Thursday 17 April 2014

పొత్తుపై చర్చలు జరుగుతున్నాయి: బాబు

పొత్తుపై చర్చలు జరుగుతున్నాయి: బాబు కన్ఫ్యూజన్ వద్దే వద్దు: ప్రకాశ్ జవదేకర్ మలుపులు తిరుగుతున్న ఎన్నికల పొత్తు!

Published at: 17-04-2014 21:38 PM
హైదరాబాద్, ఏప్రిల్ 17: తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్య ఎన్నికల పొత్తుపై చర్చలు కొనసాగుతున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సీట్ల పొత్తుపై కన్ఫ్యూజన్ ఏమీ లేదని బిజెపి నాయకుడు ప్రకాశ్ జవదేకర్ గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో వెల్లడించారు. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీకి గల ఆక్షేపణల విషయాన్ని పరిశీలిస్తున్నామని కూడా ఆయన వివరించారు.
బలహీనమైన అభ్యర్ధులను బిజెపి నిలబెట్టడంవల్ల ప్రత్యర్థులకే ఎక్కువ లాభమని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. గెలిచే అభ్యర్థులను నిలబెడితే సమస్య లేదని, కాని ఓడిపోయే అభ్యర్థులను బిజెపి నిలబెట్టడంలో అంతరార్థం ఏమిటని తెలుగుదేశం పార్టీ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ మొండి వైఖరి వల్ల కనీసం పది పార్లమెంటు స్థానాలను, 30 అసెంబ్లీ స్థానాలను వైసీపీకి అప్పగించినట్టవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.
సంఘ్ పరివార్ కర్ర పెత్తనం వల్ల కూడా పొత్తు వ్యవహారం సరిగా ముందుకు పోవడం లేదని చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. సొంత బలం గురించి ముందు వెనుకలు ఆలోచించుకోకుండా బిజెపి మొండి వైఖరిని అవలంబించడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రుచించడం లేదు. సొంతంగానే పోటీ చేస్తే తెలుగుదేశం లాభపడుతుంది గాని బలం లేని స్థానాలను బిజెపికి వదిలేయడంవల్ల ప్రత్యర్థులకే లాభమని వారు పార్టీ అగ్రనాయకత్వానికి వివరిస్తున్నారు. వారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్న చంద్రబాబుకు ఆదాని వ్యవహారం కూడా రుచించడంలేదు. నరేంద్ర మోదీ సన్నిహితుడైన పారిశ్రామికవేత్త జగన్‌ను కలవడం వెనుక మతలబు ఏమిటని ఆయన నేరుగా బిజెపి అధిష్ఠానం దగ్గరే తమ ఆక్షేపణ వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది.
టిడిపి-బిజెపి పొత్తుకు గండి పడేటట్టు ఉండని బుధవారం అర్థరాత్రి ఏబిఎన్-ఆంధ్రజ్యోతి వెల్లడించడంతో ఢిల్లీలో బిజెపి నాయకులకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయ్యింది. వెంటనే బిజెపి అధిష్ఠానం జవదేకర్‌ను హైదరాబాద్‌కు పంపించింది. తెలుగుదేశం పార్టీతో పొత్తు కొనసాగుతుందని ఆయన చెబుతున్నా, ఒకవేళ పొత్తు గనక దెబ్బ తిన్నట్టయితే వెంటనే బిజెపి తరపున పోటీ చేయడానికి అభ్యర్థుల జాబితా ఒకటి సిద్ధమైపోయినట్టు తెలుస్తున్నది. ఈ జాబితాను బిజెపి సీమాంధ్ర నాయకుడు హరిబాబు ఢిల్లీకి తీసుకువెళ్లినట్టు విశ్వసనీయంగా తెలుస్తున్నది. అలాగే ఈ జాబితాలో ఉన్నవారికి నామినేషన్‌ను చివరి క్షణంలో అయినా వేయడానికి సిద్ధంగా ఉండవలసిందిగా ఫోన్లు వెళ్తున్నాయి. ఈ పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా సొంతంగానే పోటీ చేద్దామని పార్టీ నాయకుని వద్ద గట్టిగా పట్టుపడుతున్నట్టు తెలుస్తున్నది,

No comments:

Post a Comment