవసరం. మనిషికి 5 కేజీల చొప్పున బియ్యం, వెయ్యి రూపాయల పెన్షన్‌, ఎస్సీ, ఎస్టీలకు అదనపు ప్రయోజనాలు, ఉపాధి హామీ పథకం కింద 150 రోజుల పని దినాలు... ఇలా అనేక ప్రయోజనాలు అన్ని కుటుంబాలకూ అందుతున్నాయి. పేదల్ని అన్ని విధాలా ఆదుకోవాలన్నదే నా ధ్యేయం.
 
సిటిజన్‌ చార్టర్‌ తరహాలో జన్మభూమిలో వచ్చిన విజ్ఞాపనల పరిష్కారానికి కూడా నిర్దిష్ట కాలపరిమితిని నిర్దేశిస్తారా? 
చాలావరకు సమస్యలు పరిష్కారమవుతున్నాయి. అర్హతతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికీ పెన్షన్లు కావాలి అంటే కష్టం. హేతుబద్ధత చూడాలి. అర్హులందరికీ ఇస్తున్నాం. పెన్షన్‌ ఎవరికిచ్చారు... ఎప్పుడిచ్చారు అనే వివరాలన్నీ ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే ఉంటున్నాయి.
 
సిబ్బంది సామర్థ్యం పెంచకుండా, అవినీతిని రూపుమాపకుండా సమస్యల పరిష్కారం సాధ్యమేనా? 
ఇది నిరంతర ప్రక్రియ. ఈరోజు నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ అరవింద్‌ పనగారియా వచ్చారు. కొన్ని ప్రాంతాల్లో తిరిగి చూసిన తర్వాత అభివృద్ధిపట్ల చాలా ఆనందంగా ఉన్నారు. నా అంచనాల ప్రకారం ఇంకా జరగాల్సిది చాలా ఉంది.
 
రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని (డబ్బులు లేకుంటే ఇది సాధ్యం కాదు కదా అనే అర్థంలో...), ఆర్థిక సమస్యలు అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయని అరవింద్‌ పనగారియా వ్యాఖ్యానించారు. దీన్ని మీరు ఎలా స్వీకరిస్తారు? 
వారి వ్యాఖ్య సవ్యంగానే ఉంది. కానీ... మన పరిస్థితి వేరు. విభజన సమయంలో అన్యాయం జరిగింది. కేంద్రం నుంచి రావాల్సిన సాయం రావడంలేదు. దానికోసం ప్రయత్నిస్తున్నాం. అరవింద్‌ పనగారియాకు సముద్ర తీర విజన్‌న్‌పై ప్రజెంటేషన్‌ చేశాను. రెండు సాగర్‌ మాల ప్రాజెక్టులు అవసరమని ఆయన అన్నారు. ఒకటి... గుజరాత్‌-ముంబై, మరొకటి విశాఖ-చెన్నై. ఈ రెండు సాగర మాలలు వస్తే ఇండియాలో చైనా తరహా అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇది మన విజన్‌కు సూట్‌ అవుతోంది.
 
గతంలో అధికారంలో ఉన్నప్పుడు పాలనా సంస్కరణలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు సంక్షేమం అంటున్నారు. గెలుపు ఓటములు మీ ప్రాధాన్యతలను ప్రభావితం చేశాయా? 
నేను పని చేయాల్సింది నాకోసం, నా కుటుంబం కోసం కాదు. ప్రజలకోసం పని చేస్తున్నా. వారికి సాధికారత తేవాలి కదా! అభివృద్ధి ఫలితాలు పేదలకు అందాలి. పేదల సంక్షేమం జరగాలి. జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి. అదే ఇప్పుడు చేస్తున్నా. నేను అభివృద్ధి చేశాను... సరైన సమయంలో దాని ఫలితాలు ప్రజలకు సహజంగా చేరతాయని గతంలో అనుకున్నాను. ఎన్నికల్లో ఓడిపోయాం. తర్వాత స్వార్థంతో రాషా్ట్రన్ని లూటీ చేశారు. ఇప్పుడు పేదలకోసం, రైతులకోసం కష్టపడుతున్నా. 
ఒకాయన అమరావతి వెళ్లి పర్యావరణం ధ్వంసమవుతోందంటాడు. ఈయనెవరు? అమరావతిలో రైతులకు ఆ విషయం తెలియదా? అసెంబ్లీలో ఒకాయన విజయవాడ సెక్స్‌, క్రైమ్‌ సిటీ అంటాడు. విజయవాడ పేరు దెబ్బ తీయాలనే ప్రయత్నం. నీచ రాజకీయాలకోసం ఇంత దుర్మార్గమా? ఇలాంటి దౌర్భాగ్యపు ప్రతిపక్షాలు ఇక్కడ ఉండటం దురదృష్టకరం.

రాజధాని శంకుస్థాపన సమయంలో రాష్ట్రానికి ప్యాకేజీపై కేంద్రం కసరత్తు చేస్తోందని, అతి త్వరలో ప్యాకేజీ రాబోతోందని చెప్పారు. నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ ఇప్పుడు మీ వద్దకు వచ్చి ప్రశంసిస్తున్నారు. మరి ప్యాకేజీ మాటేమిటి? 

వారు నివేదిక ఇచ్చామన్నారు. త్వరలోనే ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్‌ తీసుకొని మాట్లాడతాను. ఎట్టిపరిస్థితుల్లో ప్రయత్నిస్తా. ఒకవైపు కొన్ని పనులవుతున్నాయి. అవి చాలవు. విభజన సమయంలో చెప్పినవన్నీ చేయవలసిన అవసరం ఉంది. ప్రధాని వాటన్నిటినీ చేస్తానని హామీ ఇచ్చారు. చేస్తారని ఆశిస్తున్నా. 
మీరు వచ్చాక పని పెరిగిపోయిందని అధికార యంత్రాంగం భావిస్తోంది. 
పని పెరిగిందనుకుంటే పెరిగిపోతుంది. చేసే పనిలో ఆనందం పొందితే ఆటోమేటిక్‌గా దానికి అలవాటుపడతాం. టెక్నాలజీ వచ్చింది. దాన్ని ఉపయోగించుకోవాలి. ఒక ట్యాబ్లెట్‌ తీసుకెళ్తే ఫైళ్లు మోసుకెళ్లే అవసరం లేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సులువుగా పనిచేయడం అలవాటు చేసుకోవాలి.
 
అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అయింది. అధికారుల పని తీరు మెరుగుపరుస్తామంటున్నారు. మరి... మంత్రివర్గ సహచరుల మాటేమిటి? 
అందరూ సమాజంలో భాగమే. మా మంత్రులే కాదు... ఎమ్మెల్యేలు, పార్టీవారు, మీ పత్రికలవారు, ప్రజలు అందరూ ఎప్పటికప్పుడు సమర్థత మెరుగుపరుచుకోవాలి. ఇప్పుడు కూడా మావాళ్ళకు అదే చెప్పాను.
 
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసే అవకాశం ఉందా? 
సరైన సమయంలో ఉంటుంది. ఇప్పుడున్న మంత్రులే చాలావరకు మంచి ఫలితాలు తెస్తున్నారు. ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటాం. అవసరమైనప్పుడు ప్రజాప్రయోజనాలకోసం ఏమి నిర్ణయాలో చేయాలో అవి చేస్తాం.
 
2016లో మీ లక్ష్యాలేమిటి? 
2016 ఏపీకి ఒక నూతన అధ్యాయం. దేశంలో ఒక అగ్ర రాష్ట్రంగాతయారు చేయడానికి ప్రణాళిక తయారు చేసుకున్నాం. సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా ఇవ్వాలి. అభివృద్ధితో జీవన ప్రమాణాలు పెంచాలి. ఉపాధి అవకాశాలు రావాలి. సంపద సృష్టి జరగాలి. ఆర్థిక అసమానతలు లేని సమాజానికి చేసే కృషిలో 2016 నాంది.
 
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ రాసిన ‘కొత్త పలుకు’ వ్యాసంలో కొన్ని సూచనలు ఇచ్చారు. మీరు కూడా మీ నాయకులకు చెప్పారు. సమీక్షలు ఎక్కువవుతున్నాయని... 
సమీక్షలు తగ్గించాం. ఇక్కడ చాలా సమస్యలున్నాయి. సామర్థ్యం, నైపుణ్యాల అభివృద్ధి లేదు. నా స్వభావం ఏంటంటే... మనుషుల్లో మార్పుకోసం ప్రయత్నిస్తాను. చెప్పి చూస్తాను. మార్పు రాకపోతే, ఇది తప్పు అనుకుంటే నాకంటే కఠినంగా ఉండేవారు ఎవరూ ఉండరు.
 
రాజకీయంగా తెలంగాణలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ బలపడినట్టుగా ఇక్కడ మీరు బలపడటం లేదు! 
రకరకాలుగా ఊహించుకోవచ్చు. ఒక్కో నాయకుడి స్టైల్‌ ఒక్కోలా ఉంటుంది. టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో చాలా బలంగా ఉంది. ఒకటి రెండు ఎన్నికలు కాదు. రాజకీయ స్థిరత్వం రావాలన్నా, ప్రజలకు మంచి జరగాలన్నా ఒక పార్టీ ఎక్కువ కాలం పాలించి సమర్థ నాయకత్వాన్ని ఇవ్వాలి. ఉదాహరణకు... 2004లో నేను ఓడిపోయిన తర్వాత నాకు కొంత నష్టం జరిగింది. నాకంటే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది. మళ్లీ కష్టపడ్డాను... తిరిగి అధికారంలోకి వచ్చాను. ఈ పదేళ్లు రాష్ట్రం మంచి అవకాశాన్ని కోల్పోయింది. నేను చేసిన పనుల ఫలితాలు చేతికి వచ్చే సమయంలో అధికారం పోవడం... అక్కడి నుంచి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిగా తయారు చేయడం చూస్తున్నాం. రాజకీయంగా గట్టిగా ఉండాలనుకున్నప్పుడు... దీర్ఘకాల రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజాహితంకోసం చాలా గట్టిగా ఉంటాను.
 
ప్రభుత్వం దృష్టి మొత్తం అమరావతిపైనే ఉందని, మిగిలిన ప్రాంతాల్ని విస్మరిస్తున్నారని ఒక భావన ఉంది. మరీ ముఖ్యంగా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయలసీమలోనే ఉంది! 
అది సరి కాదు. కొందరు రాజకీయ ప్రయోజనాలకోసం మాట్లాడుతున్నారు. ఈ రోజు పనగారియా వచ్చారు. ఏం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యూహాత్మక ప్రాంతంలో ఉందన్నారు. విశాఖ నుంచి చెన్నై సాగర్‌ మాల వస్తే ఇక్కడే అభివృద్ధి జరుగుతుంది... ఆ తర్వాతే మిగిలిన ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందన్నారు. గోదావరిపై పోలవరం నిర్మాణానికి నాలుగేళ్లు పడుతుంది కాబట్టి... పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టాం. ఈరోజు పట్టిసీమ ద్వారా నీటిని కృష్ణాకు తెచ్చాం. వచ్చే ఏడాది వంద టీఎంసీలు తెచ్చి రాయలసీమకు కచ్చితంగా నీరిస్తామని చెప్పానంటే కారణమేంటి! పట్టిసీమ పూర్తయింది. సీమకు నీరొస్తే వీరికి పుట్టగతులుండవనే మాట్లాడుతున్నారు. ఈరోజు అనంతపురం, కర్నూలు, తిరుపతిలలో ఎంతో అభివృద్ధి జరిగింది. ఇవి చెప్పరా? నేను కూడా రాయలసీమలో పుట్టాను. రాయలసీమ సెంటిమెంట్లు నాకు తెలుసు. అక్కడ కరువు, వెనుకబాటుతనం నాకు బాగా తెలుసు. రాయలసీమ ప్రజలకోసం, రాష్ట్ర ప్రజలకోసం పని చేస్తా. అంతేకానీ, తప్పుడు విమర్శలు చేసే వాళ్ల కోసం కాదు!

No comments:

Post a Comment