Monday 28 December 2015

అమరావతి నుంచి నలుదిక్కులా హైస్పీడ్‌ రైల్‌ నెట్‌వర్క్‌

అమరావతి నుంచి నలుదిక్కులా హైస్పీడ్‌ రైల్‌ నెట్‌వర్క్‌
29-12-2015 06:39:07

మంగళగిరి: మంగళగిరి రైల్వేస్టేషన్‌కు మహర్దశ పట్టనుంది. విజయవాడకు సైతం వెళ్లని హైస్పీడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు భవిష్యత్తులో విధిగా మంగళగిరి స్టేషన్‌లో ఆగను న్నాయి. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ను పరిశీలిస్తే... రాజధాని ప్రాంతంలో మంగళగిరి ప్రధాన జంక్షన్‌గా అవతరించే అవకాశాలున్నాయి. మాస్టర్‌ ప్లానులో ప్రతిపాదించిన హైస్పీడ్‌ రైల్వేట్రాక్‌లు రాజధాని నలుదిక్కులా ఉన్న మెట్రోపాలిటన్‌ నగరాల నుంచి నేరుగా మంగళగిరి జంక్షన్‌ను చేరుకునే విధంగా ఉన్నాయి. ఈ హైస్పీడ్‌ ట్రాక్‌లు విజయవాడ, తెనాలి స్టేషన్లను తాకకుండా వాటికి దూరంగా మంగళగిరి జం క్షన్‌ను చేరుకునేలా ప్రతిపాదించడం విశేషం. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అమరావతికి దేశంలోని ప్రధాన నగరాల నుంచి సులభంగా, వేగంగా చేరుకునే విధంగా హైస్పీడ్‌ రోడ్డు, రైలు కనెక్టవిటీ కావాలని పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇందుకు అనుగుణంగా తుది మాస్టర్‌ ప్లానులో హైస్పీడ్‌ రైల్వే లైన్లను ప్రతిపాదించారు. ప్రస్తుతం ఉన్న డబుల్‌ లైన్‌ రైల్వేట్రాక్‌లకు సమాంతరంగా హైస్పీడ్‌ రైల్వే ట్రాక్‌లను ప్రతిపాదించారు. నాలుగు వైపుల నుంచి కొత్తగా ఏర్పాటయ్యే ఈ హైస్పీడ్‌ ట్రాక్‌లకు మంగళగిరి ప్రధాన జంక్షన్‌ కానుంది. తుది మాస్టర్‌ ప్లాను విడుదలైన నేపథ్యంలో మంగళగిరి స్టేషన్‌ అభివృద్ధికి చేసిన ముఖ్య ప్రతిపాదనల నేపథ్యంలో అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ ఎన్‌వీ రామకృష్ణారెడ్డి సోమవారం స్టేషన్‌కు చేరుకుని స్థల పరిశీలన చేశారు. 
మాస్టర్‌ ప్లాన్ లో మార్గాలు ఇలా.. 
బెంగళూరు నుంచి నరసరావుపేట మీదుగా వేమవరం, ఫిరంగిపురం, డోకిపర్రు, పేరేచర్ల, చినపలకలూరు పక్కగా గుంటూరుకు హైస్పీ డ్‌ రైల్వేట్రాక్‌ను ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి మంగళగిరికి ప్రస్తుతం ఉన్న డబుల్‌ లేన్‌ ట్రాక్‌కు పశ్చిమ సమాంతరంగా అగతవరప్పాడు, వెనిగండ్ల, కొప్పురావూరు మీదుగా హైస్పీడ్‌ రైల్వేట్రాక్‌ను నిర్మిస్తారు. ఇక్కడి నుంచి నవులూరు, కృష్ణాయపాలెం, వెంకటపాలెం మీదుగా అంటే.. కొత్తగా నిర్మించనున్న విజయవాడ పశ్చిమ బైపాస్‌ రోడ్డుకు సమాంతరంగా ఈ కొత్త ట్రాక్‌ నిర్మాణం జరుగుతుంది. వెంకటపాలెం నుంచి ఐకాన్‌ బ్రిడ్జికి తూర్పు సమాంతరంగా కృష్ణానదిపై హైస్పీడ్‌ రైల్వేట్రాక్‌ నిమిత్తం కొత్త వంతెన నిర్మిస్తారు. అంటే రాజధాని ప్రాంతానికి వెంకటపాలెం వెనుకవైపు అమరావతి స్టేషన్‌ ఏర్పాటు కావొచ్చు. కృష్ణానదిని దాటిన తరువాత ఈ రైల్వేట్రాక్‌ విజయవాడ బైపాస్‌ రోడ్డుకు సమాంతరంగా ప్రయాణిస్తూ గొల్లపూడి దాటాక రెండు శాఖలుగా చీలనుంది. ఓ శాఖ హైదరాబాద్‌ డబుల్‌ లేన్‌ రైల్వేట్రాక్‌కు సమాంతరంగా హైదరాబాద్‌ వైపు వెడుతుండగా... రెండోది విజయవాడ బైపా్‌సకు సమాంతరంగా గన్నవరం సమీపంలో ప్రస్తుత రైల్వేట్రాక్‌కు సమాంతరంగా విశాఖ వెడుతుంది. ఇక చెన్నై నుంచి ప్రస్తుత డబుల్‌ లేన్‌ రైల్వేట్రాక్‌కు సమాంతరంగా మంగళగిరి వరకు కొత్త హైస్పీడ్‌ రైల్వే ట్రాక్‌ను ఏర్పాటు చేస్తారు. మాస్టర్‌ ప్లానులో దీని వివరాలు బాపట్ల వద్ద నుంచి పొందుపరిచారు. ఈ డబుల్‌ లేన్‌ రైల్వేట్రాక్‌కు తూర్పు సమాంతరంగా ఏర్పాటయ్యే ఈ హైస్పీడ్‌ ట్రాక్‌కు మోదుకూరు నుంచి ప్రస్తుత డబుల్‌ లేన్‌ ట్రాక్‌ నుంచి దూరంగా వెళ్లిపోతుంది. మోదుకూరు నుంచి ఈ లైను చుండూరుకు తూర్పు ముఖంగా (తెనాలితో సంబంధం లేకుండా) చినపరిమి, పెదరావూరు, చినరావూరు, నేలపాడు, నందివెలుగు, చింతలపూడి మీదుగా దుగ్గిరాల వద్ద మళ్లీ ప్రస్తుతం ఉన్న డబుల్‌ లేన్‌ రైల్వేట్రాక్‌కు సమాంతరంగా వస్తుంది. ఇక్కడి నుంచి మంగళగిరి మండలం చినవడ్లపూడి వరకు వెళ్లి అక్కడి నుంచి పూర్తిగా పడమర వైపు తిరిగి కోకాకోలా ఫ్యాక్టరీ వెనుకగా చినకాకాని ముందరగా ప్రయాణిస్తూ ప్రస్తుత హైవే నుంచి కొత్తగా ఏర్పాటు కానున్న విజయవాడ పశ్చిమ బైపాస్‌ కూడలి సెంటరుకు వచ్చి బైపాస్‌ రోడ్డుకు సమాంతరంగా ప్రయాణిస్తూ మంగళగిరి వద్ద ఏర్పాటయ్యే రైల్వే జంక్షన్‌ను చేరుకుంటుంది.

No comments:

Post a Comment