Monday, 21 April 2014

మోసకారి కేసీఆర్ Rahul Speech

మోసకారి కేసీఆర్

Published at: 22-04-2014 03:36 AM
మాతోనే ఉంటామని చెప్పి.. చివరికి వెన్నుపోటు
ఆలింగనం చేసుకుని, చేతిలో చె య్యి వేసి.. చెయ్యిచ్చారు
ప్రాణం పోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకునే వారే కావాలి
ఆయన ఇప్పుడు ఇచ్చే హామీలు నమ్మేదెలా?
కేసీఆర్ వద్ద మాటకారితనం తప్ప మరొకటి లేదు
'బ్రాండ్ తెలంగాణ' కాంగ్రెస్‌తోనే సాధ్యం
సోనియా కృషివల్లే తెలంగాణ.. కేసీఆర్ పాత్ర శూన్యం
తెలంగాణ, సీమాంధ్రకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాం
పాలమూరు, నిజామాబాద్ సభల్లో రాహుల్ ఉద్ఘాటన
దేశవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ.. ఐదేళ్లలో పేదలందరికీ పక్కా ఇళ్లు
'కొన్నాళ్ల క్రితం కేసీఆర్ నన్ను కలిశారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు ధన్యవాదాలు తెలిపారు. ఐదారు నిమిషాలు నాతో మాట్లాడాక... నాతో చేతులు కలిపారు. "రాహుల్ జీ, నేను మీ ముందు ఉన్నాను. నన్ను ఆలింగనం చేసుకోండి' అన్నారు. 'నేను మీతోనే ఉన్నాను' అన్నారు. బయటికి వెళ్లాక ఇచ్చిన మాట మరిచిపోయారు. ముందు చేయి కలిపారు, తర్వాత కౌగిలించుకున్నారు, ఆపై కత్తితో (వెన్నుపోటు) పొడిచారు!'
- రాహుల్ గాంధీ
(మహబూబ్‌నగర్, నిజామాబాద్ - ఆంధ్రజ్యోతి) 'తెలంగాణ ఇచ్చింది మేమే! తెలంగాణను అభివృద్ధిలోకి తెచ్చేదీ మేమే! మమ్మల్నే ఆదరించండి. కాంగ్రెస్‌నే గెలిపించండి' అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలను కోరారు. తెలంగాణ అభివృద్ధికి దూరదృష్టి ఉన్న నాయకత్వం కావాలని... టీఆర్ఎస్‌కు ఆ సత్తా లేదని తెలిపారు. 'విలీనం'పై ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని కేసీఆర్... ఇప్పుడు ఇస్తున్న వాగ్దానాలను మాత్రం ఎలా నిలబెట్టుకుంటారని ప్రశ్నించారు. కేసీఆర్ వద్ద మాటకారితనం తప్ప మరేమీ లేదన్నారు. సోమవారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌లో, సాయంత్రం నిజామాబాద్‌లో జరిగిన బహిరంగ సభలలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. 'కొన్నాళ్ల క్రితం కేసీఆర్ నన్ను కలిశారు. తెలంగాణ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఐదారు నిమిషాలు నాతో మాట్లాడారు. నాతో చెయ్యి కలిపారు. 'రాహుల్ జీ, నేను మీ ముందు ఉన్నాను. నన్ను ఆలింగనం చేసుకోండి' అన్నారు. 'నేను మీతోనే ఉన్నాను' అన్నారు. బయటికి వెళ్లాక ఇచ్చిన మాట మరిచిపోయారు. ముందు చేయి కలిపారు, తర్వాత ఆలింగనం చేసుకున్నారు. ఆనక కత్తితో పొడిచారు'' అంటూ పార్టీ విలీనంపై కేసీఆర్ ఇచ్చిన మాట తప్పారని రాహుల్ కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. "దళిత ముఖ్యమంత్రిని చేస్తానని మీకూ మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ ఊసెత్తడంలేదు. అలాంటి నాయకుడు ఎన్నికల సమయంలో ఇచ్చే వాగ్దానాలను కూడా మరిచిపోతాడు'' అని పేర్కొన్నారు. టీఆర్ఎస్‌కు, ఆ పార్టీ నాయకులకు పదవీకాంక్ష తప్ప మరొకటి లేదని విమర్శించారు.
'బ్రాండ్ తెలంగాణ' మాతోనే సాధ్యం
'ఇక్కడి యువత తెలంగాణను మాత్రమే కాదు... భారతదేశాన్ని, మొత్తం ప్రపంచాన్ని చూసే విశాలమైన కలలుకనాలి' అని రాహుల్ పేర్కొన్నారు. "ఇప్పుడు కెమెరాలు, గడియారాలు, చివరికి టీషర్ట్ చూసినా వాటిపై మేడిన్ చైనా అని ఉంటుంది. డబ్బు మనది, ఉపాధి చైనా వాళ్లది. కానీ... ఆ వస్తువులన్నింటిపై మేడిన్ తెలంగాణ అని ఉండాలనే లక్ష్యం కావాలి. చైనా, జపాన్, ఇంగ్లండ్, అమెరికా కూడా మేడిన్ తెలంగాణ వస్తువులు కొనాలి. సోదరులారా... ఈ స్వప్నాన్ని టీఆర్ఎస్ సాకారం చేయలేదు. టీఆర్ఎస్ కేవలం నెల, రెండు నెలల కలలు మాత్రమే చూపించగలదు. జీవితాలను మార్చే లక్ష్యాలను నెరవేర్చలేదు. ఇప్పుడు దీర్ఘకాలిక ప్రయోజనాలను కాంక్షించే, దూరదృష్టి ఉన్న నాయకులు తెలంగాణకు కావాలి. చేతిలో చేయి వేసి ఇచ్చిన మాటను... ప్రాణంపోయినా నిలబెట్టుకునే నేతలు కావాలి. టీఆర్ఎస్‌ను గెలిపించి చిన్నకలను సాకారం చేసుకుంటారా? కాంగ్రెస్‌కు పట్టంకట్టి అభివృద్ధి లక్ష్యాలను సాధించుకుంటారా?'' అని ప్రజలను ప్రశ్నించారు. పరిపాలన అనుభవం, దూరదృష్టి కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సోనియా చేసిన కృషిని రాహుల్ వివరించారు. ఆమె లేకుంటే తెలంగాణ ఏర్పాటు అయి ఉండేది కాదన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల ఆకాంక్షను సోనియా నెరవేర్చారని గుర్తు చేశారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం సందర్భంగా టీఆర్ఎస్ ఎక్కడా కనిపించలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే రాష్ట్ర సత్వర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. 'దేశంలో చిట్ట చివరి రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను... అభివృద్ధిలో నెంబర్ వన్ చేస్తాం' అని రాహుల్ ఉద్ఘాటించారు. తెలంగాణ, సీమాంధ్ర అభివృద్ధికి తాము చేసిన వాగ్దానాలను అమలు చేస్తామన్నారు.
వరాల వర్షం..
తెలంగాణపై రాహుల్ వరాల వర్షం కురిపించారు. నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యం ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పదేళ్ల పాటు పరిశ్రమలకు పన్ను మినహాయింపు ఇస్తామన్నారు. ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు ఎత్తిపోతల పథకాలను జాతీయ ప్రాజెక్టులుగా చేపడతామని ప్రకటించారు. హైదరాబాద్‌కు వచ్చే ఆదాయమంతా తెలంగాణకే చెందుతుందని, ఆ నిధులతో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న 'ఆరోగ్యశ్రీ'ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. స్వయం సహాయ సంఘాల పనితీరును రాహుల్ ప్రశంసించారు. తాము అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా ఇలాంటి బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈసారి అధికారంలోకి రాగానే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరతామని, పార్లమెంటులో మొట్టమొదట ఆమోదించే బిల్లు ఇదేనని రాహుల్ స్పష్టం చేశారు. దేశంలో 15 కోట్ల మందిని దారిద్య్రరేఖకు దిగువ నుంచి బయటికి తీసుకొచ్చామన్నారు. 'సుమారు 70 కోట్ల మంది దారిద్య్ర రేఖకు ఎగువన, మధ్యతరగతికి దిగువన ఉన్నారు. వీరందరినీ వచ్చే ఐదేళ్లలో మధ్య తరగతి స్థాయికి తీసుకొస్తాం' అని ప్రకటించారు. ఐదేళ్లలో గుడిసె అన్నది లేకుండా... దేశవ్యాప్తంగా పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా రెండు వేల మహిళా పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు.
ఒక బీజేపీ.. 2 భారత్‌లు
"బీజేపీ రెండు రకాల భారత్‌లను సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. ఒకటి... ధనికులు, వ్యాపారుల భారత్. మరొకటి... నిరుపేదల భారత్. హిందువులు ముస్లింలతో ఘర్షణకు దిగేలా బీజేపీ ప్రయత్నిస్తోంది.హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టే ప్రభుత్వం ఈ దేశానికి అవసరం లేదు. పేదలకు అనుకూలమైన లౌకిక సర్కారే ఢిల్లీ గద్దెనెక్కాలి. కాంగ్రెస్ లౌకికవాద పార్టీ. వ్యాపార వేత్తలు మాత్రమే కాదు... పేదలు, రైతులు, కార్మికులు, హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు ఇలా అందరి అభివృద్ధి కోసం కృషి చేస్తుంది. ''
- రాహుల్ గాంధీ
టీఆర్ఎస్.. చిల్లర కొట్లు: జైపాల్
మహబూబ్‌నగర్: టీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదని, అది చిల్లర దుకాణమని కేంద్ర మంత్రి, మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి ఎస్.జైపాల్‌రెడ్డి అన్నారు. అది ఎప్పుడు మూసుకుంటుందో, ఎప్పుడు తెరుచుకుంటుందో తెలియదని ఎద్దేవా చేశారు. తెలంగాణ నిర్మాణం టీఆర్ఎస్ వంటి చిన్నా చితకా పార్టీలతో సాధ్యం కాదని స్పష్టం చేశారు. లోక్‌సభలో, రాజ్యసభలో బీజేపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా సోనియా చిత్తశుద్ధి కారణంగానే తెలంగాణ ఏర్పాటయ్యిందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నట్లుగా ప్రకటించుకున్న 'ఫాంహౌస్ నేతలు' ఒక్కసారి కూడా పార్లమెంటులో దీనిపై మాట్లాడలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరిస్తామని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమం పుట్టింది మహబూబ్‌నగర్ జిల్లాలోనే అని మాజీ మంత్రి డీకే అరుణ పేర్కొన్నారు. సిద్ధాంతాలున్న పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని, కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ఈ బహిరంగ సభల్లో జానారెడ్డితోపాటు పలువురు అగ్రనేతలు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే సోనియాకు కృతజ్ఞత: డీఎస్
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే సోనియాగాంధీకి, రాహూల్‌గాంధీకి కృతజ్ఞతలు తెలిపినట్లేనని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. నిజామాబాద్ సభలో ఆయన ప్రసంగించారు. 'తెలంగాణ ఇచ్చాక నేను సోనియాగాంధీని కలినప్పుడు తెలంగాణ ప్రజలు ఆనందంగా ఉన్నారా అని అడిగారు. తనను తల్లిగా, దేవతలా పూజించవద్దని ఆమె నాతో అన్నారు' అని చెప్పారు. ఆత్మబలిదానాలు చేసుకున్న వారి కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రొ.జయశంకర్ పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 2016నాటికి పూర్తిచేసి జాతీయ హోదాను కల్పిస్తామని హామీ ఇచ్చారు.

No comments:

Post a Comment