Monday 27 April 2015

వాన కథలు వాసనలు ....కాళిదాసు పురుషోత్తం

వాన కథలు వాసనలు ....కాళిదాసు పురుషోత్తం (27-Apr-2015)

మూడు కథలు. ఈ కథల మధ్య ఐదు పదుల సంవత్సరాల కాలం కరిగి ప్రవహించి ఘనీభవించింది. గురజాడ ‘సంస్కర్త హృదయం’ కథకూ, సోమర్‌సెట్‌ మామ్‌ ‘రెయిన్‌’ కథకూ పోలికలున్నాయని నార్లవారు అన్నారు. ఆ స్ఫూర్తితోనే పరిశోధించాను. గురజాడ, మామ్‌, పాలగుమ్మి పద్మరాజు కథల మధ్య కొన్ని సాదృశ్యాలు, సమాన ధర్మాలు నాకు స్ఫురించాయి.
క సముద్ర ప్రయాణంలో (1916) ‘రెయిన్‌’ కథకు వస్తువు స్ఫురించిందని, 1920లో దానికి అక్షరరూపం ఇచ్చినట్లు మామ్‌ గ్రంథస్థం చేశారు. ‘రెయిన్‌’ కథ సంగ్రహంగా పేర్కొని, దానికి ‘సంస్కర్త హృదయం’, ‘గాలివాన’లతో ఉన్న సామ్యాన్ని వివరిస్తాను.
అమెరికన్‌, బ్రిటిష్‌ ప్రయాణీకుల చిన్న బృందం శాన్‌ఫ్రాన్సిస్కోలో నౌక ఎక్కు తారు. మధ్య వయస్సు దాటిన మత ప్రచారకులు డేవిడ్‌ సన్‌ దంపతులు, యవ్వనంలో ఉన్న డాక్టర్‌ మెక్‌ఫిల్‌ దంపతులు సహ ప్రయాణీకులు. అదే నౌకలో చాలా ఆడంబరంగా, గాడీగా, బట్టలు ధరించి, ఎబ్బెట్టుగా ముస్తాబు చేసుకొన్న మిస్‌ శాడిథామ్‌ప్సన్‌ అనే యువతి కూడా ప్రయాణిస్తుంది. ఆమె స్వేచ్ఛగా సహ ప్రయాణీకులతో మాట్లాడుతూ, విరగబడి నవ్వుతూ, ఆడుతూ పాడు తూ కులాసాగా ఉంటుంది. ఆ అమ్మాయి మీద డేవిడ్‌సన్‌ దంపతులకు సదభిప్రాయం లేదు. ఆమె వేశ్య అయి ఉంటుందని వాళ్లు తీర్మానించుకుంటారు.
ఒక నావికుడికి అమ్మవారు సోకడంతో, నౌక నిరవధికం గా పోగోపోగో అనే చిన్న ఓడరేవులో లంగరు వేయవలసి వస్తుంది. పై అధికారుల ఆజ్ఞ అయ్యేవరకు నౌక అక్కడే ఉండే ఏర్పాటు. పోగో పోగో చిన్న టౌన్‌. హార్బరు సమీపంలోనే స్థానిక వ్యాపారి హార్న్‌ ఇంటి మేడ పైగదుల్లో డేవిడ్‌ సన్‌ దంపతులు, డాక్టర్‌ మెక్‌ఫిల్‌ దంపతులు ఉంటారు. విడవకుండా కురుస్తున్న వర్షం రేకుల కప్పుమీద పడి చేసే చప్పుడు, ఆ పరిస్థితుల్లో అక్కడ ఎంతకాలం ఉండిపోవాలో అనే దిగులు ప్రయాణీకులను అసహనం పాలు చేస్తాయి. మిస్‌ శాడిథామ్‌ప్సన్‌ అదే ఇంటిలో కింది భాగంలో, మెట్ల వద్ద గదిలో దిగుతుంది. ఆమె అక్కడ ఉండడాన్ని డేవిడ్‌సన్‌ దంపతులు బొత్తిగా సహించరు. మిస్‌ శాడిథామ్‌ప్సన్‌ గ్రామఫోన్‌లో పాటలు పెట్టి, నావికులతో స్థానిక యువకులతో కలిసి తాగుతూ, పాడుతూ ఆడుతూ మహాసర్దాగా ఉంటుంది.
ఆదివారం వస్తుంది. వాన సెలవివ్వదు. మిస్‌థామ్‌ప్సన్‌ గదిలో షరా మామూలే. ఆటలూ, పాటలూ, కేరింతలూ... ఏవీ ఆగవు. డేవిడ్‌సన్‌ దంపతుల సహనం నశిస్తుంది. ఆమెలాంటి వేశ్య ఆ టౌన్‌లో ఉంటే ఆ సమాజానికే ప్రమాదమని వాళ్లు తీర్మానించుకుంటారు. మత ప్రచారకులంటే అధికారులకూ భయమే. డేవిడ్‌సన్‌ పోగోపోగో టౌన్‌ గవర్నరును కలిసి, మిస్‌ థామ్‌ప్సన్‌ తిరుగు ఓడలో శాన్‌ఫ్రాన్సిస్‌కో వెళ్లిపోయేటట్టు ఆర్డరు వెయ్యమంటాడు. అయిష్టంగానే ఆయన ఓడ రాగానే అందులో వెనక్కు వెళ్లాలని ఆర్డరు జారీ చేస్తాడు.
మిస్‌థామ్‌ప్సన్‌కు ఆ పిడుగులాంటి వార్త అందుతుంది. ఆమె డాక్టర్‌ మెక్‌ఫిల్‌ దంపతులను కలిసి, తనకు ఏదో ద్వీపంలో కేషియర్‌ ఉద్యోగం వచ్చిందని, గవర్నరు ఆర్డరు రద్దు చేయించమని వేడుకొంటుంది. కానీ, డాక్టర్‌ మెక్‌ఫిల్‌ అభ్యర్థనను గవర్నరు మన్నించడు. ‘అయితే ఇక నాకు సాయపడగలిగిన వ్యక్తి డేవిడ్‌సన్‌ గారే!’ అంటుంది థామ్‌ప్సన్‌ .
చివరి ప్రయత్నంగా మిస్‌ థామ్‌ప్సన్‌ డేవిడ్‌సన్‌ను కాళ్లావేళ్లాపడి బ్రతిమాలుతుంది. తనకు మూడేళ్ళ జైలుశిక్ష పడిందని, వెనక్కి వెళ్తే జైలు తప్పదని అసలు విషయం చెప్పి కరుణించమంటుంది. వెనక్కి వెళ్లి, జైలు శిక్ష అనుభవించి, పశ్చాత్తాపంతో పవిత్రురాలివి కమ్మని డేవిడ్‌సన్‌ హితబోధ చేస్తాడు. ఆమె తన ఆడంబర వేషం విసర్జించి మౌనంగా గదికి పరిమితమవుతుంది. డేవిడ్‌సన్‌ ప్రతి రాత్రి భోజ నం ముగించి మిస్‌ థామ్‌ప్సన్‌ గదికి వెళ్లి ప్రార్థన చెయ్యడం మొదలుపెడతాడు. ఆమె అతని బోధనల ప్రకారం మెలుగుతూ ఉపదేశాలు వింటూ, అతనితో కలిసి ప్రార్థన చేస్తూ ఉంటుంది. ‘మావారు ఆపన్నులను రక్షించడం కోసం నిద్రాహారాలన్నీ త్యజిస్తారు. ప్రకృతి విపత్తులను, విలయాలను దేన్నీ లెక్కపెట్టరు. ఆయన తత్వమే అంత’ అని శ్రీమతి డేవిడ్‌సన్‌ తన భర్త గొప్పతనాన్ని డాక్టర్‌ మెక్‌ఫిల్‌ దంపతులకు వివరిస్తుంది. రోజులు గడిచిపోతుంటాయి. డేవిడ్‌సన్‌ మిస్‌థామ్‌ప్సన్‌ గదికి వెళ్లి స్తుతులు, ప్రార్థనలూ చదువుతూనే ఉంటాడు. విడుపు లేకుండా వర్షం పడుతూనే ఉంటుంది. ఒకరోజు పొద్దున్నే డాక్టర్‌ మెక్‌ఫిల్‌ గది తలుపును ఎవరో సన్నగా తడ్తారు. డాక్టర్‌ తలుపు తీస్తాడు. నిశ్శబ్దంగా తన వెంట రమ్మంటూ ఆ ఇంటి యజమాని హార్న్‌ సైగ చేస్తాడు. రెండు వారాలుగా తెరపి లేకుండా కురిసిన వాన వెలసి, ప్రకృతి ప్రశాంతంగా ఉంది. సముద్రతీరంలో, ఇసకలో మత ప్రచారకుడు డేవిడ్‌సన్‌ పీకకోసుకొని పడి ఉంటాడు. రక్తసిక్తమైన కత్తి అతని పిడికిట్లో అలాగే ఉంటుంది. డాక్టర్‌ మెక్‌ఫిల్‌ అవసరమైన ఏర్పాట్లన్నీ చేసి తన గదికి వెళ్తూ మెట్ల దగ్గర ఆగు తాడు. మిస్‌థామ్‌ప్సన్‌ గ్రామ్‌ఫోన్‌లో అశ్లీలమైన పాటల రికార్డుపెట్టి పూర్వంలాగే అలంకరణతో, ఆడుతూ, పాడుతూ ఉంటుంది. ‘ఏమిటిదంతా’ అంటాడు డాక్టర్‌ మెక్‌ఫిల్‌. ఆవిడ ముఖంలో వ్యక్తమైన పరిహాసాన్ని, తిరస్కార భావాన్ని, ఎవ్వరూ వర్ణించలేరు. "You men! you filthy dirty pigs!you are all the same , all of you pigs! Pigs"  అంటుందామె. Dr macphail gasped . He understood.
డేవిడ్‌సన్‌ దంపతులు వయసు మళ్లుతున్నవాళ్లని, ఆ దంపతుల మధ్య శృంగార భావాలు, కామవాంఛల వంటివేవీ లేవని కథకుడు మామ్‌ మొదట్లోనే అంటాడు. తమ సిద్ధాంతం, ఆచరణ తిరుగులేనిదనే విశ్వాసంలో కూరుకొని పోయినవాళ్లని కూడా మామ్‌ వాళ్ల గురించి వర్ణిస్తాడు. నిజానికి మిస్‌ థామ్‌ప్సన్‌ చాలా నిష్టగా, ఏకాగ్రంగా, పాత అలవాట్లన్నీ విడిచిపెట్టి, చివరకు అన్నపానాలు, స్నానం కూడా విడిచిపెట్టి ప్రార్థనలతో కాలం గడుపుతుంది. అయితే ఏకాంతం, ఆమె స్పర్శ - డేవిడ్‌సన్‌కు తపోభంగం కలిగిస్తుంది.
బహుశా గురజాడ ‘సంస్కర్త హృదయం’ (ఇంగ్లీషు మూలం-stooping to raise) చదివిన వాళ్లకు ఈ కథతో ఉన్న సారూప్యాలు బోధపడి ఉంటాయి. పుస్తకజ్ఞానం తప్ప జీవితానుభవం, ఆచరణ కొరవడిన ప్రొఫెసరు రంగనాథయ్యరు విద్యార్థి చందర్‌ పెట్టిన పరీక్షలో ఫెయిలవుతాడు. ‘బోగం’ యువతి సరళ రూపలావణ్యాలకు, సంగీతవిద్యకు పరవశుడై, ఒక బలహీన క్షణంలో మనసు మీద అదుపుతప్పి, ఆమెను చుంబించి అనుచితంగా ప్రవర్తిస్తాడు. బయట వరండాలోంచి వికటాట్టహాసంతో పాటు ‘‘....సంస్కరణంటే యిదే! ఒకరిని లేవనెత్తబోయి మనమే కిందపడ్డం’’ అనే మాటలు వినిపిస్తాయి. గురజాడ కథలో విద్యార్థి చందర్‌ అన్న ఈ మాటల వంటి మాటలే మిస్‌థామ్‌ప్సన్‌ నోటి నుంచి వినిపిస్తాయి. ఆమె వ్యక్తిత్వానికి సరిపోయే మాటలు. రంగనాథయ్యరు నైతికంగా చచ్చి, అవమానభారంతో రాత్రికి రాత్రే ఊరూ, ఉద్యోగం విడిచిపెట్టి ఎటో వెళ్లిపోతాడు. ‘రెయిన్‌’కథలో మతప్రచారకుడు డేవిడ్‌సన్‌ చావుకన్నా, రంగనాథయ్యర్‌ స్థితి పాఠకుల్లో గొప్ప సానుభూతిని కలిగిస్తుంది. గురజాడ నెథానియల్‌ హేథార్న్‌ కథ ‘రెపాచినీస్‌ డాటర్‌’ సంవిధానాన్నే అనుకరించి ‘సంస్కర్త హృదయం’ రాశారు. చివరి వాక్యాలు హేథార్న్‌ కథలోనూ ఇలాగే ఉంటాయి.
‘సంస్కర్త హృదయం’, ‘రెయిన్‌’ కథలకూ పాలగుమ్మి పద్మరాజు ‘గాలివాన’ కథకూ కూడా కొన్ని పోలికలున్నాయి. ‘గాలివాన’ అంతర్జాతీయ కథల పోటీలో (1951) ద్వితీయ ఉత్తమకథ పురస్కారాన్ని పొందింది. ‘గాలివాన’లో తన పెంకుటిల్లు కూలిన అనుభవం కథకు నేపథ్యంగా వాడుకొన్నట్లు పద్మరాజు అన్నారు. ‘రెయిన్‌’ కథ రెండు వారాల్లో జరుగుతుంది. ‘గాలివాన’ 12.15 గంటల వ్యవధిలో జరుగుతుంది. ‘గాలివాన’ కథలో ప్రధాన పాత్ర ‘రావుగారి’కి యాభైయ్యేళ్లుంటాయి. నీతినియమాలను తు.చ. తప్పకుండా పాటిస్తూ క్రమశిక్షణతో, నిష్టగా జీవించడం రావుగారు ఎంచుకొన్న జీవిత విధానం. తన పిల్లలు తలదువ్వుకొనే పద్ధతి, అలం కరణ, నోములు ప్రతిదీ ఇంట్లో రావుగారి అభిమతం మేరకే నిశ్చయమయిపోతాయి.
ఏదో వూర్లో ఆస్తిక సమాజంలో ఉపన్యసించడానికి రావుగారు రెండవతరగతి పెట్టెలో ప్రయాణం చేస్తారు. (ఇప్పటి సెంకడ్‌ క్లాస్‌ కాదు, పరుపుల పెట్టె) సన్నగా వానజల్లు మొదలవుతుంది. 30 ఏళ్ల బిచ్చగత్తె ఆ పెట్టెలో యాచిస్తూ ఉంటుంది. రావుగారు ఆమెను చీదరించుకొంటారు. వర్షం పెద్దదై గాలివానగా మారుతుంది. రాత్రి నిర్జనంగా ఉన్న స్టేషన్‌లో రావుగారు దిగుతారు. గాలివానలో ఊళ్లోకి వెళ్లే సౌకర్యం లేక, ఆయన ఒక్కడే వెయిటింగ్‌ రూంలో గడపవలసి వస్తుంది. ఆ గాలివానలో ఆయనకు ఆ బిచ్చగత్తె ఒక్కర్తే తోడు. ‘నిత్యమూ ధర్మా ధర్మ చింతతో బాధపడే అంతరాత్మగానీ, నాగరికులకు సహజమయిన సంకీర్ణ మనస్తత్వంగాని ఆమెకు లేవు. తను ఎన్నడూ ఎరగని మగవాడిక్కూడా ఆమె శరీరాన్ని అర్పించి, తేలికైన మనసుతో సుఖించగలదు’ అని కథకులు ఆమె అంతరంగాన్ని వర్ణించారు. తుపాను బీభత్సంలో రావుగారి పిరికిమనసు ఆవిడ స్పర్శనూ, సాన్నిహిత్యాన్ని అంగీకరించవలసి వస్తుంది. ‘ఆమె మరీ దగ్గరగా జరిగి ఆయన వొళ్లో వాలింది. ఆమె రొమ్ముల బరువు- ఆమె (రావుగారి) మోకాళ్లమీద వాల్చింది. మోకాళ్లు మరికాస్త దగ్గరగా ముడుచుకొని దీర్ఘంగా అవమానకరమయిన ఆలోచనాపరంపరలో (రావుగారు) మునిగిపోయారు. ఆమె అలా మాట్లాడుతూనే ఉంది.’
రావుగారి ఒళ్లో వాలిన తర్వాత ఆమెలోని శృంగార భావనలు నిదురించాయి. ఇంటిదగ్గర రావుగారి పిల్లలు, ఊళ్లో దిక్కూమొక్కూలేని తన పిల్లల్ని మాత్రమే గుర్తుకు తెచ్చుకుంది. కాళ్లు తిమ్మిరెక్కితే, ‘పడుకొని ఉన్న ఆ మూర్తిని కదల్చకుండా మెల్లిగా ఆయన కాళ్లు కదుపుకొన్నారు. ఆయన మనస్సు మేలుకొంది. (టార్చి) లైటు వెలిగించి ఆమె ముఖం వంక చూశారు. నిద్రలో ఆ ముఖం అమాయకంగా, నిశ్చలంగా ఉంది. స్వచ్ఛమైన, నిసగర్గమయిన ఒక శోభ. ఆమె ముఖంలో దివ్యత్వం స్ఫురింపజేసింది.’
గాలివాన ఆగింది. తెల్లవారి రావుగారు ఆమె కోసం వెదికారు. ఆమె చేతిలో రావుగారి పర్సు, టికెట్‌ కౌంటర్‌లోని డబ్బు ఉన్నాయి. ఆమెపైన దూలంపడి మరణించి ఉంది. రావుగారు ఆమె చేతిలోని డబ్బు టికెట్‌ కౌంటర్‌ సొరుగులో ఉంచారు. తన పర్సు మాత్రం ఆమె చేతుల్లో అలాగే ఉంచేశారు. ‘ఆమె ఆఖరుతత్వం... ఆయనలో లోతుగా మాటుపడియున్న మానవత్వాన్ని ఈ జీవి వికసింపచేసింది. ఆయన భార్యగాని, ఆయన పిల్లలలో ఎవరుగాని ఆమె వచ్చినంత దగ్గరగా రాలేదు.’ అని పద్మరాజు వాచ్యంగానే చెప్పి కథ ముగించారు. కథ చదివి ముగించినపుడు పాషాణ సదృశుడైన ఒక కర్కశుడిలో పదేళ్ల బాలిక మానవత్వాన్ని మేల్కొల్పిన ఫెలిని కళాఖండం ‘లాస్ర్టాడా’ నా మనసులో తళుక్కున మెరిసింది.
గాలివాన చదివిన అనుభూతి తీవ్రతను రెయిన్‌ కథ పాఠకులలో కలిగించదు. గాలివాన కథ పాఠకుల మనసుల్లో ఒక ఎరుకను, వికాసాన్ని కలిగిస్తుంది. ఇంతకుమించిన సాహిత్య ప్రయోజనం మరేం కావాలి? మిస్‌థామ్‌ప్సన్‌, డేవిడ్‌సన్‌ పాత్రలే బిచ్చగత్తె, రావుగారుగా నాకన్పిస్తారు. వర్షం, గాలివాన రెండు కథలకూ నేపథ్యం. శిల్పందృష్టిలోనూ గాలివాన సార్వకాలికమైన విలువలను ప్రతిపాదించిన గొప్ప కథ.
పద్మరాజుగారి కథ చదివినపుడు సంస్కర్త హృదయం, రెయిన్‌ గుర్తు రావటం ‘అపచారం కాదు కదా!’ గురజాడ కథ అనువాదం 1951 ఆగస్టు భారతిలో అచ్చ యింది. ఈ పోలికలూ, సాదృశ్యాలు యాదృచ్ఛికాలేనా? గురజాడ ఒరిజినల్‌ స్టోరీ ఆయన జీవిత కాలంలోనే ఏ విదేశీ పత్రికలోనైనా అచ్చయిందా? ప్రస్తుతానికి సమాధానాల్లేవు.
కాళిదాసు పురుషోత్తం
09247564044

No comments:

Post a Comment