Friday 17 April 2015

స‌బ్సి‌డీల‌కు నై... రాయితీల‌కు సై

స‌బ్సి‌డీల‌కు నై... రాయితీల‌కు సై
Posted on: Fri 25 Apr 05:13:40.379935 2014


                 ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టలేని దేశం, కోటీశ్వరులు శత, సహస్ర కోటీశ్వరులుగా మారేందుకు సహకరించడాన్ని ఊహించగలమా...? కోటానుకోట్ల లాభాలు గడించే వేదికగా దేశం మారడాన్ని అంగీకరించగలమా...? కానీ ఈ పరిస్థితి ఎక్కడో కాదు... మనదేశంలోనే ఉన్నదంటే సాధారణ జనం అశ్చర్యపోతారు... అంతేనా...? సంక్షేమ పథకాలకు ప్రభుత్వాలు వేలకోట్లు ఖర్చుచేస్తునప్పటికీ, అవినీతి వల్ల అవి నిష్ప్రయోజనకరంగా తయారవుతున్నాయని కొందరు తెగ బాధపడుతున్నారు. దీనికే 'లీకేజీ' అని ముద్దు పేరు పెట్టారు. పైగా 'లీకేజీ' కారణంగా సబ్సిడీలు, సంక్షేమ ఖర్చులే రద్దుచేయాలంటున్నారు. 'లీకేజీ' పైన మొసలి కన్నీరుకు అసలు కారణం ఇది. సబ్సిడీలను వదిలించుకునేందుకు ఈ సాకు.
అసలు సరళీకృత విధానాలతో పేదల సంక్షేమం సాధ్యమా...? 'లీకేజీ' అనేది విధానాలలో భాగమే! ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం ఫలితమిది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అందినంత కాజేయడమే కదా! సంక్షేమం కోసం కేటాయించింది కూడా ఇలాగే కైంకర్యమవుతున్నది. ఓట్ల కోసం మభ్యపెట్టేందుకు సంక్షేమ పథకాలు ఆచరణలో ప్రయివేటు సంస్థలకు ప్రజల డబ్బు తరలించేందుకు, కాజేసేందుకు మార్గాలు. ఆరోగ్యశ్రీ, విద్యాహక్కు, వృత్తి విద్యా కోర్సులలో ఫీజు రీయింబర్స్‌మెంటు వంటి పథకాలలో జరుగుతున్నదేమిటి...? ప్రజలకు కొంత మేలు కలుగుతున్న మాట నిజమే! కానీ, ఈ డబ్బంతా ప్రభుత్వ రంగంలో ఖర్చుపెడితే ప్రభుత్వాస్పత్రులను, విద్యాలయాలను శాశ్వతంగా, ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయవచ్చు గదా! పేరు మాత్రం సంక్షేమం. నిధులు ప్రయివేటుపరం కావడానికి రాచబాట!
                    ఆహార భద్రతా చట్టం చేసిన ప్రభుత్వమే దానికి అవసరమైన నిధులు కేటాయించకపోవడం మరో ప్రత్యేకత. నిజానికి ప్రజాపంపిణీ వ్యవస్థకు ఇప్పటికే ఖర్చు చేస్తున్న దానికి రూ.30 వేల కోట్లు అదనంగా కేటాయిస్తే చాలు. బడ్జెట్లో రూ.10 వేల కోట్లు మాత్రమే అదనంగా కేటాయించారు. కానీ దీనితోనే దేశాభివృద్ధి అంతా కుప్పగూలిపోతున్నట్లు కొందరు గగ్గోలు పెడుతున్నారు. పైగా ప్రభుత్వం పెంచుతున్న పెట్రోలు, డీజిల్‌ ధరల వల్ల నిత్యజీవితావసర సరుకుల ధరలన్నీ పెరుగుతున్నాయి. సంక్షేమం కోసం పెట్టే ఖర్చు వల్ల కలుగుతున్న ప్రయోజనం దీంతో ఎగిరిపోతున్నది. కుడిచేత్తో ఇచ్చి పుర్ర చేత్తో తీసుకోవడమంటే ఇదేనేమో! కేటాయించిన మొత్తం నిధులు కూడా దారి మళ్ళిస్తున్నారు. దళితులకు కేటాయించిన సబ్‌ప్లాన్‌ నిధులు మన రాష్ట్ర ప్రభుత్వం హుస్సేన్‌ సాగర్‌ శుద్ధి చేయడానికి, రింగు రోడ్డు వేయడానికి మళ్ళించింది కదా! పేదలను పేదలు, నిరుపేద(ఎపిఎల్‌, బిపిఎల్‌)లని విభజించడం కూడా సబ్సిడీ ఖర్చు కోత పెట్టడానికే. ఇప్పటికే ఎరువుల సబ్సిడీ 2008-09లో 75 వేల కోట్లుండగా 2011-12 నాటికి రూ.50 వేల కోట్లకు తగ్గించారు. గ్యాస్‌ సబ్సిడీ 2010-11లో రూ.38 వేల కోట్లుండగా 2011-12 నాటికి 23 వేల కోట్లకు కుదించారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
                    అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదా...? గత నాలుగు సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం కోటీశ్వరులకు ప్రోత్సాహకాల పేరు మీద ఇచ్చిన సబ్సిడీ రూ.20 లక్షల కోట్లకు పైనే. ప్రభుత్వమే బడ్జెట్లో చెప్పిన  విషయమిది. అయినా పారిశ్రామికాభివృద్ధి మైనస్‌లోకే పోయింది. పారిశ్రామికవేత్తలకిచ్చే సబ్సిడీలు, డాలర్లు కొని దాచుకోవడానికి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి, పెండ్లిండ్ల వంటి శుభకార్యాల పేరుతో విలాసాలకు ఖర్చుచేస్తున్నారు. వీరి నుండి ఈ డబ్బు వసూలు చేసి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఖర్చు చేయవచ్చు. మనసుంటే కదా మార్గముండేది. మనసంతా పెట్టుబడిదారుల మీద పారేసుకున్న తర్వాత పేదలు కనిపించటం కష్టమేకదా! ఒకవైపు సాధారణ ప్రజల వార్షిక వినిమయం వృద్ధి రేటు 2009-12 మధ్య ఎనిమిది శాతం ఉండగా 2012-13 మధ్య 4.4 శాతానికి పడిపోయిందని ఎననామిక్‌ సర్వే తేల్చింది. అంటే అంతర్గత మార్కెట్‌ కుదించుకుపోతున్నది. ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్న ఫలితమిది. అయినా పాలకుల మనసు కరగడం లేదు.
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు 1991 నాటి పరిస్థితి పునరావృతమైంది. మరింత తీవ్రమైంది. రూపాయి విలువ పడిపోయిందనీ, విదేశీ వాణిజ్యంలో కరెంటు ఎకౌంటు లోటు జిడిపిలో 2.5 శాతానికి చేరిందన్నారు. అప్పుల భారం 21 శాతానికి చేరుకున్నదన్నారు. ద్రవ్యోలబ్బణం ప్రభావం నిత్య జీవితావసర సరుకులు, ముఖ్యంగా ఆహార సరుకుల మీదనే ఎక్కువగా పడిందన్నారు. ప్రపంచ బ్యాంకు విధానాలే పరిష్కారమన్నారు. ప్రజలు త్యాగం చేయాలన్నారు. 23 సంవత్సరాల తర్వాత ఇప్పుడేం జరిగింది...? రూపాయి విలువ మరింత దిగజారింది. కరెంటు ఎకౌంటు లోటు 4.8 శాతానికి చేరి, ఆనాటి కన్నా రెట్టింపయ్యింది. అప్పుల భారం తగ్గకపోగా 35.09 శాతానికి ఎగబాకింది. ఇప్పుడు ఆహార సరుకులు, నిత్యజీవితావసర సరుకుల ధరలు అందనంత దూరం పోయాయి. ఏమి సాధించినట్లు? పెద్దపెద్ద పారిశ్రామిక వేత్తల ఆస్తులు మాత్రం లక్షల కోట్లల్లో లెక్కిస్తున్నారు. వీరు ప్రపంచ ధనికుల లిస్టులో చేరుతున్నారు. ప్రజలు ఎవరి కోసం త్యాగం చేయాలి? అంబానీలు, ఆదానీలు, టాటా, బిర్లా, మహీంద్రాల సేవలో తరిస్తున్న ప్రధాని అభ్యర్థులు సమాధానం చెప్పాలి.
 -రవిరాజా

No comments:

Post a Comment