Thursday 3 April 2014

ముస్లింల మద్దతుకు మోదీ ఏం చేయాలి?

ముస్లింల మద్దతుకు మోదీ ఏం చేయాలి? 





(దీపశిఖ)-రాజ్‌దీప్ సర్దేశాయ్

Published at: 04-04-2014 07:22 AM
అహ్మదాబాద్ నగర శివార్లలో ఉన్న ముస్లిం బస్తీ సిటిజన్ నగర్‌ను మోదీ ఎందుకు సందర్శించరు? 2002 అల్లర్ల బాధితులు పలువురు ఆ బస్తీలో చాలా దయనీయమైన, అమానుషమైన దుర్భర పరిస్థితుల్లో నివశిస్తున్నారు, కాదు, కునారిల్లుతున్నారు. ఆ అభాగ్యులకు నిజంగా పునరావాసం కల్పించి, శక్తిమంతమైన గుజరాత్‌లో తాము భాగస్వాములమన్న భావన కలిగించగలిగితే వారి హృదయాలను మోదీ గెలుచుకోగలరు. బహుశా సగటు భారతీయ ముస్లిం మనసులనూ ఆయన జయించగలరు.
'అబద్ధాన్ని సత్యంగా మార్చడంలో ఆయన నిపుణుడు. జాతిలో చీలికలు సృష్టి ంచి దేశాన్ని పాలించాలనేది భారతీయ జనతా పార్టీ సూత్రం. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ మిగతా రాష్ట్రాలలో కంటే ఎక్కువ అవినీతి ఉంది. కొద్ది మంది పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారాను, మీడియాలో సదా పతాక శీర్షికల్లో ఉండడం ద్వారాను జాతి మద్దతును గెలుచుకోగలనని మోదీ భావిస్తున్నారు. భారతదేశంలో 70శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివశిస్తున్నారని, తన రాజకీయ వ్యూహాలు వారిని ప్రభావితం చేయబోవనే వాస్తవాన్ని ఆయన అర్థం చేసుకోవడం లేదు. మోదీ తన అంచనాలలో పొరపడడమే కాదు చరిత్ర పరిజ్ఞానం సరైన విధంగా లేని వ్యక్తి'.
గత డిసెంబర్‌లో బీజేపీ ప్రధాని అభ్యర్థిని ఇంత తీవ్రంగా అభిశంసించిన వ్యక్తి సబీర్ అలీ. బీజేపీలో కేవలం 24 గంటలు మాత్రమే సం దేహపూరిత సభ్యుడుగా ఉన్న ఘనతను సాధించుకున్న రాజకీయవేత్త ఈ అలీ! గత జనవరిలో జనతాదళ్ (యునైటెడ్) తనను రాజ్యసభకు మళ్ళీ నామినేట్ చేయడానికి తిరస్కరించడంతో మోదీపై తన అభిప్రాయాలను అలీ మార్చుకున్నారు మరి.అలీ లజ్జారహిత రాజకీయ అవకాశవాది. ఆయన రాజకీయ ప్రస్థానం లోక్ జనశక్తి నుంచి జనతాదళ్ (యునైటెడ్)కు , అక్కడ నుంచి బీజేపీకి సాగింది. బీజేపీలో చేరిన మరో ముస్లిం ప్రముఖుడు ఎమ్.జె.అక్బర్. ఈయన దేశ వ్యాప్తంగా విఖ్యాతుడైన పత్రికా సంపాదకుడు, రచయిత, మేధావి. అక్బర్ రాజకీయ ప్రస్థానం రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నుంచి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీకి సాగింది. తన రాజకీయాలలో వచ్చిన మార్పును ఆయన తెలివిగా, లౌక్యంగా అయితే ప్రతిభావంతంగా సమర్థించుకోవచ్చుగానీ వచ్చిన అప్రతిష్టను ఎప్పటికీ పోగోట్టుకోలేరు. ఇదే అక్బర్, 2002లో గుజరాత్ అల్లర్ల అనంతరం మోదీని హిట్లర్‌తో పోల్చారు. హిందూ ముస్లింల మధ్య తీవ్ర అగాధాలను సృష్టిస్తున్నందుకు గుజరాత్ ముఖ్యమంత్రికి నిషాన్-ఎ-పాకిస్థాన్ పురస్కారాన్ని ఇవ్వాలని కూడా అక్బర్ సూచించారు.
అలీ, అక్బర్ ఇరువురూ బీహార్‌కు చెందిన వారే. కొంతమంది ముస్లిం నాయకులకు స్థానం కల్పించడం ద్వారా, కేవలం హిందువుల పార్టీ మాత్రమే అని తనపై ఉన్న అపప్రథను పోగొట్టుకోవాలన్న బీజేపీ అప్రకటిత ఆకాంక్షను వారు ఒక విధంగా నెరవేరుస్తున్నారు. 1980, 1990 దశకాలలో సికిందర్ భక్త్ బీజేపీ ఉపాధ్యక్షుడుగా ఉండేవారు. మృదు స్వభావి అయిన సికిందర్ చివరి వరకూ అటల్-ఆడ్వాణీ ద్వయం నీడలో సంతోషంగా ఉండిపోయారు. గత దశాబ్దంలో బీజేపీ ముస్లిం 'ముఖాలు' ముఖ్తర్ అబ్బాస్ నక్వీ, షానవాజ్ హుస్సేన్. ఈ ఇరువురికీ ప్రజల్లో అంతగా మద్దతు లేదు. అయితే అంతకుమించి రాజకీయ ప్రయోజనాలు పొందారు. 'మెజారిటీ వర్గీయుల పార్టీలో మైనారిటీ వర్గీయులు'గా తమ స్థానాన్ని భద్రంగా కాపాడుకొంటున్నారు. మరో నేత నజ్మా హెఫ్తుల్లా. 2004 సార్వత్రక ఎన్నికల తరుణంలో ఆమె కాంగ్రెస్ నుంచి వైదొలగి బీజేపీలో చేరారు. వాజపేయి మళ్ళీ అధికారానికి వస్తారని చాలా మంది మాదిరిగానే ఆమె కూడా గట్టిగా విశ్వసించారు మరి.
సరే, ఇప్పుడు మళ్లీ రాజకీయ పవనాలు నరేంద్ర మోదీ నాయకత్వంలో ముందుకు సాగుతున్న బీజేపీకి అనుకూలంగా వీస్తున్నాయి. అయితే ఆ పవనాలు తనను ప్రభావితం చేయడానికి భారతీయ ముస్లింలు ఎటువంటి ఆస్కారమివ్వడంలేదు. మోదీ నాయకత్వాన్ని వారు గట్టిగా తిరస్కరిస్తున్నారు. సీఎన్ఎన్ఐబిఎన్ కోసం సీఎస్‌డీఎస్ నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌లో ముస్లింలు మినహా అన్ని సామాజిక వర్గాలలోనూ మోదీకి, ఆయన ప్రత్యర్థుల కంటే ఎక్కువ మద్దతు లభిస్తున్నట్టు వెల్లడయింది. ఈ సార్వత్రక ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయడానికి తాము సుముఖంగా ఉన్నట్టు చెప్పిన ముస్లింలు కేవలం పదిశాతం మంది మాత్రమే. వారిలో అత్యధికులు మోదీని ప్రధానమంత్రిగా చూడడానికి వారు నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నారు.
ముస్లిం ఓటర్ల ఈ వైఖరిలో ఆశ్చర్యమేముంది? ఏ బీజేపీ నాయకుడూ, చివరకు అటల్ బిహారీ వాజపేయికూడా ముస్లిం సమాజంలో సంఘ్‌పరివార్ పట్ల ఉన్న విశ్వాసలోటును పూడ్చలేక పోయారు. ఇది హిందుత్వ రాజకీయాల ప్రభావ ఫలితం. దీని నుంచి బీజేపీ తప్పించుకోలేదు. 2002లో గుజరాత్‌లో మారణకాండను నివారించడంలో నరేంద్ర మోదీ విఫలమయ్యారు. భారతీయ ముస్లింలు ఈ వాస్త వాన్ని ఎప్పటికీ విస్మరించలేరు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అటువంటి ఘోరాన్ని అరికట్టడంలో విఫలమవ్వడాన్ని బాధిత వర్గం వారు క్షమించగలరా? ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీ టిక్కెట్‌పై లోక్‌సభకు పోటీ చేస్తున్న అభ్యర్థులలో ఒక్క ముస్లిం కూడా లేరు. అలాగే గుజరాత్ నుంచి ఒక్క ముస్లింకి కూడా బీజేపీ టిక్కెట్ లభించలేదు. కమలం గుర్తుతో పోటీచేసే ముస్లిం అభ్యర్థి విజేత కావడం అసాధ్యమన్న వాస్తవం బీజేపీ నాయకత్వానికి బాగా తెలుసన్న విషయాన్ని ఈ పరిణామాలు ధ్రువీకరిస్తున్నాయి.
జాతికి 'ఆమోదయోగ్యమైన' నాయకుడుగా రూపొందడానికి మోదీ చేస్తున్న ప్రయత్నాలు భారతీయ ముస్లింలను ఆకట్టుకోకుండా, వారి మద్దతు పొందకుండా పరిపూర్తి కాలేవు. ముస్లింల మద్దతును కూడా పొందినప్పుడు మాత్రమే ఆయన నిజమైన జాతీయ నాయకుడు కాగలరు.ఈ కాలమిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీపై తన పునరాలోచనకు రెండు కారణాలను అక్బర్ చెప్పారు. 2002 గుజరాత్ అల్లర్లలో మోదీ పాత్ర ఉందని ఏ విచారణా సంఘమూ నిరూపించలేకపోవడం మొదటి కారణం. ఇది న్యాయబద్ధమైన వాదనే. అయితే జర్నలిస్ట్ మనోజ్‌మిట్టా తన పుస్తకం 'ది ఫిక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫైండింగ్'లో గుజరాత్ అల్లర్లపై విచారణలు ఎలా అర్ధసత్యాలలో చిక్కుకున్నాయో చక్కగా వివరించారు. చాలా వాస్తవాలను కప్పిపుచ్చడం జరిగిందని కూడా ఆయన పేర్కొన్నారు. ఆ అల్లర్లకు మోదీ వ్యక్తిగత బాధ్యత లేకపోవచ్చు గానీ, ఆయన ఆధ్వర్యంలోని పాలనా యంత్రాంగం ఆ హింసాకాండను అరికట్టడంలో విఫలమయిందన్నది విస్మరించేలేని వాస్తవం. ఆయన మంత్రి మండలిలోని ఒక సీనియర్ మంత్రిని దోషిగా నిర్ధారించి న్యాయస్థానం రెండున్నర దశాబ్దాలకు పైగా కఠిన కారాగార శిక్ష విధించింది. సంఘ్ పరివార్ కార్యకర్తలు పలువురు వ్యక్తిగతంగా ఆ హింసాకాండలో ప్రత్యక్షంలో పాల్గొన్నారన్నది ఒక సత్యం. ఇవి మోదీ నైతిక వ్యక్త్తిత్వంపై మచ్చలే కాదూ?
అక్బర్ చెప్పిన రెండో కారణం మరింత ఒప్పించే విధంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు మోదీ అగ్రప్రాధాన్యమిస్తున్నారని, ముస్లింలు పేదరికం నుంచి బయటపడేందుకు ఇదొక్కటే మార్గమని తాను విశ్వసిస్తున్నానని అక్బర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు సృష్టించిన భయాల నుంచి బయటపడడానికి కూడా మోదీ నాయకత్వం దోహదం చేయగలదని ఆయన అన్నారు. గుజరాతీ ముస్లి ంలు ఇతర రాష్ట్రాలలోని ముస్లింల కంటే మెరుగైన జీవనం గడుపుతున్నారన్నది నిజమే అయినప్పటికీ సంపన్న గుజరాతీ ముస్లిం వర్గం ఆవిర్భావం మోదీ ప్రభవించక ముందే జరిగిందన్నది ఎవరూ కొట్టివేయలేని వాస్తవం. ఉదాహరణకు బొహ్రా ముస్లింలనే తీసుకోండి. వారు శతాబ్దాలుగా గొప్ప వ్యవస్థాపనాపరులు. వ్యాపారదక్షులు. కాగా గుజరాత్‌లో సగటు ముస్లిం స్థితిగతులు ఇప్పటికీ ఇతర సామాజిక వర్గాల కంటే తక్కువ స్థాయిలోనే ఉన్నాయని వివిధ సర్వేలలో వెల్లడయింది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో ఎందరో ముస్లింలు వెలివాడల బతుకులు బతుకుతున్నారు.
సంఘ్ పరివార్ పట్ల ముస్లిం సమాజంలో విశ్వాసలోటును తొలగించడానికి మరింత విశ్వసనీయమైన పరిష్కారాన్ని మోదీకి నేను సూచించదలిచాను. ఆయన నిజంగా ఆ విశ్వాసలోటును పూర్తిగా తొలగించదలచుకుంటే ప్రముఖ ముస్లింల మద్దతును పొందడం మాత్రమే కాకుండా సామాన్య ముస్లింల మద్దతునూ సాధించగలగాలి. అహ్మదాబాద్ నగర శివార్లలో ఉన్న ముస్లిం బస్తీ సిటిజన్ నగర్‌ను మోదీ ఎందుకు సందర్శించరు? 2002 అల్లర్ల బాధితులు పలువురు ఆ బస్తీలో చాలా దయనీయమైన, అమానుషమైన దుర్భర పరిస్థితుల్లో నివశిస్తున్నారు, కాదు, కునారిల్లుతున్నారు. ఆ అభాగ్యులకు నిజంగా పునరావాసం కల్పించి, పురోగమనపథంలో ఉరకలువేస్తోన్న శక్తిమంతమైన గుజరాత్‌లో తాము భాగస్వాములమన్న భావన కలిగించగలిగితే వారి హృదయాలను మోదీ గెలుచుకోగలరు. బహుశా సగటు భారతీయ ముస్లిం మనసులనూ జయించగలరు.
(ఆంధ్రజ్యోతికి ప్రత్యేకం)

No comments:

Post a Comment