Wednesday 29 April 2015

హచ్‌ కుక్కలా ఉంటానని పిచ్చి కుక్కలా మారాడు: రేవంత్‌రెడ్డి

హచ్‌ కుక్కలా ఉంటానని పిచ్చి కుక్కలా మారాడు: రేవంత్‌రెడ్డి


  • కేసీఆర్‌పై రేవంత్‌ విసుర్లు
  • హామీలు గాలికి వదిలి ఇప్పుడు కొత్త కబుర్లా?
  • మేనిఫెస్టో అమలుపై ఎక్కడైనా చర్చకు సిద్ధం
  • డబ్బులిచ్చి సభకు తోలుకొచ్చారు..!
  • జనం అంతా నీ వెనకే ఉన్నారా?
  • అయితే.. ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు
  • నీ అల్లుడు చాకు కాదు.. వెన్నులో దిగబోయే బాకు
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణకు హచ్‌ కుక్క మాదిరిగా కాపలా కాస్తానని చెప్పిన కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పిచ్చి కుక్క మాదిరిగా అందరి మీదా పడి కరుస్తున్నారు. హచ్‌ కుక్క పిచ్చి కుక్క అయింది’ అని టీటీడీఎల్పీ ఉప నేత రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ఎన్టీఆర్‌ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో కేసిఆర్‌ తమను కుక్కలు, గాడిదలతో పోల్చారని, ఆయన కంటే ఎక్కువ తిట్లు తాము తిట్టగలమని... కానీ, సంస్కారవంతమైన పార్టీ నుంచి వచ్చిన తమకు సంస్కారం అడ్డు వస్తోందని ఆయన అన్నారు.

‘ఎన్నికల ముందు కేసీఆర్‌ తనను అధికారంలోకి తెస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని, గిరిజనులు, మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇస్తానని, పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కట్టిస్తానని హామీలు గుప్పించారు. ఇప్పుడు వాటన్నింటినీ గాలికొదిలి వాటర్‌ గ్రిడ్‌ ద్వారా నీళ్లందించి ఓట్లకు వస్తామని చెబుతున్నారు. ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నావా లేక వాటర్‌ గ్రిడ్‌ నీళ్ళిస్తామన్నావా? ఇది మోసం కాదా’ అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం తొమ్మిది నెలల్లో హైదరాబాద్‌కు కృష్ణా జలాలను తెచ్చి సరఫరా చేసిందని, నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ గ్రామాలకు కూడా కృష్ణా జలాలు ఇచ్చిన ఘనత తమ పార్టీదేనని చెప్పారు. పోయిన ఖరీఫ్‌లో రైతులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొనేంత దుర్భరంగా కరెంటు సరఫరాను నిర్వహించారని, దానితో భయపడి రైతులు ఈ సారి పంటలు వేయక కరెంటు వాడకం తగ్గిపోతే అది తన ఘనతని కేసీఆర్‌ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.

‘మూడేళ్ళ దాకా కరెంటు కష్టాలు తప్పవని ఆయనే చె ప్పారు. ఈ ఆరు నెలల్లో ఆయన కొత్తగా ఉత్పత్తి చేసింది ఏమీ లేదు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చిందీ లేదు. ఇతర రాషా్ట్రల నుంచి కొన్నదీ లేదు. మరి కరెంటు ఎక్కడ నుంచి వచ్చింది? రైతులు వ్యవసాయాన్ని పడావు పెడితే వచ్చింది’ అని చెప్పారు. తన అల్లుడు చాకు అని కేసీఆర్‌ కితాబు ఇస్తున్నాడని, కాని ఆ అల్లుడు ఆయన వెన్నులో దిగబోయే బాకు అని రేవంత్‌ చమత్కరించారు. తనపై కుట్రలు చేశారని కేసీఆర్‌ తమ పార్టీ బహిరంగ సభలో పరోక్షంగా తన అల్లుడు గురించే చెప్పారని, వైఎస్‌ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే ఆయన అల్లుడు ఎక్కడ ఉండేవారో అందరికీ తెలుసునన్నారు. కేసీఆర్‌ తన సభకు అధికారాన్ని ప్రయోగించి డబ్బులిచ్చి జనాన్ని తోలుకొచ్చారని ఆరోపించారు. ‘ఆయన సభకు బఠానీలు అమ్మడానికి వచ్చినంత మంది మా పాలమూరు సభకు రాలేదని ఆయన అంటున్నారు.

మాది కేవలం కార్యకర్తల సమావేశం. అదీ కేవలం ఒక జిల్లా సమావేశం. ఆయన పది జిల్లాల నుంచి వేల వాహనాలను పెట్టి తోలుకొచ్చాడు. మా సమావేశాలకు వచ్చిన వారు ఉదయం నుంచి రాత్రి వరకూ కూర్చున్నారు. ఆయన సభకు వచ్చిన వారు అలా ఉన్నారా? నిజంగా జనం ఆయన వెంట ఉంటే ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు రా. టీడీపీ, కాంగ్రెస్‌, వైసీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలందరితో రాజీనా మాలు చేయించి ఎన్నికలు పెడి తే ఎవరి సత్తా ఏమిటో తెలిసిపోతుంది. ఈ ఎమ్మెల్యేలందరూ నీ టిక్కెట్టుపై గెలిస్తే మూడేళ్ళదాకా నిన్ను ఒక్క మాట అనం. చేతనైతే ముందుకు రా’ అని రేవంత్‌ సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఎక్కడైనా ఎపుడైనా బహిరంగ చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు.

టిఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రణాళిక తీసుకొని తాము వస్తామని, ఆ చర్చ ఎక్కడ పెట్టాలో ప్రభుత్వం నిర్ణయించుకో వచ్చునని చెప్పారు. తనకు తెలంగాణ పార్టీ బాధ్యతలు అప్పగించాలని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పోస్టర్లు వేసిన వారు తన అభిమానులో లేక వ్యతిరేకులో తనకు తెలియదని, కాని అది అకతాయి పనేనని వ్యాఖ్యానించారు. తమ పార్టీలో ఏ పదవి ఖాళీ లేదని, ఎవరి పనిని వారు సమర్ధంగా నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు. ఇటువంటి చిల్లర పనులు మంచివి కావని ఆయన హితవు పలికారు. 

No comments:

Post a Comment