Wednesday 15 April 2015

బీజేపీ, సంఘ్‌ జాయింట్‌ వెంచర్‌

బీజేపీ, సంఘ్‌ జాయింట్‌ వెంచర్‌
విశాఖపట్నం, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): ‘‘మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం... బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ జాయింట్‌ వెంచర్‌. కార్పొరేట్‌ వర్గాలకు ఇది కొమ్ము కాస్తోంది. అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి మోదీ తీసుకున్న నిర్ణయాలతో దేశ ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.’’ అని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కారత్‌ విమర్శించారు. మంగళవారం విశాఖపట్నంలో అట్టహాసంగా ప్రారంభమైన పార్టీ 21వ అఖిల భారత మహాసభలో ఆయన కీలక ఉపన్యాసం చేశారు. ఈ నెల 19 వరకూ జరిగే ఈ మహాసభకు విశాఖ పోర్టు కళావాణి స్టేడియం ఆతిథ్యమిస్తోంది. వివిధ రాషా్ట్రల నుంచి వామపక్ష పార్టీలకు చెందిన 900 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. మహాసభ ప్రారంభానికి ముందు పార్టీ సీనియర్‌ నేత మహ్మద్‌ అమీన్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మహాసభలో ప్రతినిధులనుద్దేశించి కారత్‌ ప్రసంగిస్తూ... దేశ సంపదను ధనికుల చేతిలో పెట్టేందుకు అతి స్వల్ప వ్యవధిలోనే మోదీ అనేక నిర్ణయాలు తీసుకున్నారని, బొగ్గు గనులు, బీమా, రైల్వే, భూసేకరణ వంటి అంశాల్లో కార్పొరేట్‌ వర్గాలు, విదేశీ పెట్టుబడిదారులకు మోదీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్‌ పన్నును తగ్గించి, సంపద పన్నును పూర్తిగా రద్దు చేశారని, గౌతమ్‌ అదానీ ఆస్తులు ఏడాది కాలంలో రూ.25 వేల కోట్లు పెరిగాయని, ఇదంతా మోదీ పుణ్యమేనని ఆయన విమర్శించారు. వ్యవసాయ, నీటి పారుదల రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోయాయని కారత్‌ విమర్శించారు. చట్టాలు మార్చి కార్మికుల హక్కులను హరించే ప్రయత్నం చేస్తున్నారని తప్పుబట్టారు. ఖనిజ సంపద, మైనింగ్‌ అనుమతుల వల్ల అనేక మంది ఆదివాసీలు నిర్వాసితులు అవుతున్నారని ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ హిందూత్వం ముసుగులో విద్యావిధానం, పరిశోధన, సాంస్కృతిక సంస్థల్లో అజమాయిషీ చేస్తోందని కారత్‌ దుయ్యబట్టారు. మైనార్టీలకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని, ప్రార్థన మందిరాలైన చర్చీలపై దాడులు జరుగుతున్నాయని, మహిళల వేషధారణపైనా ఆంక్షలు పెడుతున్నారని ఆరోపించారు. అమెరికా ఒత్తిడికి లొంగిపోతున్న మోదీ... వారికి అనుగుణంగా విదేశాంగ విధానం మార్చేస్తున్నారని, దీనివల్ల మేధోహక్కులు హరించుకుపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఈ రోజున భారతదేశమంతా అంబేద్కర్‌ జయంతి చేసుకుంటున్నారని, అయితే ఏ లౌకిక, ప్రజాస్వామ్య విధానాలపై అంబేద్కర్‌ రాజ్యాంగం నిర్మించారో దాన్ని కూల్చివేసే విధంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు వ్యవహరిస్తున్నాయని కారత్‌ దుయ్యబట్టారు. ఆర్డినెన్స్‌లపై ఆర్డినెన్సులు తెస్తూ ప్రజాస్వామ్యాన్ని కేంద్రం పరిహాసం చేస్తోందని ఆరోపించారు. భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తామన్నారు. ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ, రాయితీల తగ్గింపు, పన్నుల పెంపు వంటివన్నీ ప్రజావ్యతిరేక ఽధోరణులేనని దుయ్యబట్టారు. కార్మిక చట్టంలో మార్పులపై కేంద్ర కార్మిక సంఘాలన్నీ కన్నెర్ర చేస్తున్నాయని, బొగ్గు బిల్లుపై రెండు రోజులు బంద్‌ చేశాయని, బీమా రంగంలోకి విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు బంద్‌ చేశారని, ఇలా ప్రతి ఒక్కరూ తమ హక్కుల కోసం రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేస్తున్నారని, భవిష్యత్తు అంతా ఇలాగే ఉంటుందని కారత్‌ పేర్కొన్నారు. పాలకులకు, ప్రజలకు మధ్య ఘర్షణలు పెరుగుతాయని, ఈ నేపథ్యంలో వామపక్ష పార్టీలన్నీ ఏకమై ప్రజల తరఫున బూర్జువా పార్టీలపై పోరాటం చేయడానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, ఏఐఎఫ్‌బీ ప్రధాన కార్యదర్శి దేబబ్రతా బిశ్వాస్‌, సోషలిస్టు యూనిటీ ఫర్‌ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా (కమ్యూనిస్టు) ప్రధాన కార్యదర్శి ప్రవోశ్‌ గోష్‌, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ నాయకులు అబనీరాయ్‌, సీపీఐఎంఎల్‌ (లిబరేషన్‌) పొలిట్‌బ్యూరో సభ్యురాలు కవితా కృష్ణన్‌ తదితరులు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చి సందేశమిచ్చారు. దేశంలో హిందూత్వ శక్తులతోపాటు కార్పొరేట్‌ శక్తులకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ఐక్యపోరాటాలను ఉధృతం చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. పలు దేశాల్లోని కమ్యూనిస్టు పార్టీలు ఈ మహాసభకు సందేశం పంపాయి. సుమారు రెండున్నర గంటలపాటు సాగిన ప్రారంభ సభలో నేతలంతా జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, సామ్రాజ్యవాద శక్తుల ప్రాబల్యం, ప్రధానిమోదీ వైఖరి, దేశంలో పారిశ్రామిక, వ్యవసాయ విధానాలపై మాట్లాడారు. ఒకరిని మించి మరొకరి ప్రసంగాలకు ప్రతినిధుల నుంచి స్పందన వచ్చింది.

No comments:

Post a Comment