Wednesday 29 April 2015

టీఆర్‌ఎస్‌పై మెతకవైఖరి ఎందుకు? - నాగం

టీఆర్‌ఎస్‌పై మెతకవైఖరి ఎందుకు?

Sakshi | Updated: April 29, 2015 02:40 (IST)
టీఆర్‌ఎస్‌పై మెతకవైఖరి ఎందుకు?
బీజేపీపై నాగం అసంతృప్తి
నేడు ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం
టీడీపీ నుంచి నాగంకు ఆహ్వానం..?


హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో తప్పులు చేస్తున్నా, లోపాలను ఎత్తిచూపే అవకాశమున్నా.. ప్రజల వైపు నుంచి మాట్లాడటంలో బీజేపీ విఫలమవుతుండడంపై ఆ పార్టీ ముఖ్యనేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్‌తో పాటు అనేక అంశాల్లో ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశమున్నా.. అధికార టీఆర్‌ఎస్‌పై మెతక వైఖరితో ఉన్నామని ఆయన తన సన్నిహితుల వద్ద అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. అవినీతి, హామీల అమల్లో వైఫల్యం, ఉద్యమకారులకు ద్రోహం వంటివాటిపై సీఎం కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ను నిలదీయవచ్చని నాగం వాదిస్తున్నారు.


ప్రతిపక్షాలు మౌనంగా ఉంటే ప్రజలకు, ప్రజాస్వామ్యానికి మంచిదికాదని తన సన్నిహితుల వద్ద చెబుతున్నారు. కరెంటు ఇవ్వలేమంటూ రైతులను భయపెట్టి, పంటలు వేయకుండా చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటోందని నాగం విమర్శిస్తున్నారు. వీటిపై మాట్లాడాలంటే పార్టీ కార్యాలయంలో చాలా పరిమితులున్నాయని, మాట్లాడకుంటే ప్రజలకు నష్టం జరుగుతుందని నాగం పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశాలపై పార్టీ కార్యాలయం వేదికపై కాకుండా ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మాట్లాడాలని నాగం జనార్దన్‌రెడ్డి నిర్ణయించారు.


సొంతంగా రాజకీయవేదిక?
పార్టీ కార్యాలయం బయట విలేకరుల సమావేశం ఏర్పాటుచేస్తుండటంతో.. నాగం జనార్దన్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై చర్చ జరుగుతోంది. ఆయన బీజేపీని వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లు పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నాగం ఒకవేళ బీజేపీని వీడితే ఎటువైపు అడుగులు ఉంటాయనే దానిపై స్పష్టత లేదు. సొంత రాజకీయ వేదికతో ప్రభుత్వంపై పోరాడాలనే యోచనలో ఆయన ఉన్నట్టుగా సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు టీడీపీలో చేరాలంటూ నాగం జనార్దన్‌రెడ్డికి ఆహ్వానం అందుతున్నట్టుగా తెలిసింది. ఈ పరిస్థితుల్లో టీడీపీలో చేరాలా, వద్దా అనేదానిపై నాగం ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదని సన్నిహితులు చెబుతున్నారు.


బయట మాట్లాడితే తప్పేమీ లేదు: కిషన్‌రెడ్డి
ప్రెస్‌క్లబ్ వంటి వేదికపై పార్టీ నేతలు మాట్లాడితే తప్పేమీ కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తాను కూడా ప్రెస్‌క్లబ్‌లో వందలసార్లు మాట్టాడినట్టుగా చెప్పారు. నాగం పార్టీతో రోజూ మాట్లాడుతూనే ఉన్నాడని, ఆయన అసంతృప్తితో ఉన్నట్టుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. శాసనసభ సమావేశాల్లోనూ నాగం సలహా, సూచనల మేరకే తాము వ్యవహరించామని.. ఆయన అనుభవాన్ని బీజేపీ ఉపయోగించుకుంటుందని పేర్కొన్నారు.

No comments:

Post a Comment