Tuesday 14 April 2015

గురిపెట్టిన నక్సలైట్లు

గురిపెట్టిన నక్సలైట్లు

సీఎం కేసీఆర్‌కు అసాధారణ భద్రత
చాప కింద నీరులా నక్సల్స్‌ విస్తరణ
ఉత్తర తెలంగాణపై నజర్‌
ఆదిలాబాద్‌, నిజామాబాద్‌కు కమిటీలు
‘నిఘా’కు అందకుండా అడుగులు
‘సీఆర్‌బీ’ ఆనంద్‌కు టీ-బాధ్యతలు
ఆయన ఆధ్వర్యంలోనే ప్లీనరీ నిర్వహణ
అప్రమత్తమవుతున్న పోలీసులు
మళ్లీ ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థ బలోపేతం
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అసాధారణ
భద్రత! బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలతోపాటు... కొత్తగా మందుపాతర్లను సైతం తట్టుకుని నిలిచే ‘రక్షణ కవచం’! అందులో... ఆధునిక ఆయుధాలతో ఆరుగురు పోలీసు కమెండోలు! జిల్లా పర్యటనల్లో అత్యవసరమైతే తప్ప రోడ్డు మార్గంలో పయనించవద్దని, హెలికాప్టర్లనే ఉపయోగించాలని ముఖ్యమంత్రికి సూచనలు!
(హైదరాబాద్‌ - ఆంధ్రజ్యోతి) తెలంగాణలో మావోయిస్టులు చాపకింద నీరులా విస్తరిస్తున్నారని, తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నారని అందిన సమాచారమే సీఎం కోసం చేసిన ఈ అసాధారణ భద్రతా ఏర్పాట్లకు కారణమని తెలుస్తోంది. ‘రాష్ట్రస్థాయిలోని అత్యంత ప్రముఖుల’పైనా దాడి చేసే స్థాయిలో నక్సల్స్‌ బలం పెంచుకుంటున్నారని సమాచారం. మావోయిస్టుల నియంత్రణలో కాకలు తీరిన పోలీసు అధికారులకు సైతం అందనంత పకడ్బందీగా నక్సల్స్‌ అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. ఎప్పుడు, ఎటువైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అర్థంకాక... తమ దగ్గర ఉన్న అరకొర సమాచారంతోనే అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మావోయిస్టుల టార్గెట్‌ ఉన్నతస్థాయిలోనే ఉంటుందన్న అనుమానాలు తలెత్తడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. మావోయిస్టులు అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుంటున్నారన్న సమాచారం ఉన్న నేపథ్యంలో... సీఎం కాన్వాయ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బాగా దూరం నుంచి కూడా ‘లక్ష్యాన్ని’ దెబ్బతీసే సామర్థ్యాన్ని మావోయిస్టులు సొంతం చేసుకున్నారనే సమాచారంతో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
అసలేం జరుగుతోంది?
రెండు వారాలుగా ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో పోలీసులు సీరియస్‌ ఆపరేషన్‌ మొదలు పెట్టారు. మరోవైపు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో మావోయిస్టు సానుభూతిపరులపైనా నిఘా పెట్టినట్లు తెలిసింది. పోలీసుల ఆందోళనకు ప్రధాన కారణం.. ఉత్తర తెలంగాణలో మావోయిస్టులు చాపకింద నీరులా విస్తరిస్తున్నారనే సమాచారమే. అయితే, ఇందుకు నక్సల్స్‌ అనుసరిస్తున్న వ్యూహం పోలీసులకు అంతుచిక్కడం లేదు. గతంలో ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థ ద్వారా పోలీసులు నక్సల్స్‌ చర్యలను ముందుగానే పసిగట్టేవారు. ఎప్పటికప్పుడు చెక్‌ చెప్పేవారు. అయితే, ఇప్పుడు మావోయిస్టులు వ్యూహం కొత్తగా ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తమ కదలికలు పోలీసులకు చేరకుండా... సరికొత్త ఎత్తుగడలను అనుసరిస్తున్నారని పేర్కొంటున్నాయి. మావోయిస్టుల ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు పాత పద్ధతిలో ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థను మరోసారి బలోపేతం చేసుకుంటున్నారు. అయినా మావోయిస్టుల సమాచారం అంత ఈజీగా పోలీసులకు చిక్కడంలేదు.
‘సమాచార’ లోపం...
తెలంగాణ బాధ్యతలను మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, కేంద్ర మధ్య రీజియన్‌ (సీఆర్‌బీ) నేత ఆనంద్‌కు అప్పగించినట్లు సమాచారం. ఆయన పర్యవేక్షణలోనే గత ఏడాది చివరల్లో ఆంధ్ర, తెలంగాణలకు వేర్వేరు రాష్ట్ర కమిటీలు ఏర్పాటయ్యాయి. ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ 125 మంది సభ్యులతో తొలి ప్లీనరీని నిర్వహించింది. ఖమ్మం, వరంగల్‌ జిల్లాల సరిహద్దు అటవీప్రాంతంలోనే ప్లీనరీ జరిగిందని మావోయిస్టు వర్గాలు చెబుతున్నాయి. అయితే... పోలీసులు దీన్ని ఖండిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌ సమీపంలోనే ఈ ప్లీనరీ జరిగిందనేది వారి వాదన. నిఘా వర్గాలు మాత్రం ప్లీనరీ తెలంగాణలోనే జరిగిందని చెబుతున్నాయి. ‘‘మావోయిస్టు పార్టీ తెలంగాణలో దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. కొందరు వ్యక్తులు ఉన్నారు తప్ప... తప్ప దళాలు, ప్లటూన్‌లు, కమిటీలు లేవు. అలాంటిది, ఇప్పుడు తెలంగాణలో ప్లీనరీ జరగడం అనేది పెద్ద విషయం. ప్లీనరీ ఏర్పాట్లు కూడా ముందుగా లీక్‌ కాలేదు. కనీసం తెలంగాణ కమిటీలో ఎవరెవరు ఉన్నారో కూడా ఇప్పటి వరకు సమాచారం పూర్తిస్థాయిలో లేదు. వారి వ్యూహం మారినట్లుగా ఉంది. లీక్‌లు కాకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. వారి విస్తరణను మేం అడ్డుకోవాల్సిందే. వారి వ్యూహ ప్రతివ్యూహాలను పసిగట్టి వారి కదలికలను గుర్తించి అడ్డుకోవాల్సి ఉంది’’ అని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ప్లీనరీలో ప్రభుత్వ తీరుతెన్నులపై ప్రత్యేక తీర్మానం చేశారని... ఇక, ప్రభుత్వంతో ఘర్షణ తప్పదనే సంకేతం పంపించినట్లేనని చెప్పారు. అయితే, ప్లీనరీ గురించిన సమాచారాన్ని పసిగట్టలేకపోవడంపట్ల సర్కారు పోలీసు శాఖపై సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. గతంలో... నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి మావోయిస్టు దళాలు దండకారణ్యానికి తరలి వెళ్లాయి. ఇక్కడ నిర్భంధం పెరిగి నేతలు పెద్ద ఎత్తున ఎన్‌కౌంటర్లలో మరణించిన తర్వాత మావోయిస్టు పార్టీ ఈ రెండు జిల్లాలను దాదాపుగా వదులుకుంది. అయితే, గత కొంతకాలంగా వారు తిరిగి నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో కార్యకలాపాలు మొదలుపెట్టినట్లు తెలిసింది. ఈ రెండు జిల్లాలకు కమిటీలు ఏర్పాటు చేసినట్లు సమాచారం.
విరామం...టెన్షన్‌...
రాష్ట్ర విభజన తర్వాత మావోయిస్టుల విషయంలో మొండిగా వెళ్లవద్దని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఎన్‌కౌంటర్లు ఉండొద్దని పోలీసులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. మావోయిస్టులు కూడా కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంపై వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరిస్థితులను ఆసరాచేసుకొని బలం పెంచుకోవాలని, నేరుగా ప్రభుత్వంతో ఘర్షణకు దిగవద్దని వారు ఓ స్పష్టమైన విధానంతో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే... కొన్నాళ్లుగా ఈ వైఖరిలో మార్పు వచ్చిందని, వారు దూకుడు పెంచారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో మావోయిస్టు సానుభూతిపరులను అక్రమంగా నిర్భంధించడం, ఆదివాసీలపై మావోయిస్టుల ముద్రవేసి తీవ్రమైన దాడులు చేయడం వంటివి చోటు చేసుకున్నాయంటూ మావోయిస్టులు టీ-సర్కారుపై గుర్రుమంటున్నారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకొనేందుకు మావోయిస్టుల వద్దకు వెళ్లకుండా... అలాంటి ఆలోచనలను మొగ్గలోనే తుడిచేస్తూ, వారిపై ‘మావోయిస్టు’ ముద్ర వేస్తున్నారని పేర్కొంటున్నారు. అటవీ భూములకు సంబంధించి ఖమ్మం జిల్లా ఆదివాసీల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. వీరి ఆందోళన వెనుక తమ పార్టీ ఉందన్న అనుమానంతో ప్రభుత్వం అటవీ అధికారులకు దన్నుగా పోలీసులను పంపి, ఆందోళనను ఉక్కుపాదంతో అణచివేసిందని నక్సల్స్‌ చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీరు కూడా గత ప్రభుత్వాల్లాగానే ఉందని... ఇక, సర్కారుపై సమరం చేయాలని మావోయిస్టులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్‌కు అదనపు భద్రత
‘రక్షక్‌ ప్లస్‌’ బుల్లెట్‌ ఫ్రూఫ్‌ ఫైరింజన్‌
అందులోనే ఆరుగురు కమాండోలు
సీఎం కేసీఆర్‌ రక్షణ కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కేసీఆర్‌ కాన్వాయ్‌లో ఇప్పటికే నాలుగు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు, ఒక జామర్‌ ఉన్నాయి. సీఎం జిల్లాల్లో పర్యటించేటప్పుడు అదనపు భద్రత కోసం ‘రక్షక్‌ ప్లస్‌’ అనే అత్యాధునిక వాహనాన్ని ప్రవేశపెట్టారు. బుల్లెట్‌ ఫైర్‌ టెండర్‌గా పిలిచే కొత్త వాహనాన్ని సీఎం కాన్వాయ్‌లో చేర్చారు. ఇది కాల్పులను మాత్రమే కాదు... మందుపాతర పేలుళ్లను కూడా ఇది తట్టుకోగలదు. సీఎం ప్రయాణించే వాహనానికి ఇది రక్షణ కవచంగా పని చేస్తుంది. మరో విశేషమేమిటంటే... ఈ వాహనంలో మెరికల్లాంటి ఆరుగురు పోలీసు కమెండోలు అత్యాధునిక ఆయుధాలతో అప్రమత్తంగా ఉంటారు. వాహనం లోపలి నుంచే కాల్పులు జరిపే అవకాశం ఉంటుంది. దీనిని భారత్‌ డైనమిక్స్‌ కంపెనీ లిమిటెడ్‌ సంస్థ రూపొందించింది. మరోవైపు... అత్యవసరం అనుకుంటే తప్ప మిగతా సందర్భాల్లో హెలికాప్టర్‌నే వినియోగించాలని సీఎంకు అధికారులు సూచించినట్లు సమాచారం. ఉత్తర తెలంగాణకు చెందిన మరో మంత్రికి కూడా భద్రతను పెంచారు. ఆయనకు కూడా బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలను సమకూర్చనున్నారు.

No comments:

Post a Comment