అప్పుడు ఓటుకు నోట్లు..! ఇప్పుడు కాల్ మనీ...!!
Sakshi | Updated: December 14, 2015 18:13 (IST)
* కేసీఆర్ కలిసిన ప్రతిసారీ ఇబ్బందికర పరిస్థితుల్లో చంద్రబాబు
హైదరాబాద్: రెండు నెలల కిందట చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లినప్పుడు... ఈరోజు కేసీఆర్ స్వయంగా చంద్రబాబు వద్దకు వెళ్లినప్పుడు... రెండు సందర్భాల్లోనూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడారు. నోట్ల వ్యవహారాల్లో తీవ్ర విమర్శల సుడిగుండంలో చిక్కుకున్న సందర్భంలోనే చంద్రబాబు, కేసీఆర్‌ల భేటీలు జరగడం విశేషం.
ఈ నెల 23 నుంచి 27 వరకు మెదక్ జిల్లా ఎర్రవల్లి గ్రామంలో తలపెట్టిన అయుత చండీ మహా యాగంలో పాల్గొనాలని కోరుతూ కేసీఆర్ సోమవారం చంద్రబాబును కలుసుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన కేసీఆర్ విజయవాడలో ఉన్న చంద్రబాబు నివాసానికి వెళ్లి స్వహస్తాలతో ఆహ్వానపత్రికను అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్వయంగా కేసీఆర్‌కు అతిథి మర్యాదలు చేశారు. మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ బాల్క సుమన్‌లతో కలిసి వెళ్లినప్పటికీ కేసీఆర్‌తో చంద్రబాబు విడిగా దాదాపు 20 నిమిషాలపాటు ఏకాంతంగా చర్చించుకున్నారు. అనంతరం ఆంధ్రా వంటకాలతో కేసీఆర్‌కు చంద్రబాబు ప్రత్యేక విందునిచ్చారు.
వెనక్కి తిరిగిచూస్తే...
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి చంద్రబాబు స్వయంగా హైదరాబాద్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆహ్వానం అందజేశారు. అక్టోబర్ 18న చంద్రబాబు తెలంగాణ సీఎం అధికారిక నివాసానికి వెళ్లి అమరావతి శంకుస్థాపనకు రావాలని కోరాగా, కేసీఆర్ అందుకు సమ్మతించి హాజరయ్యారు కూడా.
రెండు సందర్భాల్లోనూ...
అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్‌ను ఆహ్వానించాలనుకున్నప్పుడు చంద్రబాబు తీవ్ర తర్జనభర్జన పడాల్సి వచ్చింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి నోట్ల కట్టలను ఎరగా చూపిన విషయం తెలిసిందే. రేవంత్‌రెడ్డి జూన్ 1న స్టీఫెన్‌సన్‌ను కలిసి డబ్బు మూటను ఇస్తున్న వీడియో రికార్డులు బయటకు రావడం, ఆ తర్వాత స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడినట్టు ఆడియో టేపులు బయకుపొక్కడం వంటి ఘటనలు తీవ్ర సంచలనం సృష్టించాయి. ఈ వ్యవహారంలో చంద్రబాబు గొంతువరకు కూరుకుపోయారని కేసీఆర్ చెప్పగా, మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ చంద్రబాబు నేరుగా కేంద్రం ముందు శరణుజొచ్చిన విషయం తెలిసిందే.
ఈ ఘటన జరిగిన తర్వాత నాలుగు నెలల వరకు చంద్రబాబు, కేసీఆర్ పరస్పరం కలుసుకున్న సందర్భం రాలేదు. అమరావతి శంకుస్థాపనకు రావాలని కోరే విషయంలో అక్టోబర్ 18న చంద్రబాబు వెళ్లి కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఆ తర్వాత అక్టోబర్ 22న దసరా పండుగ రోజు అమరావతి శంకుస్థాపన వేదికపైన కలుసుకున్నారు. రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ కుమార్తె వివాహ కార్యక్రమంలో వారిద్దరు పరస్పరం ఎదురుపడినప్పుడు నమస్కారాలతో సరిపెట్టారే తప్ప పెద్దగా మాట్లాడుకోలేదు.
మళ్లీ ఇప్పుడు...
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం కలిగిస్తున్న కాల్‌మనీ వ్యవహారంలోనూ అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయని, అందులో టీడీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే పాత్ర ఉందని బలంగా వినిపిస్తోంది. గత రెండు రోజులుగా ఈ వ్యవహారంపై అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజల నుంచి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కేసీఆర్ రావడం యాధృచ్చికమైనప్పటికీ చంద్రబాబును ఇబ్బంది పెట్టిందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.
No comments:
Post a Comment