Wednesday 29 April 2015

చైనా-పాక్ మైత్రి

చైనా-పాక్ మైత్రి

Sakshi | Updated: April 23, 2015 00:29 (IST)
రెండేళ్లక్రితం అధికార పగ్గాలు చేపట్టినప్పటినుంచీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అలుపెరగని బాటసారిలా ప్రపంచం చుట్టబెడుతున్నారు. ఆయన తదుపరి మజిలీ ఎటువైపా అని అందరూ తర్కించుకునేంతగా ఈ పర్యటనలు సాగుతున్నాయి. పశ్చిమాసియా మినహా ప్రపంచంలో జిన్‌పింగ్ సందర్శించని ప్రాంతం లేదు. ఈజిప్టు, సౌదీ అరేబియాలకు ఈ నెలలో వెళ్లి ఆ లోటును కూడా భర్తీ చేసుకుందామని అనుకున్నా యెమెన్ సంక్షోభం బద్దలుకావడం... అందులో సౌదీ, ఈజిప్టులు తలమునకలై ఉండటం కారణంగా అది సాధ్యపడలేదు. ఈ సంక్షోభంలో చైనా మిత్ర దేశాలు ఇరాన్, సౌదీలు రెండూ చెరోపక్కా ఉండి కత్తులు నూరుకుంటున్నాయి. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు జిన్‌పింగ్ సౌదీ గడ్డపై అడుగుపెడితే... ఆ దేశం యెమెన్‌పై సాగిస్తున్న దాడులకు చైనా మద్దతిస్తున్నదన్న అభిప్రాయం ఇరాన్‌కు కలిగే ప్రమాదం ఉంటుంది. అది చైనా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది.

అందుకే ఆయన ఈసారి పాకిస్థాన్, ఇండొనేసియా పర్యటనలతో సరిపెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. నిరుడు సెప్టెంబర్‌లో ఆయన మన దేశంతోపాటు పాకిస్థాన్ కూడా వెళ్లాల్సి ఉన్నా చివరి నిమిషంలో పాక్ పర్యటన రద్దయింది. ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తున్న తీరుపై అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలతో అడపా దడపా అక్షింతలు వేయించుకుంటూ ఏకాకినయ్యానన్న భావనతో కుంగిపోయి ఉన్న పాక్... జిన్‌పింగ్ పర్యటన రద్దుకావడంతో అప్పట్లో కలవరానికి లోనైన మాట వాస్తవం. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో జరపబోయే చైనా పర్యటనకు ముందే జిన్‌పింగ్ తమ దేశం రావాలని పాక్ గట్టిగా కోరిందని దౌత్య నిపుణులు చెబుతున్నారు. యెమెన్ సంక్షోభంలో తటస్థంగా ఉండాలని ఈ నెల 10న పాక్ పార్లమెంటు తీర్మానించడం జిన్‌పింగ్ పర్యటనకున్న ఆఖరి అవరోధాన్ని తొలగించింది.
  పాకిస్థాన్‌తో చెలిమికి తామిచ్చే ప్రాధాన్యత గురించి జిన్‌పింగే స్వయంగా పాకిస్థాన్ దినపత్రిక ‘డైలీ టైమ్స్’కు రాసిన ప్రత్యేక వ్యాసంలో తెలియజెప్పారు. పాకిస్థాన్‌కు వస్తే సొంత తమ్ముడి ఇంటికి వచ్చినట్టుంటుందని ఆయన అభివర్ణించారు. అతి త్వరలో పాక్ ‘ఏసియన్ టైగర్’గా ఆవిర్భవించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. పాకిస్థాన్ ఆ స్థాయికి ఎదగడం మాట అటుంచి, తాను ఆసియాకు తిరుగులేని అధినేతనని తెలియజెప్పడం జిన్‌పింగ్ ప్రస్తుత పాక్, ఇండొనేసియా పర్యటనల ఆంతర్యమని వేరే చెప్పనవసరం లేదు. భారత్‌పై చైనా, పాకిస్థాన్‌లకున్న అసంతృప్తి ఆ రెండు దేశాలనూ తొలినాళ్లలో ఏకం చేసినా...రాను రాను అది బహుముఖంగా విస్తరించింది. ఆర్థిక, సైనిక, అణు రంగాల్లో పాకిస్థాన్‌కు చైనా తోడ్పాటునందించేంతగా పెరిగింది.

ఇరు దేశాలూ 2006లో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పర్యవసానంగా రెండు దేశాలమధ్యా వాణిజ్యం చకచకా విస్తరించింది. ఈ దశాబ్దకాలంలో రెండు దేశాలమధ్యా వాణిజ్యం ఎనిమిదింతలు పెరిగితే... ఇతర దేశాలతో పాక్ వాణిజ్యం మూడింతలు మాత్రమే విస్తరించింది. జిన్‌పింగ్ ప్రస్తుత పర్యటన సందర్భంగా 2,800 కోట్ల డాలర్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందాలు ఖరారయ్యాయి. మరో 1,800 కోట్ల డాలర్లమేర చైనా పెట్టుబడులు ఆ దేశానికి సమకూరతాయని చెబుతున్నారు. మధ్య ఆసియాను చుట్టబెడుతూ తూర్పు, పడమరలను కలిపే విస్తృతమైన ‘న్యూ సిల్క్ రోడ్ ప్రణాళిక’ను సాకారం చేసుకోవడంలో భాగంగానే ఈ ఒప్పందాలన్నీ కుదిరాయి. చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ పాత్ర అందులో కీలకం. పాక్‌లోని గ్వదర్ రేవు పట్టణం నుంచి చైనాలోని క్జిన్‌జియాంగ్ వరకూ ఉండే ఈ కారిడార్ కోసం రోడ్లు, రైల్వే లైన్లు, డ్యామ్‌లు, పైప్‌లైన్లు నెలకొల్పడం ఈ ఒప్పందాల్లోని ముఖ్యాంశం. ఇవన్నీ అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పూర్తయితే పాకిస్థాన్‌కు 8,400 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. అంతేకాదు... చైనా నావికాదళానికి చెందిన నౌకలు, జలాంతర్గాములు వినియోగించుకోవడం కోసం గ్వదర్ పోర్టును చైనాకు 40 ఏళ్ల లీజుకిచ్చేందుకు కూడా పాక్ సిద్ధపడుతోంది. బహుశా ఇందుకు కృతజ్ఞతగానే పాక్‌కు ఎనిమిది జలాంతర్గాములివ్వడానికి చైనా అంగీకరించింది. అంటే ఇరు దేశాల సంబంధాలూ వాటి ద్వైపాక్షిక వాణిజ్యానికి  మాత్రమే పరిమితమై లేవు. అవి ఈ ప్రాంతంలో చైనా సైనిక ప్రయోజనాలకు అనుగుణంగా కూడా విస్తరిస్తున్నాయని అర్థమవుతుంది. పర్యవసానంగా పాకిస్థాన్ ఈ ప్రాంతంలో మరింతగా రెచ్చిపోయే ప్రమాదం లేకపోలేదు.

ఇలా పరస్పర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఇరు దేశాల సంబంధాలకూ పాక్‌లో నెలకొని ఉన్న అస్థిర పరిస్థితులే ప్రధాన శత్రువు. చైనా పశ్చిమ సరిహద్దుల్లో సుస్థిరత నెలకొనడానికి పాక్ సహకారం ఎంతో ఉన్నదని, ఉగ్రవాదుల అణచివేతలో అది చురుగ్గా ఉంటున్నదని కొనియాడినా జిన్‌పింగ్‌కు వాస్తవమేమిటో తెలియదనుకోవడానికి లేదు. పాక్‌లో క్రమేపీ మత ఛాందసవాదం, ఉగ్రవాద ఘటనలు పెరగడం చైనా గమనించకపోలేదు. అందువల్లే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదిరినా వాటి అమలు దగ్గరకొచ్చేసరికి ఉగ్రవాదుల బెడద ఉంటుందని ఆ దేశం భావిస్తోంది. అందువల్లే ప్రాజెక్టు పనులు జరిగే ప్రాంతం పొడవునా 12,000 మంది సైనికులను మోహరిస్తామని... చైనా ఇంజనీర్లకూ, నిపుణులకూ, ప్రాజెక్టు డెరైక్టర్లకూ భద్రత కల్పిస్తామని పాక్ ప్రత్యేకంగా హామీ ఇచ్చింది. చైనా విస్తృత పథకంలో భౌగోళికంగా పాక్‌ది కీలకపాత్ర కనుక జిన్‌పింగ్ ఆ దేశంపై వరాల వర్షం కురిపించారు. అయితే, మన భద్రతపై దీని ప్రభావం ఏమేరకు ఉంటుందో మన దేశం సమీక్షించవలసి ఉంటుంది. అలాగే, వచ్చే నెలలో నరేంద్ర మోదీ చైనాలో పర్యటించే సమయానికి జిన్‌పింగ్ పాక్ సందర్శన ఫలితాలపై ఒక అంచనాకొచ్చి అందుకనుగుణమైన వ్యూహాన్ని రచించుకోవాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment