Sunday 27 December 2015

రష్యా విమానం కూల్చివేత పుతిన్ కుట్రా!

రష్యా విమానం కూల్చివేత పుతిన్ కుట్రా!

Others | Updated: December 26, 2015 18:58 (IST)
రష్యా విమానం కూల్చివేత పుతిన్ కుట్రా!
లండన్ :
మధ్యప్రాచ్యంలోని షారమ్ ఎల్ షేక్ పర్యాటక ప్రాంతంలో అక్టోబర్ 31వ తేదీన రష్యా విమానం మెట్రోజెట్ ఫ్లైట్ 9268 ఆకాశంలో పేలిపోయి 224 మంది రష్యన్లు మరణించడానికి కారణం ఎవరు? ఈ దుర్ఘటనకు బాధ్యులం తామే అని చెప్పుకుంటున్న ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టులకు నిజానికి అంతటి శక్తి ఉందా? తాము శతఘ్నితో పేల్చేసినట్లు వాళ్లు చెబుతున్నా.. సంఘటన స్థలంలో శతఘ్ని శకలాలు ఒక్కటి కూడా ఎందుకు దొరకలేదు. అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను రష్యా ప్రభుత్వం నేటికీ ఎందుకు సేకరించలేక పోయింది?

ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగా ఉన్న రష్యా విమానం పేలుడు సంఘటనపై మాజీ కేజీబీ (ఇప్పటి ఎఫ్‌ఎస్‌బీ) ఏజెంట్ బోరిస్ కార్పిఖోవ్ ఓ బాంబు పేల్చారు. ఈ పేలుడు వెనక టెర్రరిస్టుల ప్రమేయం ఏమీ లేదని, రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాన కుట్రదారుడని ఆరోపించారు. ఆయన ఆదేశం మేరకు రష్యా సైనిక ఇంటెలిజెన్స్‌లో ఒక భాగమైన జీఆర్‌యూ అధికారులు పథకం ప్రకారం బాంబుతో విమానాన్ని పేల్చేశారని ఆయన చెప్పారు. జీఆర్‌యూలో సీనియర్ అధికారిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి ద్వారా తనకు ఈ విషయం తెలిసిందని, 'టూ రాబిట్స్ విత్ వన్ బుల్లెట్ (ఒక దెబ్బకు రెండు పిట్టలు)' అని కూడా ఆయన ఈ కుట్ర గురించి వ్యాఖ్యానించారని కార్పిఖోవ్ తెలిపారు.

రష్యా విమానం కూలిపోయిన రోజు సాయంత్రం ఓ రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ కొత్తగా పరిచయం చేసుకున్న ఓ ప్రయాణికురాలి ద్వారా ఓ గిఫ్ట్ ప్యాకెట్‌ను సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని తన కుటుంబ సభ్యులకు అందజేసే మిష మీద పంపారని, ఆమెను అంతంత మాత్రంగా ఉండే సెక్యూరిటీ చెకప్‌లను దాటించి విమానం ఎక్కేవరకు ఆ రష్యా ఏజెంట్ తోడున్నారని కార్పిఖోవ్ తెలిపారు. ఆ గిఫ్ట్ ప్యాకెట్‌లోనే 'ఈ హెచ్‌వీ-7 బాంబు' (రష్యా స్పెషల్ ఇంటెలిజెన్స్ వర్గాల కోసమే ఈ బాంబులను రష్యా తయారుచేస్తోంది), దాని ఇగ్నేటర్ ఉందని, ఇగ్నేటర్ ఎలక్ట్రో లైట్ ద్వారా ఇగ్నైట్ అవుతుందని తెలిపారు. ఆ బాంబును విమానంలో 31 లేదా 31ఏ సీటులో పెట్టి ఉంటారని, గిఫ్ట్‌ను తీసుకొచ్చిన మహిళ ఆ పక్క సీటులోనే కూర్చొని ప్రయాణించారని ఆయన వివరించారు. ఆ బాంబు పేలిపోవడం వల్లనే విమానం గాలిలో ఉండగానే విమానం, అందులోని ప్రయాణికుల శరీరాలు తునాతునకలయ్యాయని తెలిపారు. రష్యా విమానం సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు బయల్దేరిన కొన్ని నిమిషాలకే పేలిపోవడం, దాని శకలాలు 30 మైళ్ల వ్యాసార్ధంలో చెల్లా చెదరుగా పడిపోవడం తెల్సిందే.

ఇదే నిజమైతే పుతిన్ ఈ దారుణానికి ఎందుకు ఒడిగట్టారు?
చెచెన్యా తిరుగుబాటుదారులకు సహకరిస్తున్న ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టులను తుదముట్టించేందుకు, సిరియా అధ్యక్షుడు అసద్ సేనలకు అండగా వారిపై రష్యా సైనికులు గత కొంతకాలంగా భూతల యుద్ధం చేస్తున్న విషయం తెల్సిందే. చెచెన్యా తిరుగుబాటుదారుల అణచివేతను బ్రిటన్ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం కూడా ఇక్కడ గమనార్హమే. బ్రిటన్ లాంటి దేశాల నుంచి సానుభూతిని పొందేందుకు, ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టులను అమానుషులని ముద్ర వేసేందుకు, వారి అంతానికి పలు దేశాల సంఘీభావాన్ని కూడగట్టుకునేందుకు పుతిన్ ఈ దారుణ కుట్రకు తెర లేపారన్నది కార్పిఖోవ్ వాదన. 'టూ రాబిట్స్ విత్ వన్ బుల్లెట్' అంటే అర్థం ఇదేనేమో! ఇదీ నిజమైతే పుతిన్ కుట్ర ఫలించినట్లే.

రష్యా విమానం పేలిపోయి 224 మంది రష్యన్లు చనిపోవడంతో అంతర్జాతీయంగా రష్యా పట్ల సానుభూతి పవనాలు వీచాయి. ముఖ్యంగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, చైనాలు ఐఎస్‌ఐఎస్‌పై యుద్ధానికి తాము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అధికారికంగా ప్రకటించాయి. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ స్వయంగా పుతిన్‌కు ఫోన్ చేసి సానుభూతి వ్యక్తం చేయడంతోపాటు ఐఎస్‌ఐఎస్‌పై పోరాటానికి సహకరిస్తామని హామీ కూడా ఇచ్చారు. అప్పటినుంచి రష్యా వైమానిక దళాలు సిరియాలో ఐఎస్‌ఐఎస్‌కు వ్యతిరేకంగా గగనతలం నుంచి బాంబులవర్షం కురిపిస్తున్నాయి. చిరకాల మిత్రుడైన అసద్‌కు ఆయుధ సంపత్తిని పుతిన్ సమకూరుస్తున్నారు.

చెల్లింపుల వివాదంలో చిక్కుకొని రష్యాలో జైలు జీవితం గడిపి, విడుదల కాగానే ఇంగ్లండ్‌కు పారిపోయి వచ్చి, రహస్య జీవితం గడుపుతున్న కార్పిఖోవ్ అక్కసుతో చెబుతున్న మాటలేనని వీటిని కొట్టి పారేయచ్చు కూడా. ఆయన పదేళ్లకు పైగా కేజీబీలో మేజర్ స్థాయిలో పనిచేయడమే కాకుండా ఆయనకు రష్యా మిలటరీ ఇంటెలిజెన్స్ వర్గాలతో ఇప్పటికీ సంబంధాలున్నాయి. రష్యా ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పుతిన్ సొంత దేశ ప్రజలనే చంపుకొంటారా ? అన్న అనుమానం కూడా రావచ్చు. అయితే ఇలాంటి ఆరోపణలు ఆయన మీద రావడం ఇదేమీ కొత్తకాదు.

కేజీబీలో గూఢచారిగా పనిచేసిన పుతిన్.. తొలిసారి ఎన్నికైనప్పుడు కూడా ఆయనపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. 1999లో మాస్కోలోని నాలుగు అపార్ట్‌మెంట్లలో, బైనాకస్క్, వోల్గోడోన్స్కు పట్టణాల్లో వరుస బాంబు పేలుళ్లు సంభవించి 307 మంది మరణించారు. మహిళలు, చిన్నపిల్లలు కూడా చనిపోగా మొత్తం 1700 మంది గాయపడ్డారు. ఈ పేలుళ్లకు చెచెన్యాలోని ముస్లిం తీవ్రవాదులే కారణమని పుతిన్ అప్పట్లో ఆరోపించారు. వారిపై దాడులను తీవ్రతరం చేశారు. ఈ పేలుళ్లపై దర్యాపు చేస్తున్న స్థానిక పోలీసులు ముగ్గురు క్రెమ్లిన్ గూఢచారులను అరెస్ట్ చేయడంతో పేలుళ్లకు కారణం పుతిన్ అంటూ ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో మరో పేలుడు కుట్రను రష్యా పోలీసులు భగ్నం చేశారు. ఆ కేసులో కూడా రష్యా పోలీసులు ఎఫ్‌ఎస్‌బీ అధికారులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఎఫ్‌ఎస్‌బీ అధికారులు తమ ఐడీ కార్డులను చూపించి విడుదలయ్యారు. ఆపార్ట్‌మెంట్ పేలుళ్లకు మూడురోజుల ముందే ఓ రష్యన్ అధికారి ఓ కౌన్సిల్ సమావేశంలో అధికారికంగా పేలుళ్ల బాధితులకు సానుభూతిని వ్యక్తం చేయడం గమనార్హం.

ఈ అంశాలన్నింటిపై రాజకీయ దుమారం చెలరేగడంతో పేలుళ్లపై దర్యాప్తునకు పుతిన్ ప్రత్యేక పార్లమెంటరీ కమిషన్‌ను ఏర్పాటుచేశారు. అప్పుడు కమిషన్ దర్యాప్తునకు పుతిన్ ప్రభుత్వం ఏ మాత్రం సహకరించలేదు. ఇద్దరు కమిషన్ సభ్యులు హత్యలకు గురయ్యారు. కమిషన్ తరఫున పనిచేస్తున్న ఓ సీనియర్ న్యాయవాది జైలుకు వెళ్లారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో చెచెన్యా వేర్పాటువాదులే పేలుళ్లకు కారణమని దర్యాప్తు కమిషన్ తేల్చింది. పేలుళ్లకు పుతినే కారణమని వెల్లడించిన కేజీబీ మాజీ ఏజెంట్ లిట్వినెంకో బ్రిటన్ పారిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన రష్యా ఏజెంట్ల చేతుల్లో హతమయ్యారు.

విమాన ప్రమాదానికి సంభంధించి పుతిన్‌పై వస్తున్న తాజా ఆరోపణల్లోని నిజానిజాలను పక్కన పెడితే, ఆరోపణలకు సంబంధించిన వార్తా కథనాలు మాత్రం బ్రిటన్ మీడియాలో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి.

No comments:

Post a Comment