Friday, 25 April 2014

తెలంగాణ చరిత్ర పితామహుడు డా. ద్యావనపల్లి సత్యనారాయణ

తెలంగాణ చరిత్ర పితామహుడు డా. ద్యావనపల్లి సత్యనారాయణ

Published at: 26-04-2014 08:01 AM
మనం ఈనాడు మన చరిత్ర పునాదుల మీద నిల్చున్నాం. మన చరిత్ర పునాదులను గురించి తెలియజేసేది పురావస్తు శాఖ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తుశాఖ ఏర్పాటై సరిగ్గా నేటికి వంద సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆ సంస్థ ఏర్పాటుకు కారకుడైన డాక్టర్ గులామ్ యాజ్దాని తెలంగాణ చరిత్రకు పితామహుడు. అప్పటికే భారత పురావస్తు శాఖలో ప్రసిద్ధుడైన సర్ జాన్ మార్షల్, యాజ్దానిని ఆనాటి నిజాం ప్రభుత్వానికి రిఫర్ చేశారు. యాజ్దాని హైదరాబాదుకు వచ్చి నైజాం రాష్ట్ర పురావస్తు శాఖ సంచాలకుని అధికారాలు, విధుల గురించి 1914, ఏప్రిల్ 26న వివరణాత్మక నోట్ రాసి ప్రభుత్వానికి సమర్పించారు. దాన్ని ప్రభుత్వం అంగీకరించడంతో నిజాం రాష్ట్ర పురావస్తు శాఖ ఏర్పడింది.
హైదరాబాద్ పురావస్తు శాఖ సంచాలకులుగా యాజ్దాని దశాబ్దాల పాటు వ్యవహరించారు. గుర్రాల మీద వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ తిండి తిప్పలు తదితర ఎన్నో ప్రయాసలకోర్చి తెలంగాణలో ప్రముఖమైన దేవాలయాలు, కోటగోడలు తదితర చారిత్రక స్థలాలను పరిశీలించి, పరిశోధించారు. ఇతర పండితులతో పరిశోధింప చేయించారు. శాసనాలు ఇతరత్రా చారిత్రక ఆధారాలను సేకరించి, పరిష్కరించి, ప్రచురించి తెలంగాణ చారిత్రక సంస్కృతికి పునాదులుగా నిలిచే కృషి ఫలితాలను మనకు అందుబాటులోకి తెచ్చారు.
యాజ్దాని ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కళాశాలలో ఇంగ్లీషు, అరబిక్ భాషల్లో ఎం.ఏ. చేశారు. విద్యార్ధి దశలో క్రికెట్, ఫుట్‌బాల్ మొదలైన క్రీడల్లో ఆయన నిష్ణాతులు. పంజాబ్ విశ్వవిద్యాలయంలో పర్షియన్ భాషలో పనిచేస్తున్న సమయంలో హైదరాబాద్ ప్రభుత్వంలో పనిచేసే అవకాశం ఆయనకు వచ్చింది.
ఒక్క వ్యక్తితో ప్రారంభమైన నిజాం రాష్ట్ర పురావస్తు శాఖను తన హయాంలో బహుముఖంగా విస్తరింపజేశారు. సహచరులు, సిబ్బందితో కలిసిపోయి వారిని నవ్విస్తూ అలసట తెలియకుండా ఎన్నో పనులను చేయించేవారట. అలా ఈనాడు మనకు రామప్ప శిల్పాలు, తెలంగాణ శాసనాలు, రాచకొండ రాజధానీ నగరం మీద యాజ్దానీ పరిశోధన ఫలితాలే ఆధారం.
ఆయన పని నిబద్ధతకు ఒక నిదర్శనాన్ని నెమరువేసుకుందాం. 1930 ప్రాంతంలో ఒకసారి యాజ్దానీ కలకత్తాలోని ఒక మేధావుల సదస్సులో ఉన్నారు. మరునాటి ఉదయం ఆయన సదస్సులో ప్రసంగించవలసి ఉంది. కానీ ఆనాటి రాత్రి యాజ్దానీ కలలో రామప్ప దేవాయలం కనిపించి తాను త్వరలో కూలిపోనున్నానని, కాబట్టి తనను వెంటనే కాపాడాలని చెప్పిందట. వెంటనే యాజ్దానీ లేచి ఉన్న పళంగా గుర్రమెక్కి రెండు రోజుల్లో రామప్పను చేరుకొని మూడో రోజు రామప్ప ఆలయం ఆగ్నేయ భాగం కూలిపోకుండా సపోర్టింగ్ స్తంభాలు కట్టి దాని సమగ్ర చరిత్ర, శాసనాలను అక్షరబద్ధం చేయించారు. అలాగే 1915లో రాచకొండ మీద ఆయన ఎం.శ్రీనివాస్‌తో చేయించిన చారిత్రక సర్వేనే ఇప్పటికీ అందుబాటులో ఉన్న ఏకైక ఆధారం. 14-16 శతాబ్దాల మధ్య తెలంగాణ ప్రాంతానికి రాజధానియైన రాచకొండకు మళ్ళీ వందేళ్ళ తరువాత 2014-15 సంవత్సరంలోనే రూ. 2 లక్షలు కేటాయించారు. రాచకొండ ప్రాధాన్యాన్ని వందేళ్ళ కిత్రమే గుర్తించారు గులామ్ యాజ్దానీ.
క్రీ.శ. 1948 వరకు తెలంగాణ, మరట్వాడా, రాయచూర్ ప్రాంతాలు నిజాం ప్రభుత్వ ఆధీనంలో ఉండేవనే విషయం అందరికీ తెలిసినదే. ఈ ప్రాంతాలను ఆనాడు దక్కన్ అనేవారు. కాబట్టి ఈ దక్కన్ ప్రాంతపు సమగ్ర చరిత్రను నిర్మించ తలపెట్టి ప్రొఫెసర్ హరూన్ ఖాన్ షేర్వాణీ, నవాబ్ అలీయవార్ జంగ్‌లతో కలిసి ప్రభుత్వానికి పలుమార్లు విన్నపాలు చేసి, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో (1939-1945) కూడా పది భాగాల దక్కను చరిత్ర రచన, ప్రచురణల కోసం నిధులను విడుదల చేయించారు యాజ్దానీ. డా. పి.యస్. జోషి, డా. యూసుఫ్ హుస్సేన్ ఖాన్, ప్రొఫెసర్ నీలకంఠ శాస్త్రి వంటి ఉద్దండ పండితులతో దక్కన్‌ను పాలించిన రాజవంశాల గురించి రాయించి, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీచే ప్రచురింప జేయించారు. ఈ రచనా యజ్ఞం 1952 వరకు సాగింది. ఇప్పుడు ఆ ప్రామాణిక గ్రంథం పేరు 'ఎర్లీ హిస్టరీ ఆఫ్ దక్కన్' పేరుతో రెండు భాగాలుగా అందుబాటులో ఉన్నది. తెలుగు, తెలంగాణ వంటి పదాల నేపథ్యంలో తెలంగాణ చారిత్రక మూలాలను వెదకటం కూడా ఈ గ్రంథంలో కనిపిస్తుంది. ఈ గ్రంథం వేసిన బాటలోనే తరువాతి కాలంలో 'మిడివల్ హిస్టరీ ఆఫ్ దక్కన్', 'మోడరన్ హిస్టరీ ఆఫ్ దక్కన్' అనే ప్రామాణిక గ్రంథాలు వచ్చాయి.
దక్కనులో ప్రధానమైన చారిత్రక స్థలాలను సమగ్రంగా సంరక్షించి వాటిని సందర్శన యోగ్యంగా చేసింది కూడా యాజ్దానీనే. ఈనాడు ప్రపంచ వారసత్వ స్థలాలుగా గుర్తించబడిన అజంతా, ఎల్లోరాల్లోని చిత్రాలు, శిల్పకళలను ఇటలీ శాస్త్రవేత్తల సహాయంతో వెలుగులోకి తెచ్చారు. ఆ క్రమంలో అజంతా చిత్రాలను ఒరిజినల్ కలర్స్‌లో యాజ్దానీ చేయించి హైదరాబాద్ పురావస్తు మ్యూజియంలో పెట్టించారు. అవే ఇప్పుడు ప్రపంచంలో ఎవరు చూడాలనుకున్నా చూడడానికి మిగిలినవి. ఎందుకంటే ఆ తరువాత అజంతా గుహల్లోని చిత్రాలు రంగు వెలిసిపోయి శిథిలస్థితికి చేరుకున్నాయి. అలాగే ఎల్లోరాలోని శిల్పాలు, చిత్రాలకు కూడా యాజ్దానీగారి రచనలే ప్రథమ ప్రామాణికలు.
యాజ్దానీ చారిత్రక స్థలాలను వెలుగులోకి తీసుకు రావడమే కాకుండా వాటిని ప్రజలు సందర్శించేందుకు వీలుపడే చర్యలు కూడా తీసుకున్నారు. ఉదాహరణకు, జహీరాబాద్‌కు అల్లంత దూరంలో ఈనాడు కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బీదర్ కోటను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా నిజాం ప్రభుత్వంచే నిధులు కేటాయింపజేయించి హైదరాబాద్ నుంచి అక్కడి వరకు పక్కా రోడ్డు వేయించారు. అలాగే టోలి మసీద్, గోల్కొండ కోటలను సందర్శన యోగ్యం చేయించి, హైదరాబాద్ నుంచి ఆ ప్రదేశాలకూ రోడ్డు వేయించారు.
తన బహుముఖ సేవలకు గుర్తింపుగా యాజ్దానీ పద్మభూషణ్, ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ వంటి ఎన్నో అవార్డులను పొందారు.
ఇలా తెలుగు, దక్కను ప్రజల చారిత్రక సంస్కృతులను వెలికి తీసి మనకు గర్వకారణాలను అందుబాటులోకి తెచ్చి పురావస్తు పరిశోధనల వికాసానికి బాటలు వేసిన గులామ్ యాజ్దానీ పేరిట సంవత్సరం పాటు కొత్త తెలంగాణ రాష్ట్రం, ప్రజలు, పరిశోధకులు అనేక కార్యక్రమాలు నిర్వహించుకొని తమ వైభవోపేత సమగ్ర చరిత్రను పునర్నిర్మించుకోవలసి ఉంది.
n డా. ద్యావనపల్లి సత్యనారాయణ
చరిత్రకారులు, ఏపీ గిరిజన సంగ్రహాలయ సంరక్షకులు
(నేటికి రాష్ట్ర పురావస్తు శాఖ ఆవిర్భవించి 100 సంవత్సరాలు)

No comments:

Post a Comment