56 మందికి శిక్ష రద్దు
చుండూరు నిందితులకు భారీ ఊరట
దళితుల ఊచకోత కేసులో హైకోర్టు సంచలన తీర్పు
దళితుల కుటుంబాలకు కలిగిన వేదన తీర్చలేనిదే
ఇప్పటికైనా కక్షలకు స్వస్తి పలకండి
మానవతా విలువలతో కలిసి బతకండి: ధర్మాసనం హితవు
దళితుల ఊచకోత కేసులో హైకోర్టు సంచలన తీర్పు
దళితుల కుటుంబాలకు కలిగిన వేదన తీర్చలేనిదే
ఇప్పటికైనా కక్షలకు స్వస్తి పలకండి
మానవతా విలువలతో కలిసి బతకండి: ధర్మాసనం హితవు
హైదరాబాద్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): చుండూరు ఊచకోత కేసులో మరో సంచలనం! చుండూరు మారణ కాండ అప్పట్లో సంచలనం సృష్టిస్తే.. ఈ కేసులో నిందితులకు ప్రత్యేక కోర్టు విధించిన శిక్షలను రద్దు చేస్తూ హైకోర్టు ధర్మాసనం మంగళవారం సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుల్లో 21 మందికి జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా; 35 మందికి ఏడాది జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ 2007 జూలై 11న ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఈ మేరకు నిందితులు చేసుకున్న అప్పీళ్లను జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, జస్టిస్ ఎంఎస్‌కే జైస్వాల్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆమోదించింది. ఈ కేసులో నిందితులంతా అగ్రవర్ణాల వారు కావడంతో మళ్లీ అల్లర్లు చెలరేగే అవకాశాలు ఉండవచ్చని సంశయించిన ధర్మాసనం.. తీర్పు నేపథ్యంలో చుండూరు, మోదుకూరు గ్రామాల్లో ఎటువంటి ఉత్సవాలు జరుపుకోకుండా చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా ఎస్పీని ఆదేశించింది. కనీసం మూడు నెలలపాటు ఆయా గ్రామాల్లో ముందు జాగ్రత్త చర్యగా గట్టి నిఘా ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ప్రత్యేక కోర్టు తీర్పుపై హైకోర్టులో దాఖలైన బ్యాచ్ పిటిషన్లను ధర్మాసనం అనుమతించింది. "మృతులు ఏ సమయంలో ఎక్కడ మరణించారో.. వారిని హత్య చేసినది ఎవరో ప్రాసిక్యూషన్ కచ్చితంగా రుజువు చేయలేకపోయింది. ప్రాసిక్యూషన్‌లో తీవ్ర లోపాలున్నా ట్రయల్ కోర్టు గుర్తించలేదు. ఈ కేసులో ఎనిమిది మంది దళితులు మరణించడం.. భారీ సంఖ్యలో నిందితులను చేర్చడంతో ఈ కేసుకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ నేపథ్యంలోనే కేసు విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు కొంతమంది నిందితులకు శిక్షలు ఖరారు చేసింది. 100 నుంచి 120 మంది తమపై మారణాయుధాలతో దాడి చేశారని, తనకు తీవ్ర గాయాలు అయినా సమీపంలోని పంట కాల్వలో దూకి సుమారు మూడు కిలోమీటర్లు ఎదురు ఈదుకుంటూ వెళ్లానని సాక్ష్యం చెప్పిన వ్యక్తి (పీడబ్ల్యూ - 15) క్రాస్ ఎగ్జామినేషన్‌లో తనకు ఈత రాదని ఒప్పుకున్నాడు.
ఈత రాని వ్యక్తి, తీవ్ర గాయాలు అయినా ఏటికి ఎదురీదుతూ వెళ్లానని చెప్పిన సాక్ష్యాన్ని సైతం ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది'' అని ధర్మాసనం తప్పుబట్టింది. ఇతను దళితుల నాయకుడిగా ఉన్నప్పటికీ ఈ దాడికి సంబంధించి ఎటువంటి ఫిర్యాదు చేయలేదని, తనకు ఈత రాకపోయినా పదడుగుల లోతున్న కాల్వలో ఈదుకుంటూ తెనాలిలోని తన బంధువుల ఇంటికి చేరుకున్నానని, 1991 ఆగస్టు పదో తేదీ వరకు అక్కడ తలదాచుకున్నానని చెప్పారని, అయినా, ఆచూకీ తెలియకుండాపోయిన తన సమీప బంధువుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేయలేదంటూ ప్రాసిక్యూషన్‌లోని లోపాలను ఎత్తి చూపింది. "ప్రధాన సాక్షులు (1 నుంచి 7)గా ఉన్న అందరూ ఈ కేసులో 6వ నిందితునిగా ఉన్న వ్యక్తి అవిటి వాడని ఒప్పుకున్నారు. ఒక చేతిని కాలుపై వేయకుండా ముందుకు వెళ్లలేడని స్పష్టం చేశారు. అయినా, ఆరో నిందితుడు ముగ్గురిని వెంటాడి చంపాడని చెప్పిన సాక్ష్యాన్ని ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది'' అని ధర్మాసనం ఆక్షేపించింది. ఈ కేసు ప్రాసిక్యూషన్‌లో ఎన్నో తీవ్ర లోపాలు ఉన్నాయని స్పష్టం చేసిన హైకోర్టు.. నిందితులకు కింది కోర్టు విధించిన తీర్పును రద్దు చేసింది. కింది కోర్టు ఆదేశాల మేరకు నిందితులు ఎవరైనా జరిమానా చెల్లిస్తే ఆ మొత్తాన్ని వారికి తిరిగి ఇచ్చివేయాలని ఆదేశించింది. "తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన దళిత కుటుంబాలకు కలిగిన వేదన తీర్చలేనిదే. ప్రభుత్వం ఎంత సహాయం చేసినా ఆ బాధ తీరనిది. అయితే... అభియోగాలపై 15 ఏళ్లుగా 200 మందిపై కొనసాగుతున్న విచారణ.. ప్రతి దాడులు ఆయా కుటుంబాల్లో సైతం ఎంతో ప్రభావం చూపింది. ఇప్పటికైనా ఈ కక్షలకు స్వస్తి పలికి పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుంటూ మానవతా విలువలతో కలిసి మెలిసి బతకాలి'' అని ధర్మాసనం హితవు పలికింది.
చుండూరులో ఏం జరిగిందంటే..
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా తెనాలి మండలం చుండూరు గ్రామంలో కొంత కాలంపాటు దళితులు, అగ్రవర్ణాల మధ్య ఘర్షణలు జరిగాయి. పోలీస్ కేసులు నమోదయ్యాయి. గ్రామంలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. వివిధ కేసుల్లోని నిందితులను అరెస్టు చేయడానికి 1991 ఆగస్టు 6న పోలీసులు గ్రామంలోకి వెళ్లారు. సోదాలకు దిగారు. ఉదయం 11 గంటలకు పోలీసులు దళితవాడకు చేరుకోగానే వాడలోని పురుషులంతా ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. ఇది తెలుసుకున్న అగ్రవర్ణాల వారు పొలాల్లోనే వారిని చంపాలని భావించారు. 400 మంది మారణాయుధాలతో బయలుదేరి రెండు గ్రూపులుగా విడిపోయారు. ఒక గ్రూపు మోదుకూరు రోడ్డు నుంచి నల్లమడ డ్రెయిన్ వైపు, మరో గ్రూపు రైల్వే ట్రాక్ వెంట ఉన్న ఒకటో కొత్త కాలువ గట్టు వెంట వెళ్లి దళితులను వెంటాడింది. ఆయా గ్రూపుల్లోని వారు దొరికిన వారిని దొరికినట్లు గొడ్డళ్లతో నరికి, బరిశలతో పొడిచి దారుణంగా చంపారు. ఈ మారణకాండలో జాలాది ఇమ్మానియేల్, జాలాది ముత్తయ్య, మల్లెల సుబ్బారావు, మండ్రు రమేశ్, జాలాది ఇసాకు, అంగలకుదురు రాజమోహనరావు, సంకూరు శాంసన్, దేవరపల్లి జయరాజు హత్యకు గురి కాగా వీరి శవాలను కాలువలోకి నెట్టివేశారు. ఈ మారణ హోమంలో పతంగి జక్రయ్య, దైరి ధనరాజ్, మద్దు దాసరయ్య, తనంచింతల ఆదామ్, బూరుగడ్డ సాంబయ్య గాయపడ్డారు. ఈ ఘటనపై చుండూరు పోలీస్ స్టేషన్‌లో 11 కేసులు, అమృతలూరు స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. అన్ని కేసులనూ కలిపి దర్యాప్తు జరిపి అప్పటి తెనాలి డీఎస్పీ జె.రాయలయ్య మొత్తం 219 మందిని ముద్దాయిలుగా, 135 మందిని సాక్షులుగా పేర్కొంటూ కోర్టులో ఒకే చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ముద్దాయిలుగా చూపిన 219 మందిలో చుండూరుకు చెందిన 123 మంది, మున్నంగివారిపాలెంకు చెందిన 65 మంది, మోదుకూరుకు చెందిన 65, వలివేరుకు చెందిన ఒకరు ఉన్నారు. తెనాలి మున్సిఫ్ మేజ్రిస్టేట్ కోర్టులో తొలుత ప్రాథమిక విచారణ పూర్తి చేసుకున్న కేసు 1993లో విచారణ నిమిత్తం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక ప్రత్యేక న్యాయస్థానానికి చేరింది. వివిధ కారణాలతో 2003 జూలై వరకు గుంటూరులోని ప్రత్యేక న్యాయస్థానంలో వాయిదాలు సాగాయి. చుండూరు క్యాంపు కోర్టులో 2004 డిసెంబర్ 1 నుంచి సాక్షుల విచారణ ప్రారంభమై 2007 మార్చి 13 నాటికి పూర్తయింది. ప్రాసిక్యూషన్ తరపున 70 మంది, ముద్దాయిల తరపున 9 మంది సాక్ష్యం చెప్పారు. అనంతరం చుండూరు స్పెషల్ కోర్టులో రెండు నెలలపాటు ఇరుపక్షాల వాద ప్రతివాదనలు సాగాయి. ఇరుపక్షాలు వెయ్యి పేజీలకు పైగా లిఖిత పూర్వక వాదనలను కోర్టుకు సమర్పించాయి. 2007 జూలై 18న వాదనలు ముగియడంతో జూలై 31న న్యాయమూర్తి అనిష్ చుండూరులోనే తుది తీర్పు ఇచ్చారు. 179 మందిపై విచారణ జరగగా 123 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. వీరిలో 41 మందిపై సాక్ష్యాధారాలు లేవని, 20 మందిపై సాక్ష్యాలు ఉన్నప్పటికీ రికార్డు లేదని, 62 మందిపై సంశయాత్మక లబ్ది (బెన్‌ఫిట్ ఆఫ్ డౌ ట్) కింద కేసు కొట్టివేశారు. మిగిలిన 56 మందిలో 21 మం దికి యావజ్జీవ ఖైదు, 35 మందికి ఏడాది జైలు శిక్ష విధించారు.
No comments:
Post a Comment