Monday 27 April 2015

దమ్ముంటే ఎన్నికలకు రా!: కేసీఆర్‌కు చంద్రబాబు సవాల్‌

 దమ్ముంటే ఎన్నికలకు రా!: కేసీఆర్‌కు చంద్రబాబు సవాల్‌

  • ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు.. ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుంది
  • ఉప ఎన్నికలకు మేం సిద్ధం.. మీరు సిద్ధమో కాదో తేల్చుకోండి
  • నా దగ్గర పని చేశారు.. నీకిక్కడేం పని అంటున్నారు
  • కేసీఆర్‌ మాటలతో మనసుకు బాధ 
  • 2019 ఎన్నికల్లో గెలిచేది మనమే: బాబు
  • రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రకాశ్‌ గౌడ్‌ ప్రమాణ స్వీకారం
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): ‘‘సంతలో పశువుల మాదిరిగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అదే బలమని భ్రమపడుతున్నారు. చేతనైతే.. ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు రా! ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుంది. మేం సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధమో కాదో తేల్చుకోండి’’ అని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌కు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సవాల్‌ విసిరారు.

రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడుగా రాజేంద్ర నగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ సోమవారం రాత్రి దాదాపు తొమ్మిది గంటలకు ఎన్టీఆర్‌ భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు, టీఆర్‌ఎస్‌ 14వ వార్షికోత్సవ బహిరంగ సభ సందర్భంగా కేసీఆర్‌ చేసిన విమర్శలకు ఈ సందర్భంగా ఆయన జవాబిచ్చారు. దమ్ముంటే ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్‌ విసిరారు. ‘‘ఇదే ఎన్టీఆర్‌ భవన్లో కూర్చుని కార్యకర్తలకు తెలుగుదేశం పాఠాలు చెప్పిన కొంతమంది వ్యక్తులు.. ఇప్పుడు బయటకు వెళ్లి తిట్ల పురాణం విప్పుతున్నారు. ఏదేదో మాట్లాడుతున్నారు. నా దగ్గర పని చేసి, ట్రస్ట్‌ భవన్లో పాఠాలు చెప్పిన వ్యక్తి ఇప్పుడు నీకిక్కడేం పని అని అంటున్నారు. వారి మాటలు మనసుకు బాధ కలిగిస్తున్నాయి.

ప్రజలతో కార్యకర్తలతో ఉన్న సంబంధాన్ని ఎవరూ విడదీయలేరు’’ అని చంద్రబాబు ఉద్విగ్నంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి మాటలు బాధ కలిగేలా ఉన్నాయని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే తాను ఇక్కడ ఉన్నానని, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని తీరతామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణను అభివృద్ధి చేసింది టీడీపీయేనని, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల అభివృద్ధి అంతా టీడీపీ పుణ్యమేనని, ఈ విషయం ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. గుజరాత్‌ తర్వాత తెలంగాణే మిగులు బడ్జెట్‌ రాష్ట్రమని 14వ ఆర్థిక సంఘం ప్రకటించిందని, దీనికి కారణం టీడీపీ ప్రభుత్వమేని చెప్పారు. తాము రక్షించిన సంపదను వైఎస్‌ హయాంలో తెగనమ్ముకుని రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు.

‘‘చేసింది చెబుదాం. ప్రజల్లోకి వెళదాం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధిద్దాం. టీడీపీకి పేద, బడుగు, బలహీన వర్గాలు, ప్రజల మద్దతు ఉంది. వారి మద్దతు ఉన్నంత వరకూ భయపడాల్సిన అవసరం లేదు’’ అని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడి, వారి మద్దతు కూడగట్టుకుని బుల్లెట్‌లా దూసుకుపోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీడీపీ జెండాను రెపరెపలాడించి 2019 నాటికి అధికారాన్ని సాధించేవరకు ఉడుంపట్టు పట్టాలని సూచించారు. తొలుత ప్రకాశ్‌ గౌడ్‌తో టీ టీడీపీ ఎన్నికల కన్వీనర్‌ ఈ.పెద్దిరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి వారిని ఎన్నికల్లో గెలిపించుకుంటే తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని టీ టీడీపీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సవాల్‌ చేశారు.

No comments:

Post a Comment