Wednesday, 29 April 2015

చైనా-పాక్ మైత్రి

చైనా-పాక్ మైత్రి

Sakshi | Updated: April 23, 2015 00:29 (IST)
రెండేళ్లక్రితం అధికార పగ్గాలు చేపట్టినప్పటినుంచీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అలుపెరగని బాటసారిలా ప్రపంచం చుట్టబెడుతున్నారు. ఆయన తదుపరి మజిలీ ఎటువైపా అని అందరూ తర్కించుకునేంతగా ఈ పర్యటనలు సాగుతున్నాయి. పశ్చిమాసియా మినహా ప్రపంచంలో జిన్‌పింగ్ సందర్శించని ప్రాంతం లేదు. ఈజిప్టు, సౌదీ అరేబియాలకు ఈ నెలలో వెళ్లి ఆ లోటును కూడా భర్తీ చేసుకుందామని అనుకున్నా యెమెన్ సంక్షోభం బద్దలుకావడం... అందులో సౌదీ, ఈజిప్టులు తలమునకలై ఉండటం కారణంగా అది సాధ్యపడలేదు. ఈ సంక్షోభంలో చైనా మిత్ర దేశాలు ఇరాన్, సౌదీలు రెండూ చెరోపక్కా ఉండి కత్తులు నూరుకుంటున్నాయి. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు జిన్‌పింగ్ సౌదీ గడ్డపై అడుగుపెడితే... ఆ దేశం యెమెన్‌పై సాగిస్తున్న దాడులకు చైనా మద్దతిస్తున్నదన్న అభిప్రాయం ఇరాన్‌కు కలిగే ప్రమాదం ఉంటుంది. అది చైనా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది.

అందుకే ఆయన ఈసారి పాకిస్థాన్, ఇండొనేసియా పర్యటనలతో సరిపెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. నిరుడు సెప్టెంబర్‌లో ఆయన మన దేశంతోపాటు పాకిస్థాన్ కూడా వెళ్లాల్సి ఉన్నా చివరి నిమిషంలో పాక్ పర్యటన రద్దయింది. ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తున్న తీరుపై అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలతో అడపా దడపా అక్షింతలు వేయించుకుంటూ ఏకాకినయ్యానన్న భావనతో కుంగిపోయి ఉన్న పాక్... జిన్‌పింగ్ పర్యటన రద్దుకావడంతో అప్పట్లో కలవరానికి లోనైన మాట వాస్తవం. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో జరపబోయే చైనా పర్యటనకు ముందే జిన్‌పింగ్ తమ దేశం రావాలని పాక్ గట్టిగా కోరిందని దౌత్య నిపుణులు చెబుతున్నారు. యెమెన్ సంక్షోభంలో తటస్థంగా ఉండాలని ఈ నెల 10న పాక్ పార్లమెంటు తీర్మానించడం జిన్‌పింగ్ పర్యటనకున్న ఆఖరి అవరోధాన్ని తొలగించింది.
  పాకిస్థాన్‌తో చెలిమికి తామిచ్చే ప్రాధాన్యత గురించి జిన్‌పింగే స్వయంగా పాకిస్థాన్ దినపత్రిక ‘డైలీ టైమ్స్’కు రాసిన ప్రత్యేక వ్యాసంలో తెలియజెప్పారు. పాకిస్థాన్‌కు వస్తే సొంత తమ్ముడి ఇంటికి వచ్చినట్టుంటుందని ఆయన అభివర్ణించారు. అతి త్వరలో పాక్ ‘ఏసియన్ టైగర్’గా ఆవిర్భవించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. పాకిస్థాన్ ఆ స్థాయికి ఎదగడం మాట అటుంచి, తాను ఆసియాకు తిరుగులేని అధినేతనని తెలియజెప్పడం జిన్‌పింగ్ ప్రస్తుత పాక్, ఇండొనేసియా పర్యటనల ఆంతర్యమని వేరే చెప్పనవసరం లేదు. భారత్‌పై చైనా, పాకిస్థాన్‌లకున్న అసంతృప్తి ఆ రెండు దేశాలనూ తొలినాళ్లలో ఏకం చేసినా...రాను రాను అది బహుముఖంగా విస్తరించింది. ఆర్థిక, సైనిక, అణు రంగాల్లో పాకిస్థాన్‌కు చైనా తోడ్పాటునందించేంతగా పెరిగింది.

ఇరు దేశాలూ 2006లో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పర్యవసానంగా రెండు దేశాలమధ్యా వాణిజ్యం చకచకా విస్తరించింది. ఈ దశాబ్దకాలంలో రెండు దేశాలమధ్యా వాణిజ్యం ఎనిమిదింతలు పెరిగితే... ఇతర దేశాలతో పాక్ వాణిజ్యం మూడింతలు మాత్రమే విస్తరించింది. జిన్‌పింగ్ ప్రస్తుత పర్యటన సందర్భంగా 2,800 కోట్ల డాలర్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందాలు ఖరారయ్యాయి. మరో 1,800 కోట్ల డాలర్లమేర చైనా పెట్టుబడులు ఆ దేశానికి సమకూరతాయని చెబుతున్నారు. మధ్య ఆసియాను చుట్టబెడుతూ తూర్పు, పడమరలను కలిపే విస్తృతమైన ‘న్యూ సిల్క్ రోడ్ ప్రణాళిక’ను సాకారం చేసుకోవడంలో భాగంగానే ఈ ఒప్పందాలన్నీ కుదిరాయి. చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ పాత్ర అందులో కీలకం. పాక్‌లోని గ్వదర్ రేవు పట్టణం నుంచి చైనాలోని క్జిన్‌జియాంగ్ వరకూ ఉండే ఈ కారిడార్ కోసం రోడ్లు, రైల్వే లైన్లు, డ్యామ్‌లు, పైప్‌లైన్లు నెలకొల్పడం ఈ ఒప్పందాల్లోని ముఖ్యాంశం. ఇవన్నీ అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పూర్తయితే పాకిస్థాన్‌కు 8,400 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. అంతేకాదు... చైనా నావికాదళానికి చెందిన నౌకలు, జలాంతర్గాములు వినియోగించుకోవడం కోసం గ్వదర్ పోర్టును చైనాకు 40 ఏళ్ల లీజుకిచ్చేందుకు కూడా పాక్ సిద్ధపడుతోంది. బహుశా ఇందుకు కృతజ్ఞతగానే పాక్‌కు ఎనిమిది జలాంతర్గాములివ్వడానికి చైనా అంగీకరించింది. అంటే ఇరు దేశాల సంబంధాలూ వాటి ద్వైపాక్షిక వాణిజ్యానికి  మాత్రమే పరిమితమై లేవు. అవి ఈ ప్రాంతంలో చైనా సైనిక ప్రయోజనాలకు అనుగుణంగా కూడా విస్తరిస్తున్నాయని అర్థమవుతుంది. పర్యవసానంగా పాకిస్థాన్ ఈ ప్రాంతంలో మరింతగా రెచ్చిపోయే ప్రమాదం లేకపోలేదు.

ఇలా పరస్పర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఇరు దేశాల సంబంధాలకూ పాక్‌లో నెలకొని ఉన్న అస్థిర పరిస్థితులే ప్రధాన శత్రువు. చైనా పశ్చిమ సరిహద్దుల్లో సుస్థిరత నెలకొనడానికి పాక్ సహకారం ఎంతో ఉన్నదని, ఉగ్రవాదుల అణచివేతలో అది చురుగ్గా ఉంటున్నదని కొనియాడినా జిన్‌పింగ్‌కు వాస్తవమేమిటో తెలియదనుకోవడానికి లేదు. పాక్‌లో క్రమేపీ మత ఛాందసవాదం, ఉగ్రవాద ఘటనలు పెరగడం చైనా గమనించకపోలేదు. అందువల్లే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదిరినా వాటి అమలు దగ్గరకొచ్చేసరికి ఉగ్రవాదుల బెడద ఉంటుందని ఆ దేశం భావిస్తోంది. అందువల్లే ప్రాజెక్టు పనులు జరిగే ప్రాంతం పొడవునా 12,000 మంది సైనికులను మోహరిస్తామని... చైనా ఇంజనీర్లకూ, నిపుణులకూ, ప్రాజెక్టు డెరైక్టర్లకూ భద్రత కల్పిస్తామని పాక్ ప్రత్యేకంగా హామీ ఇచ్చింది. చైనా విస్తృత పథకంలో భౌగోళికంగా పాక్‌ది కీలకపాత్ర కనుక జిన్‌పింగ్ ఆ దేశంపై వరాల వర్షం కురిపించారు. అయితే, మన భద్రతపై దీని ప్రభావం ఏమేరకు ఉంటుందో మన దేశం సమీక్షించవలసి ఉంటుంది. అలాగే, వచ్చే నెలలో నరేంద్ర మోదీ చైనాలో పర్యటించే సమయానికి జిన్‌పింగ్ పాక్ సందర్శన ఫలితాలపై ఒక అంచనాకొచ్చి అందుకనుగుణమైన వ్యూహాన్ని రచించుకోవాల్సి ఉంటుంది.

మహానాడు ఈసారి హైదరాబాద్‌లో

మహానాడు ఈసారి హైదరాబాద్‌లో

Sakshi | Updated: April 29, 2015 04:18 (IST)
మహానాడు ఈసారి హైదరాబాద్‌లో
హైదరాబాద్:  తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా మే 27 నుంచి 29 వరకు నిర్వహించే మహానాడు ఈసారి హైదరాబాద్‌లో జరగనుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో స్థానిక కార్యకర్తలు, నేతల్లో  ఉత్సాహం తెచ్చేందుకు హైదరాబాద్‌లోనే మహానాడు నిర్వహించాలని ఈ ప్రాంత నేతలు కోరుతున్నారు. దీంతో మహానాడు వేదికగా హైదరాబాద్‌ను ప్రాథమికంగా ఖరారు చేశారు. ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించాలని  చంద్రబాబు యోచిస్తున్నారు. మే రెండో తేదీన బాబు అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగే పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో మహానాడు నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటారు.


ఈ విషయమై చర్చించేందుకు తెలంగాణ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు బుధవారం సమావేశమవనున్నారు. కాగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సచివాలయంలోని తన చాంబర్‌లో మంగళవారం మధ్యాహ్నం విందు ఇచ్చారు. ఇదిలా ఉండగా టీటీడీ పాలకవర్గ సభ్యులుగా నియమితులైన ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, జి. సాయన్న చంద్రబాబును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

గంటాకు అయ్యన్న ఝలక్!?

గంటాకు అయ్యన్న ఝలక్!?

Sakshi | Updated: April 29, 2015 02:22 (IST)
గంటాకు అయ్యన్న ఝలక్!?
బండారుకు దక్కని టీటీడీ పదవి
ఆడారికి చెక్ పెట్టనున్న ప్రభుత్వం!
సర్కారు చేతికి డెయిరీ పగ్గాలు ?
ఆధిపత్యం సాధిస్తున్న అయ్యన్న
 

విశాఖపట్నం: ఆధిపత్య పోరులో మంత్రి గంటాపై సహచర మంత్రి అయ్యన్న వ్యూహాత్మకంగా పైచేయి సాధిస్తున్నారు. గంటాను నేరుగా లక్ష్యంగా చేసుకోకుండా ఆయన అనుచరవర్గాన్ని ఒక్కొక్కటిగా దెబ్బతీస్తున్నారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారుకు టీటీడీ పాలకమండలి పదవి రాకుండా అయ్యన్న చక్రం తిప్పారు. మరో ప్రధాన అనుచరుడు, విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావును తదుపరి లక్ష్యంగా చేసుకున్నారు. ఆడారి అడ్డా అయిన విశాఖ డెయిరీ వ్యవహారాలను నేరుగా ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చేలా అయ్యన్న పావులు కదుపుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరులో అయ్యన్న స్పష్టమైన ఆధిక్యత సాధించారనడానికి
నిదర్శనంగా నిలుస్తున్న తాజా ఉదంతాలివిగో...

తదుపరి లక్ష్యం ఆడారి!: గంటాకు ప్రధాన మద్దతుదారైన విశాఖడెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావుపై అయ్యన్న గురిపెట్టారు. 27ఏళ్లుగా ఆయన ఆధిపత్యంలో ఉన్న విశాఖ డెయిరీపై దృష్టిసారించారు. అయ్యన్న ప్రధాన మద్దతుదారుడైన జిల్లా పార్టీ అధ్యక్షుడు  గవిరెడ్డి జిల్లా కొన్ని రోజుల క్రితం బహిరంగంగానే తులసీరావు అవినీతి ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు. విశాఖ డెయిరీని అడ్డంపెట్టుకుని రూ.500కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆడారిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.  యాక్ట్-64 ప్రకారం ఈ డెయిరీని స్థాపిస్తే డెరైక్టర్లకు ఎన్నికలు జరగకుండా అడ్డుకోవడానికి సంస్థను యాక్ట్- 95 యాక్ట్ కిందకు తీసుకువచ్చారని దుయ్యబట్టారు. తాజాగా కంపెనీ యాక్టు-55ని వర్తింపజేస్తూ నిబంధనలు మార్చడాన్ని కూడా గవిరెడ్డి ప్రశ్నించారు. డెయిరీలో అక్రమాల చిట్టాను రూపొందించి గవిరెడ్డి సీఎంచంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు సమచారం. డెయిరీ వ్యవహారాలను పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువచ్చే అంశాన్ని సీఎం కార్యాలయం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రత్యేక అధికారిని నియమించి డెయిరీ పాలనావ్యవహారాలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువచ్చేలా ప్రతిపాదన రూపొందిస్తున్నట్లు అధికారవర్గాలు చెప్పుకుంటున్నాయి. అదే జరిగితే జిల్లాలో  గంటా వర్గాన్ని అయ్యన్న  పూర్తిగా దెబ్బతీసినట్లే అవుతుంది.

బండారుకు చుక్కెదురు

గంటా వర్గంలో కీలక నేత, ఎమ్మెల్యే బండారు సత్యాన్నారాయణమూర్తిని మంత్రి అయ్యన్న అదను చూసి దెబ్బకొట్టారు. తనకు మంత్రి పదవి రాకుండా సైంధవ పాత్ర పోషించడానికి బండారును మంత్రి గంటా ప్రయోగించిన విషయాన్ని అయ్యన్న ఇంకా మరచిపోలేదు. సమయం కోసం వేచి చూసిన ఆయన టీటీడీ పాలకమండలి నియామక సమయంలో తన అస్త్రాన్ని ప్రయోగించారు. పాలకమండలిలో బండారుకు స్థానం కల్పించాలన్న గంటా వర్గం విజ్ఞప్తిపై సీఎం చంద్రబాబు మొదట సానుకూలంగా స్పందించారు. రెండువారాల క్రితం బండారును నియమాకం దాదాపు ఖాయమైందని మీడియాలో కూడా వార్తలు గుప్పుమన్నాయి. అయ్యన్న వ్యూహాత్మకంగా వ్యవహరించి బండారు అవకాశాలను దెబ్బకొట్టారు. నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ ద్వారా పావులు కదిపినట్లు తెలుస్తోంది.  బండారు సామాజికవర్గానికే చెందిన  ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పేరును తెరపైకి తెచ్చారు. ఉత్తరాంధ్రకే చెందిన వెలమ సామాజికవర్గం నుంచి లలిత కుమారికి స్థానం ఇవ్వడంతో  అదే వర్గానికి చెందిన బండారుకు దారులు మూసుకుపోయాయి.

టీఆర్‌ఎస్‌కు దీటుగా సభ పెడదాం!

టీఆర్‌ఎస్‌కు దీటుగా సభ పెడదాం!

Sakshi | Updated: April 29, 2015 04:12 (IST)
టీఆర్‌ఎస్‌కు దీటుగా సభ పెడదాం!
     ఏపీ సీఎం చంద్రబాబుతో టీటీడీపీ నేతలు
     జూన్‌లో పరేడ్ గ్రౌండ్స్‌లోనే
     నిర్వహిద్దామని ప్రతిపాదన
     అంగీకరించిన బాబు


హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఆవిర్భావ సభకు దీటుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని తెలంగాణ టీడీపీ నిర్ణయించింది. మే నెలాఖరులో నిర్వహించే మహానాడు తరువాత ఈ సభ జరపాలని భావిస్తున్నట్లు టీటీడీపీ నేతలు పార్టీ అధినేత చంద్రబాబుకు తెలిపారు. మంగళవారం ఏపీ సచివాలయంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, జి.సాయన్న, సండ్ర వెంకట వీరయ్య తదితరులు చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సోమవారం టీఆర్‌ఎస్ సభకు హాజరైన జనం, చంద్రబాబుపై కేసీఆర్ విమర్శలు చర్చకు వచ్చాయి.


‘10 లక్షల మంది జనం వస్తారని గొప్పలు చెప్పుకొన్నారు. తీరా చూస్తే 2 లక్షలు కూడా దాటలేదు. మనం తలచుకుంటే అంతకన్నా ఎక్కువ మందిని తీసుకురావచ్చు. మహానాడు తరువాత పరేడ్ గ్రౌండ్స్‌లోనే టీడీపీ సభ పెట్టి తడాఖా చూపిస్తాం..’ అని రేవంత్, ఎర్రబెల్లి తదితర నేతలు చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. ఇందుకు అంగీకరించిన బాబు.. పకడ్బందీగా సభ నిర్వహణపై దృష్టిపెట్టాలని సూచించినట్లు సమాచారం. అంతకన్నా ముందు మే నెలలో ఖమ్మంలో సభ నిర్వహించి ఆ జిల్లా టీడీపీ వెంటే ఉందన్న సందేశాన్ని పంపించాలని నాయకులకు సూచించినట్లు తెలుస్తోంది. ఇక మహానాడును హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించినందున రెండు రాష్ట్రాల ప్రతినిధులు హాజరవుతారని, అందుకోసం సరైన వేదికను నిర్ణయించాలని నేతలు చంద్రబాబును కోరినట్లు సమాచారం.


ఇక జీహెచ్‌ఎంసీ ఎన్నికలను డిసెంబర్‌లోపు నిర్వహించాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో... గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీ పటిష్టతపై దృష్టిపెట్టాలని చంద్రబాబు ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి, పార్టీ ముఖ్య నాయకులు ఒక్కొక్కరు 20 డివిజన్ల బాధ్యతలు తీసుకోవాలని చెప్పినట్లు తెలిసింది. ఎన్నికల సన్నద్ధతపై నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం, పథకాల్లో అవినీతి, హామీల  అమల్లో వైఫల్యంపై ప్రజల్లోకి వెళ్లాలని బాబు సూచించినట్లు తెలిసింది. కాగా.. టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ ఎమ్మెల్యేల అనర్హతపై బుధవారం ఉదయం 11 గంటలకు స్పీకర్‌ను కలిసేందుకు టీటీడీపీ నేతలు అపాయింట్‌మెంట్ తీసుకున్నారు.

చింతలను బీజేపీ సిఫారసు చేయలేదు: బాబు
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో బీజేపీ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని నియమించాలని భావించినా ఆ పార్టీ నేతలెవరూ ఆయన పేరు సిఫారసు చేయలేదని చంద్రబాబు వెల్లడించారు. టీటీడీలో తెలంగాణ నుంచి టీడీపీ తరుఫున ఎమ్మెల్యేలు జి.సాయన్న, సండ్ర వెంకట వీరయ్యతో పాటు బీజేపీ నుంచి చింతలను ఖరారు చేసినట్లు బాబు చైనా పర్యటనకు ముందు ప్రకటించారు. అయితే సోమవారం విడుదల చేసిన జీవోలో చింతల పేరు లేదు. ఈ నేపథ్యంలో టీడీఎల్‌పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం చంద్రబాబును కలిసినప్పుడు ఆరా తీయగా పైవిధంగా ఆయన స్పందించారు.


కానీ ముందే పేరు ప్రకటించి తరువాత వెనక్కు త గ్గడం వల్ల చింతలకు ఇబ్బందేమోనని ఎర్రబెల్లి పేర్కొనగా... ‘హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోనే ఉన్న టీటీడీకి చెందిన బాలాజీ భవన్ స్థాయిని పెంచుదాం. దానికి చింతలను చైర్మన్ చేసి, టీటీడీ పాలకమండలి ఎక్స్ అఫిషియో సభ్యుడి హోదా కల్పిద్దాం’ అని బాబు చెప్పినట్లు సమాచారం

కాంగ్రెస్‌ లేకపోతే కేసీఆర్‌ జీవితమే లేదు: కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ లేకపోతే కేసీఆర్‌ జీవితమే లేదు: కాంగ్రెస్‌

  • టీఆర్‌ఎస్‌ విస్తరణకు సర్కారు సొమ్ము
  • ద్రోహులకు ముందు వరుసలో స్థానమా ?
  • సీఎంపై టీ-కాంగ్రెస్‌ నేతల ధ్వజం
  • 3 లక్షల మంది పట్టే స్టేడియంలో 12 
  • లక్షల మంది ఎలా ఉంటారు: కుంతియా
  • 8 మంది ద్రోహులకు మంత్రి పదవులు: షబ్బీర్‌
  • ఏం సాధించారని సంబరాలు: జీవన్‌రెడ్డి
హైదరాబాద్‌/ఖమ్మం, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): ‘‘కాంగ్రెస్‌ పార్టీ లేకపోతే... టీఆర్‌ఎస్‌ లేదు.. తెలంగాణ లేదు.. ప్లీనరీ లేదు.. అసలు కేసీఆర్‌ జీవితమే లేద’’ని టీ కాంగ్రెస్‌ నేతలు దెప్పిపొడిచారు. పార్టీ కమిటీ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్‌, దాసోజు శ్రవణ్‌, డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్యగౌడ్‌ మంగళవారం గాంధీ భవన్‌లో విలేకర్లతో మాట్లాడారు. అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమవుతుందన్న భ్రమలో కేసీఆర్‌ ఉన్నారని, అందుకే ప్రతి వేదికపై అది నరుక్కుంటా, ఇది నరుక్కుంటా అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని అద్దంకి దయాకర్‌ మండిపడ్డారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి, ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడని, కానీ దీనిపై ఇంతవరకు వివరణ ఇవ్వలేదని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ విస్తరణ కోసం ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

వాటర్‌గ్రిడ్‌, మిషన్‌ కాకతీయ కోసం రూ.70 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని, నిజానికి మంత్రులు, ఎమ్మెల్యేల కమీషన్ల కోసమే వాటిని వెచ్చిస్తున్నారని విమర్శించారు. అది మిషన్‌ కాకతీయ కాదని ‘కమీషన్‌ కాకతీయ’ అని విమర్శించారు. దాసోజు శ్రవణ్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ది బహిరంగ సభ కాదని, బల నిరూపణ సభ అని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలోనే సభను నిర్వహించారని ఆరోపించారు. 14 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమంలో నడిచిన కార్యకర్తలను కాదని... నిన్న మొన్న పార్టీలో చేరిన దొంగలు, దోపిడీదారులు, తెలంగాణ ద్రోహులను ముందు వరుసలో కూర్చోబెట్టుకున్నారని విమర్శించారు. తెలంగాణను ఈనగాసి నక్కల పాలు చేయొద్దంటూ మాట్లాడుతున్నారని, వేదికపై నీ పక్కన ఉన్నది నక్కలే కదా అని దెప్పిపొడిచారు. భిక్షమయ్యగౌడ్‌ మాట్లాడుతూ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, యువకులను కొట్టించి, కేసులు పెట్టించిన తెలంగాణ ద్రోహులను పక్కన కూర్చోబెట్టుకుని బంగారు తెలంగాణను సాధించుకుంటామని చెబుతావా అంటూ దుయ్యబట్టారు.

కాగా, తెలంగాణ ముసుగులో కేసీఆర్‌ నియంత పాలన సాగిస్తున్నారని, ఆయన కుటుంబమే వనరుల దోపిడీని యథేచ్ఛగా సాగిస్తున్నదని ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియా, రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క ఆరోపించారు. మంగళవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశంలో పాల్గొన్న వారు మాట్లాడారు. కేసీఆర్‌ రాషా్ట్రన్ని దోచుకునే ప్రయత్నంలో ఉన్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ సభ సందర్భంగా మూడు లక్షల మంది జనం పట్టే స్టేడియంలో 12 లక్షల మంది ఎలా ఉంటారని ప్రశ్నించారు. కుటుంబానికి ఒకే పింఛన్‌ ఇచ్చేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన కేసీఆర్‌ ఆయన కుటుంబంలోని అందరికీ రాజకీయ ఉద్యోగాలు ఎలా ఇచ్చారని నిలదీశారు. కొడుకు, అల్లుడు శాఖలకు తప్ప వేరే శాఖలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారిని ఓదార్చడానికి కూడా సీఎంకు మనస్సు రావడం లేదని విమర్శించారు. మండలిలో కాంగ్రెస్‌ పక్ష నేత షబ్బీర్‌ ఆలీ మాట్లాడుతూ కేసీఆర్‌ కేబినేట్‌లో ఎనిమిది మంది తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులిచ్చారని విమర్శించారు.

తెలంగాణ ఉద్యమకారులు రోడ్డున పడితే ద్రోహులు మాత్రం పదవులు అనుభవిస్తున్నారని ధ్వజమెత్తారు. కాగా, సీఎం కేసీఆర్‌ ప్రతి పథకాన్ని, కార్యక్రమాన్ని, ప్రాజెక్టును మారుస్తూ తన ‘లేబుల్‌’ ఉండేటట్లుగా జాగ్రత్త పడుతున్నారని ఽసీఎల్పీ ఉపనేత టి. జీవన్‌రెడ్డి మండిపడ్డారు. 11 నెలల పాలనలో ఏ ప్రగతి సాధించారని, ప్రజలు, నిరుద్యోగులు కోసం ఏం ఏశారని టీఆర్‌ఎస్‌ వార్షికోత్సవ సంబరాలు చేసుకున్నారని నిలదీశారు. ‘‘శిశుపాలుడి మాదిరిగా ప్రజలు నీకు 100 తప్పుల అవకాశాన్ని ఐదేళ్ల కాల పరిమితితో ఇచ్చారు. ఆలోపు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చు. లేకపోతే నిన్ను ప్రజలు క్షమించరు. నీ నియంతృత్వ ధోరణి రాష్ట్ర ప్రగతికి దోహదపడదు’’ అని కేసీఆర్‌పై ధ్వజమెత్తారు.

రాజధానికి తరలిపోదాం: అశోక్‌బాబు

రాజధానికి తరలిపోదాం: అశోక్‌బాబు

  • హైకోర్టు, సచివాలయం మినహా అన్ని శాఖలూ సిద్ధం కావాలి
  • హైదరాబాద్‌ రాజధాని అనే విషయాన్ని మర్చిపోవాలి
విజయవాడ, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి) : హైకోర్టు, సచివాలయం మినహా అన్ని శాఖలూ జూన్‌ తర్వాత ఏపీ రాజధాని నుంచే తమ కార్యకలాపాలు నిర్వహించడానికి సన్నద్ధం కావాలని ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు అశోక్‌బాబు కోరారు. విజయవాడలో మంగళవారం జేఏసీ ప్రధాన కార్యదర్శి ఎన్‌.చంద్రశేఖర్‌కు, ఆయనకు పశ్చిమ కృష్ణ శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం జరిగింది. ఈ సందర్భంగా అశోక్‌బాబు మాట్లాడారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ ప్రభుత్వం తమకు పీఆర్సీని ప్రకటించిందని, రాష్ట్రాభివృద్ధికి తమ వంతు సేవ చేసేందుకు ఉద్యోగులంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

ఔట్‌ సోర్సింగ్‌ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేసేలోపు.. ముందుగా స్కేల్‌ ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని శాఖల ఉద్యోగులకూ హెల్త్‌ కారు ్డలు మంజూరు చేసేలా ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని, కిడ్నీ తదితర వ్యాధులకు పెద్ద మొత్తం లో ఖర్చు అవుతుందని, రెండు లక్షలు దాటిన బిల్లులకు సాంకేతిక సమస్యలున్నాయని, దీనిపై ప్రభుత్వంతో చర్చిస్తున్నామని చెప్పారు. మెడికల్‌ బిల్లుల రీయింబర్స్‌మెంట్‌ను జూన్‌ దాకా పొడిగించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఏపీ అభివృద్ధి బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. రాజధాని అంటే హైదరాబాద్‌ అనే విషయాన్ని మరిచిపోవాలని, తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు.

'అందుకే నేనొక ఆడదాన్నని మర్చిపోయాను'

'అందుకే నేనొక ఆడదాన్నని మర్చిపోయాను'

Sakshi | Updated: April 29, 2015 08:45 (IST)
'అందుకే నేనొక ఆడదాన్నని మర్చిపోయాను'
షీ అలర్ట్ !
మహిళలూ జాగ్రత్త!


సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు  సాక్షి అందిస్తోన్న వాస్తవ సంఘటనలివి...

 ‘మధూ... నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంతగా అంటే... నువ్వు లేకుండా బతకలేనంత. నీకోసం ప్రాణమైనా ఇవ్వగలిగేంత. ఐలవ్యూ మధూ’ సురేశ్ మాటలు చెవిన పడుతున్నాయి. కానీ అదేంటో... నా మనసులో ఎలాంటి భావమూ లేదు. అది పెద్దగా స్పందించడం లేదు. పరవశించి పరవళ్లు తొక్కడం లేదు. నిశ్చలంగా ఉంది. ‘ఏంటి మధూ... ఏం మాట్లాడవేంటి?’... నా సమాధానం కోసం ఎక్కువసేపు ఎదురుచూడలేనట్టు ఆతృతగా అడిగాడు సురేశ్. త్వరగా పెదవి విప్పు అన్నట్టుగా నా ముఖంలోకే చూస్తూ నిలబడ్డాడు. జవాబు కోసం కంగారుగా కళ్లలో వెతుకుతున్నాడు. కనిపించలేనట్టుంది. కాస్త నిరాశగా ముఖం పెట్టాడు.

 ‘నేను నీతో ఒకటి చెప్పాలి సురేశ్. అది విన్న తర్వాత నీ నిర్ణయం చెప్పు’ అన్నాను. ‘త్వరగా చెప్పు/ అంటూ వినడానికి సమాయత్తమయ్యాడు. నేను చెప్పాను. అంతా చెప్పాను. ఏదీ దాచకుండా చెప్పేశాను. అంతే... సురేశ్ ముఖం మ్లానమయ్యింది. మౌనంగా అయిపోయాడు. కాసేపు దిక్కులు చూశాడు. క్షణం తర్వాత తేరుకుని అన్నాడు... ‘సారీ మధూ. ఓ అర్జంటు పని గుర్తొచ్చింది. మళ్లీ కలుస్తాను’ అంటూ వెళ్లిపోతుంటే ఫక్కున నవ్వాన్నేను. తెరలు తెరలుగా తన్నుకొస్తోన్న నవ్వును తొక్కిపట్టే ప్రయత్నం చేయకుండా విరగబడి నవ్వాను. నవ్వీ నవ్వీ చివరికి అలసిపోయి ఆగిపోయాను.

 నీకేమైనా పిచ్చా అన్నట్టు వెనక్కి తిరిగి చూశాడు సురేశ్. అవును. నాకు పిచ్చే. నిజంగా పిచ్చే. లేదంటే ఇలా ఎందుకు నవ్వుతాను? ఎగసిపడుతోన్న బాధను యెద గోడల మధ్య దాచేసి... ఏమీ లేనట్టు, ఏదీ ఎరగనట్టు ఎందుకిలా పగలబడి నవ్వుతాను? నాకు పిచ్చే. లేదంటే... మూగబోయిన మనసును ఎవరో వచ్చి మళ్లీ పలికిస్తానంటే సంతోషపడాల్సింది పోయి, నిజాలు నిక్కచ్చిగా చెప్పి, అది విన్న వ్యక్తి ఛీ అన్నట్టుగా చూస్తుంటే ఏడవకుండా నరాలు తెగిపోయేంతగా పడీ పడీ ఎందుకు నవ్వుతాను? పిచ్చే. నాకు పిచ్చే. కానీ ఈ పిచ్చి ఒకప్పుడు లేదు. ఇంత నటన నాకు ఒకప్పుడు చేతగాదు. అప్పుడు నేను నిజంగానే నవ్వేదాన్ని. మల్లెలు విరిసినట్టు.. వెన్నెల విరబూసినట్టు.. హిమం కురిసినట్టు.. స్వచ్ఛంగా, నిండుగా నవ్వేదాన్ని. ఆ నవ్వు నాకు మా నాన్న ఇచ్చారు. ఆయనెప్పుడూ నవ్వుతూనే ఉండేవారు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వెంటాడి వేధించినా నవ్వుతూనే వాటితో పోరాడేవారు. సంపదలు చేజారినా, అయినవాళ్లు మోసగించినా నవ్వుతూనే అన్నిటినీ అధిగమించేవారు. చివరికి అనారోగ్యంతో మంచం పట్టినప్పుడు, రోగం ముదిరి మృత్యువు ఆయనను కౌగిలించుకుంటున్నప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నారు. ఆయన నవ్వుతూనే వెళ్లిపోయారు. కానీ ఆ క్షణమే నా పెదవుల మీది నుంచి నవ్వు చెరిగిపోయింది.

అమ్మ నన్ను చిన్ననాట వదిలి వెళ్తే... నాన్న యవ్వనంలో వదిలిపోయారు. వెంటాడే వాళ్ల జ్ఞాపకాలు... భయపెట్టే ఒంటరి క్షణాలు... బతుకును భారంగా మార్చేశాయి. ఏం చేయాలో తెలీదు. ఎక్కడికి వెళ్లాలో అర్థం కాదు. అంతా చీకటి. ఏ దారీ కనిపించని చిక్కనిచీకటి. అప్పుడే ఉన్నట్టుండి నాన్నగారి చెల్లెలు వచ్చింది. ఆమె పుట్టగానే మా నానమ్మా తాతయ్యా చనిపోతే నాన్నే పెంచారట. కానీ నాన్న మాటను కాదని ప్రేమించినవాడితో వెళ్లి పోయింది. అమ్మానాన్నా అయి పెంచిన అన్నని పగవాడిలా చూస్తూ ఇన్నేళ్లూ గడిపింది. కానీ ఆయన మరణవార్త తెలిశాక ఆగలేక వచ్చేసింది. నా అన్నవాళ్లు లేక నిస్పృహతో ఉన్న నన్ను అక్కున చేర్చుకుంది. నన్ను వాళ్ల ఇంటికి తీసుకెళ్లింది. అంత వేదనలోనూ ఓ చిన్న ఓదార్పు. నాకంటూ కొందరు ఉన్నారన్న ధైర్యం. గతాన్ని మెల్లగా మర్చిపోవాలనుకున్నాను. భవిష్యత్తును మలచుకుందామనుకున్నాను. కానీ అది సాధ్యం కాదనీ, నా భవిష్యత్తును అప్పటికే మా అత్త భర్త మరోలా లిఖించేశాడనీ తెలుసుకోలేకపోయాను.

అత్తయ్య తొలిసారి ఇంటికి తీసుకెళ్లినప్పుడు నన్ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు మావయ్య. ఆ ఆప్యాయత ఆయన్ను నా మనసులో నాన్న స్థానంలో నిలబెట్టింది. కానీ ఆ నాగుపాము ఎప్పటికీ నాన్న కాలేదని తర్వాత తెలిసింది. అతనో దుర్మార్గుడు. పెళ్లానికీ కూతురికీ తేడా తెలియని కామాంధుడు. అక్కడ అడుగు పెట్టినప్పుడే నామీద కన్ను వేశాడు. అదను కోసం కాపు కాశాడు. అత్తయ్య లేని క్షణం చూసి పడగ విప్పాడు. నేను తన నిజ స్వరూపాన్ని గ్రహించేలోపే కాటు వేశాడు. నా భవితను కాలరాశాడు. నా బతుకును కన్నీటిపాలు చేసేశాడు. అంతటితో ఆగలేదు. తన వ్యాపార అవసరాల కోసం నన్ను మరికొందరి అవసరాలు తీర్చమన్నాడు. కాదంటే తనకు తోచిన రీతిలో కసి తీర్చుకునేవాడు. అత్తతో చెబుదామను కున్నాను. కానీ  ఆ నీచుడు నాకా అవకాశం ఇవ్వలేదు. నోరు విప్పితే నిందల పాలు చేస్తానన్నాడు. నేనే తనని రెచ్చగొట్టానని అత్తయ్యకు చెబుతానన్నాడు. అతడి కోసం కళ్లలో పెట్టుకుని పెంచిన నాన్ననే కాదన్న అత్త... ఇవాళ అతడి కోసం నన్ను తప్పుడు మనిషిగా ఎంచదన్న నమ్మకం ఏముంది! అందుకే నోటికి తాళం వేసుకున్నాను. నిజాన్ని పెదవుల మాటున నొక్కిపెట్టేశాను. దాంతో నా బతుకు మరీ నరకమైపోయింది. నా తనువు అతని స్నేహితుల చేతుల్లో వందలసార్లు నలిగిపోయింది. నా మనసు వేలసార్లు చచ్చిపోయింది.

తట్టుకోలేకపోయాను. తెగించాలని నిర్ణయించుకున్నాను. ఒక వ్యక్తి దగ్గరకు నన్ను పంపినప్పుడు తప్పించుకు పారిపోయాను. ఎలాగో ఓ స్వచ్ఛంద సంస్థ నీడకి చేరాను. వారి సాయంతో నా కాళ్లమీద నేను నిలబడ్డాను. అప్పుడే పరిచయమయ్యాడు సురేశ్. నన్ను ప్రేమించానన్నాడు. నేను లేకపోతే చచ్చిపోతా నన్నాడు. దాంతో నా గతాన్ని అతని ముందు పరిచాను. గతుక్కుమన్నాడు. నువ్వు నా ప్రాణం అన్నవాడు కాస్తా నా మానం పోయిందని తెలిసి తన మానాన తను వెళ్లిపోయాడు. నేను లేకపోతే చచ్చిపోతాను అన్నవాడు నాతో బతకడం ఇష్టం లేదంటూ ముఖం తిప్పుకుని వెళ్లిపోయాడు. అంత వరకూ పొంగి పొర్లిన ప్రేమ నేను పతితనని తెలియగానే మాయమైపోయింది. నన్ను చిన్నచూపు చూసి వెళ్లిపోయింది. అంతే. ఆరోజే నిర్ణయించుకున్నాను... ఇక ఏ మగవాడినీ నా చేరువకు రానివ్వకూడదని. నిజం దాచి దగ్గర కాలేను. మోసగించి మనువాడలేను. అలా అని నిజం చెప్పి ఇలా ఛీత్కారానికి గురవ్వనూలేను. అందుకే నేనొక ఆడదాన్నని మర్చిపోయాను. నాకూ ఆశలున్నాయన్న సంగతిని పూర్తిగా విస్మరించాను. తోడు కోరుకోవడం మాని నేను మోడులా బతుకుతున్నాను. తోచిన దారిలో సాగిపోతున్నాను. అంతకంటే ఏం చేయను!!
 - మధుమిత (గోప్యత కోసం పేరు మార్చాం)
ప్రెజెంటేషన్: సమీర నేలపూడి


అందరూ ఒకలా ఉండరు. సురేశ్ అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ మనస్ఫూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు తారస పడతారు. అప్పుడు జీవితం సంతోషంగా ఉంటుంది. కాబట్టి జీవితంలో ఎవరికీ దగ్గర కాకూడదు అన్న నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. అయినా నిజం చెప్పి తీరాలన్న రూలేమీ లేదు కదా! అందరూ మెచ్యూర్‌‌డగా ఉండకపోవచ్చు. అర్థం చేసుకోలేకపోవచ్చు. కాబట్టి బాధపెట్టే నిజాన్ని చెప్పడం కంటే మనసులోనే సమాధి చేసెయ్యడం మంచిది. జరిగినదాన్ని ఓ యాక్సిడెంట్ అనుకుని మర్చిపోవడమే మంచిది. మధుమిత అనుకున్నట్టు అది మోసం కాదు. పాపం తనే మోసపోయింది. ఎవరో చేసిన ద్రోహానికి బలయ్యింది. అందులో ఆమె తప్పేమీ లేదు. అందుకే తన గతాన్ని చెప్పకపోవడం మోసం ఎప్పటికీ అవ్వదు. కాబట్టి అదంతా తను పూర్తిగా మర్చిపోవడమే మంచిది.

డా॥శ్రీనివాస్ ఎస్.ఆర్.ఆర్.వై.
సైకియాట్రిస్టు
ప్రభుత్వ మానసిక చికిత్సాలయం
ఎర్రగడ్డ, హైదరాబాద్

హచ్‌ కుక్కలా ఉంటానని పిచ్చి కుక్కలా మారాడు: రేవంత్‌రెడ్డి

హచ్‌ కుక్కలా ఉంటానని పిచ్చి కుక్కలా మారాడు: రేవంత్‌రెడ్డి


  • కేసీఆర్‌పై రేవంత్‌ విసుర్లు
  • హామీలు గాలికి వదిలి ఇప్పుడు కొత్త కబుర్లా?
  • మేనిఫెస్టో అమలుపై ఎక్కడైనా చర్చకు సిద్ధం
  • డబ్బులిచ్చి సభకు తోలుకొచ్చారు..!
  • జనం అంతా నీ వెనకే ఉన్నారా?
  • అయితే.. ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు
  • నీ అల్లుడు చాకు కాదు.. వెన్నులో దిగబోయే బాకు
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణకు హచ్‌ కుక్క మాదిరిగా కాపలా కాస్తానని చెప్పిన కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పిచ్చి కుక్క మాదిరిగా అందరి మీదా పడి కరుస్తున్నారు. హచ్‌ కుక్క పిచ్చి కుక్క అయింది’ అని టీటీడీఎల్పీ ఉప నేత రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ఎన్టీఆర్‌ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో కేసిఆర్‌ తమను కుక్కలు, గాడిదలతో పోల్చారని, ఆయన కంటే ఎక్కువ తిట్లు తాము తిట్టగలమని... కానీ, సంస్కారవంతమైన పార్టీ నుంచి వచ్చిన తమకు సంస్కారం అడ్డు వస్తోందని ఆయన అన్నారు.

‘ఎన్నికల ముందు కేసీఆర్‌ తనను అధికారంలోకి తెస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని, గిరిజనులు, మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇస్తానని, పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కట్టిస్తానని హామీలు గుప్పించారు. ఇప్పుడు వాటన్నింటినీ గాలికొదిలి వాటర్‌ గ్రిడ్‌ ద్వారా నీళ్లందించి ఓట్లకు వస్తామని చెబుతున్నారు. ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నావా లేక వాటర్‌ గ్రిడ్‌ నీళ్ళిస్తామన్నావా? ఇది మోసం కాదా’ అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం తొమ్మిది నెలల్లో హైదరాబాద్‌కు కృష్ణా జలాలను తెచ్చి సరఫరా చేసిందని, నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ గ్రామాలకు కూడా కృష్ణా జలాలు ఇచ్చిన ఘనత తమ పార్టీదేనని చెప్పారు. పోయిన ఖరీఫ్‌లో రైతులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొనేంత దుర్భరంగా కరెంటు సరఫరాను నిర్వహించారని, దానితో భయపడి రైతులు ఈ సారి పంటలు వేయక కరెంటు వాడకం తగ్గిపోతే అది తన ఘనతని కేసీఆర్‌ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.

‘మూడేళ్ళ దాకా కరెంటు కష్టాలు తప్పవని ఆయనే చె ప్పారు. ఈ ఆరు నెలల్లో ఆయన కొత్తగా ఉత్పత్తి చేసింది ఏమీ లేదు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చిందీ లేదు. ఇతర రాషా్ట్రల నుంచి కొన్నదీ లేదు. మరి కరెంటు ఎక్కడ నుంచి వచ్చింది? రైతులు వ్యవసాయాన్ని పడావు పెడితే వచ్చింది’ అని చెప్పారు. తన అల్లుడు చాకు అని కేసీఆర్‌ కితాబు ఇస్తున్నాడని, కాని ఆ అల్లుడు ఆయన వెన్నులో దిగబోయే బాకు అని రేవంత్‌ చమత్కరించారు. తనపై కుట్రలు చేశారని కేసీఆర్‌ తమ పార్టీ బహిరంగ సభలో పరోక్షంగా తన అల్లుడు గురించే చెప్పారని, వైఎస్‌ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే ఆయన అల్లుడు ఎక్కడ ఉండేవారో అందరికీ తెలుసునన్నారు. కేసీఆర్‌ తన సభకు అధికారాన్ని ప్రయోగించి డబ్బులిచ్చి జనాన్ని తోలుకొచ్చారని ఆరోపించారు. ‘ఆయన సభకు బఠానీలు అమ్మడానికి వచ్చినంత మంది మా పాలమూరు సభకు రాలేదని ఆయన అంటున్నారు.

మాది కేవలం కార్యకర్తల సమావేశం. అదీ కేవలం ఒక జిల్లా సమావేశం. ఆయన పది జిల్లాల నుంచి వేల వాహనాలను పెట్టి తోలుకొచ్చాడు. మా సమావేశాలకు వచ్చిన వారు ఉదయం నుంచి రాత్రి వరకూ కూర్చున్నారు. ఆయన సభకు వచ్చిన వారు అలా ఉన్నారా? నిజంగా జనం ఆయన వెంట ఉంటే ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు రా. టీడీపీ, కాంగ్రెస్‌, వైసీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలందరితో రాజీనా మాలు చేయించి ఎన్నికలు పెడి తే ఎవరి సత్తా ఏమిటో తెలిసిపోతుంది. ఈ ఎమ్మెల్యేలందరూ నీ టిక్కెట్టుపై గెలిస్తే మూడేళ్ళదాకా నిన్ను ఒక్క మాట అనం. చేతనైతే ముందుకు రా’ అని రేవంత్‌ సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఎక్కడైనా ఎపుడైనా బహిరంగ చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు.

టిఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రణాళిక తీసుకొని తాము వస్తామని, ఆ చర్చ ఎక్కడ పెట్టాలో ప్రభుత్వం నిర్ణయించుకో వచ్చునని చెప్పారు. తనకు తెలంగాణ పార్టీ బాధ్యతలు అప్పగించాలని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పోస్టర్లు వేసిన వారు తన అభిమానులో లేక వ్యతిరేకులో తనకు తెలియదని, కాని అది అకతాయి పనేనని వ్యాఖ్యానించారు. తమ పార్టీలో ఏ పదవి ఖాళీ లేదని, ఎవరి పనిని వారు సమర్ధంగా నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు. ఇటువంటి చిల్లర పనులు మంచివి కావని ఆయన హితవు పలికారు. 

నన్ను ఉండొద్దనడానికి కేసీఆర్‌ ఎవరు?: చంద్రబాబు

నన్ను ఉండొద్దనడానికి కేసీఆర్‌ ఎవరు?: చంద్రబాబు

  • తెలంగాణలో ఉంటాం.. గెలిచి తీరుతాం
  • నా వల్ల కాదా తెలంగాణ మిగులు రాష్ట్రమైంది?
  • టీ టీడీపీ నేతలతో చంద్రబాబు వ్యాఖ్య
  • ప్రజల మధ్యే ఉండి పనిచేయాలని సూచన
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఇక్కడేం పని అని టీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యకు చంద్రబాబు స్పందించారు. ‘ఆ మాట అనడానికి కేసీఆర్‌ ఎవరు? తెలంగాణతో నాది ముప్ఫై ఏళ్ల అనుబంధం. తెలంగాణలో ఒక స్పష్టమైన అభివృద్ధికి పునాదులు వేసింది నేనే. రోడ్లు, స్కూళ్లు, ఆస్పత్రులు, ఇంజనీరింగ్‌ కళాశాలలు, మెడికల్‌ కళాశాలలు, ఐటీ కంపెనీలు, గ్రామాల్లో మంచినీటి పధకాలు వంటి వన్నీ నా హయాంలోనే తెలంగాణలో వచ్చాయి. నేను దిగిపోయే సమయానికి రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ ఉంది. ఎన్నో కంపెనీలను నేను తేవడం వల్ల..హైదరాబాద్‌కు ఆదాయం పెరిగింది. ఇవాళ దేశంలో తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉందంటే ఆ కృషి...శ్రమ నాది.

ఈ ఆరు నెలల్లో కేసీఆర్‌ పాలన వల్ల తెలంగాణ మిగులు రాష్ట్రం కాలేదు. చేతనైతే నా కంటే బాగా చేసి చూపించాలి. నాపై ఏడిస్తే ఉపయోగం లేదు. భౌతికంగా విడిపోయింది నిజం. కానీ మానసికంగా తెలుగువారంతా ఒకటే. వారందరి కోసం తెలుగుదేశం పార్టీ అక్కడా ఉంటుంది...ఇక్కడా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో గెలిచి చూపిస్తుంది’’ అని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. మంగళవారం ఆయన ఇక్కడ సచివాలయంలో తెలంగాణ ప్రాంత పార్టీ ముఖ్యులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో కేసీఆర్‌ చేసిన విమర్శల ప్రస్తావన రాగా, చంద్రబాబు స్పందించారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే తెలంగాణలో బడుగు బలహీనవర్గాలకు తమ వాణిని వినిపించే అవకాశం వచ్చి రాజకీయంగా ముందడుగు వేయగలిగారని, ఆ వర్గాల వాణి వినిపించకూడదని అనుకొనేవారే ఇక్కడ టీడీపీ ఉండకూడదని భావిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ‘టీడీపీ ఆవిర్భావం తెలంగాణలో పెత్తందారీతనానికి పాతర వేసింది. టీడీపీ ప్రభుత్వాలు తెలంగాణలో చక్కటి అభివృద్ధిని చూపించాయి. పని చేసిన వాళ్లం మనం. మనం లేకుండా ఎటుపోతాం? ఈ విషయాలు ప్రజలకు సమగ్రంగా వివరించండి. అనునిత్యం ప్రజల్లో ఉండండి. వారి హృదయాలను గెలుచుకోండి’ అని ఆయన పార్టీ నేతలకు సూచించారు. గిల్లి కజ్జాలు పెట్టుకొంటూ రెండు రాషా్ట్రల మధ్య తగాదాలు రగలాలన్నట్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వైఖరి ఉన్నదని, తాను మాత్రం వీలైనంతవరకూ తెలంగాణకు కూడా సహకరిస్తూ తన పని తాను చేసుకొంటూ పోతున్నానని చెప్పారు.

ఆదరణ బాగుంది: టీ టీడీపీ నేతల సంతృప్తి
ప్రజలు ఎన్నో ఆశలతో టీఆర్‌ఎ్‌సను గెలిపించారని, ఆ ఆశలు నిలుపుకోవడంలో ప్రభుత్వం రోజురోజుకూ విఫలమవుతోందని...ప్రజల్లోకి వెళ్లినప్పుడు తమకు అది స్పష్టంగా కనిపిస్తున్నదని తెలంగాణ నేతలు..ఆయనకు చెప్పారు. తెలంగాణలో ఇప్పటివరకూ జరిగిన మూడు జిల్లాల పార్టీ సమావేశాలు బాగా జరిగాయన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. మే నెలాఖరులో జరిగే మహానాడు సమావేశాల తర్వాత తదుపరి జిల్లా సమావేశం నల్లగొండలో నిర్వహించాలని అనుకొన్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు ఈ ఏడాదిలోనే జరిగే అవకాశం ఉన్నందువల్ల పార్టీపరంగా పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని, కింది స్థాయి నుంచి కేడర్‌ను ఉత్తేజితం చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో కూడా పార్టీపరంగా ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించాలన్న ప్రతిపాదన వచ్చింది. అయితే, తగిన సమయం, సందర్భం చూసుకొని చేపట్టాలని అనుకొన్నారు. చంద్రబాబుతో భేటీ అయిన వారిలో తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు, ఉప నేత రేవంత్‌ రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖరరెడ్డి, కొత్తగా టీటీడీ పాలకమండలిలో సభ్యులుగా నియమితులైన ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, సాయన్న పాల్గొన్నారు. 

2020 నాటికి దేశంలో 60 శాతం యువతే - బాబు

ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు
ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లతో అభివృద్ధికి కృషి
2020 నాటికి దేశంలో 60 శాతం యువతే
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 29 : ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం విశాఖలోని నొవాటెల్‌ హోట్‌లో ఇండస్ర్టియల్‌ మిషన్‌ను బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందని, వృద్ధిరేటు 7.5 శాతం ఉంటుందని అంచనాలు ఉన్నాయని పేర్కొన్నారు.
 
2020 నాటికి దేశంలో ఆంగ్లంలో మాట్లాడేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని...అప్పటికి దేశ జనాభాలో 60 శాతం యువతే ఉంటుందన్నారు. గతంలో తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌కు ఐటీ సంస్థలను తీసుకువచ్చేందుకు 15 రోజుల పాటు అమెరికాలో పర్యటించానని చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లతో అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.
 
రాష్ట్రంలో విద్యుత్‌ కొరత లేదని బాబు తెలిపారు. 2020 నాటికి రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యమని స్పష్టం చేశారు. 10 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామన్న బాబు రెండంకెల వృద్ధిరేటు సాధిస్తామని తెలిపారు. గోదావరి, కృష్ణా నదులు అనుసంధానం చేస్తామని చెప్పారు. నదుల అనుసంధానంతో నీటి కొరత ఉండదని సీఎం పేర్కొన్నారు. దేశంలో మిగిలిన రాష్ర్టాల కంటే ఏపీ పారిశ్రామిక విధానం అత్యున్నతమైనదని చంద్రబాబు అన్నారు. 15 రోజుల్లోనే సింగ్‌ల్‌ డెస్క్‌తో పరిశ్రమలకు అనుమతి ఇస్తామని వెల్లడించారు.
 
సంక్షేమ పథకాల అమలులోనూ టెన్నాలజీ వాడుతున్నట్లు తెలిపారు. బయోమెట్రిక్‌ విధానంతో రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తున్నామని, ఆధార్‌తో అన్నింటినీ అనుసంధానం చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. త్వరలో ప్రైవేట్‌ యూనివర్సిటీల బిల్లు తీసుకొస్తామన్నారు. విద్యా, వైద్య, టూరిజం హబ్‌గా ఏపీని మారుస్తామని స్పష్టం చేశారు. హైవేతో తీరప్రాంతాలు అనుసంధానం చేస్తామని, జలరవాణా మార్గాలు అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు.
 
రెండోతరం పారిశ్రామిక వేత్తల్లో ఎక్కవ మంది ఏపీ వారే ఉన్న బాబు పరిశ్రమలు, సేవారంగాలతోనే ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. కృష్ణా నదికి ఇరువైపులా రాజధాని నిర్మాణం ఉంటుందని తెలిపారు. విశాఖ ఆర్థిక రాజధాని, టూరిజం కేంద్రంగా మారుతుందని చెప్పారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు అన్నారు.
 
భూసేకరణపై విపక్షాల రాద్ధాంతం సరికాదని, అభివృద్ధి జరగాలంటే భూసేకరణ అవసరమని వివరించారు. రాజధానికి 33 వేల ఎకరాలు భూసమీకరణ చేసినట్లు చెప్పారు. అభివృద్ధిలో తొలి ప్రాధాన్యత భూములు ఇచ్చే రైతులకే అని స్పష్టం చేశారు. ఉపాధి కల్పనలో యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు

టీఆర్‌ఎస్‌పై మెతకవైఖరి ఎందుకు? - నాగం

టీఆర్‌ఎస్‌పై మెతకవైఖరి ఎందుకు?

Sakshi | Updated: April 29, 2015 02:40 (IST)
టీఆర్‌ఎస్‌పై మెతకవైఖరి ఎందుకు?
బీజేపీపై నాగం అసంతృప్తి
నేడు ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం
టీడీపీ నుంచి నాగంకు ఆహ్వానం..?


హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో తప్పులు చేస్తున్నా, లోపాలను ఎత్తిచూపే అవకాశమున్నా.. ప్రజల వైపు నుంచి మాట్లాడటంలో బీజేపీ విఫలమవుతుండడంపై ఆ పార్టీ ముఖ్యనేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్‌తో పాటు అనేక అంశాల్లో ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశమున్నా.. అధికార టీఆర్‌ఎస్‌పై మెతక వైఖరితో ఉన్నామని ఆయన తన సన్నిహితుల వద్ద అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. అవినీతి, హామీల అమల్లో వైఫల్యం, ఉద్యమకారులకు ద్రోహం వంటివాటిపై సీఎం కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ను నిలదీయవచ్చని నాగం వాదిస్తున్నారు.


ప్రతిపక్షాలు మౌనంగా ఉంటే ప్రజలకు, ప్రజాస్వామ్యానికి మంచిదికాదని తన సన్నిహితుల వద్ద చెబుతున్నారు. కరెంటు ఇవ్వలేమంటూ రైతులను భయపెట్టి, పంటలు వేయకుండా చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటోందని నాగం విమర్శిస్తున్నారు. వీటిపై మాట్లాడాలంటే పార్టీ కార్యాలయంలో చాలా పరిమితులున్నాయని, మాట్లాడకుంటే ప్రజలకు నష్టం జరుగుతుందని నాగం పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశాలపై పార్టీ కార్యాలయం వేదికపై కాకుండా ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మాట్లాడాలని నాగం జనార్దన్‌రెడ్డి నిర్ణయించారు.


సొంతంగా రాజకీయవేదిక?
పార్టీ కార్యాలయం బయట విలేకరుల సమావేశం ఏర్పాటుచేస్తుండటంతో.. నాగం జనార్దన్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై చర్చ జరుగుతోంది. ఆయన బీజేపీని వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లు పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నాగం ఒకవేళ బీజేపీని వీడితే ఎటువైపు అడుగులు ఉంటాయనే దానిపై స్పష్టత లేదు. సొంత రాజకీయ వేదికతో ప్రభుత్వంపై పోరాడాలనే యోచనలో ఆయన ఉన్నట్టుగా సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు టీడీపీలో చేరాలంటూ నాగం జనార్దన్‌రెడ్డికి ఆహ్వానం అందుతున్నట్టుగా తెలిసింది. ఈ పరిస్థితుల్లో టీడీపీలో చేరాలా, వద్దా అనేదానిపై నాగం ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదని సన్నిహితులు చెబుతున్నారు.


బయట మాట్లాడితే తప్పేమీ లేదు: కిషన్‌రెడ్డి
ప్రెస్‌క్లబ్ వంటి వేదికపై పార్టీ నేతలు మాట్లాడితే తప్పేమీ కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తాను కూడా ప్రెస్‌క్లబ్‌లో వందలసార్లు మాట్టాడినట్టుగా చెప్పారు. నాగం పార్టీతో రోజూ మాట్లాడుతూనే ఉన్నాడని, ఆయన అసంతృప్తితో ఉన్నట్టుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. శాసనసభ సమావేశాల్లోనూ నాగం సలహా, సూచనల మేరకే తాము వ్యవహరించామని.. ఆయన అనుభవాన్ని బీజేపీ ఉపయోగించుకుంటుందని పేర్కొన్నారు.

భూసేకరణ చట్టంలో సవరణలు సహేతుకమే - పి.సుగుణాకర్‌రావు

ఆ సవరణలు సహేతుకమే

Sakshi | Updated: April 29, 2015 02:10 (IST)
ఆ సవరణలు సహేతుకమే
పి.సుగుణాకర్‌రావు

 యూపీఏ పాలనలో పేదల భూములను సేకరించి తక్కువ ధరలకే బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టాలని చూశారు.

 నరేంద్ర మోదీ నాయకత్వం లోని ఎన్డీయే ప్రభుత్వం 2013, భూసేకరణ చట్టంలో తీసుకురాదలచిన మార్పులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 2013 న్యాయమైన పరిహార హక్కు, పారదర్శక భూసేకరణ, పునరావాసం, పునర్‌నివాస చట్టం జనవరి 1, 2014 నుంచి అమలులోకి వచ్చింది. నిజానికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 68 సంవత్సరాలు గడిచినా బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 1894 భూసేకరణ చట్టాన్నే ఇంతకాలం అమలు చేసుకున్నాం. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి పరిశీలిస్తే- ఆనకట్టలు, కాల్వలు, విద్యుదు త్పత్తి కేంద్రాలు, రైల్వేలు, విమానాశ్రయాలు, మౌలిక సదుపాయాల కల్పన, గని పనుల కారణంగా దాదాపు రెండున్నర కోట్ల మంది దేశంలో భూనిర్వాసితులుగా మిగిలారు. న్యాయస్థానాలలో జాప్యం, నిధుల లోటు, పరిహారాల చెల్లింపులో జాప్యం వంటి కారణాలతో చాలామంది నష్టపోయారు కూడా. కానీ ప్రజా అవస రాలు అనే కారణంతో ఇలాంటివారి అభ్యర్థనలు ప్రభు త్వాలను కదిలించలేక పోయాయి. నిజానికి ప్రజా ప్రయోజనాలకే భూసేకరణ అనే అంశం మీద గతంలో ప్రజలలో విశ్వాసం ఉండేది.

 యూపీఏ హయాంలో, మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్న కాలంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల పేరిట (సెజ్‌లు) జరిగిన భూసేకరణ భూదురాక్రమణగా మారింది. అవసరమైన దానికంటే ఎక్కువ మొత్తంలో ప్రైవేటు సంస్థల కోసం సేకరించి ప్రజలకు అన్యాయం చేశారన్న విమర్శ ఉంది. రైతాంగంలో ఇది మరీ బలంగా ఉన్న భావన. విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ భూసేకరణ మీద ప్రజలు యుద్ధం ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా లోని సోంపేట, కాకరపల్లిలలో విద్యుదుత్పాదక సంస్థ కోసం భూసేకరణ చేయాలని నిర్ణయించినప్పుడు కూడా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఐదుగురు మరణించారు. 2008లో పశ్చిమ బెంగాల్‌లో టాటా నానో కార్ల కర్మాగారం ఏర్పాటు ప్రయత్నాన్ని కూడా ప్రజలు అడ్డుకున్నారు. యూపీఏ పాలనలో పేదల భూములను సేకరించి తక్కువ ధరలకే బడా పారిశ్రామి కవేత్తలకు కట్టబెట్టాలని చూశారు. దీనితోనే భూసేకరణ అంటే, పేదల భూములను లాక్కుని పెద్ద పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టడమనే అభిప్రాయానికి ప్రజలు రావల సివచ్చింది. నిజానికి 2013 చట్టాన్ని ఎన్నికలకు ముందు కొన్ని ప్రయోజనాలను సాధించుకోవడానికి యూపీఏ తెచ్చింది. అందులో రైతు సంక్షేమం లేదు.

 2013 చట్టం ప్రకారం స్థానిక సంస్థలు, గ్రామస భల అనుమతులతో  భూసేకరణ జరగాలి. భూయజ మానులతో పాటు వ్యవసాయ కూలీల, చేతివృత్తుల, కౌలుదారుల ప్రయోజనాలకు అది ప్రాధాన్యం ఇచ్చింది. భూసేకరణతో సామాజికంగా జరిగే ప్రభావం గురించి కూడా నిపుణులతో అంచనా వేయించాలి. గ్రామీణ ప్రాంతంలో అయితే మార్కెట్ ధరకు నాలుగు రెట్లు, పట్టణ ప్రాంతంలో రెండు రెట్లు పరిహారం పొందే హక్కును కూడా ఈ చట్టం కల్పించింది. పునరావాసా నికి, మౌలిక వసతుల కల్పనకు కూడా ఆ చట్టం ప్రాధా న్యం ఇచ్చింది. కానీ ప్రభుత్వం యాజమాన్య హక్కు కలి గి ఉండి ప్రైవేటు పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలంటే 80 శాతం నిర్వాసితుల సమ్మతి; ప్రభుత్వ-ప్రైవేటు ఉమ్మడి భాగస్వామ్యంలో నెలకొల్పదలచిన ప్రాజెక్టుల కైతే 70 శాతం నిర్వాసితుల సమ్మతి ఉన్నప్పుడే భూసే కరణ జరపాలనే నిబంధన కూడా ఆ చట్టంలో ఉంది. ఈ చట్టం అమలులోకి వచ్చిన కాలానికి మోదీ అధికారం చేపట్టారు.

 జాతీయ రహదారులు, రైల్వేలు, అణుశక్తి, విద్యు దుత్పాదన వంటి పదమూడు కేంద్ర ప్రభుత్వ ప్రాజె క్టులు 2013 భూసేకరణ చట్టం పరిధిలో చేరవు. అందు వల్ల ఆ అంశాల ఆధారంగా సేకరించే భూములకు ఈ చట్టం ద్వారా నష్ట పరిహారం చెల్లింపు సాధ్యం కాదు. కాబట్టి ఆ పదమూడు అంశాలను 2015 నాటి సవరణ ద్వారా అదే చట్టం పరిధిలోకి తీసుకువచ్చారు. అలాగే  నీటి పారుదల, విద్యుదుత్పాదన, భూగర్భగనులు, పారి శ్రామిక వాడల నిర్మాణం వంటి భారీ ప్రాజెక్టుల పని కేవలం ఐదేళ్లలో పూర్తి చేయడం సాధ్యం కాదు కాబట్టి, అలాంటి ప్రాజెక్టులకు పట్టే కాలపరిమితిని కూడా ఈ చట్టం పరిగణనలోనికి తీసుకుంది. నిజానికి భూయ జమాని సమ్మతి లేని కారణంగా దాదాపు 300 బిలియన్ కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు ప్రారంభానికి నోచుకో లేదనీ, 2013 భూసేకరణ చట్టంలో మార్పు చేయనిదే భూసేకరణ పని సులభం కాదనీ 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా కేంద్రానికి విన్నవించుకు న్నాయి. దీనితో కేంద్రం 2013 చట్టానికి ఎన్డీయే 14 సవరణలు చేసింది. ఇందులో నష్ట పరిహారానికి సంబం ధించి ఎలాంటి మార్పులూ లేవు. దేశ భద్రత, రక్షణ వస్తువుల తయారీ, గ్రామీణ విద్యుద్దీకరణ, పేదలకు గృహవసతి వంటి సదుపాయాల కల్పనకు భూ యాజ మాన్యం ప్రభుత్వం చేతిలోనే ఉండి, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం లేదా ప్రైవేటు పరిశ్రమల ఏర్పాటు అనివార్యమైనప్పుడు సామాజిక సర్వే, నిర్వాసితుల సమ్మతి లేకుండా భూమిని సేకరించవచ్చునన్న నిబం ధనలను ఈ సవరణ ద్వారా చేర్చారు. ప్రైవేటు పారి శ్రామిక అవసరాలకు పారిశ్రామికవేత్తలే నేరుగా రైతు లతో సంప్రదించి ఉభయుల అంగీకారంతో భూములు కొనుగోలు చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే ఎక్కువ కొనుగోలు చేసిన ప్రైవేటు సంస్థలకు కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతోనే ఈ సవరణలు జరిగాయన్న విపక్ష ఆరోపణలలో నిజం లేదు.

 ప్రైవేటు పెట్టుబడు లను ఆహ్వానించక తప్పని వాతావరణంలోనే ఈ చట్టా నికి మార్పులు చేశారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాని కల్లా ఇల్లు లేని 8 కోట్ల మందికి ఆ వసతి కల్పించాలని మోదీ ప్రభుత్వం లక్ష్యం. భూవసతి లేని 30 కోట్ల మంది సంక్షేమం గురించి ఆలోచించవలసిన అవసరం ప్రభు త్వం మీద ఉంది. నాలుగు కోట్ల మంది నిరుద్యోగులకు ఉపాధి, మౌలిక అవసరాల కల్పన వంటివి కూడా ప్రభు త్వ బాధ్యతలే. కాగా, తాము కోరుకున్న రీతిలో భూసే కరణ చట్టాన్ని రూపొందించుకునే హక్కు రాష్ట్రాలకు ఉంది. 120 సంవత్సరాల నాటి చట్టాన్నే ఆశ్రయించు కుని కోట్లాది మందిని నిర్వాసితులుగా మిగిల్చిన కాం గ్రెస్‌కు బీజేపీని విమర్శించే హక్కులేదు. 2015 సవర ణలు సరైనవేనని చరిత్ర రుజువు చేస్తుంది.
 (వ్యాసకర్త బీజేపీ కిసాన్‌మోర్చా
 జాతీయ ప్రధాన కార్యదర్శి)
 మొబైల్: 98497 77899

Monday, 27 April 2015

ప్రత్యేక హోదాపై తాత్సారమెందుకు?....కొణిదెల చిరంజీవి

ప్రత్యేక హోదాపై తాత్సారమెందుకు?....కొణిదెల చిరంజీవి


బీజేపీ, తెలుగుదేశం పార్టీల నేతలు నవ్యాంధ్రప్రదేశ్‌ ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారనడంలో రెండో అభిప్రాయానికి తావులేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడంలో తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలతో కూడిన అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా హక్కుకై సంఘటితంగా సమష్టిగా కృషిచేయాలి.
హించిన ఉప్రదవమే జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల నెత్తిన పిడుగులాంటి వార్త. కేంద్రంలో అధికారంలోకి వచ్చి 11 నెలలు గడిచినా.. ఏపీ రాష్ట్ర పునర్‌విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయకుండా తాత్సారం చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెప్పకనే చెప్పింది. ఇద్దరు గౌరవ పార్లమెంటు సభ్యులు, రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై సూటిగా అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణిని, వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించడం ద్వారా నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లేనట్లేనని అర్థమవుతోంది.
కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక.. ఆ రెండు పార్టీలు ప్రజలకు చేసిన వాగ్దానాలు, ఇచ్చిన హమీలు నెరవేరడానికి ఎంతోకాలం పట్టదని రాష్ట్ర ప్రజానీకం ఆశించింది. అయితే గత 11 నెలలుగా ఆ రెండు పార్టీలు విడివిడిగా, ఉమ్మడిగా ఆడుతున్న డ్రామాలతో వాటి పట్ల ఏర్పరచుకొన్న భ్రమలు క్రమంగా తొలగిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తీరని అన్యాయం జరగనుంది.
ఒక్కసారి ఓ 15 నెలల ముందు కేంద్రంలో, రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల్ని తెలుగు ప్రజలందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజనకు అనుకూలంగా అన్ని రాజకీయ పార్టీలు ఆమోదం తెలుపుతూ లేఖలు ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని విభజించడానికి ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో.. ఆనాడు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న నేను, ఆంధ్రాకు చెందిన సహచర కేంద్రమంత్రులు, గౌరవ పార్లమెంట్‌ సభ్యులందరం కలసి సుదీర్ఘ సమావేశాలు ఏర్పాటు చేసుకొని, విభజన అనంతరం ఏర్పడే ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగాలంటే.. చేపట్టాల్సిన చర్యలు, ఆర్థిక ప్రయోజనాలపై చర్చించాము. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడంతో పాటు మరికొన్ని నిర్దిష్టమైన డిమాండ్‌లను తయారుచేసి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారికి, ప్రధాన మంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ గారికి ఇచ్చాం.. వ్యక్తిగతంగా నేనైతే విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర వర్గాల ప్రయోజనాల పరిరక్షణకు హైదరాబాద్‌ను యూనియన్‌ టెరిటరీ (యూటీ) చేయాలని ప్రతిపాదించాను. కానీ అది సాధ్యం కాదన్నప్పుడు.. విభజిత రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ప్రయోజనాలు, రాయితీలు కల్పించాలని లిఖితపూర్వకంగా కోరాము.
మేము చేసిన సూచనల కనుగుణంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ మొదలైన వాటిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 షెడ్యూల్‌ 13లో చేర్చడం జరిగింది. ఆ తర్వాత 2014 ఫిబ్రవరి 20న అప్పటి ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ గారు నూతనంగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్‌కు చేయబోయే సహాయాలను రాజ్యసభలో ప్రకటించారు. రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు. బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాబోయే ప్రభుత్వం తమదేనని.. తాము నవ్యాంధ్ర ప్రదేశ్‌కు పదేళ్ళ పాటు ప్రత్యేకహోదా ఇస్తామని, అభివృద్ధిలో ఏ రాష్ట్రానికి తీసిపోని విధంగా తీర్చిదిద్దుతామంటూ ప్రకటన చేశారు.
రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలవగానే ఒకవైపు బీజేపీ, మరోవైపు తెలుగుదేశం పార్టీలు నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన హామీలన్నీ అమలు చేసేందుకు తమకే ఓటు వేయాలని ప్రచారం చేశాయి. రాష్ట్ర బీజేపీ తమ ఎన్నికల ప్రణాళికలో నవ్యాంధ్ర ప్రదేశ్‌కు పది సంవత్సరాల ప్రత్యేకహోదా ఇస్తామన్న వాగ్దానాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. నరేంద్రమోదీగారు విశాఖపట్నం, తిరుపతి ఎన్నికల సభలలో పాల్గొన్న సందర్భంలో కాంగ్రెస్‌ పార్టీని తీవ్రంగా దుయ్యబడుతూ.. ‘బిడ్డ కోసం తల్లిని చంపేశారని’ కవితాత్మకంగా ప్రస్తావించడమే కాకుండా తమకు ఓట్లేసి అధికారం అప్పజెపితే విభజన బిల్లులో పేర్కొన్న అంశాలన్నిటినీ అములు చేస్తామన్నారు. ప్రజలు నమ్మారు. ఓట్లేసి ఎన్డీఏ, భాగస్వామ్య టీడీపీకి అధికారం అప్పజెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ నేతలకు కూడా ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు. ప్రజలకు ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో ఆ పార్టీ నేతలున్నారు. గత ఏడాది ఆంధ్ర ప్రాంతంలో సమైక్య ఉద్యమం జరుగుతున్నప్పుడు విభజన అంశాన్ని బీజేపీ కూడా రాజకీయంగా వాడుకున్నది. రాజకీయ అవసరాల కోసమే కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా చీల్చిందంటూ రాజకీయం చేసి.. ఎన్నికల్లో రాజకీయ అవసరాలు తీర్చుకొని ఇప్పుడు ఆంధ్రఫ్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాలూ అదే విధమైన డిమాండ్‌ చేస్తాయంటూ రాజకీయపరమైన కారణాలని చూపడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నిజమే.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే మరికొన్ని రాష్ట్రాలు ఆ డిమాండ్‌ను తెర మీదకి తీసుకురావచ్చు. అంతమాత్రాన ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేయాలా? ఏ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అవసరమో.. ఆయా రాష్ట్రాలకు చెప్పి ఒప్పించాల్సిన బాధ్యత బీజేపీ -ఎన్‌డీఏ మీద లేదా?
ఇక రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారనే సాకుతో కాంగ్రెస్‌ పార్టీ ద్వారా పలు పదవులు అనుభవించి చివరి క్షణంలో పార్టీని వీడి బీజేపీలో చేరిన రాష్ట్ర నేతలు కొందరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయంపై నోరుమెదపకపోవడాన్ని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు.. 2002లో గుజరాత్‌లో జరిగిన గోధ్రా నరమేథం నేపథ్యంలో అప్పటి ఎన్‌డీఏ సర్కార్‌ మెడపై కత్తి పెట్టి నరేంద్రమోదీని గుజరాత్‌ సీఎంగా తప్పించకపోతే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి కూలదోస్తామని బెదిరించిన చంద్రబాబునాయుడు.. ఇప్పుడు ఆరు కోట్ల ఆంధ్ర ప్రజానీకానికి తీరని అన్యాయం జరుగుతుంటే ఎన్‌డీఏ నుంచి తప్పుకుంటామన్న చిన్న మాట కూడా ఎందుకు అనలేకపోతున్నారు? ఆయనకు ఎందుకు ఆ బలహీనత? ప్రతి అంశానికి మీడియా ముందుకు వచ్చి మాట్లాడే చంద్రబాబు ఇంత ముఖ్యమైన అంశంపై లీకులు ఇవ్వడమే తప్ప మీడియాతో ఎందుకు ఎందుకు మాట్లాడడం లేదు? ఎన్నాళ్లు ఈ అంశంపై స్పష్టత లేకుండా ప్రజల్ని గందరగోళపరుస్తారు?
ఇదంతా తాజా చరిత్ర. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మనస్సులో ఇంకా చెరిగిపోని సన్నివేశం. అయితే ఈ 11 నెలలుగా జరుగుతున్న పరిణామాలేమిటి? ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రుల సన్నాయి నొక్కులు.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ చుట్టూ చక్కర్లు.. ప్రత్యేక హోదా ఎప్పుడిస్తారని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు! కాంగ్రెస్‌ పార్టీపై నిందలు, విమర్శలు, వెంకయ్యనాయుడి గారి అసహనం, కేంద్రంపై ఒత్తిడి తేలేని చంద్రబాబు అసమర్థత కప్పి పుచ్చుకుంటూ ఆశావహ ప్రకటనలు! కేంద్రాన్ని ఇబ్బంది పెట్టొద్దంటూ సొంతపార్టీ ఎంపీలకు క్లాసులు, హితబోధలు.. పైకి ప్రయత్నాలు చేస్తున్నామంటూ ప్రకటనలు.. లోపల లోపాయికారీ అవగాహనలు.. వెరసి ఈ రెండు పార్టీల నేతలు నవ్యాంధ్రప్రదేశ్‌ ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారనడంలో రెండో అభిప్రాయానికి తావులేదు.
మొదటి నుంచీ రాష్ట్రవిభజన అంశాన్ని తెలుగుదేశం పూర్తిగా తమ రాజకీయ లబ్ధికే ఉపయోగించుకొంది తప్ప తెలుగు ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచించలేదు. రాష్ట్ర విభజనపై పార్టీల అభిప్రాయాలు కోరుతూ కేంద్ర హోంశాఖ సమావేశం ఏర్పాటు చేస్తే దాన్ని బాయ్‌కాట్‌ చేసింది తెలుగుదేశం పార్టీయే కాదూ? తెలంగాణలో ఒకమాట, ఆంధ్రాలో మరోమాట మాట్లాడుతూ.. విభజనపై ఆది నుంచి ద్వంద్వవిధానాలే అవలంభించింది. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాపై జరుగుతున్న తాత్సారానికి నిరసనగా రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ‘కోటి సంతకాల ఉద్యమం’ ప్రారంభిస్తే టీడీపీ నేతలు హేళనగా మాట్లాడారు. కించపర్చే వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తీరుతామని, కాంగ్రెస్‌ రాజకీయం చేస్తోందన్నారు. వారిప్పుడు ఏం మాట్లాడతారు? ఏ కొత్త పల్లవి ఎత్తుకుంటారు? అంతేకాదు..కేంద్రం నుంచి 90 శాతం నిధులు గ్రాంట్‌గా లభించే అవకాశం ఉన్న పోలవరం జాతీయ ప్రాజెక్టును పక్కన బెట్టి ఆర్థికంగా దివాళా తీసిన రాష్ట్ర ఖజానాపై రూ.1300 కోట్ల భారం పడే ‘పట్టి సీమ’ ప్రాజెక్టును తలకెత్తుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పలేని స్థితిలో ఉంది.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం సీనియర్‌ నేతలు కొందరు చేస్తున్న ప్రకటనలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ప్రత్యేక హోదా రాకపోయినా నష్టం లేదని.. ఆ మేరకు ఆర్థిక సహాయం అందుతుందని ఒకరంటారు. ప్రతిపక్షాలకు పని లేదు కనుకనే ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతున్నారని మరొకరు అంటారు. ఒక సీనియర్‌ నేత మాట్లాడుతూ ‘ప్రత్యేక హోదాకు సంబంధించి కాంగ్రెస్‌ నేతలకు అవగాహన లేదని’ విమర్శిస్తున్నారు. పోనీ ఆయనకున్న అవగాహన ఏమిటో ప్రజలకు తెలియజెప్పాలి కదా? అది చేయడం లేదు. స్వయంగా గౌరవ అసెంబ్లీ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌ గారే ప్రత్యేక హోదాపై ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయని నిజాయితీగా చెప్పారు. ఒకరిద్దరు తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నదని అక్కడక్కడా మాట్లాడుతున్నారు. ఒక వైపు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎప్పుడొస్తుందో చెప్పలేమంటూ కేంద్ర మంత్రులే ప్రకటిస్తుంటే తెలుగుదేశం మంత్రులు మాత్రం అందుకు భిన్నమైన ప్రకటనలు చేయడం గమనార్హం.
ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలతో కూడిన అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా హక్కుకై సంఘటితంగా సమష్టిగా కృషిచేయాలి. లేదంటే ఆరుకోట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి టీడీపీ ద్రోహం చేసినట్లే సుమా!
కొణిదెల చిరంజీవి
కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు

ఐఎస్‌ చీఫ్‌ బగ్దాదీ హతం

ఐఎస్‌ చీఫ్‌ బగ్దాదీ హతం

వైమానిక దాడుల్లో మృతి
ఇరాన్‌ రేడియో ధ్రువీకరణ
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 27: ఇస్లామిక్‌ రాజ్యం (ఐఎస్‌) ఉగ్రవాద సంస్థ చీఫ్‌ అబూ బకర్‌ అల్‌ బగ్దాదీ హతమయ్యాడు. సుమారు నెల క్రితం అమెరికా నాయకత్వంలో మిత్రదేశాలు జరిపిన వైమానిక దాడులలో తీవ్రంగా గాయపడిన ఈ ఉగ్రవాది చనిపోయాడు. ఇరాన్‌ రేడియో సోమవారం అధికారికంగా ఈ వార్తను ప్రసారం చేసింది. అల్‌ కాయిదా తర్వాత అంతటి క్రూరమైన జిహాది గ్రూప్‌గా తయారైన ఇస్లామిక్‌ రాజ్యం(ఐఎస్‌) ఇప్పుడు ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. బగ్దాదీ వయస్సు 43 ఏళ్లు. సిరియా సరిహద్దులో నినెవె జిల్లా అల్‌బాజ్‌ ప్రాంతం వద్ద వైమానిక దాడులలో బగ్దాదీ గాయపడినప్పుడు అతనికి తగిలిన గాయాలు అంత తీవ్రమైనవి కావనీ, కొంత ఆలస్యంగానైనా కోలుకుంటాడనీ తొలుత మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తమ నేత పరిస్థితి విషమంగా ఉందనీ, కొత్త చీఫ్‌ పేరును ప్రకటించేందుకు బగ్దాదీ అనుచరులు సన్నాహాలు చేసుకుంటున్న సమయంలోనే ఇరాన్‌ రేడియో బగ్దాదీ మరణాన్ని ధ్రువీకరించింది. ఇస్లాం రాజ్యాన్ని స్థాపించే లక్ష్యంతో బగ్దాదీ 2013లో ఇస్లామిక్‌ స్టేట్‌ ఫర్‌ ఇరాక్‌, సిరియా (ఐసిస్‌) సంస్థను ఏర్పాటు చేసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు అధినేతగా తనకు తాను ప్రకటించుకున్నాడు. అనంతరం దీని పేరును ఐఎస్‌గా మార్చారు. పశ్చిమ ఇరాక్‌, లిబియా, నైజీరియా, సిరియాల్లో ఐఎస్‌ జెండా ఎగురవేయడంతోపాటు త్వరలో పలు యూరప్‌ దేశాలను హస్తగతం చేసుకుంటామని బహిరంగంగా సవాల్‌ విసిరాడు. 1971లో బాగ్దాద్‌లో సాధారణ కుటుంబంలో పుట్టిన బగ్దాదీ....బాగ్దాద్‌ ఇస్లామిక్‌ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ చేశాడు. 2003లో అమెరికా సారథ్యంలోని మిత్రదేశాల సేనలు ఇరాక్‌పై దాడులు జరిపిన సమయంలో బగ్దాదీ మతబోధకుడిగా పనిచేసేవాడు. మొదట స్థానిక ఉగ్రవాద సంస్థ కార్యకలాపాల్లో పాల్గొన్న తర్వాత ముజాహిదీన్‌ షౌరా కమిటీకి సారథ్యం చేపట్టాడు. ఈ సంస్థనే 2006లో ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌గా పేరుమార్చారు. 2010లో అల్‌ఖైదా ఇరాక్‌ విభాగం సారథిగా ఎదిగాడు. ఇరాక్‌లో కారుబాంబులు, మానవబాంబులతో అనేక చోట్ల మారణహోమం సృష్టించాడు. వేలాదిమందిని బలితీసుకున్నాడు. లాడెన్‌ మరణంతో అల్‌ఖైదా పట్టుకోల్పోవడం మొదలైంది. దీంతో 2013లో అల్‌ఖైదాతో తెగతెంపులు చేసుకుని ఐసిస్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాడు. సౌదీఅరేబియా, ఖతర్‌ వంటి దేశాలకు చెందిన సానుభూతిపరులు స్వచ్ఛందంగా ఐఎస్‌కు భారీగా నిధులు సమకూర్చేవారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి. బగ్దాదీని అమెరికా 2011లోనే ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించి, అతని ఆచూకీ తెలిపిన వారికి కోటి డాలర్ల నజరానా ఇస్తామని ప్రకటించింది. ఉగ్రవాదులు సైతం వణికిపోయేలా ఐఎస్‌ను తీర్చిదిద్దినా, ప్రపంచ మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాదిగా ఎదిగినా అతని కథ కూడా మిగిలిన ఉగ్రవాదుల్లానే ముగిసిపోవడం కొసమెరుపు

దమ్ముంటే ఎన్నికలకు రా!: కేసీఆర్‌కు చంద్రబాబు సవాల్‌

 దమ్ముంటే ఎన్నికలకు రా!: కేసీఆర్‌కు చంద్రబాబు సవాల్‌

  • ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు.. ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుంది
  • ఉప ఎన్నికలకు మేం సిద్ధం.. మీరు సిద్ధమో కాదో తేల్చుకోండి
  • నా దగ్గర పని చేశారు.. నీకిక్కడేం పని అంటున్నారు
  • కేసీఆర్‌ మాటలతో మనసుకు బాధ 
  • 2019 ఎన్నికల్లో గెలిచేది మనమే: బాబు
  • రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రకాశ్‌ గౌడ్‌ ప్రమాణ స్వీకారం
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): ‘‘సంతలో పశువుల మాదిరిగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అదే బలమని భ్రమపడుతున్నారు. చేతనైతే.. ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు రా! ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుంది. మేం సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధమో కాదో తేల్చుకోండి’’ అని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌కు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సవాల్‌ విసిరారు.

రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడుగా రాజేంద్ర నగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ సోమవారం రాత్రి దాదాపు తొమ్మిది గంటలకు ఎన్టీఆర్‌ భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు, టీఆర్‌ఎస్‌ 14వ వార్షికోత్సవ బహిరంగ సభ సందర్భంగా కేసీఆర్‌ చేసిన విమర్శలకు ఈ సందర్భంగా ఆయన జవాబిచ్చారు. దమ్ముంటే ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్‌ విసిరారు. ‘‘ఇదే ఎన్టీఆర్‌ భవన్లో కూర్చుని కార్యకర్తలకు తెలుగుదేశం పాఠాలు చెప్పిన కొంతమంది వ్యక్తులు.. ఇప్పుడు బయటకు వెళ్లి తిట్ల పురాణం విప్పుతున్నారు. ఏదేదో మాట్లాడుతున్నారు. నా దగ్గర పని చేసి, ట్రస్ట్‌ భవన్లో పాఠాలు చెప్పిన వ్యక్తి ఇప్పుడు నీకిక్కడేం పని అని అంటున్నారు. వారి మాటలు మనసుకు బాధ కలిగిస్తున్నాయి.

ప్రజలతో కార్యకర్తలతో ఉన్న సంబంధాన్ని ఎవరూ విడదీయలేరు’’ అని చంద్రబాబు ఉద్విగ్నంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి మాటలు బాధ కలిగేలా ఉన్నాయని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే తాను ఇక్కడ ఉన్నానని, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని తీరతామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణను అభివృద్ధి చేసింది టీడీపీయేనని, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల అభివృద్ధి అంతా టీడీపీ పుణ్యమేనని, ఈ విషయం ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. గుజరాత్‌ తర్వాత తెలంగాణే మిగులు బడ్జెట్‌ రాష్ట్రమని 14వ ఆర్థిక సంఘం ప్రకటించిందని, దీనికి కారణం టీడీపీ ప్రభుత్వమేని చెప్పారు. తాము రక్షించిన సంపదను వైఎస్‌ హయాంలో తెగనమ్ముకుని రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు.

‘‘చేసింది చెబుదాం. ప్రజల్లోకి వెళదాం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధిద్దాం. టీడీపీకి పేద, బడుగు, బలహీన వర్గాలు, ప్రజల మద్దతు ఉంది. వారి మద్దతు ఉన్నంత వరకూ భయపడాల్సిన అవసరం లేదు’’ అని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడి, వారి మద్దతు కూడగట్టుకుని బుల్లెట్‌లా దూసుకుపోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీడీపీ జెండాను రెపరెపలాడించి 2019 నాటికి అధికారాన్ని సాధించేవరకు ఉడుంపట్టు పట్టాలని సూచించారు. తొలుత ప్రకాశ్‌ గౌడ్‌తో టీ టీడీపీ ఎన్నికల కన్వీనర్‌ ఈ.పెద్దిరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి వారిని ఎన్నికల్లో గెలిపించుకుంటే తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని టీ టీడీపీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సవాల్‌ చేశారు.

హైదరాబాద్‌: కిరికిరి బాబు - కేసీఆర్‌

హైదరాబాద్‌: కిరికిరి బాబు - కేసీఆర్‌

  • తన పని తాను చేసుకోడు.. పొద్దున లేస్తే పుల్లలు పెడతాడు
  • ఛీ పొమ్మన్నా ఇక్కడే ఉంటాడట.. అక్కడ అన్నీ మోసాలు, గోల్‌మాల్‌.. 
  • ఏపీ సీఎంపై కేసీఆర్‌ ధ్వజం.. ‘ఆవిర్భావ’ సభలో ప్రసంగం
  • నా స్వప్నం, నా లక్ష్యం బంగారు తెలంగాణ.. సంక్షేమంలో దేశంలోనే టాప్‌.. 
  • చెరువుల నుంచి తీస్తున్నది వలస ముష్కరుల పాపం 
  • ఏ గల్లీలోనైనా చర్చకు సిద్ధం.. నల్లా నీటితో పాదాలు కడుగుతా.. 
  • రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు.. కాంట్రాక్టు రెగ్యులరైజ్‌ తథ్యం
  • ఉద్యోగుల విభజనే అడ్డంకి.. వచ్చే మార్చి నుంచి పట్టపగలే సాగుకు కరెంటు..
  • వచ్చే నెల నుంచి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, కేజీ టు పీజీ..  
  • మా విజయం ప్రజలకే అంకితం.. గులాబీ దళపతి ఉద్ఘాటన..
భారీ స్థాయిలో జరిగిన టీఆర్‌ఎస్‌ 14వ వార్షికోత్సవ సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాలు, అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. ‘తల తెగి పడినా... మాట నిలబెట్టుకుంటాం’ అని పునరుద్ఘాటించారు. అదే సమయంలో... డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు, కేజీ టు పీజీ విద్య, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగుల భర్తీ వంటి కీలక హామీలు అమలు కాకపోవడంపై ‘వివరణ’ ఇచ్చుకునేలా మాట్లాడారు. అన్నీ చేసి తీరుతామని ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల మహబూబ్‌నగర్‌లో జరిగిన టీడీపీ సమావేశాన్ని ప్రస్తావిస్తూ... ‘ఛీ పొమ్మన్నా ఇక్కడే ఉంటాడట!’ అని కేసీఆర్‌ ఈసడించుకున్నారు. ఏపీలో అన్నీ మోసాలు, గోల్‌మాల్‌ అని విమర్శించారు.

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. చంద్రబాబు పేరెత్తకుండా... ‘కిరికిరి నాయుడు’ అంటూ ధ్వజమెత్తారు. సోమవారం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ 14వ వార్షికోత్సవ సభలో కేసీఆర్‌ పాల్గొన్నారు. భారీ స్థాయిలో తరలి వచ్చిన పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం, అవసరం, తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యాలు వివరిస్తూ... మధ్యలో చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన పేరు ప్రస్తావించకుండా విరుచుకుపడ్డారు.

ఏపీలో టీడీపీ పాలనను, తమ పాలనతో పోల్చుతూ... అక్కడ అన్నీ మోసాలే అని కేసీఆర్‌ విమర్శించారు. ‘‘మనకో కిరికిరి నాయుడు ఉన్నాడు. ఆయన పక్క రాష్ట్రం సీఎం.. ఛీ పో అన్న పోడట. ఆయనకు రాష్ట్రం, రాజ్యముంది. చాలా సమస్యలు కూడా ఉన్నాయి. ఆయనపని ఆయన చేసుకోవచ్చు కదా! పొద్దున లేవగానే పుల్లలు పెడుతున్నాడు. చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలు నెరవేర్చే తెలివి ఆయనకు లేదు. డ్వాక్రా, రైతు రుణాలు మాఫీ చేస్తానన్నాడు. సగం మందికి కూడా చేయలేదు.

ఇక్కడ మాత్రం 17వేల కోట్లతో 34 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తున్నాం. మేం మాట ఇస్తే... ఇస్తే తలతెగినా సరే మాటమీద నిలబడతాం. కానీ... పక్కరాష్ట్రంలో అన్నీ మోసాలే. అంతా గోల్‌మాల్‌. మొన్న మహబూబ్‌నగర్‌కు వచ్చి కేసీఆర్‌ ను నిద్రపోనియ్యను అన్నాడు. అక్కడ దిక్కులేదుకానీ, ఇక్కడ నీళ్లు, కరెంటు ఇస్తానంటున్నాడు. కన్నతల్లికి అన్నంపెట్టనోడు.. పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్లు ఉంది ఆయన తీరు’’ అంటూ కేసీఆర్‌ ధ్వజమెత్తారు. ‘అక్కడ పోయి చావుపో... ఇక్కడేముందని!’ అని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో బఠాణీలు అమ్ముకునేందుకు వచ్చినంత మంది కూడా టీడీపీ మహబూబ్‌నగర్‌కు సభకు రాలేదని... ఆ మాత్రానికే ఆహా ఓహో అంటున్నారని అన్నారు. ‘‘మూడు, నాలుగు పెంపుడు కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. అయినా సరే... గాడిదలు ఉంటేనే గుర్రాల విలువ తెలుస్తుంది’’ అని వ్యాఖ్యానించారు.

మన డబ్బులు మనకే...
 
సంక్షేమ రంగానికి అత్యధికంగా డబ్బు ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణది అగ్రస్థానమని కేసీఆర్‌ తెలిపారు. ‘‘పెన్షన్లు, హాస్టళ్లకు సన్న బియ్యం, అంగన్‌వాడీలకు జీతాలు, గుడ్లు-పాలు... ఇలా సంక్షేమం కోసం 28వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. అవాకులు చెవాకులు, అడ్డదిడ్డంగా మాట్లాడే ప్రతిపక్ష నాయకులారా... దీనిపై ఏ గల్లీలోనైనా చర్చకు సిద్ధం!’’ అని కేసీఆర్‌ సవాలు విసిరారు. ‘‘ఇంతడబ్బు ఎక్కడిదని ఇప్పుడు ఊళ్లలో చర్చ జరుగుతోంది.

నేనేమీ పక్క నుంచి పైసలు తీసుకురాలేదు. మన డబ్బులు ఆంధ్రాకు పోతున్నాయని, తెలంగాణ వస్తే అదంతా ఇక్కడే ఖర్చుపెడతామని ఉద్యమ సమయంలో చెప్పాను. ఇప్పుడు అదే జరుగుతోంది’’ అని కేసీఆర్‌ తెలిపారు. ఎన్నికల సమయంలో చెప్పని, ఎవరూ అడగని సంక్షేమ పథకాలు కూడా తాము అమలు చేస్తున్నామని కేసీఆర్‌ తెలిపారు. షాదీముబారక్‌, కల్యాణ లక్ష్మి, బీడీ కార్మికులకు పెన్షన్ల వంటి పథకాలను ప్రస్తావించారు. ‘‘వెళ్లగొట్టిన అత్తను కోడలు మళ్లీ ఇంటికి తెచ్చుకుంటోంది. ఎందుకుకంటే పించన్‌ పైసలొస్తాయని’’ అని చమత్కరించారు.

ఇదిగో ఆంధ్రోళ్ల మాయ...
ప్రాజెక్టుల పేరిట సమైక్య సర్కారులో తెలంగాణకు మోసం చేశారని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. ‘‘ప్రాజెక్టు అనగానే అంతర్రాష్ట్ర వివాదం తేవాలి. ఇది ఆంధ్రోళ్ల మాయ. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఎస్‌ఎల్‌బీసీ పథకం. ఆ సొరంగం ఎన్నేళ్లు పడుతుందో చూడండి. వాళ్లు ప్రాజెక్టు పేరు చెప్పడం, మన తెలంగాణ సన్నాసులు చప్పట్లు కొట్టడం. ఇప్పుడు అది జరగదు. టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉంది. ప్రాజెక్టుల అమలు జరుగుతుంది’’ అని కేసీఆర్‌ తెలిపారు. ‘గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లాలి. పచ్చని మాగాళ్లలో పసిడి పంటలు పండాలి’ అని గతంలో తాను పాట రాశానని కేసీఆర్‌ గుర్తు చేశారు.

దక్షిణ తెలంగాణలో మహబూబ్‌నగర్‌, నల్లగొండ... ఉత్తర తెలంగాణలో కామారెడ్డి నుంచి స్టేషన్‌ ఘన్‌పూర్‌ వరకు కరువుకు సాక్ష్యాలుగా ఉన్నాయని... ప్రాజెక్టులను పూర్తి చేస్తామని కేసీఆర్‌ తెలిపారు. ‘‘ప్రాజెక్టుల దగ్గర కుర్చీ వేసుకొని కూర్చొని తెలంగాణను అభివృద్ధి చేస్తా! ఎవరు అడ్డొస్తాడో చూస్తా. పాలమూరు పచ్చబడాలి. రాబోయే కొద్దిరోజుల్లోనే పాలమూరు ఎత్తి పోతల ద్వారా జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తా. పెన్‌గంగ ప్రాజెక్టు పూర్తి కావాలి. లెండి కాల్వలు పూర్తి కావాలి.

నల్లగొండ జిల్లాలో నక్కలగండిని నిర్మిస్తాం. ప్రాజెక్టుల అమలు జరుగుతుంది. కడుపు నిండా నీళ్లు వస్తాయి. ఇవన్నీ జరిగేదాకా ఎట్టి పరిస్థితుల్లో విశ్రమించను’’ అని తెలిపారు. ఇదే సందర్భంగా... ‘హరీశ్‌ చాకులాగా పని చేస్తున్నాడు’ అని ప్రశంసించారు. ‘‘చెరువుల్లో పూడుకుపోయింది మట్టి కాదు... వలసపాలకుల పాపాలు. సమైక్య పాలనలో, వలస ముష్కరుల పాలనలో తెలంగాణ గుండెల మీద పేరుకుపోయిన పాపం! దానిని ఎత్తేస్తున్నాం’’ అని ప్రకటించారు. మిషన్‌ కాకతీయపై మంత్రి హరీష్‌రావు బ్రహ్మాండంగా పని చేస్తున్నారన్నారు. ‘‘తెలంగాణలో ప్రస్తుతం ఒక జోకు వినిపిస్తోంది. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు చెరువులకాడికి పోతే కచ్చితంగా దొరుకుతారని ప్రజలు నవ్వుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చెరువుల్లోని మట్టిని తట్టలతో ఎత్తిపోస్తున్నారు’’ అని కేసీఆర్‌ తెలిపారు.

‘‘కేసీఆర్‌ మాట్లాడితే సింహం గర్జించినట్లు ఉండేది, ఇప్పుడు చప్పబడింది అని కొందరు అన్నారు. అప్పుడు చెప్పాల్సిన సమయం. ఇప్పుడు తేల్చాల్సిన సమయం. ఇప్పుడు కావాల్సింది మాటలు కాదు, చేతలు! బంగారు తెలంగాణ అంటే తెలంగాణలో 80 శాతం ఉన్న బీసీలు, మైనార్టీలు, దళితులు... ఇలా తెలంగాణలోని ప్రతి బిడ్డ ముఖం బంగారు నాణెంలాగా వెలగాలి. అప్పుడే బంగారు తెలంగాణ సాకారమైనట్లు. నా లక్ష్యం, నా టీమ్‌ లక్ష్యం ఇదొక్కటే’’ అని కేసీఆర్‌ ఉద్ఘాటించారు.

చెప్పింది తూచా తప్పకుండా చేస్తాం...
‘‘ఎన్నికల్లో ఓట్లకోసం ఆకాశంలో జాబిల్లిని చూపించి, తర్వాత చౌకబారుగా మాటలు ఫిరాయించే చాలా పార్టీలను చూశాం. కానీ... టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోలో ఏం చెప్పిందో దానిని తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నాం’’ అని కేసీఆర్‌ తెలిపారు. ‘‘అనుకుంటే చేసి తీరుతాను. నేను మోచేతికి బెల్లంపెట్టి అరచేతిని నాకమని చెప్పే రకం కాదు’’ అని అన్నారు. ‘‘టీడీపీ, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించాయి.

కరెంటు సరఫరా చేసే మూడు తీగల్లో మొదటి దానికి టీడీపీ, రెండో దానికి కాంగ్రెస్‌, మూడోదానికి సీపీఐ, సీపీఎం జెండాలు కట్టమని ఆ పార్టీలు అడిగితే... ప్రజలు మూడు తీగలకు టీఆర్‌ఎస్‌ జెండాలు కట్టి అఖండ మెజార్టీతో గెలిపించారు. అందుకే 24 గంటలు కరెంటు సరఫరా అవుతోంది. వచ్చే మార్చి నుంచి రైతులకు తల తాకట్టుపెట్టైనా పొద్దటిపూట కరెంటు ఇస్తాం’’ అని కేసీఆర్‌ ప్రకటించారు.

నీళ్లివ్వకపోతే ఓట్లు అడుగను...
‘‘మంచి నీళ్లు అమ్ముకునే కాలం వస్తుందని పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పారు. ఇప్పుడే అదే జరుగుతోంది. పల్లెల్లో అక్క చెల్లెళ్లు నీళ్ల కోసం కిలోమీటర్లు పోతున్నారు. ఊరూరికీ నీళ్ల సీసాల మిషిన్లు వచ్చాయి. వాటర్‌ గ్రిడ్‌తో పల్లెకు, తాండాకు, గూడేనికి, ప్రతి బస్తీకి ప్రభుత్వ ఖర్చుతోనే నల్లా పెట్టించి నీళ్లు ఇస్తాం. ఆ నీళ్లతో మీ పాదాలు కడుగుతా!’’ అని కేసీఆర్‌ ప్రకటించారు.

ఇది చేయని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని ప్రకటించామని పునరుద్ఘాటించారు. ‘‘ఇంత మంది నేతల భవిష్యత్తును పణంగా పెట్టి, మొండిపట్టు పట్టాల్సిందేనని చెప్పాను’’ అని తెలిపారు. ‘‘నాకు ఒకటే లక్ష్యం తెలంగాణ తేవాలని. అది తెచ్చాను. నన్ను ముఖ్యమంత్రిని చేశారు. వచ్చిన తెలంగాణ బంగారు తెలంగాణ కావాలి. రైతులు, యువత, అందరి ముఖాల్లో చిరునవ్వులు కనిపించాలి. బంగారు తెలంగాణ సాధించేవరకు విశ్రమించను. 24 గంటలు పనిచేస్తా!’ అని కేసీఆర్‌ తెలిపారు.

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, కేజీటు పీజీ, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగాల భర్తీ... వంటి హామీల అమలు కాకపోవడం గురించి కేసీఆర్‌ ప్రస్తావించారు. అందుకు కారణాలూ వివరించారు. ‘గత కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన కుంభకోణాల కారణంగా ఏమిచేయాలో అర్థం కావటం లేదు’ అని తెలిపారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ల నిర్మాణం వచ్చే నెల నుంచే (మే నెల) ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇక... ‘‘కాంట్రాక్టు ఉద్యోగులంతా క్రమబద్ధీకరణ కోసం ఎదురు చూస్తున్నారు. వారినీ రెగ్యులరైజ్‌ చేస్తాం. ఆ ఆదేశాలు జారీ అవుతాయి. రెండేళ్లలోనే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఒక్క జెన్‌కోలోనే 25 వేల ఉద్యోగాలు వస్తాయి’’ అని తెలిపారు.

కమలనాథన్‌ కమిటీ ఆలస్యం కారణంగానే నియామకాల్లో జాప్యం జరుగుతోందని చెప్పారు. ‘కేజీ టు పీజీ’ విద్యను వచ్చే సంవత్సరం నుంచి వందశాతం అమలు చేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. మనకు కడియం శ్రీహరి ఉత్తమమైన వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉన్నరు. గతంలో లెక్చరర్‌గా పనిచేశారు’’ అని కేసీఆర్‌ తెలిపారు. ప్రసంగం చివర్లో కేసీఆర్‌ ‘‘హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం. రానున్న మూడున్నరేళ్లలో అమెరికాలోని డల్లాస్‌లా, జపాన్‌, సింగపూర్‌ను తలదన్నేలా మార్చి మీకు బహుమతిలా ఇస్తాను. కేసీఆర్‌ మాట ఇస్తే తప్పడు. మీరు మా వెంట నడవండి’’ అని గ్రేటర్‌ ప్రజలను కోరారు. ప్రసంగం ప్రారంభంలోనే... నేపాల్‌ భూకంప మృతులకు తెలంగాణ తరఫున కేసీఆర్‌ నివాళి అర్పించారు.