Wednesday 2 April 2014

సహజ వనరులున్న చోటే రాజధాని

సహజ వనరులున్న చోటే రాజధాని
Published at: 01-04-2014 05:02 AM

అనువైన స్థలం కూడా ఉండాలి
కమిటీకి విధివిధానాలు సృష్టీకరించిన కేంద్రం

న్యూఢిల్లీ, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): సీమాంధ్రలో కొత్త రాజధానిని ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలం, నీరు,సహజవనరులుండేలా చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాజధాని కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్‌కు పంపిన విధి విధానాల్లో కోరింది. ముందుగా రాజధాని ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రదేశం గురించి డేటా సంపాదించిన తర్వాత ఆయా ప్రాంతాలకు వెళ్లి అధ్యయనం చేయాలని సూచించింది. సమస్యతో ముడివడి ఉన్నవారిని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాన్నీ, సీమాం«ధ్రలో
ఏర్పడే కొత్త ప్రభుత్వాన్నీ, కేంద్రాన్నీ సంప్రదించిన తర్వాత ఆగస్టు 31లోగా నివేదిక సమర్పించాలని కేంద్రం స్పష్టీకరించింది. రాజధాని ఏర్పా టు చేసేందుకు అవసరమైతే నిస్సారవంతమైన అటవీ భూమిని రిజర్వేషన్ నుంచి తప్పించే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కూడా కేంద్రం చెప్పింది.
కేంద్రం సూచించిన ఇతర
విధివిధానాలివి
- కొత్త రాజధాని ప్రణాళికాబద్ధ అభివృద్దికి అనువైన విధంగా ఉండాలి. ముందుగా ఎంత జనాభా ఉంటుందో, ఎన్ని జోన్లుగా విభ జించాలో నిర్ణయించుకోవాలి. రాజ్‌భవన్, చట్టసభలు, సెక్రటేరియట్, హైకోర్టు, కార్యాలయాలు, విద్య, శిక్షణా సంస్థలు, విమానాశ్రయం, అతిథి గృహాలు, నివాస వసతులు, స్టేడియాలు, కాన్ఫరెన్స్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, పార్కులు, వినోద వసతులు, గ్రంథాలయాలు, ప్రదర్శన శాలలు, సినిమాహాళ్లు, పర్యాటక స్థలాలు, మార్కెట్లు మొదలైన వాటికి స్థలం లభించేలా ఉండాలి.
- కొత్త రాజధాని.. రాష్ట్రంలోని అన్నిప్రాంతాలకూ, ప్రస్తుత ఉమ్మడిరాజధానికి అనువుగా, రైళ్లు, వాహనాలు, విమానాల రాకపోకలకు వీలుగా ఉండాలి. రాజధానిలో రాపిడ్ మాస్ ట్రాన్సిట్ వ్యవస్థలు ఏర్పాటు చేసేందుకు వీలుకల్పించాలి.
- ఈప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాలు వేగవంతంగా ఆర్థిక, సామాజిక, సాంస్క­ృతిక మౌలిక సదుపాయాలతో అభివృద్ది చెందేట్లుగా చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు అధ్యయనం చేయాలి.
- రాజధాని ఏర్పాటు చేసేటప్పుడు సాధ్యమైనంత మేరకు ఆప్రాంతంలో వ్యవసాయం దెబ్బతినకుండా, ప్రజలు నిర్వాసితులు కాకుండా చూసుకోవాలి.
- స్థానిక పర్యావరణ పరిస్థితులు, సహజసిద్ధమైన నదులు, కాల్వలు, చెరువులు, బావులు దెబ్బతినకుండా చూడాలి.
- రాజధానిని నిర్మించేటప్పుడు కాలుష్యం పెరిగిపోకుండా చర్యలు తీసుకోవాలి.
- రాజధాని.. వరదలు, తుఫాన్లు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రమాదాలు జరిగే ప్రాంతం కాకుండా అయి ఉండాలి.
- రాజధాని నిర్మాణవ్యయం సాధ్యమైనంత తగ్గించేందుకు చూడాలి. భూసేకరణ భారీ స్థాయిలో చేయకుండా చూసుకోవాలి.
- రాజధాని నిర్మాణానికి ముడిసరుకులు, నైపుణ్యం కల, నైపుణ్యం లేని శ్రామికులు మొదలైనవి ఎంతమేరకు అవసరం, అవి ఎక్కడ లభ్యమవుతాయి అనే విషయాలను ముందుగానే అంచనా వేయాలి.

No comments:

Post a Comment