Tuesday 21 April 2015

పీఓకే మీదుగా చైనా-పాక్ బంధం

పీఓకే మీదుగా చైనా-పాక్ బంధం

Sakshi | Updated: April 21, 2015 05:17 (IST)
పీఓకే మీదుగా చైనా-పాక్ బంధం
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌తో పొరుగు దేశం చైనా మరింత దృఢ బంధాన్ని ఏర్పరచుకుంది. భారత్ వ్యక్తం చేస్తున్న ఆందోళనలను తోసిపుచ్చి మరీ పాక్‌తో కీలక ఒప్పందం చేసుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) మీదుగా చైనా -పాక్ మధ్య వ్యూహాత్మక ఆర్థిక కారిడార్ (సీపెక్) నిర్మాణానికి సమాయత్తమైంది. ఈ భారీ ప్రాజెక్టు కోసం రూ. 2.89 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది. సోమవారం రెండు రోజుల పాక్ పర్యటనకు వెళ్లిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తొలి రోజే ఈ ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నారు.మరో 50 ఒప్పందాలను ఇరు దేశాలు కుదుర్చుకున్నాయి. ఇందులో 30 సీపెక్‌కు అనుబంధంగా కుదుర్చుకున్నవే.

తొలిసారి పాక్ పర్యటనకు వచ్చిన జిన్‌పింగ్ దంపతులకు ఇస్లామాబాద్‌లో పాక్ అధ్యక్షుడు, ప్రధాని, ఆర్మీ చీఫ్ సహా కేబినెట్ అంతా ఘన స్వాగతం పలికింది. జిన్‌పింగ్‌తో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ విస్తృత చర్చలు జరిపారు. సీపెక్ సహా అనేక ఒప్పందాలపై ఇద్దరూ సంతకాలు చేశారు. రోడ్లు, నౌకాశ్రయాల వ్యవస్థ ద్వారా యూరప్, ఆసియా, ఆఫ్రికాలతో తన అనుసంధానాన్ని బలోపేతం చేసుకునేందుకు చైనా ప్రారంభించిన అత్యంత భారీ సిల్క్ రోడ్ ప్రాజెక్టులో భాగం సీపెక్.  ఇందులో భాగంగా చైనా పశ్చిమ ప్రాంతం నుంచి పీఓకే మీదుగా అరేబియా సముద్రం తీరంలోని గ్వడార్ పోర్టుకు ఆర్థిక కారిడార్ ఏర్పాటు కానుంది. ఇందులో రోడ్ నెట్‌వర్క్, రైల్వే లైన్లు, వ్యాపార జోన్లు, ఇంధనోత్పత్తి కేంద్రాలు, పైపులైన్ల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చైనా చేపడుతుంది.

పాక్, చైనాల మధ్య ఇది కీలక అనుసంధానం కానుంది. పశ్చిమాసియా నుంచి చైనాకు ఇంధన దిగుమతుల దూరం 12 వేల కి.మీ. తగ్గిపోతుంది. సీపెక్ వల్ల పాక్ ప్రాంతీయ వాణిజ్య కేంద్రంగా మారుతుందని, ఆర్థికంగా బలపడుతుందని షరీఫ్ పేర్కొన్నారు. పాక్‌లో తాబిబాన్ ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్నప్పటికీ సీపెక్ విషయంలో ముందుకే వెళ్లాలని చైనా నిర్ణయించుకుంది. 3 వేల కిలోమీటర్ల పొడవున ఈ కారిడార్ పూర్తయితే ఇరు దేశాల మధ్య ఇదే అతిపెద్ద రవాణా మార్గం కానుంది.

No comments:

Post a Comment