Tuesday 14 April 2015

విజయవాడ: మూడు నెలలు హల్ చల్.. ఇప్పుడేమో సైలెన్స్..!

విజయవాడ: మూడు నెలలు హల్ చల్.. ఇప్పుడేమో సైలెన్స్..!

  • మొదటి మూడు నెలలు హల్‌చల్‌ చేసిన నగర కమిషనర్‌
  • ఇప్పుడేమో అంటీఅంటనట్టు వ్యవహారం.. గత కమిషనర్ల పద్ధతే!
  • విచారణలకే పరిమితం.. చర్యలు శూన్యం
  • అక్రమాలతో కార్పొరేషన్‌ ప్రతిష్ఠను దిగజార్చుతున్న ఉద్యోగులు
ఆంధ్రజ్యోతి, విజయవాడ: నగర కమిషనర్‌గా సమర్థమైన అధికారి జి. వీరపాండియన్‌ బాధ్యతలు స్వీకరించటంతో కార్పొరేషన్‌ స్థితిగతుల్లో మార్పు వస్తుందని అందరూ భావించారు. అయితే కళ్లెదురుగా అవినీతి పనులు జరుగుతున్నా, ఉద్యోగుల పనితీరుపై ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తుతోన్న ఆయన కనీసం పట్టించుకున్నట్ల కూడా కనిపించటం లేదు. కేవలం ఎంక్వైరీలతో సరిపెట్టేసి, చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
టౌన్‌ప్లానింగ్‌ పై దృష్టేది?
కార్పొరేషన్‌కు అత్యంత ఆదాయం తీసుకొచ్చేది, అత్యంత అవినీతి చోటుచేసుకునేది టౌన్‌ప్లానింగ్‌ విభాగం. గత కొన్ని సంవత్సరాలుగా ఈ టౌన్‌ప్లానింగ్‌లో జరుగుతున్న అవినీతి, అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. సిటీప్లానర్‌, అసిస్టెంట్‌ సిటీప్లానర్‌, బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్స్‌, చైన్‌మన్స్‌ ఇలా ప్రతి ఒక్కరూ, తమ, తమ స్థాయిలో డబ్బుల్ని నొక్కేసే వారే. నగరంలో దాదాపు 16 వేల అక్రమకట్టడాలు ఉన్నాయంటే.. అది వీరందరి ప్రోత్సాహామే. వీటన్నింటిపై కమిష నర్‌ జి.వీరపాండియన్‌కు అనేక ఫిర్యాదులు వెళ్లాయి. కొన్ని అక్రమకట్టడాల్ని ఆయన స్వయంగా పరిశీలించారు కూడా. అయినా బాధ్యులైనవారిపై మాత్రం ఏ చర్యలూ తీసుకోలేదు.
 
ఎస్టేట్‌వైపు చూడనేలేదు..
కార్పొరేషన్‌ ఆస్తుల్ని అద్దెలకు, లీజులకు ఇచ్చి ఆదాయాన్ని సమకూర్చే విభాగం ఎస్టేట్‌. దీంట్లో కనపడని అవినీతి జరుగుతోంది. అక్కడి అధికారులు ఎస్టేట్‌ ఆస్తుల్ని పంచుకుని, అయిన కాడికి దోచుకుతింటున్నారు. వీరికితోడు బిల్‌ కలెక్టర్స్‌, గుమస్తాలు కూడా కార్పొరేషన్‌ ఖజానాకు చేరాల్సిన సొమ్మును సొంత ఖాతాల్లోకి మళ్లించు కుంటున్నారు.
 
ఈ విభాగంలో జరిగే అవినీతిపై.. ఏ లీజు దారుడ్ని అడిగినా చెబుతారు. ఇంత పెద్ద విభాగానికి ఎస్టేట్‌ ఆఫీసర్‌ లేరు. ఎవరేం చేస్తున్నారో.. ఎంత తింటున్నారో, ఎలా పనిచేస్తున్నారో లేదో పట్టించుకునేవారు లేరు. కార్పొరేషన్‌కు ఆదాయాన్ని సమకూర్చే ఈ విభాగంవైపు కమిషనర్‌ కన్నెత్తి చూసిన దాఖాలాలు లేవు. వీటితోపాటు ఇంజినీరింగ్‌, వెహికల్‌ డిపో, హార్టీకల్చర్‌.. దాదాపు అన్ని విభాగాలు అవినీతిలో మునిగితేలుతున్నాయి.
 
ఎంక్వైరీలేదు.. చర్యలు శూన్యం
కమిషనర్‌ జి.వీరపాండియన్‌ అధికార, సిబ్బందిపై ఆరోపణలు వస్తే చాలా ఆలస్యంగా స్పందిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అందరితో చర్చించిన అనంతరం ఎంక్వైరీలు వేస్తున్నారు. ఈ ఎంక్వైరీ కమిటీలు కూడా ఏ శాఖఉద్యోగి అవినీతికి పాల్పడ్డాడో.. ఆ శాఖ ఉద్యోగులతోనే వేస్తున్నారు. దీని వల్ల ఎటువంటి ఫలితమూ లేదు. సదరు ఉద్యోగిపై వస్తున్న ఆరోపణలన్నీ రిపోర్టులో ఫేక్‌ అని వస్తున్నాయి. ఆ ఉద్యోగులు తోటి ఉద్యోగిపై వ్యతిరేకంగా ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యతిరేక రిపోర్టు రాయరు. ఇలా అవినీతికి పాల్పడుతోన్న ఉద్యోగ, సిబ్బంది దర్జాగా తప్పించుకుంటున్నారు.
 
ఒక వేళ కమిషనర్‌ ఎవరిపైనైన తక్షణ చర్యలు తీసుకోవాలంటే.. ఉద్యోగ జేఏసీ, రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడ్లు వస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయన ఎంక్వైరీలు మాత్రమే చేయిస్తున్నారు. దీంతో అవినీతి, అక్రమాలకు ఒడిగడుతున్న సిబ్బందిపై మాత్రం చర్యలు తీసుకోలేకపోతున్నారు. మెతకవైఖరి ప్రదర్శించినంత కాలం మహామేథావులైన కార్పొరేషన్‌ అధికారులు.. సిబ్బంది ఆటలాడుకుంటూనే ఉంటారన్నది జగమెరిగిన సత్యం.

No comments:

Post a Comment